special road lane
-
ఈ దారి.. స్మార్ట్‌ఫోన్ దారి..
చేతిలో స్మార్ట్‌ఫోన్, చెవుల్లో ఇయర్‌ఫోన్స్ ఉంటే చాలు..టీనేజ్కురాని పిల్లాడి నుంచి పండు ముసలాడి వరకు.. చుట్టూ ఏం జరుగుతున్నా పట్టించుకోరు. ఏ సమయంలోనైనా.. ఎక్కడున్నా బయటి ప్రపంచంతో పనిలేదన్నట్టు స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో చక్కర్లు కొడుతుంటారు. ఇది ఎంత ప్రమాదకరమో వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. దీన్ని గుర్తించిన చైనాలోని షియాన్ నగర అధికారులు ఫుట్‌పాత్ తరహాలో స్మార్ట్‌ఫోన్ వాకర్ల కోసం ప్రత్యేకంగా ‘స్మార్ట్పాత్’ను ఏర్పాటు చేశారు. షియాన్ సిటీలో అత్యంత రద్దీగా ఉండే యాంటా రోయాన్ ప్రాంతంలో ఈ ప్రత్యేక లైన్‌ను నిర్మించారు. ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగులతో కూడిన ఈ లైన్‌పై మొబైల్ చిత్రాలను ఉంచారు. దీంతో అయినా ఫోన్ ప్రియులను ప్రమాదాల బారి నుంచి కాపాడవచ్చని భావిస్తున్నారు. ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి. అదేంటంటే స్మార్ట్‌ఫోన్ వాకర్ల కోసం ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేయడం ఇదేం మొదటిసారి కాదు. ఇంతకుముందు చైనాలోని చాంగ్కింగ్ సిటీలో ఇదే తరహాలో స్మార్ట్‌ఫోన్ ప్రియుల కోసం ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ ఆలోచన ఫోన్ ప్రియులపై ఏమాత్రం ప్రభావం చూపలేదంట. ఫోన్లోనే చూస్తూ.. అసలు తమకోసం ఏర్పాటు చేసిన ఈ స్మార్ట్పాత్నే వారు గమనించటం లేదని అక్కడి అధికారులు చెబుతున్నారు. -
'స్మార్ట్' యూజర్లకు ‘వాకింగ్ లేన్’ రెడీ..
బెల్జియం (ఆంట్వెర్ప్) : మార్కెట్ ఏదైనా రద్దీ కామన్. జనాలు తోసుకుంటూ, తొక్కుకుంటూ, అటూఇటూ చూసుకుంటూ నడుస్తూ ఢీకొట్టుకోవడమూ కామనే. అయితే, బెల్జియంలోని ఆంట్వెర్ప్ సిటీలో రద్దీగా ఉండే ఈ మార్కెట్లో ఇటీవల జనాలు ఢీకొట్టుకోవడం మరీ ఎక్కువైపోయిందట. ఇక్కడి జనాలకు స్మార్ట్‌ఫోన్ పిచ్చి ఎక్కువ కావడమే అందుకు కారణమట. మార్కెట్లో నడుస్తున్నప్పుడూ చాలామంది స్మార్ట్‌ఫోన్‌లో అక్షరాలు టైప్ చేసుకుంటూ వెళుతుండటంతో పరస్పరం ఢీకొట్టుకుంటున్నారట. అందుకే వీధికి మధ్యలో ఇలా రెండు గీతలతో ‘టెక్స్ట్ వాకింగ్ లేన్’ వేశారు. స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఈ లేన్‌లోనే నడుచుకుంటూ వె ళ్లాలన్నమాట. ఇటీవల డ్యామేజీ అయిన స్మార్ట్ఫోన్లతో వినియోగదారులు రావడం పెరగడంతో ఓ మొబైల్ షాపు ఓనర్ అక్కడి అధికారులకు ఈ ఐడియా ఇచ్చాడట. కానీ చాలా మంది ఈ లేన్‌ను పట్టించుకోకుండా ఎప్పటిలాగే అడ్డదిడ్డంగా నడుస్తున్నారట. అన్నట్టూ.. అమెరికాలోని వాషింగ్టన్, చైనాలోని చోంగ్క్వింగ్ నగరాల్లో కూడా ఇలాంటి లేన్లు వేశారు.