special dishes
-
Varalakshmi Vratham 2024: ఏ పూజ అయినా 'పూర్ణం'తోనే పరిపూర్ణం!
వరలక్ష్మీ వ్రతం అనగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది పూర్ణాలూ బొబ్బట్లే. ఆ తర్వాతే తక్కినవన్నీ. ఎందుకంటే ఏ పూజ అయినా పూర్ణంతోనే పరిపూర్ణం అవుతుందని పెద్దలు చెబుతారు. ఈ వేళ అమ్మవారికి పూర్ణాలు, భక్ష్యాలను నివేదిద్దాం.పూర్ణాలు..కావలసినవి..పచ్చిశనగ పప్పు – అర కేజీ,బెల్లం – అరకేజీ,యాలక్కాయలు – పది,బియ్యం – రెండు కప్పులు,పొట్టుతీసిన మినప గుళ్లు – కప్పు,ఉప్పు – రుచికి సరిపడా,ఆయిల్ – డీప్ ఫ్రైకి సరిపడా.తయారీ..– ముందుగా మినప పప్పు, బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఆరుగంటల పాటు నానబెట్టుకోవాలి.– శనగ పప్పుని కూడా కడిగి గంట పాటు నానబెట్టాలి.– నానిన బియ్యం, మినప పప్పులని మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి.– నానిన శనగపప్పుని కుకర్‌లో వేసి రెండు గ్లాసులు నీళ్లు΄ోసి మూడు విజిల్స్ రానివ్వాలి.– ఉడికిన శనగ పప్పులో బెల్లం వేసి మెత్తగా గరిటతో తిప్పుతూ దగ్గర పడేంత వరకు ఉడికించి, యాలుక్కాయల పొడి వేసి తిప్పి దించేయాలి.– శనగపప్పు మిశ్రమం చల్లారాక, ఉండలుగా చుట్టుకోవాలి.– బియ్యం, మినపగుళ్ల పిండిలో కొద్దిగా ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు శనగ పప్పు ఉండలను ఈ పిండిలో ముంచి ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి.– మీడియం మంట మీద బంగారు రంగులోకి మారేంత వరకు వేయిస్తే తియ్యని పూర్ణాలు రెడీ.భక్ష్యాలు..కావలసినవి..పచ్చిశనగ పప్పు – రెండు కప్పులు,బెల్లం తురుము – రెండు కప్పులు,యాలకుల పొడి – రెండు టేబుల్ స్పూన్లు,మైదా – రెండు కప్పులు,గోధుమ పిండి – మూడు టేబుల్ స్పూన్లు,నెయ్యి – అరకప్పు, నీళ్లు – కప్పు,ఉప్పు – చిటికెడు.తయారీ..– ముందుగా శనగ పప్పుని శుభ్రంగా కడిగి రెండు గంటలపాటు నానబెట్టాలి. – నానిన పప్పుని కుకర్‌లో వేసి, రెండు కప్పుల నీళ్లు ΄ోసి మూత పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి. ఇంతకు మించి ఉడికించకూడదు.– ఉడికిన తరువాత నీళ్లు తీసేసి పప్పుని పక్కన పెట్టుకోవాలి.– మైదాలో గోధుమ పిండి, టేబుల్ స్పూను నెయ్యి, కప్పు నీళ్లు΄ోసి పిండిని ముద్దలా కలుపుకోని పక్కనపెట్టుకోవాలి.– శనగ పప్పుని కూడా మెత్తగా రుబ్బుకోవాలి.– మందపాటి పాత్రలో బెల్లం తురుము, అరకప్పు నీళ్లు ΄ోసి సన్నని మంట మీద ఉడికించాలి.– మధ్య మధ్యలో కలియ తిప్పుతూ రుబ్బుకున్న శనగపప్పు, యాలకుల పొడి వేసి కలిపి, పదినిమిషాల పాటు ఉడికించాలి.– ఉడికిన మిశ్రమాన్ని నిమ్మకాయ సైజు పరిమాణంలో ఉండలుగా చుట్టుకుని పక్కన పెట్టుకోవాలి.– అల్యూమినియం ఫాయిల్‌పైన కొద్దిగా నెయ్యి రాసుకుని కలిపి పెట్టుకున్న మైదా పిండిని చిన్న ఉండలుగా చేసుకుని చపాతీలా చేత్తో వత్తుకోవాలి.– ఈ చపాతీలో శనగపప్పు ఉండని పెట్టి చపాతీ మొత్తం చుట్టి పూరీలా వత్తుకోవాలి.– పెనం మీద నెయ్యి వేసి రెండు వైపులా బంగారు రంగులోకి మారేంత వరకు కాల్చితే భక్ష్యాలు రెడీ. -
ఆరోగ్యానికి చేపట్టాల్సిందే.. మృగశిర కార్తెలో ఫుల్ డిమాండ్
సాక్షి, అమలాపురం: భారతీయ సంప్రదాయం ప్రకారం ఒక్కో కార్తెలో ఒక్కో రకం ఆహారం తీసుకోవడం ఆనవాయితీ. ఇటువంటి ఆహారపు అలవాట్లు ప్రకృతిలో జరిగే మార్పులకు అనుగుణంగా ఆరోగ్యానికి మేలు చేసేవి కావడం విశేషం. ఒక్కో మాసంలో ఒక్కో రకం ఆహారం తీసుకోవడం గోదావరి వాసులకు సంప్రదాయంగా, ఆనవాయితీగా వస్తోంది. వీటిలో పండ్లు, కూరగాయల వంటి శాకాహారమే కాదు. చేపల వంటి మాంసాహారాలు కూడా ఉన్నాయి. ప్రస్తుత మృగశిర కార్తెలో చేపలు ఆహారంగా తీసుకోవడం కూడా ఈ ఆనవాయితీల్లో ఒకటి. మృగశిర కార్తె రోజుల్లో చేపలు తినడం ఆరోగ్యానికి మేలని నమ్మకం. రోళ్లు పగిలే స్థాయిలో ఎండలను మోసుకొచ్చిన రోహిణీ కార్తె ముగిసిన వెంటనే మృగశిర మొదలవుతుంది. తొలకరి వర్షాలు ఆరంభమవుతాయి. ఈ క్రమంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడుతుంది. ప్రకృతిలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఫలితంగా అనేక హానికర సూక్ష్మ క్రిముల వంటివి ఉత్పత్తి అవుతాయి. ఇటువంటి వాతావరణంలో రోగ నిరోధక శక్తి తగ్గి జ్వరం, దగ్గు, శ్వాస సంబంధ సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చేపలు ఆహారంగా తీసుకోవడం వల్ల ఇటువంటి అనారోగ్యాల నుంచి కాపాడుకోవచ్చు. ఇది శాసీ్త్రయంగా కూడా నిరూపితమైంది. ఈ సీజన్లోనే హైదరాబాద్‌లో బత్తిని గౌడ్ సోదరులు ‘చేప ప్రసాదం’ ఇస్తూంటారు. దీనివల్ల ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులు తగ్గుతాయని విశ్వసిస్తారు. రుచిలో మిన్న.. గోదారి చేప నెల్లూరు అంటే కేవలం చేపల పులుసు మాత్రమే గుర్తుకు వస్తుంది. అదే గోదారి జిల్లాలంటే పులస చేపల పులుసు ఒక్కటే కాదు.. ఇక్కడ దొరికే రకరకాల చేపలు.. వాటితో తయారు చేసే రకరకాల వంటలు గుర్తుకొస్తాయి. గోదావరి నీటి మాహాత్మ్యమో.. లేక వండటంలో గొప్పతనమో చెప్పలేం కానీ గోదావరి చేప కూరలు తినాల్సిందేనని మాంసాహార ప్రియులు లొట్టలు వేసుకుంటూ చెబుతారు. చందువా వేపుడు పండుగొప్ప ఇగురు కొర్రమేను కూర కొయ్యింగల పులుసు గుమ్మడి చుక్క కోన చేపల డీప్ ఫ్రై వంటివి