space lab
-
పసిఫిక్‌లో కూలిన స్కైలాబ్
బీజింగ్: చైనాకు చెందిన అంతరిక్ష ప్రయోగ కేంద్రం టియాంగంగ్–1 పసిఫిక్ మహా సముద్రంలో కూలిపోయింది. సోమవారం ఉదయం 5.45 గంటలకు (భారత కాలమానం) టియాంగంగ్–1 దక్షిణ పసిఫిక్ మహా సముద్రంలో కూలినట్లు చైనా అధికారులు వెల్లడించారు. టియాంగంగ్ వల్ల ఎక్కడా, ఎవ్వరికీ హాని జరగలేదనీ, భూ వాతావరణంలోకి ప్రవేశించిన వెంటనే వేడికి దాదాపుగా దగ్ధమైపోయినట్లు చైనాలోని మ్యాన్డ్ స్పేస్ ఇంజనీరింగ్ ఆఫీస్ తెలిపింది. సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలన్న ఆలోచనలో భాగంగా చైనా టియాంగంగ్–1ను 2011 సెప్టెంబరులో అంతరిక్షంలోకి పంపింది. దీని జీవితకాలం రెండేళ్లు ఉండేలా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. మొత్తం ఆరుగురు వ్యోమగాములు (ఇద్దరు స్త్రీలు, నలుగురు పురుషులు) అంతరిక్షంలో టియాంగంగ్‌లో పనిచేశారు. 2013 కల్లా ఇది తన ప్రధాన పనులను పూర్తి చేసినప్పటికీ టియాంగంగ్ సేవలను చైనా పొడిగించుకుంటూ వెళ్లింది. అయితే 2016లో ఇది పూర్తిగా పనిచేయడం మానేసి, నియంత్రణను కోల్పోయి కక్ష్య నుంచి పక్కకు జరగడం ప్రారంభించింది. చివరకు సోమవారం మళ్లీ భూ వాతావరణంలోకి ప్రవేశించి సముద్రంలో కూలిపోయింది. ‘మా దగ్గర ఉన్న సమాచారం మేరకు టియాంగంగ్ కూలడం వల్ల భూమిపై ఎక్కడా ఎలాంటి హానీ జరగలేదు. 8 టన్నుల బరువు, 10.4 మీటర్ల పొడవున్న టియాంగంగ్ ఆకాశంలోనే చాలా వరకు కాలిపోయింది. అది చైనా చరిత్రలో నిలిచిపోతుంది. అంతరిక్ష కేంద్రంలో పరిశోధనల గురించి ఇది మాకు ఎంతో జ్ఞానాన్ని ఇచ్చింది’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జెన్ షువాంగ్ చెప్పారు. -
తప్పిన ముప్పు.. కూలిన చైనా స్కైలాబ్..!
బీజింగ్: ప్రస్తుతం నిరుపయోగంగా మారిన చైనా అంతరిక్ష ప్రయోగ కేంద్రం పసిఫిక్ మహాసముద్రంలో కూలిపోయింది. టియాంగంగ్-1 (స్వర్గ సౌధం) అనే అంతరిక్ష కేంద్రం ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12.15 గంటలకు (భారత కాలమానం ప్రకారం) భూ వాతావరణంలోకి ప్రవేశించిందని, భూవాతావరణంలోకి రావడంతోనే దగ్ధమైన అది దక్షిణ పసిఫిక్ సముద్రంలో కూలిపోయిందని చైనా అంతరిక్ష సంస్థ పేర్కొన్నట్టు ఆ దేశ వార్తాసంస్థ జిన్హువా తెలిపింది. అమెరికా సైన్యం కూడా ఈ వార్తను ధ్రువీకరించింది. దక్షిణ పసిఫిక్ సముద్రంలో ఇది కూలిపోయిందని తెలిపింది. టియాంగంగ్-1 స్పేస్ స్టేషన్‌ను చైనా 2011లో ప్రయోగించింది. దీని జీవితకాలం రెండేళ్లు ఉండేలా అప్పట్లో రూపొందించారు. 2013 జూన్ కల్లా ఇది తన ప్రధాన పనులను పూర్తి చేసింది. 