కదంతొక్కిన పారిశుద్ధ్య కార్మికులు
- సంగారెడ్డిలోని కలెక్టరేట్ ఎదుట ధర్నా
- దీక్షలను భగ్నం చేసిన పోలీసులు
- 96 మంది ఆందోళనకారుల అరెస్టు
- నిరసనగా నేడు జిల్లా వ్యాప్తంగా నిరసనలు
సంగారెడ్డి క్రైం: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం గ్రామపంచాయతీ, మున్సిపల్ కార్మికులు సంగారెడ్డిలోని కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. వీరి ఆందోళన కార్యక్రమానికి సీఐటీయూ మద్దతు పలికింది. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన మున్సిపల్ కార్మికులు మూడు విడతలుగా ధర్నాలు చేపట్టారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసి, దీక్షలను భగ్నం చేయడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్, గ్రామ పంచాయతీ కార్మికులు పెద్ద ఎత్తున కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టడంతో పోలీసులు మోహరించి ఆందోళనకారులను బలవంతంగా అరెస్టు చేశారు.
దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. అనంతరం పోలీసులు కలెక్టరేట్ వద్ద గత మూడు రోజులుగా చేపడుత్ను నిరాహార దీక్షా శిబిరాన్ని బలవంతంగా తొలగించారు. అంతకుముందు జరిగిన ధర్నా కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కె. రాజయ్య, నాయకులు జయరాం, సంజీవులు, తాజుద్దీన్, మల్లేశం, మాణిక్యం, ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ 37 రోజులుగా మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని విమర్శించారు. కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.
96 మంది ఆందోళనకారుల అరెస్టు
ఆందోళన చేపడుతున్న ఆందోళనకారులను సీఐలు ఆంజనేయులు, వెంకటేష్ ఆధ్వర్యంలో పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి ఇంద్రకరణ్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మొత్తం 96 మంది ఆందోళన కారులను పోలీసులు అరెస్టు చేశారు. అక్రమ అరెస్టులకు నిరసనగా బుధవారం జిల్లా వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని సీఐటీయూ నాయకులు పిలుపునిచ్చారు.