నకిలీ ఏజెంట్ల వ్యవస్థను అరికడతాం: నాయిని
♦ దుబాయ్‌లో సోనాపూర్
♦ క్యాంపును సందర్శించిన మంత్రి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నకిలీ ఏజెంట్ల చేతుల్లో అమాయకులు మోసపోకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయంతోనే గల్ఫ్‌లో ఉద్యోగాలిప్పిస్తామని హోంమంత్రి నాయిని న ర్సింహారెడ్డి అన్నారు. నకిలీ ఏజెంట్ల వ్యవస్థను అరికట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కార్మికులకు ఉపాధి, కంపెనీలతో ఒప్పందాల విషయమై శుక్రవారం దుబాయ్ వెళ్లిన మంత్రికి అక్కడి ఎయిర్‌పోర్టులో గల్ఫ్ తెలంగాణ వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. శుక్రవారం ఆయన కార్మికులు నివసిస్తున్న సోనాపూర్ క్యాంపును సందర్శించారు.
యువత ఉద్యోగాల కోసం దళారుల ద్వారా గల్ఫ్ దేశాలకు వచ్చి ఎదుర్కొంటున్న ఇబ్బం దులు వర్ణణాతీతమన్నారు. ఈ ఇబ్బందులను అధిగమించడానికి సీఎం కేసీఆర్ తెలంగాణ ఓవర్సీర్ మ్యాన్ పవర్ కంపెనీ(టామ్ కామ్) ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ వ్యవస్థ ద్వారా ప్రభుత్వమే గల్ఫ్ దేశాలలో ఉన్న కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకొని వాటికి అనుగుణంగా తెలంగాణ యువతకు ఉద్యోగాలు కల్పిస్తుందన్నారు. శనివారం(నేడు) నుంచి ఈనెల 23 వరకు దుబాయి కాన్సులేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఆయా కంపెనీలతో సమావేశం కానున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో కార్మికశాఖ ముఖ్య కార్యదర్శి హర్‌ప్రీత్‌సింగ్, హోం శాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది, టామ్‌కామ్ డెరైక్టర్ భవానీ తదితరులున్నారు.
నేడు దుబాయ్‌కు డిప్యూటీ సీఎం, ఎంపీ కవిత
రాయికల్: డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ఎంపీ కల్వకుంట్ల కవిత శనివారం దుబాయ్ వెళ్లనున్నారు. తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన మంత్రులు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో దుబాయ్‌లో నిర్వహించే లేబర్ రోడ్‌షో, యూఏఈలోని వివిధ కంపెనీల ప్రతినిధులతో స్కిల్ డెవలప్మెంట్పై నిర్వహించే సదస్సులో వీరు పాల్గొంటారు.