srinivasa nagar
-
ఇలాంటి కొడుకు మరెవరికీ వద్దు!
అన్న తీరుపై చెల్లెళ్ల ఫిర్యాదు మల్కాపురం: కంటే కూతురునే కనాలి అన్న ఓ సినీ కవి భావం అక్షరాలా నిజమైంది. కష్టాల్లో ఉన్న తల్లిని కడచూపు చూసేందుకు మలేసియా నుంచి కూతుళ్లు కదిలారు గానీ, పక్కనే ఉన్న కొడుకు మనసు మాత్రం చలించలేదు. పైగా తల్లి, చెల్లెళ్ల ఆస్తి కాజేసేందుకు కూడా వెనకాడలేదు. వివరాల్లోకి వెళితే.. 46వ వార్డు శ్రీహరిపురం-శ్రీనివాస్‌నగర్‌లో సత్యవతి అనే వృద్థురాలు తన సొంతింట్లో నివసిస్తోంది. ఆమెకు శ్రీదేవి, కనకమహాలక్ష్మి అనే కుమార్తెలతో పాటు శ్రీనివాసరావు అనే కుమారుడున్నాడు. కుమార్తెలిద్దరూ మలేసియాలో ఉంటున్నారు. శ్రీనివాసరావు స్థానికంగా తన భార్య, పిల్లలతో ఉంటున్నాడు. సత్యవతి నుంచి కొడుకు మొదటి నుంచి దూరంగానే ఉంటున్నాడని స్థానికులు చెబుతున్నారు. కుమార్తెలే ఆమెకు నెల నెలా డబ్బు పంపించేవాళ్లు. ఆమె బాగోగులన్నీ ఇరుగుపొరుగు వాళ్లే చూసేవాళ్లు. సత్యవతి ఇంటిని ఇటీవల తన పెద్ద కుమార్తె శ్రీదేవికి రాసిచ్చేసింది. ఇదిలా ఉంటే యథావిధిగానే గత శనివారం సత్యవతికి పొరుగింటివాళ్లు టీ తెచ్చారు. ఆ సమయంలో ఆమె కింద పడిపోయి ఉన్నట్టు గుర్తించడంతో కలవరం చెంది స్థానిక ఓ ప్రైవేట్ అస్పత్రికి తీసుకువెళ్లారు. ఇదే విషయాన్ని మలేసియాలో ఉంటున్న ఆమె పిల్లలకు సమాచారం అందించారు. శ్రీనివాస్‌కు విషయం చెప్పారు. కూతుళ్లు పట్టించుకున్నా కొడుకు పట్టించుకోలేదు. తల్లిని ఆస్పత్రికి తరలించిన సమయంలో ఆమె ఇంటిని కూడా శ్రీనివాస్ ఆక్రమించాడని ఆమె పెద్దకుమార్తె శ్రీదేవి ఆరోపించింది. తల్లికి ఆరోగ్యం బాగోలేదని తెలిసి ఈనెల 26న కుమార్తెలిద్దరూ నగరానికి చేరుకుని ఆస్పత్రిలో ఉన్నా ఆమెను పరామ ర్శించారు. కాగా ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడం తో ఈ నెల 26న రాత్రి మృతిచెందింది. ఆస్పత్రి ఖర్చు లు కూడా భరించనంటూ శ్రీనివాస్ మొండికేశాడు. ఆమె అంత్యక్రియలకు కూడా ముందుకు రాలేదు. దీంతో సత్యవతి మృతదేహం రెండు రోజులపాటు ఆస్పత్రిలోనే ఉంచాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో సోదరుడి తీరుపై శ్రీదేవి, కనకమహాలక్ష్మిలు పోలీసులకు ఫిర్యాదిచ్చారు. బుధవారం సత్యవతి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. కాగా.. ఈ ఘటన సత్యవతి ఆస్తిపై వివాదం వల్లేనని పోలీసులు గుర్తించారు. పోలీసులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా.. ఆస్తిని తనకిప్పిస్తే తక్షణం ఇల్లు ఖాళీ చేస్తానని శ్రీనివాస్ చెప్పడంపై పోలీసులూ ఆశ్చర్య పోయారు. తల్లిని సైతం కాదని ఆస్తిపైనే దృష్టి సారించడంపై స్థానికులు మండిపడుతున్నారు. -
విద్యుదాఘాతంతో వ్యవసాయ కూలీ మృతి
