ఎంపికే కొంప ముంచింది
► ముఖ్యమంత్రి వద్ద ఎమ్మెల్సీ పంచాయితీ
► అభ్యర్థిగా వేమిరెడ్డి ఎంపిక ఏకపక్షం
► ఆయనకు పార్టీ ముఖ్యనేతల ఆమోదం లేదు
► ఓటమికి మంత్రి నారాయణే కారణం
► అనర్హుడిని అభ్యర్థిగా నిలపడంతోనే ఈ పరిస్థితి
► గ్రాడ్యుయేట్స్, ఉపాధ్యాయ ఎన్నికల్లోనూ టీడీపీకి భంగపాటు
► చంద్రబాబు వద్ద అధికార పార్టీ నేతల ఆవేదన
►విజయవాడలో సీఎంను కలిసి ఫిర్యాదు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ఏకపక్ష వైఖరే పార్టీ కొంపముంచిందని టీడీపీ నాయకులు పేర్కొంటున్నారు. మున్సిపల్ శాఖమంత్రి నారాయణ మాటలు విని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డిని ఎంపిక చేయడంతోనే ఓటమి చవిచూడాల్సి వచ్చిందని అధికార పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏమాత్రం పరిచయం, ప్రచారం లేని వాసుదేవనాయుడిని ఎంపిక చేయడం ఓటమికి కారణమని పచ్చనేతలు బుధవారం విజయవాడలో ముఖ్యమంత్రికి వివరించినట్లు తెలిసింది. అధికార పార్టీ అభ్యర్థులకు ఓట్లేసేందుకు ఓటర్లు విముఖత చూపడంతోపాటు అభ్యర్థుల ఎంపికపై అధికార పార్టీలో విబేధాలు టీడీపీ అభ్యర్థుల ఓటమికి కారణమన్నది పరిశీలకుల అభిప్రాయం.
ఇంచార్జి మంత్రినీ పట్టించుకోక..: మూడు జిల్లాల పరిధిలో అభ్యర్థిని నిలుపుతున్నామని తెలిసినా మంత్రి నారాయణ ఏకపక్షంగా వేమిరెడ్డి అభ్యర్థిని ఖరారు చేశారు. ఈ విషయం ఆయా జిల్లాలకు చెందిన అధికారపార్టీ ముఖ్య నేతలకు ఏమాత్రం చెప్పలేదు. సాక్షాత్తూ నెల్లూరు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి శిద్దా రాఘవరావుకు సైతం ఈ విషయం చెప్పలేదు. దీనిని పార్టీ ముఖ్యనేతలు సైతం జీర్ణించుకోలేకపోయారు. మరోవైపు చంద్రబాబు ఒత్తిడితో ఎన్నికల ప్రచారానికి దిగినా ఎమ్మెల్సీ అభ్యర్థులు ప్రచారానికి కూడా అందుబాటులోకి రాలేదు. పరిచయ సమావేశాలకు సైతం వారు దూరంగా ఉన్నారు. ముఖ్యంగా పట్టభద్రుల స్థానం అభ్యర్థి వేమిరెడ్డి మంత్రి నారాయణ అనుచరుడినన్న దర్పంతో ఓటర్లతో పాటు అధికారపార్టీ జిల్లా నేతలను సైతం ఖాతరు చేయలేదు. కేవలం విద్యాసంస్థలలో మాత్రమే ప్రచారం సాగించారు. కొందరు అధికారుల అండతో బోగస్ ఓట్లు నమోదు చేయించుకొని గెలుపు ఖాయమని ప్రచారం సాగించారు. దీంతో ఓటర్లలో మరింత ఆగ్రహం నెలకొంది. పైగా తమను ఏమాత్రం పట్టించుకోక పోవడంతో అధికారపార్టీ కేడర్ చాలావరకు ఎన్నికకు దూరమైంది. ఇక మంత్రి నారాయణపై అక్కసుతో కొందరు టీడీపీ నేతలు మిన్నకుండి పోయారు. పర్యవసానంగా అధికారపార్టీ అభ్యర్థులకు ఓటమి తప్పలేదు. ఇదే విషయాన్ని బుధవారం అధికార పార్టీ నేతలు ముఖ్యమంత్రికి చెప్పినట్లు సమాచారం.
పరిచయ కార్యక్రమాలకూ దూరం..: నారాయణ విద్యాసంస్థలపై అక్కసుతో మిగిలిన విద్యాసంస్థలు ఎన్నికల్లో వేమిరెడ్డికి వ్యతిరేకంగా ఓట్లేశారని కొందరు నేతలు ముఖ్యమంత్రికి విన్నవించారు. మూడు జిల్లాల పరిధిలో అభ్యర్ధిని నిలిపేటపుడు అన్ని జిల్లాల ముఖ్య నేతలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకపోవడంపై పలువురు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మంత్రి నారాయణ సూచన మేరకు ఏకపక్షంగా అభ్యర్థిని నిలపడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని మరికొందరు చెప్పారు. తనగెలుపు ఖరారైందని వేమిరెడ్డి ప్రచారం చేసుకోవడంతో పాటు పార్టీ నేతలు, కార్యకర్తలను కలిసి ఓట్ల అడగలేదని, పరిచయ కార్యక్రమాలకు సైతం వేమిరెడ్డి హాజరు కాలేదని పార్టీ ముఖ్యనేతలు ముఖ్యమంత్రికి పిర్యాదు చేశారు.