మరో అవకాశం
కరీంనగర్: యువతీ, యువకులకుశుభవార్త. 18 ఏళ్లు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఎన్నికల కమిషన్ మరో అవకాశం కల్పించింది. అంతేకాకుండా ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జరిగిన శాసనసభ, గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓటర్ల జాబితాలో తమ పేర్లుగల్లంతయ్యాయని పలువురు ఆందోళన వ్యక్తం చేసిన విషయం విదితమే.
ఈ మేరకు ప్రత్యేక అవకాశం కల్పించిన ఎన్నికల కమిషన్ జాబితా విడుదల చేసిన విషయం విదితమే.అయితే,అప్పట్లో దరఖాస్తు చేసుకోలేని వారి కోసం మళ్లీ స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా శని, ఆదివారాల్లో ఓటరుగా నమోదు, చేర్పులు, మార్పుల ప్రక్రియ అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని 18 ఏళ్లు నిండిన యువతీ, యువకులతో పాటు చిరుమానా మారిన వారు మార్పులు, చేర్పులు అవసరమైన వారు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్ ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
జిల్లాలో 9,68,305 మంది ఓటర్లు
గ్రామపంచాయతీ ఎన్నికల అనంతరం అర్హులైన వారితో పాటు ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులకు ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించింది. ఈ మేరకు దరఖాస్తులు స్వీకరించిన అనంతరం అర్హులకు చోటు కల్పించాక గత నెల 22న తేదీన జాబితా విడుదల చేశారు. ఈ జాబితా ప్రకారం కరీంనగర్ జిల్లాలో 9,68,305 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 4,81,271 మంది కాగా, మహిళలు 4,87,013 మందితో పాటు ఇతరులు 21 మంది ఉన్నట్లు తేల్చారు. మళ్లీ ఓటరుగా నమోదుతో పాటు మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించనున్న ఈ నేపథ్యంలో ఈ సంఖ్య పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
ప్రత్యేక ఏర్పాట్లు
ఈ ఏడాది జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వారంతా తమ పేరును ఓటరు జాబితాలో నమోదు చేసుకునేందుకు అవకాశాన్ని కల్పించారు. అర్హులైన వారు తగిన ఆధారాలతో స్థానిక రెవెన్యూ కార్యాలయం లేదా బీఎల్ఓల వద్ద నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. లేనిపక్షంలో మీ సేవ కేంద్రాలు, ఆన్లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఇందుకోసం ఇదే సమయంలో బీఎల్ఓలు ప్రతీ ఇంటికి వెళ్లి ఓటరు జాబితాను పరిశీలిస్తారు.
జాబితాలో లేని వారిని గుర్తించి పేర్లను నమోదు చేసుకునేలా చర్యలు తీసుకుంటారు. ఇక ఓటరు నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రచారం చేసేందుకు కళాజాత బృందాలను సైతం నియమించారు. ఆయా బృందాల సభ్యులు గ్రామాల్లో ర్యాలీలు, సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పిస్తారు. ఇక పోలింగ్ కేంద్రాల్లో రెండు రోజుల పాటు బీఎల్ఓలు ఉదయం 9 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అందుబాటులో ఉండి దరఖాస్తులు స్వీకరించనున్నారు.