చిత్తు కాగితాల సుందర చిత్రం
ఎవరూ పట్టించుకోని.. ఎవరికీ అక్కర్లేని... చిత్తుకాగితాలు స్లమ్స్. ఆ కాగితాలను అందమైన పువ్వులుగా సీతాకోకచిలుకలుగా, పిల్లల నవ్వుల్లా కొత్తగా సింగారిస్తోంది రూబుల్నాగి.
కాశ్మీర్లో పుట్టిన రూబుల్ నాగి లండన్‌లో పెరిగింది. అక్కడే చదువుకుంది. శిల్పాలు, ఆర్ట్ ఇన్‌స్టాలేషన్‌లో ప్రత్యేకత కలిగిన ఆమెకు పెయింటింగ్ అంటే ప్రాణం. కళతో సమాజాన్ని మార్చాలన్నది ఆమె కల. అందుకు తగినట్టుగానే రెండు దశాబ్దాలుగా పెయింటింగ్ చేస్తోంది. ఎక్కడో కాదు భారతదేశంలో చిత్తుకాగితాలుగా పరిగణించే స్లమ్స్‌ని ఆమె తన కాన్వాస్‌కు వాడుకుంది.
స్లమ్స్ కలర్‌ఫుల్
దేశమంతా తిరిగి పిల్లల కోసం వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్న ఆమె ‘రూబుల్ నాగి’ ఆర్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు. యువ ప్రతిభావంతులైన కళాకారులను ప్రోత్సహించడానికి కృషి చేస్తున్న రూబుల్ జనవరి 2018 నుంచి ‘మిసాల్ ముంబై’ పేరుతో ధారవి మురికి వాడలను పెయింటింగ్ తో అలంకరిస్తోంది. ఇప్పటివరకు 30 మురికివాడల్లోని 1,50,000 ఇళ్లను అందమైన రంగులతో అలంకరించింది. గోడలపై చిత్రాలను రూపొందించింది. తన పెయింటింగ్‌తో స్లమ్స్ రూపురేఖలను మార్చుతోంది 40 ఏళ్ల రూబుల్ నాగి.
కళతో కనెక్ట్
కళకోసమే జీవితాన్ని అంకితం చేసిన రూబుల్ రెండు దశబ్దాలలో 800 శిల్పాలు, లెక్కలేనన్ని చిత్రాలను రూపొందించింది. 62 కిండర్ గార్టెన్లను కూడా నడుపుతోంది. తద్వారా పిల్లలకు ప్రాథమిక విద్యను అందిస్తోంది. రూబుల్ నాగి సంస్థ దేశవ్యాప్తంగా పిల్లల కోసం ఆర్ట్ వర్క్‌షాప్‌లు నిర్వహిస్తుంది. ఆమె తన కళను ప్రజలతో కనెక్ట్ అయ్యే మాధ్యమంగా భావిస్తుంది. ఆమె మాట్లాడుతూ ‘సామాజిక సమస్యలను లేవనెత్తడానికి వాటి గురించి అవగాహన కల్పించడానికి ప్రజలకు సహాయపడే మార్గం ఇది’ అని చెప్పే రూబుల్ పెయింటింగ్స్‌తో సామాన్య ప్రజలూ ప్రేరణ పొందుతుంటారు. ఆమె పెయింటింగ్స్ విద్య, మహిళా సాధికారత, ఉపాధి వంటి సమస్యలను చర్చిస్తాయి. అదే సమయంలో ఆమె వర్క్‌షాప్‌లో మురికివాడల ప్రజలు పరిశుభ్రత గురించీ తెలుసుకుంటారు.
కొత్త శక్తి దిశగా!
రూబుల్ ఆలోచన గొప్పదనం తెలుసుకోవాలంటే ఆమెతో కాసేపు ముచ్చటించాలి. ‘ఈ ఇళ్ళపై నేను పెయింట్ చేసిన రంగులు కొన్ని ఏళ్ల తరువాత మసకబారుతాయి. కానీ ఈ రంగులు ప్రజల ఆలోచనలో సానుకూల మార్పులు వస్తాయి. అవి వారికి ఎల్లప్పుడూ కొత్త శక్తిని ఇస్తాయి’ అంటుంది అంటోంది ఈ చిత్రకారిణి.
రూబుల్ ఇప్పటివరకు రాజస్థాన్, తెలంగాణ, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ మహారాష్ట్రతో పాటు పెయింటింగ్ ద్వారా ముంబై మురికివాడలను అభివృద్ధి చేసింది. చేస్తోంది. ఆమె పెయింటింగ్స్‌ను కార్పోరేట్ సంస్థలు, ప్రముఖ వ్యాపారవేత్తలు, భారతప్రభుత్వం, మ్యూజియమ్‌లతో సహా ఎంతో మంది సేకరిస్తుంటారు. కొనుగోలు చేస్తుంటారు. అలా వచ్చిన డబ్బుతో మురికివాడలకు ప్రాణం పోస్తోంది రూబుల్ నాగి.
మహిళలతో రూబుల్ నాగి