2016లో పనిచేయడం మానేసి కొద్దికొద్దిగా కక్ష్య నుంచి పక్కకు జరుగుతూ వస్తోంది. ‘టియాంగంగ్–1 అంతరిక్ష కేంద్రం భూమివైపుకు వస్తోంది. ఆదివారం మధ్యాహ్నానికి అది భూవాతావరణానికి 179 కి.మీ. దూరంలో ఉంది’ అని చైనా మ్యాన్డ్ స్పేస్ ఏజెన్సీ ప్రకటించడంతో ఇది భూవాతావరణంలోకి దూసుకొస్తున్న విషయంలో వెలుగులోకి వచ్చింది. అయితే టియాంగంగ్-1 భూమిపై ఏ సమయంలో, ఎక్కడ పడుతుందనే కచ్చితమైన వివరాలను ఏజెన్సీ వెల్లడించకపోవడంతో కొంత ఉత్కంఠ నెలకొంది. 8 టన్నుల బరువు, 10.4 మీటర్ల పొడవుండే టియాంగంగ్ స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, పోర్చుగల్, గ్రీస్ తదితర దేశాల్లో పడిపోయే అవకాశం ఉందని, లేదా న్యూజిలాండ్, టాస్మానియా, అమెరికాల్లోనూ కూలొచ్చని ఊహాగానాలు వెలువడ్డాయి. అంతరిక్ష కేంద్రం కూలిపోయినా భూమిపై జరిగే నష్టం పెద్దగా ఉండబోదనీ, ఎవ్వరూ భయపడాల్సిన పని లేదని చైనా అధికారులు భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇది సముద్రంలో కూలిపోవడంతో అంతరిక్ష శాస్త్రవేత్తలు ఊపిరి పీల్చుకున్నాయి. -
భూమిని ఢీ.. మరో 24 గంటలే..
బీజింగ్, చైనా : అంతరిక్షంలో గతి తప్పి భూమి వైపు దూసుకొస్తున్న స్పేస్ ల్యాబ్ టియాంగ్‌గాంగ్-1 రానున్న 24 గంటల్లో భూమిని ఢి కొట్టనున్నట్లు చైనా స్పేస్ సెన్సెస్ అకాడమీ ఓ ప్రకటనలో పేర్కొంది. వాతావరణంలోకి ప్రవేశించిన అనంతరం అది గంటకు 26 వేల కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంని వెల్లడించింది. దాదాపు 8.5 టన్నుల బరువున్న టియాంగ్‌గాంగ్-1 భూమిని తాకడం వల్ల జరిగే నష్టాన్ని తగ్గించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది. టియాంగ్‌గాంగ్-1 ప్రస్తుతం ప్రయాణిస్తున్న కక్ష్య ఆధారంగా అది 43 డిగ్రీల ఉత్తర, 43 డిగ్రీల దక్షిణ అక్షాంశాంల మధ్య ఉందని తెలిపింది. దీన్ని బట్టి న్యూజిలాండ్, అమెరికా మధ్య పశ్చిమ ప్రాంతాల్లో ఎక్కడైనా అంతరిక్ష నౌక కుప్పకూలొచ్చని వివరించింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ టియాంగ్‌గాంగ్-1 కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తోందని పేర్కొంది. చైనా తొలి అంతరిక్ష పరిశోధన కేంద్రం టియాంగ్‌గాంగ్-1ను చైనా 2011లో ప్రయోగించింది. భవిష్యత్తులో సొంతంగా అంతరిక్షంలో పరిశోధన సంస్థను ఏర్పాటు చేసేందుకు ట్రయల్‌గా ఈ తాత్కాలిక స్పేస్‌ల్యాబ్‌ను పంపింది. 2016లో టియాంగ్‌గాంగ్-1 చైనా అదుపు తప్పింది. అప్పటినుంచి అంతరిక్షంలో చక్కర్లు కొడుతూ భూమి వైపునకు ప్రయాణిస్తోంది. -
టియాంగాంగ్-1 ఎక్కడ కూలుతుందో..?
