ఆష్‌ను తయారు చేస్తున్న దృశ్యం
నెల్లూరు(బృందావనం): రంజాన్ మాసంలో ముస్లింలు కఠోర ఉపవాస దీక్షలను విరమించే సాయంసంధ్య వేళలో తొలుత అల్పాహారాన్ని సంప్రదాయం ప్రకారం తీసుకుంటారు. ఆ అల్పాహారంలో ఎండుఫలాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అయితే నెల్లూరులో మాత్రం ఒక ప్రత్యేక వంటం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎన్నో పోషక విలువలు కలిగి తక్షణశక్తిని అందించి ఉపవాసంతో మందగించిన జీర్ణవ్యవస్థకు తోడ్పాటు అందించే ఆష్‌తో సింహపురీయులకు ఎంతో అనుబంధం ఉంది. శతాబ్ధాల క్రితం పరిచయమైన ఆష్ వంటకంతో ఉపవాస దీక్ష విరమణను పాటించడం వారి ఆధ్యాత్మిక జీవనంతో పెనవేసుకుంది. హైదరాబాద్‌లో హలీం ఎంత ప్రసిద్ధో నెల్లూరులో ఆష్ కూడా అంతే ప్రసిద్ధి చెందిందనడంలో అతిశయోక్తి లేదు. ఇఫ్తార్‌లో సేవించే ఈ బియ్యపు గంజిని అన్ని మసీదుల వద్ద తయారు చేస్తారు.
తయారీ ఇలా
అధిక పోషక విలువలు కలిగిన ‘ఆష్’ను మసీదుల వద్ద ప్రత్యేక వంటమాస్టర్లు చేస్తారు. సుమారు 500 మంది నుంచి వెయ్యిమంది కోసం 20 కిలోల బొంబాయ్ రవ్వకు రెండు కిలోల మటన్, మూడు కిలోల పెసరపప్పు, మూడు కిలోల చొప్పున టమోటా, నూనె, ఉల్లిపాయలతో పాటు తగినంత పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీన, ధనియాలు, మిర్చి, పసుపుపొడి, పట్టాలవంగాలు, ఏలకులు తదితర సుగంధద్రవ్యాలను వేస్తారు. సుమారు నాలుగు గంటల పాటు కట్టెల పొయ్యిపై ఉడికించి పలుచగా ద్రవపదార్థంగా తయారు చేస్తారు.
అల్లాహ్ ప్రసాదంగా పంపిణీ
ధనికులు, పేదవారనే భావం లేకుండా ఈ ఆష్‌ను అల్లాహ్ ప్రసాదంగా అందరికీ పంపిణీ చేస్తారు. 20 కిలోల బొంబాయ్ రవ్వతో ఆష్‌ను చేసేందుకు రూ.5 వేలు ఖర్చవుతుందని వంటమాస్టర్లు తెలిపారు. తక్షణ శక్తినిచ్చే ఆష్‌ను ముస్లింలు ఎంతో ఇష్టపడతారు. కొన్ని మసీదుల నిర్వాహకులు ఆష్ తయారీ ఖర్చును భరిస్తారు. ఈ పంపిణీ నెలరోజుల పాటు నిరంతరాయంగా కొనసాగడం విశేషం.
జీర్ణవ్యవస్థకు తోడ్పాటు
ఇఫ్తార్ సమయంలో తీసుకునే ఆష్ జీర్ణవ్యవస్థకు ఎంతో ఉపకరిస్తుంది. ఉపవాసదీక్షలో ఉన్నవారు ఆష్ తీసుకోవడం ద్వారా తదుపరి తీసుకునే ఆహారపదార్థాలకు, జీర్ణవ్యవస్థకు ఎంతోమేలు కలిగిస్తుంది. ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవు.– షేక్ బాబు
శరీరానికి చల్లదనం కలిగిస్తుంది
ఆష్‌ను తీసుకోవడం ద్వారా ఎంతో సంతృప్తి కలుగుతుంది. దీన్ని అల్లాహ్ ప్రసాదంగా భావిస్తాం. ఎంతో పవిత్రంగా చూస్తాం. ఉపవాస దీక్షతో ఆష్‌కు విడలేని బంధం ఉంది. తరతరాల నుంచి నెల్లూరు జిల్లాలో ఆష్‌ను సేవించడం సంప్రదాయంగా మారింది.– షేక్ జమీర్ అన్సారీ, మౌజన్, యూసుఫియా మసీదు, కోటమిట్ట
Comments
Please login to add a commentAdd a comment