sucked into engine
-
విమానం ఇంజిన్ లోపలికి లాగేసింది!
హూస్టన్: ఊహించని ఘటన ఇది. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. డెల్టా ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానం 23న రాత్రి 10.25 గంటల సమయంలో లాస్ ఏంజెలెస్ నుంచి టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. ఎరైవల్ గేట్ వద్దకు చేరిన ఆ విమానంలోని ఒక ఇంజిన్ పనిచేస్తోంది. ఇంజిన్ వేగం ప్రభావానికి అదే సమయంలో అటుగా వెళ్లిన ఉద్యోగి ఒకరిని లోపలికి లాగేసింది. అతడు చనిపోయినట్లు నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ ఏజెన్సీ(ఎన్టీఎస్బీ)తెలిపింది. ఈ ఘటనకు దారి తీసిన పరిస్థితులపై డెల్టా ఎయిర్ లైన్స్ అధికారులను విచారిస్తున్నట్లు పేర్కొంది. మృత్యువాత పడిన ఉద్యోగి వివరాలను వెల్లడించలేదు. విమానాశ్రయాల్లో హ్యాండ్లింగ్ కార్యకలాపాలకు కాంట్రాక్టు సేవలందించే యునిఫి ఏవియేషన్ సంస్థ అతడిని నియమించుకున్నట్లు సమాచారం. కాగా, గత ఏడాది అలబామా ఎయిర్‌పోర్టులోనూ ఇలాంటి ఘటనే జరిగింది. విమానం ఇంజిన్ ఒక ఉద్యోగిని లోపలికి గుంజుకోవడంతో అతడు చనిపోయాడు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపిన అధికారులు ఇటీవలే సదరు విమాన సంస్థకు రూ.12.80 లక్షల జరిమానా విధించారు. -
విమానం ఇంజన్లో ఇరుక్కుని ఉద్యోగి మృతి
పార్కింగ్ చేసి ఉన్న విమానం ఇంజన్లో ఇరుక్కుని ఎయిరిండియా గ్రౌండ్ క్రూ సభ్యుడు ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన ముంబై విమానాశ్రయంలో జరిగింది. ముంబై నుంచి విమానం హైదరాబాద్‌కు వెళ్లాల్సి ఉంది. విమానం కో-పైలట్ ఒక సిగ్నల్‌ను తప్పుగా అర్థం చేసుకుని ఇంజన్ స్టార్ట్ చేయడంతో అప్పటికి దాని వద్ద ఉన్న రవి సుబ్రమణియన్ అనే ఉద్యోగిని ఇంజన్ ఫ్యాన్లు లోపలకు లాగేశాయి. లోపల ఇరుక్కుపోయిన రవి.. అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటన ఛత్రపతి శివాజీ డొమెస్టిక్ ఎయిర్‌పోర్టులోని 28వ బే వద్ద జరిగింది. విమాన సిబ్బంది సాధారణంగా విమానం ఇంజన్లు ఆఫ్ చేసి ఉన్నప్పుడే వాటి నిర్వహణ పనులు చూస్తుంటారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు ఎయిరిండియా సీఎండీ అశ్వనీ లోహానీ ఓ ప్రకటనలో తెలిపారు. ముంబై విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటన పట్ల తాము తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యామని, మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియస్తున్నామని అన్నారు.