పాలకులు రాయల బాటలో నడవాలి
పెనుకొండ : శ్రీకృష్ణదేవరాయల పాలన ఒక స్వర్ణయుగమని, పాలకులు ఆయన బాటలో నడిచినప్పుడే ఆయనకు గౌరవం ఇచ్చిన వాళ్లవుతారని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. శుక్రవారం 2వ రోజు రాయల ఉత్సవాల ను వైభవంగా నిర్వహించారు. తొలుతగా ఆర్డీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నారుు. అక్కడ రఘువీరా, సూర్యప్రకాష్‌రెడ్డి ఉత్సవాల పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం నాయకులు, కవులు, కళాకారులు విద్యార్థులతో కలిసి 44వ జాతీయ రహదారిలోని కృష్ణదేవరాయ విగ్రహం వద్దకు ర్యాలీగా చేరుకుని పూలమాలలు వేశారు. అనంతరం సభాస్థలికి చేరుకున్నారు. సభలో రఘువీరా మట్లాడుతూ రాయల ఉత్సవాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించడం దారుణమని విచారం వ్యక్తం చేశారు. ప్రజలే ముందుకు వచ్చి ఉత్సవాలు జరపడం ఆనందదాయకమన్నారు.
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి రాయల స్ఫూర్తితో కాంగ్రెస్ హయాంలో హంద్రీనీవా ప్రాజెక్టు పనులు ప్రారంభించారన్నారు. ఈ ప్రాజెక్టుకు మాజీ ఎంపీ అనంత వెంకటరెడ్డి పేరు పెడితే మార్చడం ఏ మేరకు సమంజసమో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సుధాకర్, నాగరాజరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోటా సత్యం, కార్యదర్శి కేటీ.శ్రీధర్, కవి, కళాకారుడు కోనాపురం ఈశ్వరయ్య, సీపీఐ శ్రీరాములు, శాంతినికేతన్ రమణారెడ్డి, సీపీఎం హరి తదితరులు ప్రసంగించారు. రాయల ఉత్సవాలపై ప్రభుత్వం వహిస్తున్న నిర్లక్ష్యాన్ని, ఎమ్మెల్యే బీకే.పార్థసారథి వైఖరిని తూర్పారబట్టారు. కొడిగెనహళ్లికి చెందిన రిటైర్డ్ ప్రిన్సిపల్ సత్యనారాయణరావు రాసిన ‘పెనుకొండ ప్రాచీన చరిత్ర’ పుస్తకాన్ని ఈ సందర్భంగా ఆవిష్కరించారు.