శ్రీనివాస్‌నగర్(మిర్యాలగూడ రూరల్) : విద్యుదాఘాతంతో వ్యవసాయ కూలీ మృతి చెందింది. ఈ సంఘటన మండల పరిధిలోని తుంగపహాడ్ గ్రామ పంచాయతీ శివారు శ్రీనివాస్‌నగర్‌లో సోమవారం చోటుచేసుకుంది. మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ వి. సర్దార్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. వేములపల్లి మండలం తోపుచర్ల పంచాయతీ శివారు సీత్యాతండాకు చెందిన ధనావత్ శంకర్ నాయక్(40) కొంతకాలంగా కుటుంబంతో కలిసి శ్రీనివాసనగర్‌లో నివాసముంటున్నాడు. తుంగపహాడ్ గ్రామానికి చెందిన రైతులు గుబ్బల శ్రీనివాస్, మిర్యాలగూడ పట్టణానికి చెందిన చిరుమామిళ్ల కోటేశ్వర్రావు వద్ద ఐదు ఎకరాలు భూమి కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే గుబ్బల శ్రీనివాస్, ధనావత్ శంకర్ నాయక్‌ను పొలం పని కోసం కూలీకి పిలిచాడు. పొలంలో పని ముగించుకొని వెళ్తుండగా పొలం గట్టుపై ఉన్న విద్యుత్ సర్వీస్ వైర్లు ఉన్న టెలిఫోన్ స్తంభం ఉంది. ఆసరా కోసం పొలం నుంచి బయటకు వస్తుండగా శంకర్ స్తంభాన్ని పట్టుకున్నాడు. స్థంభానికి విద్యుత్ సరఫరా కావడంతో విద్యుదాఘాతానికి గురై తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. మృతి చెందిన శంకర్ నాయక్‌ను కౌలు రైతు గమనించాడు . అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించామని, మృతుని భార్య చున్ని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
హత్యా.. ఆత్మహత్యా?
నంద్యాల టౌన్, న్యూస్‌లైన్: స్థానిక శ్రీనివాసనగర్‌లోని శిల్పా హైట్స్ అపార్ట్‌మెంట్స్‌లో గురువారం చోటు చేసుకున్న వంట మాస్టర్ బెల్లం కృష్ణ మృతి అనుమానాలకు తావిస్తోంది. అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న టీడీపీ శ్రీశైలం నియోజకవర్గ ఇన్చార్జి శిల్పా చక్రపాణిరెడ్డి వద్ద బేతంచెర్లకు చెందిన వంట మనిషిగా పనిచేస్తున్నాడు. శిల్పా స్థానికంగా లేకపోయినా ఇతను ఒక్కడే ఫ్లాట్‌లో ఉండేవాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బుధవారం రాత్రి అతను ఉరేసుకుని మృతి చెందడం వెనుక కారణాలు అంతుచిక్కడం లేదు. అయితే మృతదేహాన్ని పోలీసులు రాకమునుపే కిందకు దించడం అనుమానాలకు తావిస్తోంది. ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారా అన్న సందేహాలున్నాయి. సాధారణంగా ఉరేసుకున్న వ్యక్తి మెడ నరాలు బిగుసుకుపోవడంతో పాటు నాలుక బయటకు రావడం సహజం. అలాంటిది కృష్ణ గొంతుపై ఉరి వేసుకున్న గుర్తులు సరిగా లేకపోవడం కూడా హత్య జరిగి ఉండొచ్చనే అనుమానాలకు బలం చేకూరుస్తోంది. అదేవిధంగా బేతంచెర్లలో ఉన్న మృతుని కుటుంబ సభ్యులను వెంటనే నంద్యాలకు రప్పించి హడావుడిగా పోస్టుమార్టం కూడా పూర్తి చేయించడంలోని ఆంతర్యమేమిటో స్థానికులకు అంతుచిక్కడం లేదు. ఈ నేపథ్యంలోనే పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఏదేమైనా మృతిపై పలు అనుమానాల నేపథ్యంలో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తే నిజానిజాలు వెలుగు చూసే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.