బీజింగ్ : చైనాకు చెందిన తొలి అంతరిక్ష పరిశోధనా కేంద్రం టియాంగాంగ్-1 ఎక్కడ కూలుతుందోనని చైనాతో పాటు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ఒకింత ఆందోళనకు గురువుతున్నారు. ఈ విషయం గురించి చైనా శాస్త్రవేత్తలు స్పందించారు. ఈ నెల మార్చి 31 నుంచి ఏప్రిల్ 4 తేదీల మధ్య కూలిపోనున్నట్లు చైనా శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. భూమి ఆవరణలోకి రాగానే టియాంగాంగ్-1 మండిపోతుందని తెలిపారు. మార్చి 16 నుంచి టియాంగాంగ్-1 నుంచి సమాచారం అందడం లేదని చైనా అంతరిక్ష ఇంజనీరింగ్ అధికారి సోమవారమే తెలిపారు. భూమికి 216.2 కిలోమీటర్ల దూరంలో భూమి చుట్టూ తిరుగుతోంది. కచ్చితంగా భూమిపై ఎక్కడ కూలుతుందో శాస్త్రవేత్తలకు అంచనావేయడం కష్టతరంగా మారిందని ప్రకటనలో పేర్కొన్నారు. భూమిని సమీపించే రెండు గంటల ముందు మాత్రమే ఎక్కడ పడుతుందో చెప్పగలమని తెలిపారు. టియాంగాంగ్-1 ను 2011లో రెండు సంవత్సరాల జీవితకాలం ఉండేలా రూపొందించారు. ఈ టియాంగాంగ్-1ను షెన్జో-8, షెన్జో-9, షెన్జో-10 స్పేష్క్రాప్ట్లతో లోడింగ్ చేశారు. టియాంగాంగ్-1 గురించి కొన్ని వాస్తవాలు - కక్ష్యలో ఉన్న కాలం 6 సంవత్సరాల 178 రోజులు( మార్చి 26 వరకు) - భూకక్ష్య చుట్టూ 37, 287 సార్లు పరిభ్రమించింది - బరువు 8,506 కేజీలు - పొడవు10.4 మీటర్లు(34.1 అడుగులు) - వ్యాసం 3.35 మీటర్లు(11 అడుగులు) -
చైనా మరో ముందడుగు..
బీజింగ్: అంతరిక్ష రంగంలో చైనా మరో ముందడుగేసింది. తన రెండో స్పేస్ లాబొరేటరీ తియాన్‌గాంగ్-2 ను గురువారం విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. గోబి ఎడారిలోని జియక్వాన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి లాంగ్ మార్చ్ 2f రాకెట్ ద్వారా శాస్త్రవేత్తలు తియాన్‌గాంగ్-2 ను అంతరిక్షంలోకి పంపారు. ఈ స్పేస్ లాబొరేటరీని అంతరిక్షంలో రెండేళ్లపాటు సేవలందించేలా రూపొందించారు. తియాన్‌గాంగ్-2 పొడవు 10.4 మీటర్లు కాగా, వ్యాసం 3.35 మీటర్లు. దీని బరువు 8.6 మెట్రిక్ టన్నులు ఉందని చైనీస్ స్పేస్ అథారిటీ వెల్లడించింది. రెండు క్యాబిన్లుగా విభజించబడి ఉన్న స్పేస్ లాబ్‌లో.. ఒకటి ప్రయోగాలతో పాటు అంతరిక్ష యాత్రికులకు లివింగ్ క్వార్టర్స్ గా ఉపయోగపడుతుంది. రెండవది రీసోర్స్ క్యాబిన్. దీనిలో సోలార్ ప్యానల్స్, స్టోరేజ్ బ్యాటరీలు తదితర సామాగ్రి ఉంటుందని అధికారులు వెల్లడించారు.