speech by PM Modi
-
మీ మనసులో మాట ప్రధాని నోట వినాలంటే.. ఇలా చేయండి
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఓ పిలుపునిచ్చారు. రానున్న ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం జరుగుతున్న నేపథ్యంలో ప్రజల ఆలోచనలను తన నోట పలకాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఏటా మాదిరిగానే ఈ సారి ప్రధాని జాతినుద్దేశించి ప్రసగించే కార్యక్రమం జరుగుతుంది. సాధారణంగా అయితే ఈ ప్రసంగంలో ప్రభుత్వ కార్యక్రమాలు, విధివిధానాలు, దేశాన్ని అభివృద్ధి బాటలో నడపడం గురించి ఉంటుంది. కాగా ఈ సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవం రోజున భారత్‌ను ముందుకు నడిపేందుకు దేశ పౌరులను నుంచి వారి ఆలోచనలను తెలపాలన్నారు. ఎర్రకోట ప్రసంగించే మాటలు తనవే అయినా అది దేశ ప్రజల మనసులో మాటలుగా ఉండాలని మోదీ కోరుతున్నారు. అందుకు గాను ప్రధాని త్వరలో జరగనున్న ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఎర్రకోట ప్రసంగంలో తాను ఏం మాట్లాడాలో ప్రజలే చెప్పాలని.. వారి ఆలోచనలు, ఆశయాలను దేశ ప్రజలకు చెబుతానన్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ వెబ్సైట్ సిటిజన్ ఎంగేజ్మెంట్ ప్లాట్‌ఫారమ్ అయిన MyGovindia లో తమ ఆలోచనలను తెలపాలని కోరారు. Your thoughts will reverberate from the ramparts of the Red Fort. What are your inputs for PM @narendramodi’s speech on 15th August? Share them on @mygovindia. https://t.co/UCjTFU30XV — PMO India (@PMOIndia) July 30, 2021 -
మళ్లీ భూతల స్వర్గం చేద్దాం!
న్యూఢిల్లీ: భూతల స్వర్గమైన కశ్మీర్‌కు మళ్లీ పూర్వ వైభవం తీసుకువచ్చేలా కృషి చేద్దామని దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని చారిత్రక నిర్ణయంగా అభివర్ణించిన ప్రధాని.. ఆ నిర్ణయం తీసుకోవడానికి దారి తీసిన పరిస్థితులను, 370 రద్దు ఆవసరాన్ని, కశ్మీర్ అఖండ భారత్‌లో సంపూర్ణంగా భాగస్వామి కావడం వల్ల ప్రయోజనాలను టీవీలో ప్రసారమైన తన ప్రసంగంలో సుదీర్ఘంగా వివరించారు. గురువారం రాత్రి 8 గంటల నుంచి దాదాపు 40 నిమిషాల పాటు ప్రసంగించిన ప్రధాని.. జమ్మూకశ్మీర్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, శాంతియుత, సురక్షిత, సమృద్ధ కశ్మీర్ తమ లక్ష్యమని తేల్చిచెప్పారు. స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని, కళ, క్రీడ, సాంస్కృతిక రంగాల్లో వారి నైపుణ్యాలకు అంతర్జాతీయ ఖ్యాతి కల్పిస్తామని హామీ ఇచ్చారు. కశ్మీర్‌ను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి చూపుతామని, ఇందుకు దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజల సహకారం అవసరమని పేర్కొన్నారు. ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ వల్ల రాష్ట్రానికి గానీ, రాష్ట్ర ప్రజలకు గానీ ఎలాంటి ప్రయోజనం కలగలేదని, ఉగ్రవాదాన్ని, వేర్పాటువాదాన్ని రాష్ట్రంలో విస్తరించేందుకు పాకిస్తాన్‌కు మాత్రం ఈ నిబంధనలు బాగా ఉపయోగపడ్డాయని ప్రధాని వ్యాఖ్యానించారు. దీనివల్ల గత 3 దశాబ్దాల్లోనే అమాయకులైన 42 వేల మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూకశ్మీర్‌లో కొత్త యుగం ప్రారంభమైందని, దీంతో జనసంఘ్ వ్యవస్థాపక నేత శ్యామా ప్రసాద్ ముఖర్జీ, దేశ తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్, మాజీ ప్రధాని వాజ్‌పేయి, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ల స్వప్నం సాకారమైందని ఉద్ఘాటించారు. ఆర్టికల్ 370పై గతంలో చర్చే జరగలేదని, దాని వల్ల ప్రయోజనాలేంటనే విషయంలో ఎవరికీ స్పష్టత లేకపోయినా.. అది అలా కొనసాగాల్సిందే అని అంతా భావించారని ప్రధాని చెప్పారు. అయితే, తామలా భావించలేదని, జమ్మూకశ్మీర్ ప్రజల అభివృద్ధికి అడ్డుగా నిలిచిన ఆ నిబంధనలను తొలగించాలనే ధృడ నిశ్చయంతో ముందడుగు వేశామని వివరించారు. జమ్మూకశ్మీర్ భారత దేశ శిరస్సు అని, ఈ ప్రాంతాభివృద్ధి మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. ఆర్టికల్ 370 వల్ల రాష్ట్రంలో వేర్పాటువాదం, ఉగ్రవాదం, అవినీతి, వంశపాలన ప్రబలడం తప్ప రాష్ట్ర ప్రజలకు ఒనగూరిందేమీ లేదన్నారు. గత కొన్నాళ్లుగా కొనసాగుతున్న గవర్నర్ పాలన వల్ల రాష్ట్రాభివృద్ధి గాడిన పడిందన్న ప్రధాని.. ఇకపై రాష్ట్రాభివృద్ధి, స్థానిక ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగుతుందన్నారు. జమ్మూకశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా కొనసాగించబోమని, కొన్నాళ్ల తరువాత రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు. ఈద్ శుభాకాంక్షలు తెలుపుతూ.. సోమవారం నాటి ఈద్‌ను ప్రజలంతా ఆనందోత్సాహాలతో జరుపుకునేలా చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను ఆదేశించానన్నారు. కశ్మీరీల ఆశలు, ఆకాంక్షలు, స్వప్నాలను సాకారం చేసేందుకు అంతా కలసిరావాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆ అమరుల కల నిజం చేద్దాం! ‘1965లో పాకిస్తాన్ చొరబాటుదారుల గురించి మన బలగాలకు సమాచారం ఇచ్చిన మౌల్వి గులామ్ దిన్, కార్గిల్ యుద్ధంలో సేవలందించిన లదాఖ్‌కు చెందిన కల్నల్ వాంగ్‌చుక్, 2009లో ఉగ్రవాదులతో తలపడిన రాజౌరీ జిల్లాకు చెందిన మహిళ రుక్సానా కౌసర్, గత సంవత్సరం ఉగ్రవాదులు అపహరించి, చంపేసిన రైఫిల్‌మ్యాన్ ఔరంగజేబు సహా దేశం కోసం, ఈ ప్రాంతం కోసం అమరులైన ఎందరో సాహస జవాన్లు, పోలీసుల స్వప్నం కశ్మీర్లో శాంతి నెలకొనడమే. వారి స్వప్నాన్ని నిజం చేయాల్సిన బాధ్యత మనపై ఉంది’ అని మోదీ అమరజవాన్లను గుర్తు చేశారు. కౌసర్‌కు కీర్తిచక్ర, వాంగ్చుక్కు మహావీర్ చక్ర పురస్కారాలను ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఔరంగజేబు సోదరులిద్దరూ ఆర్మీలో సేవలందస్తున్న విషయాన్ని ప్రధాని గర్వంగా చెప్పారు. ప్రధాని మోదీ ప్రసంగంలోని ఇతర ముఖ్యాంశాలు.. ► దేశాభివృద్ధి, దేశ ప్రజల సంక్షేమం కోసం చర్చోపచర్చల అనంతరం పార్లమెంటు చట్టాలు చేస్తుంది. దేశమంతా అమలయ్యే ఆ చట్టాలు, వాటి ప్రయోజనాలు ఇన్నాళ్లూ కశ్మీర్లో అమలు కాకపోయేవి. ► విద్యాహక్కు, బాలికల సంక్షేమానికి సంబంధించిన చట్టాలు, కార్మిక, దళిత, మైనారిటీల కోసం రూపొందించిన చట్టాలు.. ఇవేవీ కశ్మీర్లో అమలుకు నోచుకోలేదు. ఇకపై అలా జరగదు. ఇకపై కశ్మీర్ సహా దేశవ్యాప్తంగా ఆ చట్టాలు అమలవుతాయి. 