బురద విలయం
⇒ కొలంబియాలో 206 మందిమృతి
⇒ 220 మంది గల్లంతు
⇒ వందలాది మంది గాయాలపాలు
⇒ కొట్టుకుపోయిన ఆవాసాలు, వంతెనలు
⇒ అత్యవసర పరిస్థితి ప్రకటించిన అధ్యక్షుడు
⇒ అంధకారంలో మొకోవా
⇒ తాగునీరు దొరక్క స్థానికులు ఇక్కట్లపాలు
బొగోట: దక్షిణ కొలంబియాను బురద ముంచెత్తింది. మట్టిపెళ్లలు విరిగిపడడంతో 206 మంది చనిపోగా వందలాది మంది గాయపడ్డారు. నైరుతి మొకోవా నగరం బురద ప్రవాహం ముంచెత్తింది. దీంతో అనేక ఇళ్లు, వంతెనలు, వాహనాలు, చెట్లు కొట్టుకుపోయాయి. ఎక్కడచూసినా బురద తప్ప మరేమీ కనిపించని పరిస్థితి నెలకొంది. అమెజాన్ పరీవాహక ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఎడతెరిపిలేకుండా వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో నదులు పొంగి పొర్లాయి. ఈ విలయంలో 202 మంది గాయపడగా మరో 220 మంది గల్లంతయ్యారని కొలంబియా రెడ్‌క్రాస్ సొసైటీ చీఫ్ సెసార్ యురుయెనా చెప్పారు.
ఈ విషాదం నేపథ్యంలో 300 కుటుంబాలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోయాయి. అనేక ఆవాసాలు ధ్వంసమయ్యాయి. దేశ అధ్యక్షుడు జువాన్ మాన్యుయెల్ శాంటోస్...అడవులకు ఆలవాలమైన మొకోవా ప్రాంతాన్ని సందర్శించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విషాదానికి సంబంధించి తమకు అనేక ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. శుక్రవారం రాత్రి 130 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని, దీంతో ఎమర్జెన్సీని ప్రకటించామని తెలిపారు, బాధిత కుటుంబాలపట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ... అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. తమ ప్రార్థనలన్నీ బాధిత కుటుంబాల కోసమేనన్నారు
అనూహ్య విషాదం
ఈ విషయమై పుటమయో గవర్నర్ సొర్రెల్ అర్కోకా మాట్లాడుతూ ఇదొక అనూహ్య విషాదమని అన్నారు. బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామన్నారు. అనేక కుటుంబాల ఆచూకీ తెలియడం లేదని, మొకోవా పరిసర ప్రాంతాలు బురదలో చిక్కుకుపోయాయని చెప్పారు. జాతీయ విపత్తు నిర్వహణ అధికారి కార్లోస్ ఇవాన్ మాట్లాడుతూ మొకోవా, దాని ఉపనదులు ఉప్పొంగి ప్రవహించిన కారణంగానే మట్టిపెళ్లలు విరిగిపడ్డాయని, చివరికి మహా విపత్తుకు దారితీసిందన్నారు. నదుల్లో నీటిమట్టం ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తోందని సైన్యం ప్రకటించింది.
రంగంలోకి క్రైసిస్ గ్రూపు
ఈ విషాదం నేపథ్యంలో కొలంబియా ప్రభుత్వం స్థానిక అధికారులు, సైనిక సిబ్బంది, పోలీసులతో కూడిన క్రైసిస్ గ్రూపును రంగంలోకి దించింది. ఈ బలగాలు గల్లంతైన వారి జాడ కోసం గాలిస్తున్నాయి. కొండప్రాంతాలను చుట్టుముట్టిన బురదను తొలగించడంతోపాటు సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నాయి. వీరికి అత్యవసర సిబ్బంది కూడా చేయూత అందిస్తోంది. ఈ విలయం నేపథ్యంలో మొకోవాలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తాగునీరు దొరకకపోవడంతో ప్రజలు విలవిలలాడుతున్నారు. ఇదిలాఉంచితే ఇటీవల దక్షిణ అమెరికాలోని పెరూ, ఈక్వెడార్‌లను సైతం బురద ముంచెత్తడం తెలిసిందే.
బురదమయంగా మారిన మొకోవా నగరం
మరన్ని ఫోటోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి