టీడీపీ సూపర్ జంబో రాష్ట్ర కమిటీ
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీని 219 మందితో చంద్రబాబు ఏర్పాటు చేశారు. పొలిట్‌బ్యూరో, కేంద్ర కమిటీల నియామకాలపై అసంతృప్తి, ఆగ్రహాలు వ్యక్తమైన నేపథ్యంలో సూపర్ జంబో కమిటీని నియమించారు. ఒకే కమిటీలో ఇంత మందిని నియమించడంపై రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్ర కమిటీలో 18 మంది ఉపాధ్యక్షులు, 16 మంది ప్రధాన కార్యదర్శులు, 18 మంది అధికార ప్రతినిధులు, 58 మంది కార్యనిర్వాహక కార్యదర్శులు, 108 మంది రాష్ట్ర కార్యదర్శులు, ఒక కోశాధికారిని నియమించారు. కమిటీలో బడుగు, బలహీన, ఎస్సీ వర్గాలకు 61 శాతం పదవులు ఇచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థుల నుంచి నియోజకవర్గ, మండల స్థాయి నాయకులను సైతం ఈ కమిటీలో చేర్చడం గమనార్హం.
ఉపాధ్యక్షులుగా..
పత్తిపాటి పుల్లారావు, సుజయకృష్ణ రంగారావు, నిమ్మల కిష్టప్ప, జ్యోతుల నెహ్రూ, గొల్లపల్లి సూర్యారావు, బండారు సత్యానందరావు, పరసా రత్నం, దాట్ల సుబ్బరాజు, సాయి కల్పనారెడ్డి, బూరగడ్డ వేదవ్యాస్, జయనాగేశ్వర్‌రెడ్డి, వైవీబీ రాజేంద్రప్రసాద్, తిప్పేస్వామి, హనుమంతరాయచౌదరి, పుత్తా నరసింహారెడ్డి, దామచర్ల జనార్దనరావు, శ్రీధర కృష్ణారెడ్డి, వేమూరి ఆనంద్సూర్యలను నియమించారు.
ప్రధాన కార్యదర్శులుగా..
ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, మాజీ మంత్రులు దేవినేని ఉమా, అమర్నాథ్రెడ్డి, అఖిలప్రియలతో పాటు మరో 11 మందిని నియమించారు.
అధికార ప్రతినిధులుగా..
గౌరువాని శ్రీనివాసులు, ద్వారపురెడ్డి జగదీష్, మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి, గూడూరి కృష్ణారావు, పరిటాల శ్రీరాం, కాకి గోవర్ధన్‌రెడ్డి, నాగుల్ మీరా, గొట్టిపాటి రామకృష్ణప్రసాద్, ఆనం వెంకట రమణారెడ్డి, గంజి చిరంజీవులు, రుద్రరాజు పద్మరాజు, పిల్లి మాణిక్యాలరావు, మద్దిపట్ల సూర్యప్రకాష్, సప్తగిరి ప్రకాష్, మోకా ఆనంద్‌సాగర్, దివ్యవాణి, ఎన్బీ సుధాకర్‌రెడ్డి, సయ్యద్ రఫీలను నియమించారు. నాలెడ్జ్ కమిటీ చైర్మన్‌గా గురజాల మాల్యాద్రిని నియమించారు.
అసంతృప్తిలో ఉన్న మహిళా నేతలకు చోటు
పొలిట్‌బ్యూరో, కేంద్ర కమిటీలో స్థానం ఇవ్వకుండా తమను అవమానించారని అసంతృప్తిలో ఉన్న మహిళా నేతలు పంచుమర్తి అనూరాధ, గౌతు శిరీష, పీతల సుజాత తదితరులకు ఈ కమిటీలో చోటు కల్పించారు. కాగా, కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా మాజీ సీఎం కిరణ్ సోదరుడు నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డిని నియమించారు.