నారాయణే గెలిపించుకుంటారు
-
–పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్తి పట్టాభి ఎంపికపై కత్తులు నూరుతున్న మూడు జిల్లాల సీనియర్లు
-
–ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం తెర మీదకు పరసారత్నం
తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నారాయణ ఆసుపత్రి సీఈవోగా పనిచేసిన వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డిని ఎంపిక చేయడంపై నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లోని టీడీపీ సీనియర్లు రగిలిపోతున్నారు. తమతో సంబంధం లేకుండానే ఉపాధ్యాయ స్థానానికి కూడా మంత్రి నారాయణే అభ్యర్థిని ఎంపిక చేయించుకుని ఇద్దరినీ ఆయనే గెలిపించుకుంటారులే అని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ స్థానానికి మాజీ మంత్రి పరసారత్నం పేరు మంత్రి నారాయణ తెర మీదకు తెచ్చారు.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు:
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నందువల్ల ఉపాధ్యాయ, పట్టభద్రుల స్థానాలకు చెందిన రెండు ఎమ్మెల్సీలు గెలవాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలకు టార్గెట్లు పెట్టి ఓటర్ల నమోదు చేయించారు. వీరితో సంబంధం లేకుండా మంత్రి నారాయణ మూడు జిల్లాల పరిధిలోని తన కళాశాలల్లోని ఉపాధ్యాయులను పెద్ద ఎత్తున ఓటర్లుగా నమోదు చేయించారు. వీరితో పాటు తమ సంస్థల్లో పనిచేస్తున్న పట్టభద్రులను వీలైనంత మందిని ఓటర్లుగా చేర్పించారు. నెల్లూరు జిల్లా నుంచి తాను మంత్రిగా ప్రాతినిథ్యం వహిస్తుండటం, చిత్తూరు జిల్లాకు ఇన్‌చార్జి మంత్రి అయినందున రెండు స్థానాలకు తాను అనుకున్న వ్యక్తులే అభ్యర్థులు కావాలని వ్యూహ రచన చేశారు. ఇందులో భాగంగానే పట్టభద్రుల స్థానానికి తమ ఆసుపత్రి సీఈవోగా పనిచేసిన వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డిని పట్టుబట్టి అభ్యర్థిగా ఎంపిక చేయించుకున్నారు.
రగులుతున్న సీనియర్లు
ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక గురించి పార్టీ నాయకత్వం తమతో చర్చించి నిర్ణయం తీసుకుంటుందని మూడు జిల్లాల్లోని ముఖ్య నాయకులు భావించారు. అయితే పార్టీ నాయకత్వం మంత్రి నారాయణకు పెద్ద పీట వేస్తూ ఆయన సంస్థలో పనిచేసిన మాజీ ఉద్యోగిని ఏక పక్షంగా ఎంపిక చేయడం మీద మూడు జిల్లాల్లోని సీనియర్ నాయకులు లోలోన రగిలిపోతున్నారు. పార్టీ కోసం తొలి నుంచి కష్టపడిన వారు చాలా మంది ఉండగా, కేవలం డబ్బు, మంత్రి ఆశీస్సులనే ప్రాతిపదికగా తీసుకుని వేమిరెడ్డిని ఎలా ఎంపిక చేస్తారని పార్టీ అంతర్గత చర్చల్లో తమ ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో 36 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని పార్టీ ముఖ్య నేతలను ప్రసన్నం చేసుకోవడం వేమిరెడ్డికి కత్తిమీద సాములా మారనుంది. పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకున్నందువల్ల తాము పనిచేస్తామని నాయకులు చెప్పినా ఓటింగ్ దగ్గర కొచ్చే సరికి చేతులెత్తేస్తే వేమిరెడ్డికి ఇబ్బందులు తప్పక పోవచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కేవలం నారాయణ విద్యా సంస్థల ఉద్యోగుల ఓట్లతో అభ్యర్థులు గెలుస్తారనుకోవడం అవివేకమని చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ ముఖ్యనేత ఒకరు వ్యాఖ్యానించారు.
తెర మీదకు పరసా
ఉపాధ్యాయ స్థానానికి అభ్యర్థిని పోటీకి దింపాలా? లేక స్వతంత్ర అభ్యర్థికి గానీ, బీజేపీ అనుబంధసంఘమైన ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం తరపున తామే ఒకరిని బరిలోకి దింపాలా అనే విషయం గురించి టీడీపీ నాయకత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే సూళ్లూరుపేట నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి పరసారత్నం పేరు మంత్రి నారాయణ తెర మీదకు తెస్తున్నారు. పరసారత్నం కళాశాల, యూనివర్సిటీ విద్య తిరుపతిలోనే చదవడం, ఆ జిల్లా వాసులతో కూడా సన్నిహిత సంబంధాలు ఉండటంతో సీపీఎం తరపున పోటీకి దిగుతున్న విఠపు బాలసుబ్రమణ్యంను ఢీ కొనగలరని మంత్రి నారాయణ ఇప్పటికే సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి సతీమణి సుచరిత కూడా ఈ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిత్వం కోరుతున్నారు. గురువారం తిరుపతిలో జరిగిన పార్టీ సమావేశంలో ఆమె పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు తన అభ్యర్థిత్వం పరిశీలించాలని వినతిపత్రం ఇచ్చారు. ఇదిలా ఉండగా నారా లోకేష్ ద్వారా పార్టీ సీనియర్లకు ముకుతాడు వేయించి వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డిని గెలిపించేలా పనిచేయించాలని మంత్రి నారాయణ మంత్రాంగం చేస్తున్నారు. శుక్రవారం జరిగే నెల్లూరు జిల్లా పార్టీ సమన్వయ సమావేశంలో లోకేష్ ఈ విషయం గురించి పార్టీ సీనియర్లకు గట్టిగా చెప్పే అవకాశం ఉందని మంత్రి మద్దతుదారులు చెబుతున్నారు.