Solve the problems
-
తప్పనిసరి పరిస్థితిలో దొంగతనం జరిగిందని ఫిర్యాదు.. తీరా దొంగ ఎవరంటే?...
ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడంటరు కదా. మన మధ్య, మనతోనే ఉంటూ మోసం చేస్తే ఈ సామెత వాడుతుంటాం ఔనా! అచ్చం అలాంటి సంఘటన ఒక వ్యాపారవేత్తకి ఎదురైంది. అసలేం జరిగిందంటే...ముంబైకి చెందిన వ్యాపారవేత్త అబ్దుల్‌కాదర్ షబ్బీర్ ఘోఘవాలా ఇంట్లో బంగారు ఆభరణాలు ఒక్కొక్కటిగా మాయం అవ్వడం జరిగింది. దీన్ని సదరు వ్యాపారవేత్త గుర్తించాడు కూడా. ఇలా కొద్ది నెలలోనే చాలా నగలు పోయాయి. కానీ అతను పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ఇష్టపడలేదు. ఇంట్లో వస్తువులు ఏదో మంత్రం వేసినట్లు మాయవుతున్నాయని అనుకున్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు పెద్దమొత్తంలో నగదు చోరికి గురైంది. దీంతో ఇక చేసేదేమి లేక వ్యాపారవేత్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ వ్యాపారవేత్త ఇంట్లో బంగారు ఆభరణాలు, నగదుకి సంబంధించి దాదాపు 40 లక్షలకు పైనే దొంగతనం జరిగింది. పోలీసులు వెంటనే ఇంత పెద్ద మొత్తంలో దొంగతనం జరిగాలంటే వ్యాపారవేత్తకు తెలిసిన వ్యక్తి చేసి ఉండాలి లేదా ఇంట్లో ఉండే వ్యక్తే అయ్యి ఉండాలన్న అనుమానంతో ఆ దిశగా దర్యాప్తు చేశారు. తీరా విచారణ చేస్తే అసలు దొంగ ఆ వ్యాపారవేత్త 12 ఏళ్ల మేనకోడలే ఈ దొంగతనానికి పాల్పడినట్లు తెలిసింది. దీంతో వ్యాపారవేత్త ఒక్కసారిగా షాక్ తిన్నాడు. పోలీసుల విచారణలో సదరు వ్యాపారవేత్త మేనకోడలు గుజరాత్‌లోని సూరత్‌లో ఉండే తన బంధువుని తన మావయ్య ఇంట్లో దొంగతనం చేయమని చెప్పినట్లు తెలిసింది. దీంతో సదరు బంధువుని అతనికి సహకరించిన ఇద్దరు స్నేహితులని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు రూ. 40 లక్షలు వరకు రికవర్ చేశారు. ఐతే సదరు వ్యాపారవేత్త మేనకోడలుపై ఎలాంటి చర్య తీసుకోలేదని, ఈ దొంగతనంలో ఆమె పాత్ర ఎంత వరుకు ఉందో నిర్థారించిన తర్వాత జువైనల్ జస్టీస్ బోర్డుకు వివరణాత్మక నివేదికను పంపుతామని పోలీసులు తెలిపారు. (చదవండి: దగ్గు సిరప్కి కంపెనీకి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి...ఉత్పత్తికి చెక్!) -
కదంతొక్కిన పారిశుద్ధ్య కార్మికులు
- సంగారెడ్డిలోని కలెక్టరేట్ ఎదుట ధర్నా - దీక్షలను భగ్నం చేసిన పోలీసులు - 96 మంది ఆందోళనకారుల అరెస్టు - నిరసనగా నేడు జిల్లా వ్యాప్తంగా నిరసనలు సంగారెడ్డి క్రైం: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం గ్రామపంచాయతీ, మున్సిపల్ కార్మికులు సంగారెడ్డిలోని కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. వీరి ఆందోళన కార్యక్రమానికి సీఐటీయూ మద్దతు పలికింది. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన మున్సిపల్ కార్మికులు మూడు విడతలుగా ధర్నాలు చేపట్టారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసి, దీక్షలను భగ్నం చేయడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్, గ్రామ పంచాయతీ కార్మికులు పెద్ద ఎత్తున కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టడంతో పోలీసులు మోహరించి ఆందోళనకారులను బలవంతంగా అరెస్టు చేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. అనంతరం పోలీసులు కలెక్టరేట్ వద్ద గత మూడు రోజులుగా చేపడుత్ను నిరాహార దీక్షా శిబిరాన్ని బలవంతంగా తొలగించారు. అంతకుముందు జరిగిన ధర్నా కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కె. రాజయ్య, నాయకులు జయరాం, సంజీవులు, తాజుద్దీన్, మల్లేశం, మాణిక్యం, ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ 37 రోజులుగా మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని విమర్శించారు. కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. 96 మంది ఆందోళనకారుల అరెస్టు ఆందోళన చేపడుతున్న ఆందోళనకారులను సీఐలు ఆంజనేయులు, వెంకటేష్ ఆధ్వర్యంలో పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి ఇంద్రకరణ్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మొత్తం 96 మంది ఆందోళన కారులను పోలీసులు అరెస్టు చేశారు. అక్రమ అరెస్టులకు నిరసనగా బుధవారం జిల్లా వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని సీఐటీయూ నాయకులు పిలుపునిచ్చారు. -
అధికారులూ...నిర్లక్ష్యం వద్దు
