Sri Bagh Pact
-
శ్రీబాగ్ ఒడంబడిక అమలే కీలకం!
వర్తమానంలోని అనేక సమస్యలకు చరిత్రలోనే మూలాలు ఉంటాయి. అటువంటి చరిత్రను పనికిమాలినదిగా భావించిన పాలకుల హయాంలో సమస్యలకు పరిష్కారాలు ఎలా లభిస్తాయి? కరవుకాటకాలతో వెనుకబడి పోయిన రాయలసీమ వెతలు ఆంధ్రరాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకూ కొనసాగుతూనే ఉన్నాయి. మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి కారణమైన ‘శ్రీబాగ్ ఒడంబడిక’లోని అంశాలను చిత్త శుద్ధితో అమలుకు ప్రయత్నించకపోవడమే ఈ నాటి రాయలసీమ దుఃస్థితికి ప్రధాన కారణం. ఒడంబడిక ప్రకారం దక్కిన రాజధాని ఎటూ చెయ్యి దాటిపోయింది. కనీసం అభివృద్ధికి కీలకమైన సాగు, తాగునీటి ప్రాజెక్టులన్నా పూర్తవుతాయా?శ్రీబాగ్ ఒప్పందం రాయలసీమ ప్రజల భావోద్వేగాలతో పెనవేసుకున్న అనుబంధం. తొలి భాషా ప్రయుక్త రాష్ట్ర అవతరణకు మూలం. పాలకుల నిరాదరణకు గురైన ఈ ఒడంబడికకు నేటికి 87 సంవత్సరాలు. అప్పట్లో ప్రస్తుత తెలంగాణ నైజాం నవాబు పాలనలో ఉండేది. కోస్తా, రాయలసీమ ప్రాంతాలు మద్రాసు ప్రెసిడెన్సీలో ఉండేవి. భాషాభిమానం, రాజకీయ కారణాలతో తమిళుల ఆధిపత్యంలో ఉన్న మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి తెలుగు రాష్ట్రంగా విడిపోవాలనే ఆలోచన మధ్య కోస్తా ఆంధ్ర పెద్దలలో వచ్చింది. ఈ క్రమంలో 1913 (బాపట్ల)లో తొలి ‘ఆంధ్ర మహాసభ’ జరిగింది. అది భాష, సాంస్కృతిక వికాసం కోసం పరితపించిన వేదిక అయినా... అంతర్లీనంగా మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి తెలుగు ప్రాంతం విడిపోవాలని దీని నిర్వాహకులకు ఉండేది. కారణాలు ఏమైనా రాయలసీమ ప్రాంతం నుంచి ప్రతినిధులు ప్రారంభంలో సమావేశాలకు హాజరు కాలేదు. అయితే రాయలసీమ భాగస్వామ్యం లేకుండా మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి వేరుపడటం సాధ్యం కాదన్న నిర్ణయానికి వచ్చిన ఆంధ్ర మహాసభ పెద్దలు సీమ ప్రజల మనోగతాన్ని తెలుసుకోవడం కోసం 1917లో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ సీమలో పర్యటించిన అనంతరం జరిగిన సభలలో సీమ ప్రాంత ప్రతినిధులు పాల్గొన్నారు.మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి విడిపోవాలన్న మధ్య కోస్తా ఆంధ్ర పెద్దలతో సీమ ప్రాంత పెద్దలు గొంతు కలపలేదు. కారణం అప్పటికే ఆంగ్లేయుల పాలనలో ఉన్న ఆ ప్రాంతం... విద్యాపరంగా అభివృద్ధి చెందింది. అలాగే కాటన్ బ్యారేజీ, ప్రకాశం బ్యారేజీల వల్ల సీమతో పోల్చుకుంటే అభివృద్ధిలో ముందు ఉన్నది. సమీపంలో ఉన్న మద్రాసు నగరాన్ని వదులుకుని అప్పటికే అభివృద్ధిలో మెరుగ్గా ఉన్న కోస్తా ఆంధ్రతో కలిసి రాష్ట్రంగా ఏర్పడటం సీమ పెద్దలకు ఇష్టం లేదు. ఆంధ్రా యూనివర్సిటీ ఏర్పాటు ప్రక్రియలో జరిగిన అనుభవా లతో అనుమానాలు పెరిగాయి. 1926 ఆంధ్రమహాసభ ఆంధ్రా యూనివర్సిటీనీ వెనుకబడిన అనంతపురంలో ఏర్పాటు చేయాలని తీర్మానం చేసింది. మద్రాసు శాసనసభలో ఈ అంశంపై జరిగిన తీర్మానంలో తమిళ శాసన సభ్యులు పాల్గొన వద్దని ఆనాటి ముఖ్యమంత్రి సూచించారు.వాస్తవానికి ఆంధ్ర మహాసభ తీర్మానం ప్రకారం... కోస్తా, సీమ సభ్యులు అనంతపురంలో యూనివర్సిటీ ఏర్పాటుకు ఓటు వేయాలి. అందుకు భిన్నంగా మధ్య కోస్తా సభ్యులు విజయవాడలో ఏర్పాటు చేయాలని ఓటు వేశారు. అయితే ముఖ్యమంత్రి సూచనను పక్కన పెట్టి తమిళ శాసన సభ్యులు కొందరు సీమ సభ్యులకు అనుకూలంగా ఓటు వేయడంతో 25 – 35 ఓట్లతో అనంతపురంలో యూనివర్సిటీ ఏర్పాటుకు తీర్మానం చేశారు. ఆంధ్ర మహాసభ తీర్మానం, అసెంబ్లీ ఆమోదాన్ని కాదని విశాఖలో ఏర్పాటు చేసి తొలి ఉప కులపతిగా రాయలసీమ వారికి అవకాశం ఇచ్చారు. ఈ పరిణామంతో పప్పూరి రామాచార్యులు, టీఎన్ రామకృష్ణారెడ్డి లాంటి వారు... ‘ఉంటే మద్రాసుతో కలిసి ఉందాము లేకపోతె రాయలసీమ రాష్ట్రంగా (ప్రస్తుతమున్న సీమ నెల్లూరు ప్రకాశం జిల్లా, కర్ణాటక లోని బల్లారితో సహా) విడిపోదాం’ అని ప్రతిపాదన చేశారు.ఇదంతా గమనిస్తున్న ఆంధ్రమహాసభలోని పెద్దలు చర్చల నిమిత్తం రెండు ప్రాంతాల సభ్యులతో ఒక కమిటీని నియమించారు. 1937 నవంబర్ 16న మద్రాసు నగరంలోని దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు స్వగృహం (శ్రీబాగ్)లో కమిటీ సమావేశమయ్యింది. మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి తెలుగు రాష్ట్రం అవతరించిన తర్వాత పాలనా ప్రాధాన్యతలపై ఒక ఒప్పందం చేసుకున్నారు. అదే ‘శ్రీబాగ్ ఒడంబడిక’. కోస్తా, సీమ ప్రజల పోరాటం... మరో వైపు పొట్టి శ్రీరాములు దీక్ష–ఆత్మార్పణల ఫలితంగా భారత దేశంలోనే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం 1953 అక్టోబర్ 1న అవతరించింది.శ్రీబాగ్ ఒడంబడికలోని ముఖ్యాంశాలు:1. ఒక ప్రాంతంలో రాజధాని, మరో ప్రాంతంలో హైకోర్టు ఏర్పాటు చేయాలి. ఎంపిక చేసుకునే హక్కు రాయలసీమకు ఉండాలి. 2. కృష్ణా, తుంగభద్రలలో నీటి వినియోగంలో రాయలసీమకు వాటా కేటాయించాలి. అందుకనుగుణంగా నీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలి. 3. రెండు ప్రాంతాల మధ్య సాంఘిక, సాంస్కృతిక సమానత్వాన్ని సాధించేందుకు విద్యా కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఆంధ్రా యూనివర్సిటీ కింద ఒక కేంద్రాన్ని అనంతపురంలో ఏర్పాటు చేయాలి. 4. జనాభా లెక్కల ప్రకారం కాకుండా సీమ, కోస్తా ఆంధ్రకు సమానంగా నియోజక వర్గాల ఏర్పాటు చేయాలి.ఈ ఒప్పందం ప్రకారం 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత కర్నూలులో రాజధాని, గుంటూరులో హైకోర్టు ఏర్పాటు చేశారు. కానీ, 1956లో తెలంగాణను కలుపుకుని ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కావడంతో రాజధాని రాయలసీమ నుంచి తెలంగాణకు మారింది. అలా శ్రీబాగ్ ఒప్పందానికి తూట్లు పడటం ప్రారంభమయ్యింది. రాయలసీమ అభివృద్ధిలో అతి ముఖ్యపాత్ర పోషించే నీటి ప్రాజెక్టులనన్నా పూర్తి చేస్తున్నారా అంటే అదీ జరగడం లేదు. అదేమంటే శ్రీబాగ్ ఒప్పందానికి చట్టబద్ధత లేదనీ, అది కాంగ్రెస్ పార్టీలోని రెండు గ్రూపుల మధ్య కుదిరిన ఒప్పందం అనీ కొందరు తప్పుడు ప్రచారం చేస్తు న్నారు. నాటి కాంగ్రెస్ విభిన్న అభిప్రాయాలు ఉన్నవారి సంగమం. కమిటీ సభ్యులు కాంగ్రెస్‌లో ఉన్నంత మాత్రాన ఈ ఒప్పందం ఆ పార్టీ అంతర్గత వ్యవహారంగా తేల్చడం సమంజసమేనా?చదవండి: హానికరమైన కొత్త జాతీయవాదంమద్రాసు ప్రెసిడెన్సీ నుంచి తెలుగు రాష్ట్రం విడిపోవడంలో సీమ ప్రజల త్యాగం ఉన్నది. ప్రస్తుత సీమలోని చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలకు చెందిన వారికి ఇప్పటికీ హైదరాబాద్ కన్నా చెన్నై నగరంతోనే అనుబంధం ఎక్కువ. తెలుగు రాష్ట్రం కావాలనే కోరిక పుట్టిన ప్రారంభంలోనే... తమిళులు మదురై కేంద్రంగా తమిళ రాష్ట్రం కోసం తీర్మానం చేశారు. దీనికి కారణం ఎప్పటికైనా చెన్నై తెలుగు వారిదే అవుతుందేమో అని వారి ఆలోచన. నిజానికి పప్పూరి రామా చార్యులు, టీఎన్ రామకృష్ణారెడ్డి ప్రతిపాదన ప్రకారం రాయలసీమ రాష్ట్రం ఏర్పడి ఉంటే (ప్రస్తుత రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, బళ్ళారి, చెన్నై సమీప జిల్లాలతో కలిపి) చెన్నై మహానగరం మనదే అయ్యేది. దీన్నిబట్టి సమీపంలోని చెన్నై నగరాన్ని వదులుకుని తెలుగు రాష్ట్రం కోసం సీమ ప్రజలు త్యాగం చేశారని అర్థం చేసుకోవాలి.చదవండి: వాగ్దానాలు గాలికి వదిలినట్లేనా?ప్రస్తుతం రాష్ట్రంలోని రాజకీయ వాతావరణం కారణంగా శ్రీబాగ్ ఒప్పందం అంటే రాయలసీమకు రాజధాని మాత్రమే ఆన్న ప్రచారం జరుగుతోంది. ఇది సరికాదు. మరి నీటి ప్రాజెక్టుల సంగతేమిటి? శ్రీశైలం ప్రాజెక్టు నీటిని సత్వరం అందిపుచ్చుకునే విధంగా సిద్ధేశ్వరం ఆలుగునూ, పోతిరెడ్డి పాడునూ వెడల్పు చేయడం; రాయలసీమ ఎత్తిపోతల పథకం, తుంగభద్ర నీటిని ఉపయోగించుకునే విధంగా గుండ్రేవుల, కుందూపై రిజర్వాయర్లు నిర్మించడం; గాలేరు–నగరి, హంద్రీనీవా ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవడం; చెరువుల పునరుద్ధరించడం వంటి చర్యలే రాయలసీమ కరువుకు శాశ్వత పరిష్కారం. అందుకే రాయలసీమ సమగ్రాభివృద్ధి జరగాలి అంటే కచ్చితంగా శ్రీబాగ్ ఒప్పందంలో పేర్కొన్న విధంగా కృష్ణా, తుంగభద్రలపై సీమ ప్రాంత సాగు, తాగునీటి సమస్య పరిష్కారానికి అనుగుణంగా పై ప్రాజెక్టులు పూర్తి చేయాలి.శ్రీబాగ్ ఒడంబడికలో పేర్కొన్న విధంగా కృష్ణా, తుంగభద్ర నీటిని సీమకు అందించే విధంగా ప్రాజెక్టుల నిర్మాణం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. శ్రీబాగ్ ఒప్పంద స్ఫూర్తితో సీమ సమాజం ఇందుకోసం ముందుకు సాగాలి.- మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయకర్త -
రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలి
ప్రొద్దుటూరు క్రైం: రాయలసీమలోనే హైకోర్టు ఏర్పాటుచేయాలని వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు న్యాయవాదుల సంఘం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. రాయలసీమలోని నాలుగు జిల్లాల న్యాయవాదులను కలుపుకొని త్వరలో ఇక్కడ భారీ బహిరంగసభ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. పట్టణంలోని బార్ అసోసియేషన్ కార్యాలయంలో సోమవారం రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేసే విషయమై సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ విమోచన సమితి వ్యవస్థాపకుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎంవి రమణారెడ్డి, పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మల్లేల లింగారెడ్డిలతో పాటు పెద్దఎత్తున న్యాయవాదులు పొల్గొన్నారు. డాక్టర్ ఎంవీ రమణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగిన సమయంలో తెలంగాణలో ఉన్న మన న్యాయవాదుల పరిస్థితి దారుణంగా తయారైందన్నారు. తిరిగి అలాంటి పరిస్థితి ఎదురుకాకుండా ఉండాలంటే రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాల్సిందేనని పేర్కొన్నారు. హైకోర్టు ఏర్పాటైతే ఎల్ఎల్బీ పట్టా తీసుకొని కొత్తగా వచ్చే రెండు మూడు బ్యాచ్‌లకైనా అక్కడ పనిచేసే అవకాశం లభిస్తుందన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా కోస్తా వాళ్లను తట్టుకొని మన న్యాయవాదులు నిలబడాలంటే రాయలసీమలో ఏదో ఒకచోట హైకోర్టు ఉండాలన్నారు. హైకోర్టు మన హక్కు అని తెలిపారు. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం హైకోర్టు, రాజధానిలు ఒక ప్రాంతంలో ఒకటి ఉంటే రెండో ప్రాంతంలో ఇంకోటి ఉండాలన్నారు. ఈ రోజు అమరావతిలో రాజధాని ఏర్పాటు చేస్తున్నందున న్యాయంగా హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మల్లేల లింగారెడ్డి మాట్లాడుతూ రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేస్తే ప్రాంతీయ అసమానతలు తొలగిపోతాయన్నారు. కోస్తాలో రాజధాని ఏర్పాటైనందున హైకోర్టు ఇక్కడ ఏర్పాటు చేయడం సముచితమని పేర్కొన్నారు. అవసరరీత్యా కోర్టులు ఎక్కడున్నా వెళ్లాల్సిందేనని చెప్పారు. మనకు ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ హైకోర్టును మాత్రం ముందుగా సాధించుకొని తీరాల్సిందేనని ఆయన తెలిపారు. త్వరలో నాలుగు జిల్లాల బార్ అసోసియేషన్ సభ్యులతో చర్చించిన తర్వాత ప్రొద్దుటూరులో భారీ సమావేశం ఏర్పాటు చేయాలని, పార్టీలకతీతంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని సభ్యులు నిర్ణయించారు. బార్ అసోసియేషన్ అ«ధ్యక్షుడు ఆర్వి భాస్కర్‌రావు, సీనియర్ న్యాయవాదులు ముడిమేల కొండారెడ్డి, ఇవి సుధాకర్‌రెడ్డి, పుత్తాలక్ష్మిరెడ్డి, గొర్రెశ్రీనివాసులు, జిలానిబాషా,సుదర్శన్‌రెడ్డి, దాదాపీర్ మాట్లాడారు. బార్అసోసియేషన్ కార్యదర్శి ఓబులేసు, ఏపీపీ మార్తల సుధాకర్‌రెడ్డి, మల్లేల లక్ష్మీప్రసన్న, జింకా విజయలక్ష్మి, నిర్మలాదేవి పాల్గొన్నారు. -
రాయలసీమలో రాజధాని
సీమ అభివృద్ధిపై చర్చలో పలువురు మేధావులు, విద్యావంతుల డిమాండ్ రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేస్తేనే అభివృద్ధి సాధ్యమని పలువురు మేధావులు, విద్యావేత్తలు అభిప్రాయపడ్డారు. తిరుపతిలో సోమవారం రాయలసీమ అభివృద్ధి సమితి ఆధ్వర్యంలో రాయలసీమ అభివృద్ధిపై చర్చా వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మేధావులు మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయిన తరువాత కూడా ప్రభుత్వం రాయలసీమను తీవ్ర నిర్లక్ష్యం చేయడం దారుణమన్నారు. ముఖ్యంగా రాజధాని విషయంలో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం రాయలసీమ జిల్లాల్లోనే రాజధానిని నిర్మించాలని, అయితే ప్రస్తుత పాలకులు దాన్ని ఉల్లంఘించారని ధ్వజమెత్తారు. రాయలసీమలో రాజధాని ఏర్పాటుతోనే అభివృద్ధి సాధ్యమని పలువురు మేధావులు, నాయకులు అభిప్రాయపడ్డారు. విభజన తరువాత పాలకుల పక్షపాత ధోరణితో సీమకు అన్యాయం జరిగిందన్నారు. తిరుపతిలోని ఒక ప్రైవేట్ హోటల్లో సోమవారం రాయలసీమ అభివృద్ధి సమితి ఆధ్వర్యంలో రాయలసీమ అభివృద్ధిపై చర్చా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు మేధావులు, నాయకులు పాల్గొని, తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఎవరేమన్నారంటే... - తిరుపతి సిటీ శ్రీబాగ్ ఒడంబడిక ఉల్లంఘన శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం రాయలసీమ జిల్లాల్లోనే రా జధాని నిర్మాణం చేయాలి. అయితే దాన్ని ఉల్లంఘిం చా రు. 14, 15 దశాబ్దాల్లో విదేశీ యాత్రికులు రాయలసీమ ను రతనాల సీమగా కీర్తించారు. అయితే నేడు ఈ ప్రాం తంలో రాళ్ల సీమగా మారింది.ఎక్కడ చూసినా కరువు కరాళనృత్యం చేస్తోంది. ఈ దుర్భిక్షం పోవాలంటే సీమ జిల్లాలకు 750 టీఎంసీల నీళ్లు అవసరం. నీటి సమ స్య పరిష్కారం కావాలంటే నికల జలాల పంపిణీ జరగాలి. - ఎ.హనుమంత్‌రెడ్డి, రాయలసీమ అభివృద్ధి సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఓట్టు వేయలేదని సీమకు అన్యాయం అమరావతిలో రాజధాని నిర్మాణానికి అనుకూలంగా ఉండదని సిటిజన్ ఫోరమ్ ఆధ్వర్యంలో మేమంతా సీఎం చంద్రబాబును కలిసి విన్నవించినా లెక్కచేయలేదు. రాయలసీమ ప్రజలు టీడీపీకి ఓట్లు వేయలేదని సీమకు అన్యాయం చేశారు. అయితే అనంతపురం జిల్లాలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు టీడీపీ అభ్యర్థులు గెలవడం తో అక్కడ కొంత వరకు అభివృద్ధి పనులు చేస్తానని సీఎం చెప్పారు. నెల్లూరు జిల్లాకు మంజూరైన పరిశ్రమలను చాలావరకు కోస్తాంధ్రకు తీసుకెళుతున్నారు. - అంజనేయ రెడ్డి, విశ్రాంత ఐపీఎస్ అధికారి రాయలసీమలో బస్సుయాత్ర రాయలసీమ జిల్లాలకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా ఈ ప్రాంతంలో సీపీఎం ఆధ్వర్యంలో బస్సు యాత్ర చేపట్టనున్నాం. అనంతపురం జిల్లాలో లక్షా 25 వేల ఎకరాల భూమిని రైతులు సాగుచేసుకుంటుండగా ప్రభుత్వం లాక్కుంది. అలాగే కర్నూలు జిల్లాలో కూడా పేదల నుంచి భూములు లాక్కున్నారు. సుమారు 200 మంది రైతులు ఒక అనంతపురం జిల్లాలోనే అత్మహత్యలు చేసుకున్నారు. మనమంతా దొంగల ప్రభుత్వంలో ఉన్నాం. -మధు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి నిధులు వెనక్కి పంపారు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో సాగునీరు, తాగునీరు, పరిశ్రమల కోసం మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రూ.7 వేల కోట్ల నిధులను జిల్లాకు తీసుకువస్తే సీఎం చంద్రబాబు దుర్మార్గంగా వ్యవహరించి, ఆ పథకాన్ని రద్దు చేసి,నిధులు వెనక్కి పంపారు..ఎంతవరకు సమంజసం. శ్రీపద్మావతి మెడికల్ కళాశాలలో సీమ విద్యార్థులకు రావాల్సిన మెడికల్ సీట్లును 120 జీవో పేరుతో రద్దు చేయడం సీఎం చంద్రబాబు ప్రభుత్వ అనైతిక చర్య. - నవీన్‌కుమార్‌రెడ్డి, రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ బాబు సీమను నిర్లక్ష్యం చేస్తున్నారు సీఎం చంద్రబాబు రాయలసీమ జిల్లాలను అన్నీ విధాలుగా నిర్లక్ష్యం చేస్తున్నారు. కోస్తాంధ్రాకు సీఎం దాసోహం అయ్యారు. కోస్తాంధ్రలో గెలుపొందితే చాలనే ధీ మాతో చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. సీమపై నిర్లక్ష్యం చూపి ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని పిలుపునిచ్చారు. -భూమన్, రాయలసీమ అధ్యయనాల సంస్థ అధ్యక్షుడు ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం సీమను ప్రత్యేకరాష్ట్రం చేయాలని ఉద్యమిస్తాం. ఈ ప్రాం తానికి మంచి జరిగే పరిణామం అసన్నమైంది. ఈ ప్రాం త నాయకులు అధికారంలో ఉన్నపుడు సీమ గురించి మాట్లాడరని, లేనపుడే మాట్లాడుతారు. ప్రత్యేకరాష్ట్రం ఏర్పాటుకు ఒక ఛానల్, ప్రింట్ మీడియా, సాంస్కృతిక విభాగం ఏర్పడాలి. -బెరైడ్డి రాజశేఖరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోస్తాంధ్రతో కలిసి బతికితే నయవంచనే సీమ ప్రత్యేక రాష్ర్టంగా ఏర్పడితే తప్పా మన బతుకులు మారవు. కోస్తాంధ్రతో కలిసి బతికితే నయవంచనకు గురికాక తప్పదు. సీమ ప్రత్యేక రాష్ర్టం అనే డిమాండ్‌తో మనమంతా ముందుకు వెళ్లాలి. దేశంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతం రాయలసీమ, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. -గఫూర్, మాజీ ఎమ్మెల్సీ తుళ్లూరులో రాజధాని రాదు ఎట్టి పరిస్థితుల్లోనూ తుళ్లూరు మండలంలో రాజధాని నిర్మాణం జరగదు. తిరిగి రాయలసీమలోనే ఏర్పాటు అవుతుంది. అమరావతిలో రాజధాని నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేసినప్పటి నుంచి అన్నీ అపశకునాలే చోటు చేసుకుంటున్నాయి. - చింతా మోహన్, మాజీ ఎంపీ