ఎగువ మానేరు ఎడారేనా..?
సాక్షి, ముస్తాబాద్(సిరిసిల్ల) : రాజన్న సిరిసిల్ల జిల్లా వరప్రదాయని ఎగువ మానేరు ప్రాజెక్టు. ఇంకా చెప్పాలంటే రాష్ట్రంలోనే మొదటి చిన్నతరహ నీటి ప్రాజెక్టు. నిజాం కాలంలో నిర్మించిన ఈ ప్రాజెక్టు ఆధునీకీకరణ పనులు అటకెక్కాయి. మిషన్ కాకతీయ, నీటి ప్రాజెక్టులకు వేలాది కోట్లు ప్రభుత్వం కేటాయిస్తుండగా.. అధికారుల ఉదాసీనత ఈ ప్రాజెక్టుకు శాపంగా మారింది. వేలాది ఎకరాలకు ప్రత్యక్షంగా.. పరోక్షంగా సాగునీరందిస్తూ.. ప్రజల దాహార్తిని తీరుస్తున్న ఎగువ మానేరుపై పాలకులు శీతకన్ను వీడాలి. ఈ ఏడాది మరమ్మతు పనులకు ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేస్తోందని ఎదురు చూసిన రైతన్నలకు చివరకు నిరాశే మిగిలింది. ఈ వర్షాకాలానికి ముందే పనులు పూర్తవుతాయని భావించారు. మరింత ఆయకట్టు సాగులోకి వస్తుందనకున్న అన్నదాతలకు ఎదురు చూపులే దక్కాయి.
కొట్టుకుపోతున్న స్పిల్‌వే..
చివరి నిజాం మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ 1945లో కూడవెళ్లి, పల్వంచ వాగులపై నర్మాల వద్ద ఎగువ మానేరు ప్రాజెక్టును నిర్మించారు. 1948లో పనులు పూర్తయ్యాయి. 2టీఎంసీలతో 17వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించే పనులకు శ్రీకారం చుట్టారు. కుడికాలువ ద్వారా అంటే ఇప్పటి ముస్తాబాద్ మండలానికి 10వేల ఎకరాలకు, ఎడమ కాలువ ద్వారా గంభీరావుపేట మండలానికి 7వేల ఎకరాలకు సాగునీటిని అందించారు. కాలక్రమంలో ప్రాజెక్టును అధికారులు పట్టించుకోలేదు. దీంతో సిల్ట్ పేరుకుపోయి నీటి సామర్థ్యం తగ్గింది. అలాగే కుడి, ఎడమ కా లువలు మట్టిలో కూరుకుపోయి చెట్లు మొలిచి నీ రు ముందుకు సాగని విధంగా తయారైంది. ఇక కుడి కాల్వలోని డిస్ట్రిబ్యూటరీ 17 వరకు షట్టర్లు ధ్వంసం అయ్యాయి. ఎడమ కాల్వలోని డీ–10 వ రకు శిథిలం అయ్యాయి. స్పిల్‌వే పై మొక్కలు మొ లిచి నెర్రెలు పెట్టింది. కొంత భాగం వరదకు కొ ట్టుకుపోయింది. చివరకు 5వేల ఎకరాలకు మాత్ర మే సాగునీరందించే ప్రాజెక్టుగా మిగిలిపోయింది.
ప్రతిపాదనలకు మోక్షం కలిగేనా..
మంత్రి కేటీఆర్ ఆదేశాలతో నీటిపారుదల శాఖ అ« దికారులు ఎట్టకేలకు కుడి, ఎడమ తూముల మరమ్మతు, షట్టర్ల మరమ్మతు, కుడికాలువ పది కిలో మీటర్లు, షట్టర్లు, ఎడమ కాలువ 5 కిలోమిటర్ల కా ల్వ లైనింగ్, ముఖ్యంగా యాభై ఏళ్లుగా నిండుకు న్న సిల్ట్ తొలగింపు తదితర పనులు చేపట్టేందుకు రూ. 49 కోట్ల ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆరునెలల క్రితం పంపించిన ప్రతిపాదనలు ఈఎస్సీ వరకు వెళ్లి ఆగినట్లు తెలుస్తోంది. ఈ వేసవిలోనే సిల్ట్ తొలగించి కనీసం 13వేల ఎకరాలకు నీరందించాలనుకున్న ప్రతిపాదనలు దాటలేదు. మళ్లీ వర్షాలు మొదలైతే ఇక సిల్ట్పనులు చేయరాదు. భారీ వర్షాలు పడితే వచ్చే వెసవి నాటికి కూడా పూడిక తీసే అవకాశాలు తక్కువే. ష ట్టర్ మరమ్మతు చేయరాదు. మరోసారి రబీలో 5వేల ఎకరాలకు మాత్రమే నీరందించే అవకాశాలున్నాయి.
9వ ప్యాకేజీలోకి గెస్ట్‌హౌస్, బోటింగ్
నిజాం నిర్మించిన గెస్ట్‌హౌజ్ శిథిలావస్థలో ఉండగా.. ఉద్యానవనం రూపు కోల్పోయింది. దీంతో అధికారులు రూ.2 కోట్లతో ఆధునిక హంగులతో గెస్ట్‌హౌస్ నిర్మాణానికి టెండర్ ప్రక్రియ పూర్తి చేశారు. టూరిజం శాఖ ఉద్యానవనం, గెస్ట్‌హౌస్ నిర్మాణం చేపట్టనుండగా.. దీనిని కాళేశ్వరం ప్రాజెక్టు 9వ ప్యాకేజీ కింద చేపట్టనున్నారు.