1.5 కోట్ల రాష్ట్ర ప్రజలకు ఆ ప్రయోజనాలు అందుతాయి. ► ఇతర కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ఉద్యోగులు, పోలీసులకు లభిస్తున్న సౌకర్యాలు జమ్మూకశ్మీర్‌లోని ఉద్యోగులకూ కూడా లభిస్తాయి. జమ్మూ, కశ్మీర్, లదాఖ్‌ల్లో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలనూ భర్తీ చేస్తాం. ఆర్మీ, పారామిలటరీ దళాల్లో స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తాం. ► ఐఐటీ, ఐఐఎం లాంటి ప్రతిష్టాత్మక సంస్థలను ఏర్పాటు చేస్తాం. ► రాష్ట్రంలో నీటి ప్రాజెక్టులు, విద్యుత్ ప్రాజెక్టులు, రోడ్డురవాణా తదితర మౌలిక వసతుల సౌకర్యాల కల్పనకు సంబంధించిన ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన ముందుకు తీసుకువెళ్తాం. ► జమ్మూకశ్మీర్‌లో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగాలి. కొత్త ప్రభుత్వం ఏర్పడాలి. ఉత్సాహవంతులైన యువత ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎం కావాలి. ఇకపై ఎన్నికలు పారదర్శకంగా జరుగుతాయి. వంశ పాలనకు ఇక చరమగీతమే. మీ(స్థానికుల) నుంచే ప్రజా ప్రతినిధులు వస్తారు. ► 1947 తరువాత పాక్ నుంచి ఇక్కడికి వలస వచ్చినవారు ఇన్నాళ్లూ ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు. ఇకపై వారికి ఆ అవకాశం లభిస్తుంది. ► ఐటీ, డిజిటల్ టెక్నాలజీలతో ఉపాధికి అవకాశాలుంటాయి. ► రాష్ట్రంలో పంచాయతీ వ్యవస్థ అద్భుతంగా ఉంది. పంచాయతీ సభ్యులు, ముఖ్యంగా మహిళలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. వారికి కేంద్రం నుంచి ఇకపై మరింత మద్దతు లభిస్తుంది. నిధులు అందుతాయి. ► క్రీడల్లో ఆసక్తి, అభినివేశం ఉన్న యువత కోసం శిక్షణ కేంద్రాల ఏర్పాటు, స్పోర్ట్స్ అకాడమీల ఏర్పాటు ఉంటుంది. స్థానిక యువత క్రీడానైపుణ్యాలు ఆదరణ పొందాలి. ► చేతి కళలు, వృత్తి నైపుణ్యాల ఆధారంగా స్థానికులకు ఉపాధి అవకాశం లభిస్తుంది. ఇక్కడి కళాకృతులు ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అయ్యేలా కృషి చేయాలి. సినీ పరిశ్రమకు విజ్ఞప్తి ‘సినిమా షూటింగ్‌లకు కశ్మీర్ అద్భుతమైన ప్రాంతం. ఇక్కడ షూటింగ్‌లు చేయడమే కాకుండా, స్టూడియోలు, థియేటర్లు నిర్మించాలని బాలీవుడ్, తెలుగు, తమిళ, ఇతర సినీ పరిశ్రమల వారికి విజ్ఞప్తి చేస్తున్నా. తద్వారా స్థానికులకు ఉపాధి లభిస్తుంది’ అని భారతీయ సినీ పరిశ్రమను మోదీ కోరారు. ఆర్గానిక్ హబ్.. లదాఖ్ ‘లదాఖ్కే ప్రత్యేకమైన సేంద్రియ ఉత్పత్తులు, ఔషధ మొక్కలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించాలి. ఇక్కడి జీవ వైవిధ్యత స్థానికులకు ప్రయోజనకరం కావాలి. ఇక్కడి ‘సోలో’ అనే ఔషధ మొక్కను ఆధునిక కాలపు సంజీవని అంటారు. ఆక్సిజన్ తక్కువగా లభించే ఇక్కడి ఎత్తైన ప్రాంతాల్లోని సైనికులు, ప్రజలకు ఇది నిజంగా సంజీవనే. ఇలాంటివి ఇక్కడ చాలా ఉన్నాయి. వీటితో స్థానికులకు ఆదాయం లభించాలి. ఆ దిశగా ఎగుమతిదారులు, పారిశ్రామికవేత్తలు ఆలోచించాలి’ అని మోదీ ఆకాంక్షించారు. ప్రసంగాన్ని మెచ్చని కశ్మీరీలు మోదీ ప్రసంగంపై అనేక మంది కశ్మీరీలు పెదవి విరిచారు. ఆర్టికల్ 370ని రద్దు చేసేందుకు, కశ్మీర్‌ను విడగొట్టేందుకు ప్రభుత్వం అప్రజాస్వామిక పద్ధతిని అనుసరించిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి కశ్మీర్ భూమి కావాలి తప్ప ఇక్కడి ప్రజల మనసులు కాదని కొందరు ఆరోపించారు. విద్యార్థుల నుంచి వివిధ వృత్తుల్లోని ఉద్యోగుల వరకు.. అనేక మంది మాట్లాడుతూ, ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయడం వల్ల పర్యావరణం పరంగా చాలా సున్నితమైన కశ్మీర్‌ను మౌలిక వసతుల సంబంధ కార్యకలాపాల కోసం దోపిడీ చేసే అవకాశం ఉందనే భయాన్ని వ్యక్తం చేశారు. ఆజాద్ అహ్మద్ అనే వైద్యుడు స్పందిస్తూ, ‘కేంద్రానికి మా భూమి కావాలి. మా నమ్మకాన్ని వారు గెలవాలంటే మా అభిప్రాయాలను తీసుకుని ఉండాల్సింది’ అన్నారు. -
సాయంత్రం 4 గంటలకు ప్రధాని ప్రసంగం!
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం సాయంత్రం నాలుగు గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ఆర్టికల్ 370లోని జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే నిబంధనల రద్దు, రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లదాఖ్‌లుగా విభజించి, రెండింటినీ కేంద్రపాలిత ప్రాంతాలుగా చేయడం.. తదితర నిర్ణయాలకు దారితీసిన కారణాలను ఆ ప్రసంగంలో ఆయన దేశ ప్రజలకు వివరించనున్నారు. ఇంతకుముందు మార్చి 27న చివరగా దేశప్రజలనుద్దేశించి ప్రధాని ప్రసంగించారు. ఉపగ్రహ నాశక క్షిపణి వ్యవస్థను భారత్ సముపార్జించడంపై ఆ ప్రసంగంలో ఆయన స్పందించారు. గతంలోనూ నోట్ల రద్దు నిర్ణయాన్ని కూడా ఆయన ఇలాగే జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలోనే ప్రకటించిన విషయాన్ని గుర్తు చేస్తూ.. ఈ ప్రసంగంలోనూ సంచలన విషయాలనేమైనా ఆయన ప్రకటించే అవకాశముందని కూడా పలువురు భావిస్తున్నారు. కాగా, ప్రతీ ఏడు ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధాని ప్రసంగించే ఆనవాయితీ ఉన్న నేపథ్యంలో.. అంతకుముందు కొన్ని రోజుల ముందే ప్రధాని మోదీ ప్రత్యేకంగా ఈ ఆకస్మిక నిర్ణయం తీసుకోవడం ఆసక్తి రేకెత్తిస్తోంది. కాగా, కశ్మీర్ బిల్లును రాజ్యసభ ఆమోదించిన రోజు హోంమంత్రి అమిత్ షా చేతిలోని కాగితాల్లో బుధవారమే జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారని రాసి ఉన్న విషయం గమనార్హం. అమిత్ షా చేతిలో ఆ కాగితాలున్న ఫొటోలు వైరల్ కూడా అయ్యాయి. అయితే, బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ హఠాన్మరణం కారణంగా ఆ ప్రసంగాన్ని గురువారానికి వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. -
మోదీజీ.. బయటపడిన నల్లధనం ఎంత?
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాజాగా చేసిన తన ప్రసంగంలో నోట్ల రద్దు వ్యవహారంపై ఎందుకు మాట్లాడలేదు? 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసిన తర్వాత తర్వాత పాత నోట్లను డిపాజిట్ చేసుకోవడానికి ప్రభుత్వం విధించిన గడువు ముగిసిన నేపథ్యంలో ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి శనివారం చేసిన ప్రసంగంలో అనేక విషయాలను వెల్లడిస్తారని ప్రజలంతా ఎదురుచూశారు. నకిలీ నోట్ల చెలామణిని అరికట్టడం, నల్లధనాన్ని వెలికి తీయడానికంటూ నవంబర్ 8వ తేదీన దేశంలో చెలామణిలో ఉన్న 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. రద్దు చేసిన నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి డిసెంబర్ 30 వరకు గడువు ఇచ్చారు. గడువు ముగిసిన తర్వాత ప్రధాని మోదీ గానీ రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గానీ కీలక ప్రకటన చేస్తుందని అంతా భావించారు. అయితే శనివారం సాయంత్రం 7.30 గంటలకు నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారన్న ప్రకటన వెలువడింది. మరికొన్ని గంటల్లో నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్న తరుణంలో ప్రధాని ఎలాంటి విషయాలను వెల్లడిస్తారోనని ఆసక్తిని ప్రదర్శించారు. మార్కెట్ లోకి కొత్త నోట్లు ఎన్నొచ్చాయి? ప్రధానంగా రద్దయిన నోట్లు బ్యాంకుల్లో ఎంత మేరకు డిపాజిట్ అయ్యాయి? పరిమితికి మించి ఆడిట్ గానీ సొమ్మును ఎంత మంది వెల్లడించారు? జన్ ధన్ ఖాతాల్లో ఎంత మేరకు జమ అయ్యిందీ? ఈ పరిణామాల మొత్తంలో అసలు దేశంలో బయటపడిన నల్లధనం ఎంత? మార్కెట్ లో చలామణిలో ఉన్న 500, 1000 నోట్లలో ఎంత మేరకు తిరిగి బ్యాంకుల్లోకి చేరింది? కొత్త కరెన్సీ 2000, 500 నోట్లను మార్కెట్ లోకి ఎంత మేరకు విడుదల చేశారు? కొత్తగా మళ్లీ వెయ్యి నోట్లను విడుదల చేస్తారా? కొత్త నోట్లను అక్రమంగా తరలిస్తూ ఎంత మేరకు పట్టుబడిందీ? కొత్త నోట్ల మార్పిడిలో ఎంతమంది అధికారులపై కేసులు నమోదు చేశారు? వంటి అంశాల్లో కొన్నింటినైనా ప్రధాని నోటి వెంట బయటి ప్రపంచానికి తెలుస్తాయని అంతా భావించారు. అయితే వీటిల్లో ఒకటి రెండు విషయాలను పైపై తడిమినప్పటికీ లోతుగా మాట్లాడకపోవడం అందరినీ విస్మయం కలిగించింది. ఎంత కరెన్సీ బ్యాంకుల్లో చేరింది? దేశంలో చలామణిలో ఉన్న అన్ని రకాల కరెన్సీలో 500, 1000 నోట్లు 86 శాతం ఉన్నాయి. ఈ నోట్లు దేశంలో 15.14 లక్షల కోట్ల మేరకు కరెన్సీ చలామణిలో ఉంది. ఇక వంద అంతకు తక్కువ డినామినేషన్ ఉన్న కరెన్సీ దేశంలో కేవలం 24 శాతం మాత్రమే చలామణిలో ఉంది. పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత వాటిని బ్యాంకుల్లో జమ చేసుకోవడానికి ఆర్బీఐ ఇచ్చిన గడువు డిసెంబర్ 30తో ముగియగా, దేశంలోని అన్ని బ్యాంకులు తమ వద్ద రద్దయిన పెద్ద నోట్లు ఎంత మేరకు డిపాజిట్ అయ్యాయో ఈ మెయిల్ ద్వారా అన్ని బ్యాంకులు వివరాలు అందించాలని తక్షణాదేశాలు జారీ చేసింది. అంటే బ్యాంకుల నుంచి ఆ లెక్కల వివరాలు ఆర్బీఐకి చేరినట్టే. దేశంలో చలామణిలో ఉన్న 15.14 లక్షల కోట్ల రద్దయిన కరెన్సీలో ఎంత కరెన్సీ బ్యాంకుల్లో చేరింది? ఆ విషయం తెలిస్తే దేశంలో ఎంత మేరకు నల్లధనం ఉందన్న వివరాలు వెల్లడయ్యేవి. డిపాజిట్ చేయడానికి మరో 15 రోజుల గడువు ఉందన్నప్పుడే 13 లక్షల కోట్ల మేరకు రద్దయిన నోట్లు బ్యాంకుల్లో జమయ్యాయని అప్పట్లోనే వార్తలొచ్చాయి. బ్యాంకుల్లో అక్రమాలపై చర్యలేవి? ఇలాంటి వివరాలు ప్రకటిస్తే ప్రధానమంత్రి తాను తీసుకున్న నిర్ణయంపై ఎంత మేరకు సఫలీకృమయ్యారన్నది స్పష్టంగా తెలిసేది. ప్రధాని ప్రతిష్ట కూడా మరింతగా ఇనుమడించేది. అయితే అలాంటి వివరాలేవీ వెల్లడించకపోవడంతో ప్రజల్లో మరింత అనుమానాలు రేకెత్తించే విధంగా పరిణామాలు కనిపిస్తాయి. నిజానికి దేశంలో 86 శాతం చలామణిలో ఉన్న కరెన్సీని రద్దు చేసిన నేపథ్యంలో గడిచిన నవంబర్ 8 నుంచి డిసెంబర్ 30 వరకు అనేక సంఘటనలు చోటుచేసుకున్నాయి. అనేక చోట్ల అక్రమ మార్గాల్లో కొత్త కరెన్సీ నల్ల కుబేరుల ఇళ్లలోకి చేరిపోయినట్టు అనేక సందర్భాలు వెల్లడయ్యాయి. ప్రస్తుతం దేశంలో 25 కోట్ల జన్ ధన్ ఖాతాలు ఉన్నాయి. పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత భారీ ఎత్తున సొమ్ము ఆ ఖాతాల్లో జమైనట్టు వార్తలొచ్చాయి. అయితే గడువు ముగిసిన తర్వాత వాటిపై ఇంతవరకు ఆర్బీఐ ఎలాంటి ప్రకటన చేయకపోగా ప్రధానమంత్రి ఆ విషయంలో కొంత వివరణ ఇస్తారని భావించిన ఆ విషయాలేవీ వెల్లడించలేదు. ‘నోట్ల రద్దు’ఫలితాలపై అస్పష్టత! భారత స్థూల జాతీయ ఉత్పత్తిలో 23.2 శాతం నల్లధనం ఉందని ప్రపంచబ్యాంకు గతంలో వెల్లడించింది. అలాగే ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2015 మే 5 రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా వాషింగ్టన్ కు చెందిన గ్లోబర్ ఫైనాన్స్ ఇంటిగ్రిటీ వెల్లడించిన దానిని బట్టి 2012 లో రూ. 6 లక్షల కోట్ల మేరకు నల్లధనం దేశం దాటిందని చెప్పారు. పెద్ద నోట్లను రద్దు చేసిన దరిమిలా ఒక్కో ఖాతాలో 2.5 లక్షలకు మించి డిపాజిట్ చేసినట్టయితే వాటికి లెక్కలు అడుగుతామని చెప్పిన ప్రభుత్వం వాటి వివరాలనూ వెల్లడించలేదు. నోట్ల రద్దు పరిణామాలపై 2016 సంవత్సరం చివరి రోజున ప్రధానమంత్రి జాతినుద్దేశించి చేసిన ప్రసంగం నోట్ల రద్దు పరిణామాలు, మరికొన్ని కొత్త నిర్ణయాలు వెల్లడవుతాయని ఆశించిన ప్రజలకు మాత్రం నిరాశే మిగిల్చింది. 2017 నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంలో ప్రధాని కొన్ని వరాలు ప్రకటించినప్పటికీ వాటిపై ప్రజలు పెద్దగా ఆసక్తి కనబరచలేదన్న అభిప్రాయం మాత్రం ఉంది.