స్పీకర్ మధుసూదనాచారి కాచిగూడ: సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం కోల్పోతారని, కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా అవుతుందని తెలంగాణ శాసనసభ స్పీకర్ ఎస్.మధుసూదనాచారి అన్నారు. స్వచ్ఛ హైదరాబాద్ సమీక్ష సమావేశాన్ని బుధవారం కాచిగూడలోని మహేంద్ర గార్డెన్స్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు కాగితాలకే పరిమితమవుతున్నట్టు ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపారు. సమస్యలు పరిష్కరించకుండానే నివేదికలు అందిస్తున్నారని, ఈ విషయంలో అధికారులు మరోసారి సరి చూసుకోవాలన్నారు. పనులు చేపట్టకున్నా చేపట్టినట్లు రికార్డులు రాస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి మాట్లాడుతూ అధికారుల్లో జవాబుదారీతనం కొరవడుతోందని అసంతృప్తి వ్యక్తం చే శారు. ఐదారేళ్లుగా అనేక పనులు కొనసాగుతున్నాయని, కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐఏఎస్ అధికారి రేమండ్ పీటర్, జీహెచ్ఎంసీ సర్కిల్-9 డీఎంసీ సత్యనారాయణ, వాటర్‌వర్క్స్ డీజీఎం శ్రీధర్, నోడల్ అధికారి రాజేంద్ర కుమార్, ప్రేరణ, మాజీ కార్పొరేటర్ కన్నె ఉమారాణి, బీజేపీ గ్రేటర్ కార్యదర్శి కన్నె రమేష్‌యాదవ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎక్కాల కన్నా, బి.రవీందర్‌యాదవ్, సునిల్ బిడ్లాన్, ఎస్.మున్నాసింగ్, దూసరి శ్రీనివాస్‌గౌడ్, మేడిశెట్టి రాజేష్, తుమ్మల నర్సింహ్మారెడ్డి, యాంకర్ పవన్, లక్నపురి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
కదంతొక్కిన బీడీ కార్మికులు
సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బీడీ కార్మికులు కదంతొక్కారు. మామడ, జన్నారంలో ర్యాలీలు చేపట్టి నిరసనలు చేపట్టారు. తహశీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నాలకు దిగారు. మామడలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. రూ.వెయ్యి జీవనభృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్పందించకుంటే పోరాటం ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నిర్మల్(మామడ)/జన్నారం : సమస్యల పరిష్కారం కోసం బీడీ కార్మికులు కదంతొక్కారు. శనివారం మామడ, జన్నారం మండల కేంద్రాల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. తహశీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించారు. మామడలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మహిళలు భారీ సంఖ్యలో ర్యాలీగా బస్టాండ్ నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు తరలివెళ్లారు. తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాలో ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వనమాల కృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం బీడీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు రూ.వెయ్యి జీవనభృతి చెల్లించాలని అన్నారు. సమస్యలు పరిష్కారానికి నోచుకోక రాష్ట్రంలోని ఏడు లక్షల మంది కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సమస్యలు పరిష్కరించనిపక్షంలో పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పనిదినాలు పెంచాలని అన్నారు. అనతరం ఆర్ఐ చిన్నయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల బీడివర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు బక్కన్న, ప్రధాన కార్యదర్శి రాజన్న, నాయకులు రాంలక్ష్మణ్, గంగన్న, గపూర్, సుమేష్, నంది రామయ్య పాల్గొన్నారు. సీఐటీయూ ఆధ్వర్యంలో.. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు బీడీ కార్మికులకు రూ. వెయ్యి భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తూ జన్నారంలో శనివారం సీఐటీయూ ఆధ్వర్యంలో బీడీ కార్మికులు ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు వెళ్లి ధర్నా చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూతన్‌కుమార్ మాట్లాడుతూ కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీని విడుదల చేయకపోవడం విడ్డూరమని అన్నారు. కార్మికులకు పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, కనీస వేతన చట్టం జీవో అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహశీల్దార్ సంపతి శ్రీనివాస్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కె.రాజన్న, మండల కార్యదర్శి కే.లింగన్న, సీఐటీయూ నాయకులు కూకటికారు బుచ్చన్న, పిల్లి అంజయ్య, అలగొండ శాంత, సిందెం స్వరూ ప, సుమారు వెయ్యి మంది బీడీ కార్మికులు పాల్గొన్నారు.