నేడు గరుడ సేవ
సాక్షి, తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో విశిష్టమైన గరుడ సేవను బుధవారం నిర్వహించనున్నారు. రాత్రి 8 గంటలకు వాహన సేవను ప్రారంభించనున్నారు. 3 నుంచి 4 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈవో గిరిధర్ గోపాల్, జేఈవో శ్రీనివాసరాజు, టీటీడీ సీవీఎస్వో జీవీజీ అశోక్‌కుమార్, తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ రాజశేఖరబాబు విభాగాల వారీగా గరుడసేవ ఏర్పాట్లను సమీక్షించారు. వాహన సేవ సందర్భంగా భక్తుల మధ్య తోపులాట, తొక్కిసలాటకు అవకాశం లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గ్యాలరీల్లో వేచి ఉండే అశేష భక్తజనం ఉత్సవమూర్తిని దర్శించుకునే విధంగా వాహనాన్ని అటుఇటూ తిప్పాలని సిబ్బందికి సూచించారు.
అదనపు బస్సులు లేవు
సమైక్యాంధ్ర ఉద్యమంవల్ల తిరుమల-తిరుపతి మధ్య 107 బ స్సులు మాత్రమే నడుస్తున్నాయి. ఇందులో 8 సర్వీసులు తిరుమలలోని పాపవినాశనానికి నడుపుతున్నారు. గరుడ సేవకు అవే బస్సులు తిరుగుతాయని, అదనంగా వేసే అవకాశం లేదని తిరుమల డిపో మేనేజరు లక్ష్మీనరసింహారెడ్డి తెలిపారు.
ద్విచక్ర వాహనాలకు గ్రీన్ సిగ్నల్
గరుడ సేవలో అదనపు ఆర్టీసీ బస్సులు లేకపోవడంతోద్విచక్ర వాహనాలకు అనుమతిచ్చారు. భక్తుల అవసరాల దృష్ట్యా ద్విచక్ర వాహనాలకు అనుమతించినట్టు ఈవో గిరిధర్ గోపాల్, జేఈవో శ్రీనివాసరాజు వెల్లడించారు.
భద్రత కట్టుదిట్టం..
గరుడ వాహన సేవలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సీవీఎస్వో జీవీజీ.అశోక్‌కుమార్, అదనపు సీవీఎస్వో శివకుమార్‌రెడ్డి, తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ రాజశేఖరబాబు, ఏఎస్పీ ఉమామహేశ్వర్ శర్మ, డీఎస్పీ నంజుండప్ప భద్రతను పర్యవేక్షించారు.
నాలుగు మాడ వీధుల్లో ఆహారం పంపిణీకి చర్యలు
గరుడ సేవకు వచ్చే భక్తులకు ఉచిత భోజన వసతి, వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు.
ఉదయం మోహినీ అవతారం..
బుధవారం ఉదయం స్వామివారు మోహినీ అవతారంలో దర్శనమిస్తారు.