suddala ashokteja
-
ఆవేశం.. ఆర్ధ్రత.. చైతన్యమే అతని గానం
ఉద్యమాల పురిటి గడ్డ నల్గొండలో పుట్టిన అతని నెత్తుటిలో ఓ ఆవేశం ఉంది. పాశ్చాత్య ధోరణిలో నిర్వీర్యమైపోతున్న యువతను మేల్కోల్పాలనే ఆర్ధ్రత ఉంది.. అదే అతని ఊపరైంది... అక్షరమై ఎగిసిపడింది. ‘ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం..’ అంటూ యువతకు దిశానిర్దేశం చేసినా.. ‘నేలమ్మ నేలమ్మ నేలమ్మా.. నీకు వేల వేల వందనాలమ్మ’ అంటూ పుడమితల్లి రుణం తీర్చుకోనిది అంటూ హితోక్తి పల్కినా.. ‘నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి «ఆహుతిచ్చాను’ అన్న శ్రీశ్రీ గీతానికి మరింత అద్భుతమైన పొడిగింపునిచ్చి జాతీయ పురస్కారంతో తెలుగువారి సాహితీ పతకాన్ని హస్తినలో రెపరెపలాడించినా.. అదంతా సుప్రసిద్ద రచయిత, కవి సుద్దాల అశోక్ తేజ కలానికే సొంతం. జిల్లా కేంద్రం అనంతపురంతో పాటు, రాయదుర్గంలో జరుతున్న సాహితీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన గురువారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. - అనంతపురం కల్చరల్ సాక్షి : బాల్యం నుంచే మీరు కవిత్వం రాశారంటారు.. ఏ వయసు నుంచి కలం పట్టారో చెప్పగలరా? అశోక్ తేజ : నేను నాల్గో తరగతి చదువుతున్నప్పుడే ‘జెండా’పై కవిత రాశాను. ఉపాధ్యాయులకు నచ్చి చాలా మెచ్చుకున్నారు. అదే నేను అందుకున్న తొలి బహుమతి. సాక్షి : మీపై ఎవరి ప్రభావం ఎక్కువగా ఉందంటారు? అశోక్‌తేజ :నిస్సందేహంగా మా నాన్నగారైన సుద్దాల హనుమంతు గారిదే. నాలోని శిలను శిల్పంగా మార్చడంలో ఆయన శ్రమే ఉంది. నాలోని సాహితీ పిసాసను వేలు పట్టి నడిపించిన తొలి గురువు ఆయనే. అలాగే శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి, వేటూరి, సి.నారాయణరెడ్డి, గజ్జెల మల్లారెడ్డి.... ఒకరేమిటి ప్రతి ఒక్కరూ నన్ను తీర్చిదిద్దారు. సాక్షి : దాసరి నారాయణరావుతో మీది ప్రత్యేక బంధమంటారు. వారిని ఎలా కలిశారు ? అశోక్‌తేజ : ఆయన లేకపోతే సుద్దాల అశోక్‌తేజ కవిగా ఉండేవాడు కాదంటే అతిశయోక్తి కాదు. నాలోని కవితా శక్తిని గుర్తించిన తొలి దర్శకుడు ఆయనే. ‘రాయుడుగారు.. నాయుడు గారు’ సినిమాతో ప్రారంభమైన మా బంధం ‘ఒసేయ్ రాములమ్మ’ సినిమాతో తారాస్థాయికి వెళ్లింది. అలానే ‘కంటే కూతుర్నే కను’ సినిమా నాకు నంది అవార్డు నడినొచ్చేలా చేసింది. ఈ నాటికి ఆయనే నా గాడ్‌ఫాదర్ అని నమ్ముతాను. సాక్షి : తల్లి గొప్పతనం గురించి అశోక్‌తేజ చెబితే మరింత కమ్మదనం