తింటే జిహ్వ వహ్వా అనాల్సిందే. పెద్ద చేపల్లోనే కాదు.. చిన్న వాటిల్లో కూడా బోలెడు పచ్చి మెత్తళ్ల మామిడి ఎండు మెత్తళ్ల వేపుడు కట్టి చేపలు బొమ్మిడాయిల పులుసు రామల ఇగురు చింతకాయ చిన్న చేపలు చీరమేను కూరలకు ఫిదా కాని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఈ చేపలతో పులుసులు, కూరలు, ఇగురులు, వేపుళ్ల వంటివి చేయడంలో గోదావరి వాసులు సిద్ధహస్తులు. ఇక ఉప్పు చేప పప్పుచారు, ఆర్చిన చేప ఇగురు, టమాటా రసం తినాలే కానీ వర్ణించేందుకు మాటలు చాలవు. ఇవే కాదు జెల్లలు, మాతలు, గొరకలు, బొచ్చు, శీలావతి, మోసు, గోదావరి ఎర్రమోసు, వంజరం, గులిగింతలు, మట్టకరస ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు వంటి నగరాల్లో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఒక్కటే కాదు.. గోదారోళ్ల చేపల పులుసు, గోదావరి చేపల కూరల పేరుతో రెస్టారెంట్లు కూడా వెలిశాయంటే ఇక్కడ వండే రకాలకు ఉన్న డిమాండ్ అర్థం చేసుకోవచ్చు. లెక్కకు మిక్కిలిగా ఔషధ గుణాలు చేపల్లో ఔషధ గుణాలు అపారంగా ఉంటాయి. ఇందులోని ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ గుండెకు ఆరోగ్యాన్నిస్తాయి. రక్తం గడ్డకట్టడాన్ని తగ్గిస్తాయి. చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తాయి. గుండె జబ్బులు, ఆస్తమా తదితర అనారోగ్య సమస్యలకు అడ్డుకట్ట వేయాలంటే చేపలు తినాలని వైద్యులు చెబుతారు. మనిషి తన రోజువారీ కార్యకలాపాలు సాఫీగా సాగించేందుకు మెదడులో న్యూరాన్లతో కూడిన గ్రే మ్యాటర్ ఉంటుంది. చేపలు తింటే ఇది మరింత చురుకుగా పని చేస్తుంది. వయస్సు మీద పడుతున్న సమయంలో మెదడులోని కణాల క్షీణతను నిరోధించడానికి చేపల ఆహారం తోడ్పడుతుంది. దీనివల్ల అల్జీమర్స్ వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. టైప్–1 డయాబెటిస్‌ను నియంత్రిస్తుంది. చేపలు తింటే దృష్టి లోపాలు, అంధత్వం వంటివి తగ్గుతాయి. గర్భిణులు, పిల్లలకు పాలిచ్చే సీ్త్రలకు చేపలు తినడం ఎంతో మేలు. చిన్న పిల్లలకు సరిపడే స్థాయిలో పాలు ఇవ్వలేనప్పుడు బాలింతలకు మెత్తళ్ల కూర వండి పెట్టడం సర్వసాధారణం. అలాగే బైపాస్ ఆపరేషన్ చేయించుకున్న వారికి పచ్చి మెత్తళ్లతో పాటు, ఎండు మెత్తళ్లు, చిన్న చేపలు (చేదు చేపలు) పత్యంగా అందిస్తారు. సొరచేపల ద్వారా శృంగార సామర్థ్యం పెరుగుతుందని నిపుణులు చెబుతారు. చేపలు.. కోకొల్లలు మాంసాహారులకు కార్తెతో సంబంధం లేదు. ఏడాది పొడవునా చేపలను ఆహారంగా తీసుకుంటారు. గోదావరి జిల్లాల్లో కూడా చేపలకు కొదవే లేదు. విస్తారమైన సముద్రం, అఖండ గోదావరితో పాటు నదీపాయలు, డెల్టా పంట కాలువలు, పర్రభూములు, మెట్టలో సాగునీటి చెరువులు, ప్రాజెక్టులు.. ఏజెన్సీని ఆనుకుని ఉండే సహజసిద్ధమైన చెరువులు (ఆవలు).. ఆపై వేలాది ఎకరాల్లో చేపల సాగు.. ఇలా ఎటు చూసినా రకరకాల చేపలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. కొన్ని రకాల చేపలు ఇతర రాష్ట్రాలకు కూడా ఎగుమతి అవుతుంటాయి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేపలతో ఎన్నో రకాలుగా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చేపల్లో ఉండే ప్రొటీన్ సులువుగా అరిగిపోతుంది. వృద్ధాప్యంలో సహజసిద్ధంగా వచ్చే రుగ్మతలు చాలా వరకూ దూరమవుతాయి. సహజసిద్ధంగా పెరిగే చేపల్లో మేలు చేసే ప్రొటీన్, ఇతర విలువలు ఉంటాయి. – పిండి సాయిబాబు, విశ్రాంత జంతుశాస్త్ర విభాగాధిపతి, ఎస్కేబీఆర్ కాలేజీ, అమలాపురం -
ఆహా ఏమి రుచి.. అంకాపూర్ దేశీ కోడి కూరకు 50 ఏళ్లు..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ ‘అంకాపూర్ దేశీ చికెన్’.. ఈ పేరు వింటే చాలు మాంసం ప్రియులకు నోట్లో నీళ్లూరుతాయి. ఎన్ని రకాల చికెన్ ఐటమ్స్ ఉన్నా.. ఈ దేశీ (నాటు) కోడి కూర రుచే వేరంటే అతిశయోక్తి కాదు. నాన్‌వెజ్ ప్రియులు వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా అంకాపూర్ వచ్చి మరీ ఈ కోడి కూరను ఆస్వాదిస్తుంటారు. 50 ఏళ్ల క్రితం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్‌లో ప్రారంభమైన ఈ దేశీ కోడి కూర ఇప్పటికీ తిరుగులేని బ్రాండ్ ఇమేజ్‌తో తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. అంకాపూర్ గ్రామానికి చెందిన దుబ్బ గౌడ్, లక్ష్మి దంపతులకు వచ్చిన ఆలోచన.. నేడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆ ఊరి పేరును మార్మోగిస్తోంది. ఈ పేరుతో అనేకచోట్ల హోటళ్లు, ఆర్డర్ మెస్‌లు ఏర్పాటు కావడం విశేషం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ నుంచి ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ సహా అనేక మంది జాతీయ, రాష్ట్ర స్థాయి ప్రజా ప్రతినిధులు ఈ అంకాపూర్ దేశీ కోడి కూరను రుచి చూసి మెచ్చుకున్న వారే కావడం గమనార్హం. కల్లు తాగే వారి కోసం.. గీత కార్మికుడైన బుర్ర దుబ్బగౌడ్ కల్లు తాగేందుకు తన వద్దకు వచ్చే వారికి.. నాటు కోడి కూర వండి విక్రయించేవాడు. క్రమంగా దుబ్బగౌడ్ దగ్గరికి కల్లు కోసం వచ్చేవారి సంఖ్య పెరిగింది. దీంతో దుబ్బ గౌడ్, అతని భార్య లక్ష్మి దేశీ కోడి కూరతో పాటు బాతు కూర, ఆమ్లెట్లు వేసివ్వడం ప్రారంభించారు. ఇందుకోసం గ్రామంలోని తమ ఇంటి వద్దనే దేశీ కోళ్లు, బాతులు పెంచడం ప్రారంభించారు. గిరాకీ పెరగడంతో మునిపల్లి, లక్ష్మాపూర్ గ్రామాల నుంచి రెండున్నర రూపాయల నుంచి మూడు రూపాయలకు ఒక కోడిని కొనుగోలు చేసి నలుగురు వ్యక్తులు తినడానికి సరిపడా కిలో బియ్యంతో అన్నం వండి రూ.5కు అందించడంతో క్రమంగా వారి వ్యాపారం పుంజుకుంది. లాభాల బాటలోకి వచ్చిన ఈ దంపతులను చూసి అదే గ్రామానికి చెందిన తాళ్లపల్లి రామగౌడ్, తాళ్లపల్లి మల్లాగౌడ్, బోండ్ల భాజన్న కూడా దేశీ కోడి కూర వంటకం ప్రారంభించారు. పదేళ్ల పాటు గ్రామంలోని గాంధీ చౌరస్తాలో నాటు కోడి కూర వ్యాపారం చేసిన దుబ్బ గౌడ్, లక్ష్మి దంపతులు పోటీ అధికం కావడంతో విరమించుకుని జీవనోపాధి కోసం హోటల్ పెట్టుకున్నారు. ప్రస్తుతం వీరు కాలం చేశారు. ఈ దంపతులు ప్రారంభించిన దేశీ కోడి కూర రుచి, అంకాపూర్ పేరు క్రమంగా అంతర్జాతీయ స్థాయికి విస్తరించాయి. డెలివరీ @ ‘డోర్ స్టెప్’ ఒక కోడి ఆర్డర్ చేసిన వారు తమ గ్రామ శివారులో ఎక్కడ కూర్చున్నా తోటలు, పంట పొలాలు, ఇళ్లకు నేరుగా వెళ్లి అందిస్తున్నారు. భోజనం తరువాత గిన్నెలను సైతం వారే తీసుకెళుతున్నారు. వండి నేరుగా తెచ్చి ఇస్తుండడంతో పట్టణ ప్రాంతాల నుంచి వచ్చిన వారు పంట పొలాల్లో, మామిడి తోటల్లో భోజనం చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొందరు నిజామాబాద్, ఇతర గ్రామాల్లో కూడా ఆర్డర్ మెస్‌లు ప్రారంభించారు. అంకాపూర్ గ్రామం జాతీయ రహదారికి పక్కనే ఉండడంతో ఇక్కడ ఎర్రజొన్న సీడ్ వ్యాపారం అభివృద్ధి చెందింది. సుమారు 40 సీడ్ కంపెనీలు ఇక్కడ ఏర్పాటయ్యాయి. మరోవైపు వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు రావడంతో ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు తరచూ అంకాపూర్‌ను సందర్శిస్తున్నారు. దేశీ కోడి కూరను రుచి చూసి వివిధ ప్రాంతాల్లో దీని గురించి చెప్పడంతో ప్రాచుర్యం పొందింది. అంకాపూర్ దేశీ కోడి ఆర్డర్ మెస్‌ల నిర్వాహకులు కరీంనగర్ జిల్లాతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో దేశీ కోళ్లను కొనుగోలు చేస్తున్నారు. ఒరిజినల్ కోడి అయితే ఎక్కువ ధర.. అంకాపూర్ దేశీ కోడి (క్రాస్ బ్రీడ్) కూరను సొంతంగా తయారు చేసిన ప్రత్యేకమైన మసాలాలు దట్టించి వండటంతో దానికి మంచి రుచి వస్తుంది. కోరిన వారికి ఎల్లిగడ్డ కారం సైతం ప్రత్యేకంగా ఒక గిన్నెలో పెట్టి ఇస్తారు. భోజన ప్రియులు, ముఖ్యంగా నాన్‌వెజ్ ప్రియులు ఈ కూరను ఇష్టంగా తింటున్నారు. అయితే 50 ఏళ్ల క్రితం కిలోకు రూ.5తో ప్రారంభమైన ఈ దేశీ కోడి కూర, అన్నం ధర ప్రస్తుతం రూ.1,000 వరకు ఉంటోంది. గ్రామంలో సుమారు పది మంది ఆర్డర్ మెస్‌లు నెలకొల్పారు. ప్రస్తుతం రూ.700కు నలుగురికి సరిపడా ఫారంలో పెంచిన దేశీ కోడి కూర, అన్నం చేసి ఇస్తున్నారు. ఆర్డర్ మెస్‌లోనే తినేవారికి రూ.130కు ప్లేట్ చొప్పున వడ్డిస్తున్నారు. ఇక గ్రామాల్లో పెరిగిన ఒరిజినల్ దేశీ కోడికి మాత్రం రూ.1,000 వరకు తీసుకుంటున్నారు. ఇతర ప్రాంతాలకూ విస్తరణ.. పాతికేళ్ల క్రితం వరకు కేవలం అంకాపూర్ గ్రామానికే పరిమితమైన ఆర్డర్ మెస్‌లు ప్రస్తుతం విస్తరించాయి. ఆర్మూర్ పట్టణంతో పాటు చుట్టు పక్కల గ్రామాల్లో సైతం అంకాపూర్ దేశీ కోడి కూర పేరుతో ఆర్డర్ మెస్‌లు వెలిసాయి. హైదరాబాద్‌లోని కొంపల్లి, మేడ్చల్ తదితర ప్రాంతాలకు నిజామాబాద్, పెర్కిట్, మామిడిపల్లి కేంద్రాలకు విస్తరించాయి. నిజామాబాద్ జిల్లాలో సుమారు వందకు పైగా అంకాపూర్ దేశీ కోడి కూర అందించే ఆర్డర్ మెస్‌లు ఉండగా.. ఒక్క ఆర్మూర్ మండలంలోనే 50కి పైగా ఆర్డర్ మెస్‌లు ఉన్నాయి. అయితే ఈ దేశీ కూర మెస్‌లను అంకాపూర్ వాసులే కాకుండా వరంగల్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వారు సైతం ఏర్పాటు చేసి ఆర్మూర్ ప్రాంతంలో నిర్వహిస్తున్నారు. విదేశాలకూ పార్శిల్స్.. ఆర్మూర్ ప్రాంతానికి చెందిన పలువురు అమెరికా, యూరప్, గల్ఫ్ దేశాల్లో ఉంటున్నారు. ఉద్యోగాలు, ఉపాధి కోసం అక్కడ స్థిరపడిన వారి కోసం బంధువులు అంకాపూర్ దేశీ కోడి కూరను ఇక్కడ ప్రత్యేకంగా ప్యాక్ చేయించి కొరియర్ ద్వారా పంపిస్తున్నారు. ప్రత్యేక మసాలాలతో ప్రత్యేక రుచి.. ఇంట్లో వండే చికెన్‌లా కాకుండా మేము ప్రత్యేకంగా తయారు చేసిన కొన్ని మసాలాలు దట్టించి దేశీ కోడి కూరను వండుతాం. చాలా రుచికరంగా ఉంటుండటంతో భోజన ప్రియులు తినడానికి ఆసక్తి చూపుతున్నారు. –కుంట నారాయణ గౌడ్, ఆర్డర్ మెస్ నిర్వాహకుడు, అంకాపూర్ అంతర్జాతీయ గుర్తింపుతో ఆనందం అంకాపూర్ దేశీ కోడి కూర తినడానికి వివిధ ప్రాంతాల నుంచి భోజన ప్రియులు వస్తున్నారు. కోరిన విధంగా వారికి వండి పెడుతున్నాము. అంతర్జాతీయ స్థాయిలో అంకాపూర్‌కు గుర్తింపు రావడం ఆనందంగా ఉంది. – తాళ్లపల్లి శ్రీకాంత్, ఆర్డర్ మెస్ నిర్వాహకుడు, అంకాపూర్ అంకాపూర్‌ను మించి పెర్కిట్‌లో వ్యాపారం.. దేశీ కోడి తినాలనుకున్న భోజన ప్రియులు కోరిన విధంగా వండి ఇస్తున్నాము. అంకాపూర్ కంటే పెర్కిట్, మామిడిపల్లిలో దేశీ కోడి ఆర్డర్ మెస్ వ్యాపారం చాలా ఎక్కువగా జరుగుతోంది. పట్టణ ప్రాంతాలకు చెందిన వారు ఇక్కడికి ఎక్కువగా వస్తున్నారు. – జీవన్‌గౌడ్, ఆర్డర్ మెస్ నిర్వాహకుడు, పెర్కిట్, ఆర్మూర్ -
శ్రుతిహాసన్ కోసం ప్రభాస్ చేయించిన వంటలు చూస్తే నోరూరాల్సిందే..
Prabhas surprises Shruti Haasan : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేసే అతిధి మర్యాదలు ఓ రేంజ్లో ఉంటాయి. సెట్లో ప్రభాస్ ఉన్నారంటే ఇక యూనిట్ సభ్యులందరికీ పండుగే. వెరైటీ వంటకాల రుచి చూపిస్తారాయన. ఆ మధ్య సాహో చిత్రీకరణ సమయంలో శ్రద్ధా కపూర్‌కు ప్రత్యేకంగా వంటలు చేయించిన ప్రభాస్..ఈసారి సలార్ బ్యూటీ శ్రుతిహాసన్ కోసం దాదాపు 20 వెరైటీ వంటకాలతో సర్ప్రైజ్ ఇచ్చారు. ప్రస్తుతం ప్రభాస్, శృతిహాసన్ హీరోహీరోయిన్లుగా సలార్ మూవీ చిత్రీకరణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతుంది. ఈ సందర్భంగా శ్రుతి హాసన్ కోసం స్పెషల్‌గా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, గోంగూర మాంసం, కబాబ్, రకరకాల పప్పులు, సాంబార్, కర్రీ సహా దాదాపు ఇరవై రకాల వంటకాలను ప్రభాస్ వండించి తీసుకొచ్చారట. దీనికి సంబంధించిన లిస్ట్‌ను శ్రుతి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో బయటపెట్టింది. నోరూరించే వంటకాలు చూసి శ్రుతి చాలా థ్రిల్‌కి గురైనట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభాస్ ఇచ్చిన స్వీట్ సర్ప్రైజ్కు మురిసిపోయిన శ్రుతి ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది. దీనికి సంబంధించిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రభాస్ మంచి మనసుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. నిజంగా ఆయన డార్లింగ్ అంటూ కొనియాడుతున్నారు. -
ఛాయ్ ఐస్‌క్రీమ్ పరాఠా, సూపర్..
పుర్రెకోబుద్ధి జిహ్వకోరుచి అంటారు పెద్దోళ్లు. అంటే ప్రతి మనిషి ఆలోచనలు వేరుగా ఉంటాయి, అభిరుచులు భిన్నంగా ఉంటాయి అని దాని అర్థం. అలాగే ఒక్కొక్కరు ఒక్కోరకమైన టేస్ట్‌ను ఇష్టపడుతుంటారు. ఇప్పుడు ఓవైస్ సిద్ధ్‌క్వి అనే వ్యక్తి తన అభిరుచికి తగ్గట్టు ఒక స్పెషల్ డిష్‌ను తయారుచేసి దానిని తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దానిని చూసివారు వారి అభిప్రాయాలను బట్టి భిన్నంగా స్పందిస్తున్నారు. ఇంతకీ అతను చేసిన డిష్ ఏంటంటే... మనలో చాలా మందికి ఛాయ్ తాగనిదే తెల్లారదు. టీని ఇష్టపడని వారు సామాన్యంగానే ఎవరు ఉండరు అని చెప్పొచ్చు. Chai paratha reimagined, spiced doodh patti ice cream with sugar laced parhatta. pic.twitter.com/CzPORPMb0U — Owais Siddiqui (@OwaisO) October 8, 2020 అందుకే టీ అంటే చాలా ఇష్టపడే సిద్ధ్‌క్వి ఛాయ్ పరాఠ తయారు చేసి దానిలో తనకు ఇష్టమైన ఐస్‌క్రీమ్‌ను వేసి ఒక ఢిపరెంట్ డిష్‌ను తయారు చేశారు. చాలా మంది ఛాయ్‌తో పాటు సమోసకానీ, బిస్కెట్లు కానీ తినడానికి ఇష్టపడతారు. ఇక మన సిద్ధ్‌క్వి మాత్రం తనకు ఇష్టమైన టీని పరాఠ తయారీలో ఉపయోగించి దానిలో అతనికి ఎంతో ఇష్టమైన ఐస్‌క్రీమ్ పెట్టి ఒక డిఫరెంట్ టేస్ట్‌ను నెటిజన్ల ముందు ఉంచాడు. ఇక చాలా మంది నెటిజన్లు నిజంగా ఇది సూపర్బ్ కాంబినేషన్ అంటూ కితాబిస్తున్నారు. చదవండి: రోడ్డుపై సింహాలు, గుజరాతీలో మాట్లాడిన వ్యక్తి -
పండ్లతో ఓసారి వీటిని ట్రై చేయండి
డేట్ యాపిల్ స్క్వేర్స్ కావలసినవి: ఖర్జూరం ముక్కలు – 2 కప్పులు(గింజలు తొలగించి, మిక్సీలో గుజ్జు చేసుకోవాలి), యాపిల్ గుజ్జు – అర కప్పు, బ్రౌన్ సుగర్ – ఒకటిన్నర కప్పులు, నీళ్లు – ఒకటిన్నర కప్పులు, నిమ్మరసం – 1 టేబుల్ స్పూన్, బటర్ – 1 కప్పు, ఓట్స్ పిండి, బియ్యం పిండి, మొక్కజొన్న పిండి – పావు కప్పు చొప్పున, వాల్నట్, జీడిపప్పు – 2 లేదా 3 టేబుల్ స్పూన్లు చొప్పున (మిక్సీ పట్టుకోవాలి), కొబ్బరి తురుము – పావుకప్పు తయారీ: ముందుగా ఒక పాన్ బౌల్ తీసుకుని అందులో నీళ్లు, అర కప్పు బ్రౌన్ సుగర్ వేసుకుని, గరిటెతో తిప్పుతూ ఉండాలి. కాసేపటికి ఖర్జూరం గుజ్జు వేసుకోవాలి. తర్వాత నిమ్మరసం కూడా వేసుకుని దగ్గరకు అయ్యేదాకా ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో బౌల్ తీసుకుని అందులో బటర్, 1 కప్పు బ్రౌన్ సుగర్, బియ్యం పిండి, ఓట్స్ పిండి, కొబ్బరి తురుము, మొక్కజొన్న పిండి, వాల్నట్, జీడిపప్పు పౌడర్ వేసుకుని కలుపుకోవాలి. తర్వాత యాపిల్ గుజ్జు కూడా వేసుకుని బాగా కలుపుకుని, ఒకటిన్నర లేదా 2 అంగుళాల లోతున్న చతురస్ర లేదా దీర్ఘచతురస్రాకారపు ట్రే తీసుకుని.. అందులో బటర్–యాపిల్ మిశ్రమాన్ని కొద్దిగా వేసుకుని, దానిపైన ఖర్జూరం మిశ్రమాన్ని వేçసుకుని సమాంతరం చేసుకోవాలి. తర్వాత మిగిలిన బటర్ మిశ్రమాన్ని కూడా వేసుకుని మరోసారి సమాంతరం చేసుకుని, 25 నుంచి 30 నిమిషాల పాటు ఓవెన్లో ఉడికించుకుని కావల్సిన షేప్‌లో కట్ చేసుకోవాలి. అరటిపండు హాట్‌కేక్స్ కావలసినవి: అరటి పండ్లు – 6, మొక్కజొన్న పొడి, బియ్యం పిండి – అర కప్పు చొప్పున, మైదాపిండి – 3 టేబుల్ స్పూన్లు, పంచదార – 2 టేబుల్ స్పూన్లు, పాలు – ఒకటిన్నర కప్పులు, నీళ్లు – కొద్దిగా, నూనె – సరిపడా, తేనె – 2 గరిటెలు (గార్నిష్‌కి) తయారీ: ముందుగా 4 అరటిపండ్లు, పాలు ఒక మిక్సీ పాత్రలో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద పాత్ర తీసుకుని అందులో మొక్కజొన్న పొడి, బియ్యప్పిండి, మైదాపిండి, పంచదార వేసుకుని, అరటిపండు–పాల మిశ్రమాన్ని కొద్దికొద్దిగా వేసుకుంటూ కలుపుకుని, 1 గంట పాటు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. తర్వాత నాన్ స్టిక్ పాన్ తీసుకుని, నూనె వేసుకుని, ఒకసారి ఆ మిశ్రమాన్ని బాగా కలిపి.. అవసరం అయితే కొద్దిగా నీళ్లు వేసుకుని, చిన్న చిన్న పాన్ కేక్స్ వేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన అరటిపండ్లను నచ్చిన షేప్‌లో కట్ చేసుకుని, తేనెతో గార్నిష్ చేసుకుని వేడి వేడిగా ఉన్నప్పుడే తింటే.. భలే టేస్టీగా ఉంటాయి. అభిరుచిని బట్టి ఇష్టమైన ఫ్రూట్స్‌తో ఈ పాన్కేస్ కలిపి సర్వ్ చేసుకోవచ్చు. కోకోనట్ ట్రఫిల్ కావలసినవి: కొబ్బరి తురుము – ముప్పావు కప్పు+4 టేబుల్ స్పూన్లు, కొబ్బరి పాలు – 2 కప్పులు, తేనె – 4 టేబుల్ స్పూన్స్, బటర్ – 1 టేబుల్ స్పూన్, వెనీలా ఎక్స్ట్రా –అర టీ స్పూన్ తయారీ: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని, బౌల్లో కొబ్బరి పాలు, తేనె వేసుకుని.. కొబ్బరిపాల మిశ్రమం దగ్గర పడేంత వరకూ మధ్యమధ్యలో గరిటెతో తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు అందులో బటర్, కొబ్బరి తురుము, వెనీలా వేసుకుని ఓ ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ దించుకుని కాస్త చల్లారగానే.. రెండు గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్‌లా చుట్టి.. మిగిలిన కొబ్బరి తురుముని వాటికి బాగా పట్టించి సర్వ్ చేసుకోవాలి. -
మానవతా స్ఫూర్తి
తెలుగువారి పెద్ద పండుగ మకర సంక్రాంతి. మకర సంక్రాంతి నాడే ఉత్తరాయణం ప్రారంభమౌతుంది. సూర్యరశ్మి ప్రభావం భూగోళంపై క్రమంగా పెరుగుతుంది. ఆ సమయంలో దానధర్మాలు ఆచరించాలని ధర్మశాస్త్ర గ్రంధాలు చెప్పాయి. అందుకే మకర సంక్రాంతి మనవతా స్ఫూర్తి అయింది. సంక్రాంతికి నెల రోజుల ముందు నుంచి ‘ధనుర్మాసం’గా అనేక రూపాలలో.. తెలుగు లోగిళ్లలో స్త్రీలు, పురుషులు, పండితులు, పామరులు, ధనవంతులు, పేదవారు అందరూ పాలుపంచుకునే విధంగా కళలు, సంస్కృతి, సంప్రదాయలు రూపొందాయి. వీటిల్లో రంగవల్లులు, జానపద కళారూపాలు, పొంగలి, పిండివంటలు ప్రధానమైనవి. రంగవల్లులు సంప్రదాయంలో సూచించిన విధంగా బియ్యప్పిండితో ఎనిమిది రేకుల పద్మం ముగ్గు మొదలు అనేక ముగ్గులను పోటీపడి మరీ మహిళలు నెలంతా తీర్చిదిద్దుతారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు, అమ్మవారికి సంకేతంగా పసుపు, కుంకుమ వంటి రంగులు చల్లుతారు. పర్యావరణ పరిశుభ్రత, పరిరక్షణ వంటి ఐహిక ప్రయోజనాలు కూడా ఈ ముగ్గులు వేయడంలో ఉన్నాయి. కళారూపాలు తెలుగు సంక్రాంతి పండుగకు ప్రత్యేకమైనవి జానపద కళారూపాలు. కళాకారులు భారతీయ సంస్కృతి, పురాణాలు, కథలు, గాథలు అన్నీ ఈ నెలరోజులు ఇంటి ముందుకు వచ్చి పిల్లలను, స్త్రీలను అక్కడికక్కడే విజ్ఞానవంతులను చేసేవిధంగా వీధి ప్రదర్శనలు ఇస్తారు. కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు తన చిన్నతనంలో ఇంటి ముందుకు వచ్చే జానపదకళారూపాలను చూసి భారత భాగవత రామాయణాలు, శాస్త్రీయ విషయాలు తెలుసుకున్నానని వాటి ఆవ«శ్యకతను వివరించారు. పొంగలి ధర్మశాస్త్రం చెప్పిన పాయసం తెలుగు నేలలో పొంగలి అయింది. అదీ కొత్త బియ్యంతో, ఆవు పాలతో ఉడికించిన పొంగలి. తెలుగువారికి ఇది పొంగలి పండుగ. రైతులకు, వ్యవసాయ కూలీలకు, వ్యవసాయంపై ఆధారపడిన అన్ని వృత్తులవారికీ, పశువులకు అందరికీ ఆనందాన్ని, విశ్రాంతిని ఇచ్చే సామాజిక పర్వం ఇది. ధాన్యపురాశులను ఇంటికి చేర్చటం, పనివారికి ధాన్యాన్ని పంచటం, కొత్త బియ్యం పొంగలి చేసి బంధుమిత్రులకు, పనివారికి అందరికీ పంచటమే అసలైన ప్రధానమైన పండుగ అయింది. పిండివంటలు ‘వింటే భారతం వినాలి తింటే గారెలు తినాలి’ అనుకునే తెలుగువారు.. సంక్రాంతి నాడు గారెలు తప్పనిసరిగా వండుతారు. అరిసెలు సంక్రాంతికి సంకేతమైన పిండివంట. ఈ రోజు కోసం ఎవరు ఏం చేసుకున్నా చుట్టుపక్కల వాళ్లందరికీ పంచుతారు. ఇవ్వడంలోని తీపిదనాన్ని పంచుకుంటారు. – డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ -
నాన్–వెజ్ స్పెషల్
పచ్చిమిర్చి కోడి పులావ్ కావల్సినవి: చికెన్ – అరకేజీ; పచ్చిమిర్చి పేస్ట్ – టేబుల్ స్పూన్; పచ్చిమిర్చి – 6 (పొడవుగా చీల్చాలి); కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు ; ఉప్పు – తగినంత; సాజీర – అర టీ స్పూన్; పసుపు – పావు టీ స్పూన్; మసాలా దినుసులు (దాల్చిన చెక్క–చిన్నముక్క, లవంగాలు – 4 , యాలకులు–4) ; కరివేపాకు – 2 రెమ్మలు; పుదీనా ఆకులు – అరకప్పు; పెరుగు – కప్పు ; నూనె – 2 టేబుల్ స్పూన్లు; ఉల్లిపాయల తరుగు – కప్పు; కొబ్బరి – పావు కప్పు; బాస్మతి బియ్యం – 2 కప్పులు; నీళ్లు – తగినన్ని ; నిమ్మరసం టేబుల్ స్పూన్. తయారీ: ►బియ్యాన్ని కడిగి, నీళ్లలో నానబెట్టాలి ►చికెన్‌లో ఉప్పు, కొద్దిగా ధనియాలపొడి, పసుపు, పెరుగు, పుదీనా ఆకులు వేసి బాగా కలిపి పక్కనుంచాలి ►పొయ్యిమీద పాన్ పెట్టి, గరం మసాలా దినుసులన్నీ వేసి వేయించి పక్కనుంచాలి ►చల్లారాక పొడి చేసుకోవాలి ∙విడిగా కొబ్బరి తురుమును పేస్ట్‌లా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ►పులావ్ కోసం పొయ్యిమీద మందపాటి గిన్నె పెట్టి, వేడయ్యాక నూనె వెయ్యాలి ►వేడి నూనెలో సాజీర, ఉల్లిపాయలు వేపాలి ∙దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి ►ఆ తర్వాత పసుపు, పచ్చిమిర్చి పేస్ట్, కట్ చేసిన మిర్చి, కరివేపాకు వేసి మూడు నిమిషాలు వేగనివ్వాలి ►కొబ్బరిపొడి, ధనియాల పొడి వేసి మరో 5 నిమిషాలు ఉడికించాలి ►మసాలా కలిపిన చికెన్‌ను వేసి, పదినిమిషాలు ఉడకనివ్వాలి ►ఆ తర్వాత నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి కలపాలి ►ఆ తర్వాత రెండు కప్పుల నీళ్లు పోసి, పైన మూత పెట్టి, మిశ్రమం అంతా ఉడకనివ్వాలి ►అన్నం పూర్తిగా ఉడికేంతవరకు ఉంచి, మూత తీసి పైన వేయించిన జీడిపప్పు పలుకులు, కొత్తిమీర ఆకులు చల్లి సన్నని మంట మీద మరికాసేపు ఉంచి, దించాలి. గోంగూర మటన్ కావాల్సినవి: గోంగూర ఆకులు – 250 గ్రాములు; మేక మాంసం – 500 గ్రాములు; కొత్తిమీర – తగినంత; పుదీన – గుప్పెడు; ఉల్లిపాయలు – 2 (సన్నగా తరగాలి); అల్లం వెల్లుల్లిపేస్ట్ – 2 టీ స్పూన్లు; పసుపు – అర టీ స్పూన్; కొబ్బరి తురుము – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత; కారం – తగినంత; మసాలా – (లవంగాలు –4, యాలకులు –4, ధనియాలు టేబుల్ స్పూన్. ఇవన్నీ కలిపి వేయించి, పొడి చేయాలి); గసగసాలు – టీ స్పూన్. తయారీ: ►మటన్ ముక్కలను వేడినీటిలో 10 నిమిషాలు ఉడికించాలి ►పొయ్యిమీద గిన్నెపెట్టి నూనె వేసి వేడిచేయాలి ►అందులో సాజీరా ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి ►అల్లం వెల్లుల్లి ఫేస్ట్, పుసుపు వేసి కలపాలి ►అందులో మటన్ వేసి 5 నిమిషాలు ఉడికించాలి ►తగినంత కారం, ఉప్పు కలిపి ఉడికించాలి ►కొబ్బరి పొడి వేసి 15 నిమిషాలు ఉడికించాలి ►తరువాత తరిగిన గోంగూర ఆకులు వేసి ఉడికించాలి ►చివరగా గరం మసాలా, కొత్తి మీర వేసి దించాలి. మునక్కాయ చేపల కూర కావలసినవి: కొరమీను చేప ముక్కలు – అరకేజీ; కారం – నాలుగు టీ స్పూన్లు; ధనియాల పొడి – రెండు టీ స్పూన్లు; చింతపండు గుజ్జు – అర కప్పు; కొబ్బరి పేస్ట్ – అర కప్పు; పచ్చిమిర్చి – 10 (కచ్చాపచ్చాగ దంచాలి); మునక్కాయలు – 2 (చిన్న ముక్కలుగా కట్ చేయాలి); నూనె – అర కప్పు,; జీలకర్ర పొడి – టీ స్పూన్; ఎండుమిర్చి – 5, కరివేపాకు – రెమ్మ; పసుపు – అర టీ స్పూన్; ఉప్పు – తగినంత. తయారీ: ►చేపముక్కలను శుభ్రంగా కడిగి పక్కనపెట్టుకోవాలి ►స్టౌ మీద పాన్ పెట్టి రెండు టీ స్పూన్ల నూనె వేసి వేడెక్కాక అందులో కొబ్బరి పేస్ట్, పచ్చిమిర్చి, ధనియాలపొడి, కారం, పసుపు తగినంత ఉప్పు వేసి రెండు నిమిషాలు వేయించాలి ►తర్వాత రెండు కప్పుల నీళ్లు పోసి మూతపెట్టాలి ►ఈ మిశ్రమం కాస్త చిక్కపడ్డాక అందులో కట్ చేసిన మునక్కాయ ముక్కలు, చింతపండు గుజ్జు పోసి సన్నటి సెగ మీద ఉంచాలి ►ఇది ఉడుకుతుండగా మధ్యలో చేప ముక్కలను కూడా జత చేసి మూతపెట్టాలి ►ఈ మిశ్రమమంతా చిక్కబడుతుండగా దించి వేరొక పాన్‌లో మిగిలిన నూనె వేయాలి ►అది వేడెక్కాక అందులో జీలకర్రపొడి, కరివేపాకు, ఎండుమిర్చి వేసి తాలింపు పెట్టాలి ►వేయించిన తాలింపును ఉడికించిన కూరలో కలిపి గిన్నెలోకి తీసుకోవాలి. -
ఆష్తో విందు భలే పసందు
నెల్లూరు(బృందావనం): రంజాన్ మాసంలో ముస్లింలు కఠోర ఉపవాస దీక్షలను విరమించే సాయంసంధ్య వేళలో తొలుత అల్పాహారాన్ని సంప్రదాయం ప్రకారం తీసుకుంటారు. ఆ అల్పాహారంలో ఎండుఫలాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అయితే నెల్లూరులో మాత్రం ఒక ప్రత్యేక వంటం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎన్నో పోషక విలువలు కలిగి తక్షణశక్తిని అందించి ఉపవాసంతో మందగించిన జీర్ణవ్యవస్థకు తోడ్పాటు అందించే ఆష్తో సింహపురీయులకు ఎంతో అనుబంధం ఉంది. శతాబ్ధాల క్రితం పరిచయమైన ఆష్ వంటకంతో ఉపవాస దీక్ష విరమణను పాటించడం వారి ఆధ్యాత్మిక జీవనంతో పెనవేసుకుంది. హైదరాబాద్‌లో హలీం ఎంత ప్రసిద్ధో నెల్లూరులో ఆష్ కూడా అంతే ప్రసిద్ధి చెందిందనడంలో అతిశయోక్తి లేదు. ఇఫ్తార్‌లో సేవించే ఈ బియ్యపు గంజిని అన్ని మసీదుల వద్ద తయారు చేస్తారు. తయారీ ఇలా అధిక పోషక విలువలు కలిగిన ‘ఆష్’ను మసీదుల వద్ద ప్రత్యేక వంటమాస్టర్లు చేస్తారు. సుమారు 500 మంది నుంచి వెయ్యిమంది కోసం 20 కిలోల బొంబాయ్ రవ్వకు రెండు కిలోల మటన్, మూడు కిలోల పెసరపప్పు, మూడు కిలోల చొప్పున టమోటా, నూనె, ఉల్లిపాయలతో పాటు తగినంత పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీన, ధనియాలు, మిర్చి, పసుపుపొడి, పట్టాలవంగాలు, ఏలకులు తదితర సుగంధద్రవ్యాలను వేస్తారు. సుమారు నాలుగు గంటల పాటు కట్టెల పొయ్యిపై ఉడికించి పలుచగా ద్రవపదార్థంగా తయారు చేస్తారు. అల్లాహ్ ప్రసాదంగా పంపిణీ ధనికులు, పేదవారనే భావం లేకుండా ఈ ఆష్‌ను అల్లాహ్ ప్రసాదంగా అందరికీ పంపిణీ చేస్తారు. 20 కిలోల బొంబాయ్ రవ్వతో ఆష్‌ను చేసేందుకు రూ.5 వేలు ఖర్చవుతుందని వంటమాస్టర్లు తెలిపారు. తక్షణ శక్తినిచ్చే ఆష్‌ను ముస్లింలు ఎంతో ఇష్టపడతారు. కొన్ని మసీదుల నిర్వాహకులు ఆష్ తయారీ ఖర్చును భరిస్తారు. ఈ పంపిణీ నెలరోజుల పాటు నిరంతరాయంగా కొనసాగడం విశేషం. జీర్ణవ్యవస్థకు తోడ్పాటు ఇఫ్తార్ సమయంలో తీసుకునే ఆష్ జీర్ణవ్యవస్థకు ఎంతో ఉపకరిస్తుంది. ఉపవాసదీక్షలో ఉన్నవారు ఆష్ తీసుకోవడం ద్వారా తదుపరి తీసుకునే ఆహారపదార్థాలకు, జీర్ణవ్యవస్థకు ఎంతోమేలు కలిగిస్తుంది. ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవు.– షేక్ బాబు శరీరానికి చల్లదనం కలిగిస్తుంది ఆష్‌ను తీసుకోవడం ద్వారా ఎంతో సంతృప్తి కలుగుతుంది. దీన్ని అల్లాహ్ ప్రసాదంగా భావిస్తాం. ఎంతో పవిత్రంగా చూస్తాం. ఉపవాస దీక్షతో ఆష్కు విడలేని బంధం ఉంది. తరతరాల నుంచి నెల్లూరు జిల్లాలో ఆష్‌ను సేవించడం సంప్రదాయంగా మారింది.– షేక్ జమీర్ అన్సారీ, మౌజన్, యూసుఫియా మసీదు, కోటమిట్ట -
టేస్టీ టచ్
కొత్తటేస్టులెన్ని ఊరిస్తున్నా... పాతెప్పుడూ రుచే. అలాంటి పాత వంటకాలకే కొంచెం కొత్తదనం జోడించి ఆరోగ్యకరమైన డిషెస్ అందిస్తోంది ఉలవచారు రెస్టారెంట్. ఆ వంటల స్పెషాలిటీ ఏంటో చూద్దాం... తందూరీ మచ్ఛీ... చేపను నిప్పుల మీద కాల్చుకుని, దానికింత ఉప్పు కారం తగిలించి తింటే ఆ రుచే వేరు. చేపను ముక్కలుగా చేయకుండా, ఆ ఫ్లేవర్‌ను మిస్ చేయకుండా ఉలవచారు రెస్టారెంట్ వడ్డిస్తున్న కొత్త వంటకం తందూరీ మచ్ఛీ. తందూరీ చికెన్ అందరికీ తెలిసిందే కదా! ఆ తందూరీని ఈ చేపకు చేర్చి వడ్డిస్తారంతే. ఇందులో మస్టర్డ్ పేస్ట్, జీరా పౌడర్, గడ్డ పెరుగు ఉపయోగిస్తుండటంతో ఏ కాలంలో తిన్నా చలువ చేస్తుంది. సీ ఫుడ్ కావడంతో హెల్త్‌కి మంచిది. మ్యాంగో స్ట్రైకీ చికెన్ జీడిపప్పు, మ్యాంగో పేస్టు, మసాలా పొడులతో ఆయిల్ లేకుండా నాన్ స్టిక్ పాన్ మీద చే సే స్పైసీ వంటకం. ఫ్యాట్స్‌తోపాటు ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా తయారయ్యే మ్యాంగో స్ట్రైకీ చికెన్ పూర్తిగా హెల్త్ సపోర్టివ్. గద్వాల్ కోడి పలావ్ మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల్లో ఫేమస్ అయిన రెసిపీ ఇది. ఇప్పుడు నగరవాసులను ఆకట్టుకుంటోంది. చికెన్ బిర్యానీలో బోన్స్ ఉంటాయి... కానీ బోన్‌లెస్ చికెన్‌తో మసాలా లేకుండా కేవలం పెప్పర్ పౌడర్‌తో స్పైసీగా చేసిన హోమ్లీ డిష్ ఇది. రిచ్ ఫ్లేవర్‌తో చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పలావ్‌లోకి టమాటో లేదా పుదీనా పచ్చడి తోడైతే వావ్ అనాల్సిందే! -
శ్రీరామునర్చించు జిహ్వజిహ్వ..!
