కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టాం
‘‘ఇండస్ట్రీలో రెండు దశాబ్దాల పాటు మాకు అద్భుతమైన ప్రయాణం దొరికినందుకు ఆనందంగా ఉంది. ఇండస్ట్రీ నుంచి మేము తీసుకున్న దానికి, మాకు లభించిన అనుభవాన్ని పంచాలనుకుంటున్నాం. ఇందుకోసం కొంతమంది నిర్మాతలతో మా వెంకటేశ్వర క్రియేషన్స్ (ఎస్వీసీ) అసోసియేట్ అవుతోంది. స్క్రిప్ట్ నుంచి రిలీజ్ డేట్ వరకు ఆయా చిత్రనిర్మాతలకు మా సంస్థ నుంచి మద్దతు ఇస్తాం. మా సంస్థ ద్వారా ఎంతోమంది నిర్మాతలకు, రాబోయే నిర్మాతలకు ఉపయోగపడాలనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం.
ఇందుకోసం కొత్త ప్రయాణాన్ని మొదలుపెడుతున్నాం’’ అన్నారు నిర్మాత ‘దిల్’ రాజు. పంపిణీరంగం నుంచి నిర్మాతగా మారి, ఎన్నో విజయాలు చూస్తున్నారు ‘దిల్’ రాజు. ఎస్వీసీ సంస్థ 20ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘1999లో ‘ఒకే ఒక్కడు’ సినిమాతో మా వెంకటేశ్వర ఫిల్మ్స్ మొదలైంది. ఈ సినిమాకు ముందు (1998 జూలై 24) ఇదే జూలై 24న ‘తొలిప్రేమ’ చిత్రం నైజాం డిస్ట్రిబ్యూషన్లో భాగస్వామ్యులుగా ఉన్నాం.
పవన్‌కల్యాణ్‌గారిని స్టార్‌ని చేసిన సినిమా అది. ‘పెళ్లి పందిరి’ సినిమా సక్సెస్ మమ్మల్ని ఇక్కడివరకూ తీసుకువచ్చింది. ఈ రెండు సినిమాల నిర్మాతలకు థ్యాంక్స్. అలాగే మా డిస్ట్రిబ్యూషన్లో ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలను అందించిన నిర్మాతలందరికీ ఈ రోజు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆ తర్వాత ప్రొడక్షన్ స్టార్ట్ చేసి ఈ పదహారేళ్లలో 32 సినిమాలు తీశాం. 2017లో ఆరు, గత ఏడాది మూడు సినిమాలు మా సంస్థ నుంచి వచ్చాయి. ఈ ఏడాది నాలుగు సినిమాల రిలీజ్లు ప్లాన్ చేస్తున్నాం.
ఒక సినిమా సక్సెస్ కావాలంటే స్క్రిప్ట్ దగ్గర నుంచి రిలీజ్ వరకు కావాల్సినవి ఎన్నో ఉంటాయి. శివలెంక కృష్ణప్రసాద్‌గారు, విజయ్, సత్యనారాయణరెడ్డి, కృష్ణ, గోపీ, రాహుల్, హరి, సాగర్, రాహుల్ యాదవ్ నక్కా, విజయ్ చిల్లా, మహేశ్ కోనేరు, రాజీవ్.. ఇలా ఈ నిర్మాతలందరితో మాకు ఒక మంచి అనుబంధం ఉంది. ఈ అనుబంధాన్ని తర్వాత స్థాయికి తీసుకువెళ్లాలనే ఆలోచనతో మా సంస్థతో అసోసియేషన్ గురించి ఆలోచించాం.
వారితో ట్రావెల్ అవుతూ మా సంస్థ నుంచి వస్తున్న మంచి సినిమాల మాదిరిగానే వారు కూడా మంచి సినిమాలు తీయడానికి మా వంతు కృషి చేస్తాం. వీరేకాదు, మంచి సినిమాలు చేయాలని మంచి స్క్రిప్ట్‌ను తీసుకువస్తే మా ఎస్వీసీని వాడుకుని తెలుగు ఇండస్ట్రీకి మంచి సినిమాలు ఇవ్వాలనే ఆలోచనతో ఈ కొత్త ప్రయాణం మొదలు పెడుతున్నాం.అలాగే డబ్బు సంపాదిస్తూ ప్రేక్షకులకు మంచి సినిమాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. హారిక హాసిని, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలకు కూడా ఈ సందర్భంగా «థ్యాంక్స్’’ అని అన్నారు. ‘‘రాజుగారితో నాకు 18ఏళ్ల పరిచయం ఉంది.
సినిమాలపై పిచ్చితో ఇండస్ట్రీవైపు వచ్చారు రాజు, శిరీష్, లక్ష్మణ్. ‘ఎస్వీసీ’ సక్సెస్ఫుల్ జర్నీలో నా వంతుగా నాలుగు సినిమాలు ఉండటం హ్యాపీగా ఉంది. ఎస్వీసీని నా మాతృసంస్థగా భావిస్తాను. రైటర్‌గా నాకు జన్మనిచ్చారు. ఈ సంస్థ సపోర్ట్‌తో నాలాంటి దర్శకులు చాలామంది స్థిరపడే అవకాశం ఉంది’’ అన్నారు దర్శకుడు వంశీపైడిపల్లి. ‘‘ఎస్వీసీ’ జర్నీలో నాది 2015–2019 టైమ్. ‘దిల్’ రాజుగారి జడ్జిమెంట్, లక్ష్మణ్ ప్లానింగ్, శిరీష్ ఎగ్జిక్యూషనే ఈ సంస్థ సక్సెస్‌కు కారణమనిపిస్తోంది. ఎస్వీసీ అంటే సక్సెస్ వీళ్ల కేరాఫ్ అడ్రస్’’ అన్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. ‘‘ఇండస్ట్రీలో అన్నింటినీ అన్ని రకాలుగా చూసినవాడే నిర్మాత. ఈ ముగ్గురూ ఇంత దూరం వచ్చారు. వీరితో అసోసియేట్ అవ్వడం హ్యాపీ’’ అన్నారు నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్.
‘‘ఇలాంటి పెద్దబ్యానర్లో అసోసియేట్ అయితే చిన్న సినిమాలు మరింత ఎక్కువమంది ప్రేక్షకులకు రీచ్ అవుతాయి’’ అన్నారు నిర్మాత రాహుల్ యాదవ్. ‘‘నిర్మాత అంటే ప్రతిరోజూ యుద్ధమే. 20ఏళ్లలో దాదాపు 95 శాతం విజయాలతో ఈ సంస్థ టాప్ ప్రొడక్షన్ హౌస్‌గా నిలబడింది’’ అన్నారు నిర్మాత మహేశ్ కోనేరు. ‘‘ఆర్య’ సినిమా సమయంలో నేను, బన్నీవాసు, యూవీ క్రియేషన్స్ ఈ బ్యానర్‌తో అసోసియేట్ అయ్యాం. ఈ రోజు మేమంతా నిర్మాతలుగా మారాం’’ అన్నారు విజయ్ చిల్లా. ‘‘సినిమా చూపిస్తా మామా’ చిత్రం నుంచి ఈ సంస్థతో అసోసియేట్ అయ్యాను’’ అన్నారు బెక్కం వేణుగోపాల్. లక్ష్మణ్, శిరీష్, సాగర్, కృష్ణ, గోపీ తదితరులు పాల్గొన్నారు.