రాహుల్ ఇంకా బచ్చా: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీలోని షాకూర్ బస్తీలో మురికివాడల్లోని అక్రమ గుడిసెల తొలగింపు వ్యవహారం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఇరకాటంలో పెట్టింది. సోమవారం బస్తీ వాసుల పరామర్శ సందర్భంగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఖండించారు. రాహుల్ ఇంకా 'బచ్చా' అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రాహుల్ చిన్నపిల్లాడిలా మాట్లాడుతున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. రైల్వేశాఖ తమ పరిధిలోకి రాదనే చిన్న విషయం కూడా తెలికయపోవడాన్ని తప్పుబట్టారు. రైల్వే శాఖ కేంద్రం ఆధీనంలో ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉండదనే విషయాన్ని పాపం కాంగ్రెస్ పార్టీ అతనికి చెప్పినట్టు లేదంటూ ట్విట్టర్లో వ్యాఖ్యానించారు.
బాధితులను పరామర్శించేందుకు సోమవారం రాహుల్ గాంధీ షాకూర్ బస్తీలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జరిగిన నష్టానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ బాధ్యత వహించాలంటూ ఆప్, ఎన్డీయే ప్రభుత్వాలను విమర్శించారు. మరోవైపు షాకూర్ బస్తీ ఘటనపై మెజిస్టీరియల్ దర్యాప్తునకు ఆదేశించాలంటూ ఆప్ ఆందోళన చేయడాన్ని రాహుల్ గాంధీ తప్పుబట్టారు. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్.. ధర్నాచేయడం, ఆందోళన చేయడం విడ్డూరంగా ఉందంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై మండిపడిన ఢిల్లీ సీఎం.. తన ట్విట్టర్ వేదికగా రాహుల్ గాంధీపై వ్యంగ్య బాణాలు సంధించారు.
राहुल गांधी जी अभी बच्चे हैं। उनकी पार्टी ने शायद उन्हें बताया नहीं की रेल्वे केंद्र सरकार के अंडर आती है, दिल्ली सरकार के नहीं।
— Arvind Kejriwal (@ArvindKejriwal) December 14, 2015