రాముడి పేరు తియ్యన కాబట్టి ‘పిబరే రామరసం’ అనుకుంటూ ఒకాయనా, ‘నీ నామమెంతొ రుచిరా’ అంటూ ఇంకొకాయనా దాన్నే తాగేస్తూ గడుపుతానంటారు. మాన్యుల మాటలు సరే... మనలాంటి సామాన్యుల సంగతేమిటి? అందుకే మనం... ఒడల పులకరింతతో పాటు ‘వడపప్పునూ, రామనామామృతానికి తోడు పంచామృతాన్నీ,తినగలిగినన్ని సెనగలనూ స్వీకరిద్దాం. కౌసల్యాసుప్రజారాముణ్ణి నర‘శార్దూలా’ అన్న తర్వాత ఇక పొడి ‘పులి’హోర ఆరగించకపోతే ఎలా...? ఇక పై రుచులన్నింటికీ అదనపు అనుపానంలా రాముడి నామాన్నే తేనె, చక్కెరల్లా కలిపేద్దాం! పండగ నాడు పానకంలా కలిపేసి తాగేద్దాం!! పొడి పులిహోర కావలసినవి: సన్నబియ్యం - 2 కప్పులు; పచ్చిమిర్చి - 4; కరివేపాకు - 3 రెమ్మలు; ఉప్పు - తగినంత; పసుపు - తగినంత; నూనె - కప్పు; చింతపండు రసం - పావు కప్పు (చిక్కగా ఉండాలి); పోపు కోసం: ఆవాలు - టీ స్పూను; మినప్పప్పు - టీ స్పూను; సెనగపప్పు - 2 టేబుల్ స్పూన్లు; ఇంగువ - పావు టీ స్పూను; ఎండుమిర్చి - 6; పొడి కోసం: మినప్పప్పు - టీ స్పూను; పల్లీలు - టేబుల్ స్పూను; సెనగపప్పు - టేబుల్‌స్పూను; ఎండుమిర్చి - 5; నువ్వుపప్పు - 2 టేబుల్ స్పూన్లు; పుట్నాల పప్పు - టేబుల్ స్పూను; జీడిపప్పు - 10 తయారీ: ముందుగా పొడికి కావలసిన పదార్థాలను నూనె లేకుండా వేయించి చల్లారాక పొడి చేసి పక్కన ఉంచుకోవాలి బియ్యానికి మూడు కప్పుల నీరు జత చేసి ఉడికించాలి బాణలిలో నూనె కాగాక ఇంగువ, పోపు సామాను వేసి వేయించాలి చింతపండు రసం, ఉప్పు, పసుపు జత చేసి ఉడికించి దింపేయాలి ఒక పెద్ద పళ్లెంలో అన్నం విడివిడిలాడేలా వేయాలి పోపు వేసి బాగా కలపాలి పొడి వేసి కలిపి వడ్డించాలి. కొబ్బరిపాల పరమాన్నం కావలసినవి: బియ్యం - కప్పు; కొబ్బరి పాలు - కప్పు; నెయ్యి - అర కప్పు; చిక్కటి పాలు - కప్పు; బెల్లం తురుము - కప్పు; కిస్మిస్ - 10; జీడిపప్పు - 10; ఏలకుల పొడి - టీ స్పూను; పచ్చ కర్పూరం - కొంచెం తయారీ: ముందుగా బియ్యంలో మామూలు పాలు, నీళ్లు కలిపి కుకర్‌లో ఉంచి ఉడికించాలి అన్నంలో కొబ్బరిపాలు కలిపి స్టౌ మీద ఉంచి కొద్దిగా ఉడికించాలి బెల్లం తురుము వేసి కలిపి చిన్న మంటపై ఉడికించాలి బాణలిలో నెయ్యి వేడి చేసి జీడిపప్పు, కిస్మిస్ వేసి వేయించి, ఉడుకుతున్న పరమాన్నంలో వేయాలి ఏలకుల పొడి, పచ్చకర్పూరం జత చేయాలి. పంచామృతం కావలసినవి: పెరుగు - అర కప్పు; పాలు - అర కప్పు; తేనె - 2 టేబుల్ స్పూన్లు; నెయ్యి - టీ స్పూను; పంచదార - 2 టీస్పూన్లు; అరటిపండు - ఒకటి; కొబ్బరినీళ్లు - టేబుల్ స్పూను (అరటిపండ్లు, కొబ్బరినీళ్లను రుచి కోసం వాడుకోవచ్చు. ఇవి పంచామృతాలలో ఉండే ఐదు పదార్థాలలోకి చేరవు) తయారీ: అరటిపండు ముక్కలు చేసి పక్కన ఉంచాలి ఒక పాత్రలో పెరుగు, పాలు, కొబ్బరినీళ్లు, తేనె, నెయ్యి, పంచదార వేసి బాగా కలపాలి అరటిపండు ముక్కలు జత చేయాలి దేవుడికి నైవేద్యం పెట్టి ప్రసాదం స్వీకరించాలి. పోపు సెనగలు కావలసినవి: సెనగలు - కప్పు; కొబ్బరితురుము - 3 టేబుల్ స్పూన్లు; ఆవాలు - అర టీ స్పూను; మినప్పప్పు - అర టీ స్పూను; ఎండుమిర్చి - 2; కరివేపాకు - 2 రెమ్మలు; నూనె - 2 టీ స్పూన్లు; ఇంగువ - చిటికెడు; పసుపు - చిటికెడు, ఉప్పు - తగినంత తయారీ: సెనగలను సుమారు ఆరు గంటల సేపు నానబెట్టాలి నీరు వడపోసి కుకర్‌లో ఉంచి నాలుగు విజిల్స్ వచ్చాక దించేయాలి బాణలిలో నూనె కాగాక ఆవాలు, మినప్పప్పు వేసి వేయించాలి కరివేపాకు, ఎండుమిర్చి ముక్కలు, ఇంగువ జత చేయాలి ఉడికించుకున్న సెనగలు వేసి వేయించాలి పసుపు, కొబ్బరితురుము వేసి కలిపి దించేయాలి వేడివేడిగా వడ్డించాలి. వడపప్పు కావలసినవి: పెసరపప్పు - కప్పు; పచ్చికొబ్బరి తురుము - పావుకప్పు; మామిడికాయ తురుము - పావు కప్పు; పచ్చిమిర్చి తరుగు - టీ స్పూను; ఉప్పు - తగినంత; క్యారట్ తురుము - పావుకప్పు తయారీ: పెసరపప్పును తగినంత నీటిలో సుమారు రెండు గంటలసేపు నానబెట్టాలి నీరంతా వడక ట్టేయాలి ఒక పాత్రలో నానిన పెసరపప్పు, పచ్చికొబ్బరి తురుము, మామిడికాయ తురుము, క్యారట్ తురుము, ఉప్పు, పచ్చిమిర్చి తరుగు వేసి కలపాలి. పానకం కావలసినవి: బెల్లం తురుము - 2 కప్పులు నీళ్లు - 5 కప్పులు ఏలకులపొడి - టీ స్పూను మిరియాలపొడి - 2 టీ స్పూన్లు తయారీ: ఒక పాత్రలో నీళ్లు, బెల్లం తురుము వేసి బాగా కలపాలి ఏలకుల పొడి, మిరియాల పొడి జత చేసి గ్లాసులలో పోసి అందించాలి. కర్టెసీ: హరిచందన, హైదరాబాద్ www.blendwithspices.com సేకరణ: డా. వైజయంతి