మురికివాడలను పీపీపీ మోడల్‌గా తీర్చిదిద్దుతాం
-
తిరుపతి స్కావెంజర్ కాలనీలో మొదటి ప్రాజెక్టు ప్రారంభం
-
మంత్రి పొంగూరు నారాయణ
నెల్లూరు(మినిబైపాస్): రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లోని మురికివాడలను అత్యంత సౌకర్యవంతమైన కాలనీలుగా మార్చే ప్రక్రియకు త్వరలో శ్రీకారంచుట్టనున్నామని మంత్రి నారాయణ శుక్రవారం నెల్లూరులో వెల్లడించారు. స్థానిక బారాషాహిద్ దర్గాలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొత్తగా ఏరియాలను అభివృద్ధి చేయడం కన్నా ఇదివరకే ఉన్న స్లమ్ ఏరియాలను అభివృద్ధి చేయడం సులభమన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని మురికివాడలను పీపీపీ మోడల్‌గా తీర్చిదిద్దుతామని, తొలి ప్రయత్నంగా తిరుపతిలోని స్కావెంజర్ కాలనీని అన్ని వసతులతో అత్యంత సౌకర్యవంతమైన కాలనీగా మార్చనున్నామని మంత్రి తెలిపారు. తిరుపతిలో ఉన్న స్లమ్ మున్సిపల్ పరిధిలో ఉందని, మొదటగా వారికి కావల్సిన సౌకర్యాలు కల్పించి, 6 అంతస్తుల మిద్దెలను ఏర్పాటు చేసి స్లమ్ ఏరియాలో ఉన్న వారందిరికి సొంత ఇంటిని నిర్మించి ఇస్తామని తెలిపారు. ముంబై కార్పొరేషన్‌లో ఏ విధంగా అయితే పీపీపీ మోడల్ ఇళ్లను నిర్మించారో అదే తరహాలో ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా ప్రారంభించాలని ప్రయత్నిస్తున్నామన్నారు. నవంబరు ఆఖరులోపు టెండర్లను పిలుస్తామన్నారు. తిరుపతిలో ఐదున్నర ఎకారాల స్థలంలో అభివృద్ధి చేస్తున్నామని, నెల్లూరులో కూడా ఐదున్నర ఎకరాల స్థలం కేటాయిస్తే పనులు ప్రారంభిస్తామని అన్నారు. బిల్డర్ల సహాయంతో నిర్మిస్తామని, ఒక్క పైసా కూడా స్లమ్‌లో ఉన్న వారు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. సమావేశంలో నెల్లూరు నగర మేయర్ అబ్దుల్ అజీజ్, నూనె మల్లికార్జున్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.