మార్చి 31కి పెన్నా బ్యారేజ్ పూర్తి
-
మంత్రి నారాయణ
నెల్లూరు(పొగతోట): నెల్లూరు పెన్నా బ్యారేజ్ నిర్మాణాన్ని వచ్చే ఏడాది మార్చి 31 లోపు పూర్తి చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పి.నారాయణ సంబంధిత అ«ధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక గోల్డన్‌జూబ్లీహాలులో ఇరిగేషన్, వ్యవసాయం, డీఆర్‌డీఏ, వైద్య ఆరోగ్య శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. నెల్లూరు బ్యారేజ్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. 51 గేట్లు ఏర్పాటు చేయవలసి ఉందన్నారు. సంఘం బ్యారేజ్ పనులు నిర్ధేశించిన సమయంలోపు పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్యాకేజ్ పనులు పూర్తి చేయాలన్నారు. ప్యాకేజ్ పనులు పూర్తి చేయడం వలన జిల్లాలో 2.50 లక్షలకుపైగా అదనపు ఆయకట్టు సాగులోకి వస్తుందని తెలిపారు. ప్యాకేజ్ పనులు నిర్ధేశించిన సమయంలోపు పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని కాంట్రాక్టర్లను ఆదేశించామన్నారు. నిమ్మ, బత్తాయి, కూరగాయాల సాగు విస్తీర్ణం పెరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. పర్యటక రంగం అభివృద్ధికి నిర్ధేశించిన పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. పింఛన్‌ల పంపిణీలో జాప్యం జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విధానం జిల్లాలో విజయవంతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. ఎంఎల్‌సీ బీదా రవిచంద్ర మాట్లాడారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు, డీఎం అండ్ హెచ్‌ఓ డాక్టర్ వరసుందరం, వ్యవసాయ శాఖ జేడీ హేమమహేశ్వరరావు, హర్టికల్చర్ ఏడీలు అనురాధా, ఉమాదేవి, ఇరిగేషన్, టూరిజం అధికారి నాగభూషణం, డీఆర్‌డీఏ తదితర అధికారులు పాల్గొన్నారు.