కొల్లాపూర్, న్యూస్‌లైన్: తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రజలందరూ సమష్టిగా భాగస్వాములు కావాలని టీజేఏసీ చైర్మన్ కోదండరాం పిలుపునిచ్చారు. కొల్లాపూర్ పట్టణంలో శుక్రవారం టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర విజయోత్సవ సభ నిర్వహించారు. ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు సారథ్యంలో జరిగిన సభకు ముఖ్యఅతిధిగా విచ్చేసిన కోదండరాం మాట్లాడుతూ నిద్రావస్థలో ఉన్న తెలంగాణ ఉద్యమాన్ని 2009లో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ద్వారా తట్టి లేపారన్నారు.అన్ని వర్గాల సంఘటిత పోరాటాల కారణంగా తెలంగాణ ఏర్పాటు సాధ్యమైందన్నారు.
ఇక్కడి ప్రజల ఐక్యతను దెబ్బతీసేందుకు సీమాంధ్రకు చెందిన కొందరు నేతలు యత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. అభివృద్ధిపై గ్రామ స్థాయి నుంచి ప్రణాళికలు రూపొందించాలని, వాటి అమలు కోసం సమిష్టిగా కృషిచేద్దామన్నారు. కృష్ణా జలాలను సద్వినియోగం చేసుకుని వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసుకుందామన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలు తెలివైన వారని, జిల్లా అభివృద్ధికి వారు కష్టపడతారని కొనియాడారు. ప్రజాకవి దేశపతి శ్రీనివాస్ ప్రసంగిస్తూ తెలంగాణ ఏర్పాటు ఉద్యమంలో కేసీఆర్ పాత్ర విశిష్టమైందన్నారు. అమరుల త్యాగఫలాలను స్మరించుకుందామన్నారు. తెలంగాణ పాటలతో ఆయన సభకు విచ్చేసిన వారిని ఉత్సాహపరిచారు.
కేసీఆర్ ద్వారానే అభివృద్ధి :స్వామిగౌడ్
తెలంగాణ రాష్ట్రాభివృద్ధి కేసీఆర్ ద్వారానే సాధ్యమని ఎమ్మెల్సీ స్వామిగౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పార్టీనే గెలిపించాలని, మిగతా పార్టీలకు డిపాజిట్లు కూడా రాకూడదని ఆయన కోరారు. తెలంగాణ కోసం పదవులను, పార్టీలను వదులుకున్న జూపల్లి కృష్ణారావు, మందాజగన్నాథంలను మరోమారు ఎమ్మెల్యే, ఎంపీలుగా గెలిపించాలని కోరారు. శ్రీకాంతాచారి వంటి అమరుల త్యాగఫలమే రాష్ట్ర ఏర్పాటన్నారు. ఈ ప్రాంత టీడీపీ నాయకులు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన చంద్రబాబు నాయకత్వాన్ని వ్యతిరేకించాలన్నారు.
టీఆర్‌ఎస్‌దే అధికారం : మందా
వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు అధిక సంఖ్యలో గెలుపొందుతారని, టీఆర్‌ఎస్ ప్రభుత్వ ఏర్పా టు ఖాయమని ఎంపీ మందాజగన్నాథం అన్నారు. 1969 నుంచి తా ను తెలంగాణ ఉద్యమంలో భాగస్వామిగా ఉన్నానన్నారు. ఏపార్టీలో ఉన్నా వాదాన్ని వి నిపించానని చెప్పారు. హైద్రాబాద్‌ను అభివృద్ధి చేసింది తానేనని చెప్పుకుంటున్న చంద్రబాబు చార్మినార్, ఉస్మాని యా క్యాంపస్, ఆస్పత్రి కట్టినప్పుడు కూడా ఉన్నారా అని ప్రశ్నించారు. తెలంగాణ జోలికి రావద్దని హితవు పలికారు.
పీడ విరగడైంది: జూపల్లి
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం ద్వారా జిల్లాకు పట్టిన పీడ విరగడైందని పరోక్షంగా మాజీ మంత్రి డీకే అరుణపై ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు ఆరోపణలు చేశారు. తెలంగాణ ఏర్పాటుకు మాట ఇచ్చి నిలబెట్టుకున్న సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. సభలో పలువురు జిల్లా, నియోజకవర్గ టీఆర్‌ఎస్ నాయకులు ఉన్నారు.
ఐక్యతతో పునర్నిర్మాణం
Published Sat, Mar 1 2014 4:02 AM | Last Updated on Sat, Sep 2 2017 4:12 AM
Advertisement
Advertisement