స్పీకర్లు పావులుగా మారుతున్నారు
హైదరాబాద్: ఎమ్మెల్యేలు, ఎంపీలు స్వార్థ ప్రయోజనాల కోసమే పార్టీలు మారుతున్నారని కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి విమర్శించారు. స్పీకర్లు అధికార పార్టీ చేతిలో పావులుగా మారుతున్నారని అన్నారు. స్పీకర్ నిర్ణయాలపై కోర్టులు పరిశీలించే అవకాశం ఇవ్వాలని జైపాల్ రెడ్డి అభిప్రాయపడ్డారు. 'పార్టీ ఫిరాయింపులు- స్పీకర్ పాత్ర' అనే అంశంపై బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఆదివారం జరిగిన సదస్సులో జైపాల్ రెడ్డి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ బీపీ జీవన్ రెడ్డి, జస్టిస్ బీ సుదర్శన్ రెడ్డి, హైకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ పీ లక్ష్మణరెడ్డి, జస్టిస్ బి, శేషశయనారెడ్డి, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కే రామచంద్రమూర్తి, లోక్‌సత్తా జేపీ, వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి వేణుగోపాల్, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు.
ఫిరాయింపుల నిరోధక చట్టంలో నిబంధనలు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయని జస్టిస్ జీవన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. స్పీకర్ నిర్ణయమే అంతిమం కాకుండా, దానిపై అప్పీల్‌కు వెళ్లే అవకాశం ఇవ్వాలని పేర్కొన్నారు. ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకునే అధికారం ఎన్నికల కమిషన్‌కు ఉండాలని జస్టిస్ జీవన్ రెడ్డి అన్నారు. సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కే రామచంద్రమూర్తి మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధంగా గెలిచినవారే రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఫిరాయింపుదారులపై కఠిన చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు. జస్టిస్ లక్ష్మణ రెడ్డి మాట్లాడుతూ.. షెడ్యూల్ 10లో సవరణలు తేవాలని సూచించారు. స్పీకర్ వ్యవస్థపై కూడా చర్చ జరగాలని అన్నారు.