స్కూల్‌కు రంగులు చేస్తున్న కార్మికులు
జైపూర్: కష్టకాలంలో తమకు ఆశ్రయమిచ్చిన విద్యాలయానికి వలస కార్మికులు వినూత్నంగా ధన్యవాదాలు తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో తమకు గూడు కల్పించిన స్కూల్‌కు కొత్త రంగులు అద్ది రుణం తీర్చుకున్నారు. ఈ స్ఫూర్తిదాయక ఘటన రాజస్థాన్ సికర్ జిల్లా పల్సానా గ్రామంలో చోటుచేసుకుంది.
స్థానిక మీడియా కథనం ప్రకారం.. కరోనా నేపథ్యంలో పల్సానా గ్రామంలోని పాఠశాల భవనంలో కొంతమంది వలస కార్మికులను క్వారంటైన్‌లో ఉంచారు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బిహార్, ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు వీరిలో ఉన్నారు. గ్రామస్థుల ఆతిథ్యం వారిని అమితంగా ఆకట్టుకోవడంతో ఊరికి ఏదోటి చేయాలనుకున్నారు. తమకు ఆశ్రయయిచ్చిన పాఠశాలకు రంగులు వేసి చాలా కాలం అయినట్టు గుర్తించిన కార్మికులు.. స్కూల్‌కు పెయింటింగ్ వేస్తామని గ్రామ సర్పంచ్‌తో చెప్పారు. దాంతో ఆ సర్పంచ్, పాఠశాల సిబ్బంది అవసరమైన వస్తువులు తెప్పించారు. కార్మికులు తమ క్వారంటైన్ వ్యవధి ముగిసేలోగా పాఠశాల భవనానికి, గోడలకు పెయింట్ వేసేశారు. ఆ పని చేసినందుకు ఆ గ్రామ సర్పంచ్, వారికి డబ్బులివ్వబోతే సున్నితంగా తిరస్కరించారు.
‘మాకు ఇన్నాళ్లు ఉచితంగా భోజనాలు పెట్టారు. అందుకుగాను మేము ఏదోటి చేయాలనుకున్నాము. పాఠశాల భవనానికి పెయింట్ వేసే అవకాశం లభించింది. మాకు డబ్బులివ్వాల్సిన అవసరం లేదు. అయినా మీరు ఏమైనా ఇవ్వదలచుకుంటే మీ ఊరి ఈ పాఠశాలకే ఇవ్వండి’ అంటూ కార్మికులు డబ్బును నిరాకరించారు. కాగా, ఆ పాఠశాలకు తొమ్మిదేళ్లుగా రంగులు వేయలేదని తెలుస్తోంది. వలస కార్మికుల చొరవతో ఇన్నాళ్లకు ఆ విద్యాలయం కొత్త అందాలు సంతరించుకుంది. ఈ ఘటన గురించి తెలిసిన వారు వలస కార్మికులపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment