Sri Ramchandra
-
ప్రేమంటే అంత ద్వేషం దేనికి?
ప్రపంచమంతా ప్రేమ మయం. యూత్ అయితే ప్రేమనామస్మరణతో తరించిపోతున్నారు. ఇలాంటి ఈ రోజుల్లో ఈ కుర్రాడు ‘ప్రేమా లేదు.. గీమా లేదు’ అంటున్నాడు. కూరలో కరివేపాకులా ప్రేమను తీసిపారేస్తున్నాడు. ఇంతకీ ఈ కుర్రాడెవరు? ప్రేమపై అంత ద్వేషాన్ని ఎందుకు పెంచుకున్నాడు? చివరకు ఈ కుర్రాడి జీవితంతో ప్రేమ ఎలా ఆడుకుంది? ఆనే ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘ప్రేమా గీమా జాన్తా నయ్’. ‘ఇండియన్ ఐడల్’ శ్రీరామచంద్ర, బార్బీ హండా జంటగా నటించారు. సుబ్బు ఆర్వీ దర్శకుడు. మద్దాల భాస్కర్(భాను), దాడి బాలభాస్కర్ నిర్మాతలు. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ రెండోవారంలో విడుదల కానుంది. నిర్మాతలు మాట్లాడుతూ-‘‘గాయకుడు శ్రీరామచంద్రను హీరోగా స్థిరపరిచే సినిమా ఇది. మహానటుడు ఎస్వీఆర్ మనవడు జూనియర్ ఎస్వీరంగారావు విలన్‌గా నటించారు. మణిశర్మ స్వరాలందించిన ఈ చిత్రం పాటలకు మంచి స్పందన లభిస్తోంది. యువతరం ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకునే సినిమా అవుతుంది’’ అని తెలిపారు. నరేష్, భానుచందర్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కూర్పు: మార్తాండ్ కె.వెంకటేష్, కెమెరా: సురేందర్‌రెడ్డి, జగదీష్. -
ప్రేమంటే పడని కుర్రాడి కథ
ఇండియన్ ఐడల్ శ్రీరామచంద్ర కథానాయకునిగా రూపొందుతోన్న చిత్రం ‘ప్రేమా గీమా జాన్తా నై’. బార్బీ కథానాయిక. సుబ్బు ఆర్వీ దర్శకుడు. మద్దాల భాస్కర్, బాల భాస్కర్ నిర్మాతలు. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. మణిశర్మ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను ఈ నెలాఖరున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ-‘‘నవ్యమైన ప్రేమకథతో రూపొందుతోన్న చిత్రమిది. యూత్‌ని ప్రభావితం చేసే అంశాలు ఇందులో ఉంటాయి. ప్రియాంక చోప్రా మేనకోడలు బార్బీహండ హీరోయిన్గా, మహానటుడు ఎస్వీరంగారావు మనవడు జూనియర్ ఎస్వీఆర్ విలన్‌గా ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతుండటం విశేషం. వచ్చే నెలలో సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ప్రేమంటే పడని ఓ కుర్రాడు ప్రేమలో పడ్డాక తన అభిప్రాయాన్ని ఎలా మార్చుకున్నాడు? అనే కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రమిదని, ఇందులోని ప్రేమ సన్నివేశాలు కొత్తగా ఉంటాయని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి కూర్పు: మార్తాండ్ కె.వెంకటేష్, కార్యనిర్వాహక నిర్మాత: ఎం.ఎస్.కుమార్. -
కిక్ బాక్సింగ్ నేర్చుకున్న శ్రీరామ్
‘ఇండియన్ ఐడిల్’ శ్రీరామచంద్ర కిక్ బాక్సింగ్ నేర్చుకున్నారు. ఎందుకో తెలుసా? ‘ప్రేమా గీమా జాన్తా నయ్’ కోసం. ఈ సినిమాతో ఆయన హీరోగా పరిచయం అవుతున్నారు. కథలో భాగంగా కిక్ బాక్సింగ్ నేర్చుకున్నానని శ్రీరామచంద్ర చెప్పారు. సోమవారం హైదరాబాద్‌లో ఆయన పత్రికల వారితో మాట్లాడుతూ -‘‘నన్ను హీరోగా చేయమని గత రెండేళ్ల నుంచి చాలామంది అడుగుతున్నారు. కొన్ని కథలు కూడా విన్నాను. దర్శకుడు సుబ్బు చెప్పిన కథ వినూత్నంగా అనిపించి ఓకే చెప్పాను’’ అని తెలిపారు. సుబ్బు ఆర్.వి. దర్శకత్వంలో శుభం క్రియేషన్స్ పతాకంపై మద్దాల భాస్కర్, డీబీ భాస్కర్ నిర్మిస్తున్న చిత్రం ‘ప్రేమా గీమా జాన్తా నయ్’. ఈ నెల 11న పాటల్ని విడుదల చేయబోతున్నామని నిర్మాతలు చెప్పారు. మణిశర్మ స్వరాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని దర్శకుడు పేర్కొన్నారు. ఇందులో కామెడీ ఛాయలున్న విలన్‌గా నటిస్తున్నానని ఎస్వీ రంగారావు తెలిపారు. యువతను ఆకట్టుకునే చిత్రమిదని కథానాయిక బార్బీ చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: సురేందర్‌రెడ్డి, సహనిర్మాతలు: ప్రతాప్‌రెడ్డి, అడారి మూర్తి.