లీవులే ఇచ్చారు.. వేతనం రాలేదు
సాక్షి, హైదరాబాద్: ‘దేవుడు వరమిచ్చినా పూజారి అడ్డుకున్నట్లుగా ఉంది ఆర్టీసీ కార్మికుల పరిస్థితి’. సకల జనుల సమ్మె కాలాన్ని స్పెషల్ క్యాజువల్ లీవ్‌లుగా గుర్తించినా, ఆ సమ్మె కాలానికి వేతనం చెల్లిస్తామని చెప్పకపోవడంపై ఆర్టీసీ కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా జరిగిన సకల జనుల సమ్మెలో ఆర్టీసీ కార్మికులు కూడా పాల్గొన్నారు. సమ్మె చేసిన 27 రోజులను స్పెషల్ క్యాజువల్ లీవ్‌గా పరిగణించాలని తెలంగాణ ప్రభుత్వం 2016లోనే ఉత్తర్వులు జారీ చేసింది.
ఇది ఇతర అన్ని శాఖల్లో అమలైనప్పటికీ, ఆర్టీసీలో దాదాపు రెండున్నరేళ్ల జాప్యం తర్వాత తాజాగా ఉత్తర్వులు జారీచేశారు. వీటి ప్రకారం.. సమ్మెలో పాల్గొన్న కార్మికులందరి ఖాతాల్లోనూ 27 రోజుల లీవులు అదనంగా చేరతాయి. ఇది రిటైర్డ్ కార్మికులతోపాటు మరణించినవారికీ వర్తిస్తుంది. అయితే, గతనెలలో మంత్రుల కమిటీ ఇచ్చిన హామీ మేరకు ఆ సమ్మె కాలానికి వేతనం కూడా చెల్లించాలి.
అయితే, ఒకసారి దరఖాస్తు చేసుకున్న లీవుకు రెండోసారి వేతన చెల్లింపు (సమ్మె విరమణ తర్వాత కార్మికులు 27 రోజులకు ఈఎల్స్ దరఖాస్తు చేసుకున్నారు) చేయడం నిబంధనలకు విరుద్ధమని ఆర్థ్ధిక విభాగం వాదిస్తోంది. అందువల్లే సమ్మె కాలానికి వేతనం చెల్లించడం కుదరదని చెబుతోంది. ఈ విషయాన్ని మంత్రులు ముందుగా నిర్ధారించుకోకుండానే మీడియా ముందు ప్రకటించి, ఈ మేరకు సీఎంతో నిధులు కూడా విడుదల చేయించారు. కానీ, ఆర్థికశాఖ అభ్యంతరంతో వేతన చెల్లింపు ఆగిపోయింది.
ముందుగానే చెప్పిన సాక్షి..!
ఆర్టీసీ కార్మికులకు సమ్మెకాలంలో స్పెషల్ క్యాజువల్ లీవులు, వేతనం విషయంలో అన్యాయం జరుగుతోందంటూ జూలై 28న ‘సమ్మె సెలవుపై నీలిమేఘాలు’అన్న శీర్షికతో సాక్షి పత్రికలో కథనం ప్రచురితమైంది. అందులో వేతనం విషయంలో ఆర్థికశాఖ అభ్యంతరాలు, రిటైర్డ్ కార్మికుల విస్మరణ తదితర విషయాలు ప్రస్తావించింది. ఇçప్పుడు సమ్మెకాలానికి వేతన చెల్లింపులు ఉండవన్న మాట తాజా ఉత్తర్వులతో నిజమైంది.
ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి: ఎన్ఎంయూ
సమ్మెకాలానికి వేతనం ఇస్తామని సీఎం అంగీకరించి రూ.80 కోట్లు విడుదల చేశారు. మంత్రుల కమిటీ కూడా ఇదే విషయాన్ని చెప్పింది. కేవలం సాంకేతిక కారణాలతో వారి హామీ అమలుకాకుం డా పోతోంది. ఇది ముమ్మాటికీ గుర్తింపు యూనియన్ వైఫల్యమే. వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని, కార్మికులకు వేతనాలు అందించాలి.
వారి అవగాహనా రాహిత్యం వల్లే: ఎంప్లాయీస్ యూనియన్
చర్చల్లో పాల్గొన్న గుర్తింపు నాయకుల అవగాహ నా రాహిత్యం వల్లే ఇదంతా జరిగింది. ఆచరణకు సాధ్యంకాని హామీలిచ్చి కార్మికుల్లో ఆశలు రేపా రు. ఇపుడు వారికి ఏం సమాధానం చెబుతారు?
ముందే తెలుసు: తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ (టీజేఎంయూ)
ఇలా జరుగుతుందని ముందే తెలుసు. ఏ లీవులకైనా రెండోసారి ఏ సంస్థా చెల్లింపులు చేయదు. మంత్రులతోనూ అదే ప్రకటన చేయించారు. గుర్తింపు యూనియన్ నాయకులకు ముందుచూ పు లేకపోవడమే సమస్యకు కారణం.
నిధులను వెనక్కి వెళ్లకుండా ఆపాం: టీఎంయూ నేతలు
మంత్రులు, ఆర్థికశాఖకు సమన్వయలోపం వల్ల వేతన చెల్లింపులు కుదరలేదు. ఆర్థిక శాఖ చెల్లింపులు చేయకపోవడానికి అదే కారణం. దానికి మమ్మల్ని ఎలా బాధ్యుల్ని చేస్తారు? మా పోరాటం వల్లనే సీఎం విడుదల చేసిన రూ.80 కోట్లను 2013 లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ రూపంలో చెల్లించేందుకు సంస్థ ముందుకు వచ్చింది.