ఆ అధికారం ఈఆర్సీకి లేదు
⇒ సుమోటోగా టారిఫ్
⇒ జారీ చేయడంపై ట్రాన్స్‌కో సీఎండీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు విద్యుత్ టారిఫ్ పెంపు ప్రతిపాదనలు సమర్పించని పక్షంలో సుమోటో (తమంతట తాము)గా నిర్ణయం తీసుకుంటామని హెచ్చరిస్తూ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ) లేఖ రాయడాన్ని తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో), విద్యుత్ సరఫరా సంస్థ(ట్రాన్స్‌కో)ల సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు తీవ్రంగా తప్పుపట్టారు. గత నెల 11న ఈఆర్సీ డిస్కంలకు రాసిన లేఖపై ఆయన స్పందిస్తూ ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. సుమోటోగా విద్యుత్ టారిఫ్‌పై నిర్ణయం తీసుకోవడానికి ఈఆర్సీ ఏమీ ప్రభుత్వం కానీ, కోర్టు కానీ కాదని స్పష్టం చేశారు.
ఈఆర్సీకి అలాంటి అధికారాలు లేవన్నారు. వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్ఆర్), టారిఫ్ ప్రతిపాదనలను డిస్కంలు సమర్పించిన తర్వాతే విద్యుత్ టారిఫ్‌పై నిర్ణయం తీసుకునే అధికారం ఈఆర్సీకి ఉందని స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఏఆర్‌ఆర్‌లు, టారిఫ్ ప్రతిపాదనలు సమర్పించడంలో జాప్యం జరిగిందని, ఏ ఈఆర్సీ ఇలాంటి నోటీసులు జారీ చేయలేదన్నారు. ఉజ్వల్ డిస్కం యోజన (ఉదయ్) పథకంలో డిస్కంల చేరికతో పాటు పెద్ద నోట్ల రద్ద కారణాలతో టారిఫ్ ప్రతిపాదనల సమర్పణలో జాప్యం జరిగిందన్నారు. విద్యుత్ టారిఫ్ పెంపు ప్రతిపాదనలను ఇప్పటికే డిస్కంలు సీఎం కేసీఆర్‌కు సమర్పించాయని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఆయన స్పష్టంచేశారు.
ఛత్తీస్‌గఢ్ పీపీఏకూ అనుమతి అక్కర్లేదు
ఛత్తీస్‌గఢ్ నుంచి 1,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేసేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందానికి (పీపీఏకు) తెలంగాణ రాష్ట్ర ఈఆర్సీ ఆమోదించాల్సిన అవసరం లేదని ప్రభాకర్ రావు తేల్చి చెప్పారు. నిబంధనల మేరకు ఛత్తీస్‌గఢ్ ఈఆర్సీ ఆమోదిస్తే సరిపోతుందన్నారు. ఉత్తర, తూర్పు, పశ్చిమ విద్యుత్ గ్రిడ్ల (న్యూ గ్రిడ్)తో దక్షిణ గ్రిడ్ అనుసంధానం కోసం పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నిర్మిస్తున్న వార్ధా (మహారాష్ట్ర)– డిచ్ పల్లి– మహేశ్వరం 765 కేవీ డబుల్ సర్క్యూ ట్ కారిడార్ నిర్మాణం పూరై్తన వెంటనే ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లు ప్రారం భిస్తామన్నారు.