ఉంటుందంటారు. ఏమా ప్రత్యేకత ? అశోక్‌తేజ :అమ్మ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మా అమ్మ జానకమ్మ ఆర్ధ్రత నిండిన దొడ్డ ఇల్లాలు. ఆమెది ఎంత గొప్ప మానవత్వమంటే.. మా ఊళ్లో ఎవరైనా చనిపోతే ఆ రోజంతా ఏమి తినేది కాదు. ఎందుకు తినవని మేమడిగితే వాళ్ళు ఏడుస్తుంటే మనకెలా సహిస్తుంది బిడ్డా అనేది. బహుశా ఆ ప్రభావపు ఝరిలో నేను ఇప్పటికీ మునిగి తేలుతుంటాను. కాబట్టే ‘నేలమ్మ.. నేలమ్మ’ పాట గానీ, పాండురంగడులోని ‘మాతృదేవోభవా’ పాట గాని ఆ భావుకత నుంచే పుట్టుకొచ్చాయి. కేవలం అమ్మ పైనే నేను వందల సంఖ్యలో పాటలు రాసుంటాను. సాక్షి : మీపై ఉద్యమాల ప్రభావం ఎక్కువగా ఉంది కదా! అదే సమయంలో అందమైన డ్యూయెట్లను ఎలా రాయగల్గుతున్నారు ? అశోక్‌తేజ : ప్రేమనైనా.. పోరాటమైనా సమానంగానే ప్రతిస్పందిస్తుంది నా కలం. సాక్షి : సినీ ప్రస్థానంలో మిమ్మల్ని బాధపెట్టిన సంఘటనలేమైనా ఉన్నాయా ? అశోక్‌తేజ : ఇంత వరకు చాలా మందికి తెలియని విషాదకర విషయమొకటుంది. నేను అత్యంత ప్రేమించే మా అమ్మ చనిపోయి పార్థివశరీరం ఇంకా నా ఒళ్లోనే ఉండగానే.. ఓ సినిమాకు రాసిన శృంగార గీతం మార్చమని నిర్మాత అదే సమయంలో అడిగారు. ఇక ఎలా ఉంటుందో చెప్పండి. గుండె చప్పుడు కూడా వినలేని నిస్సహాయస్థితిలో కూడా కర్తవ్యమంటే అదేనని అమ్మ చెప్పినట్టనిపించి పాట మార్చి రాసిచ్చాను. అప్పుడు పొందిన ఆవేదన మరెవరికీ రాకూడదనుకుంటాను. సాక్షి : ‘అనంత’ సాహిత్యంతో మీ పరిచయం... అశోక్‌తేజ : రాయలసీమ కవులు విద్వాన్ విశ్వం (అనంతపురం), మధురాంతకం రాజారామ్(చిత్తూరు), పుట్టపర్తి నారాయణాచార్యుల సాహిత్యం నాకు బాగా నచ్చుతుంది. వారి శైలి నాకు మార్గదర్శకమైంది. సాక్షి : సమాజంలో వస్తున్న మార్పులు గురించి.. అశోక్‌తేజ : నూరు శాతం ఇబ్బందికరంగా ఉన్నాయి. అనవసరమైన అభిజాత్యాల(ఈగో)తో మానవ సంబంధాలను చెడగొట్టుకుంటున్నాం. సెంటిమెంట్లు మిస్సవుతున్నాం. కేవలం మంచి మాటలతో ప్రపంచాన్ని సాధించవచ్చన్న చిన్న విషయం అవగతమైతే ఇక జీవితమంతా విజయాలే. ఇతరుల శ్రమను గుర్తించాలి. ఆ తాపత్రయంతోనే నేను రాసిన ‘శ్రమకావ్యం’ ప్రతి ప్రాంతంలో వినిపిస్తున్నాను. అలాగే ప్రకృతిని కాపాడుకోవడానికి యువ సమాజాన్ని జాగృతం చేస్తున్నా. సాక్షి : మెరుగైన సమాజం కోసం ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు ? అశోక్‌తేజ : యువతనే టార్గెట్‌గా చేసుకుని సాహిత్యాన్ని మలుచుకున్నాను. నేను ఇప్పటి దాకా 1,200 సినిమా పాటలు, మరో రెండు వేల దాకా ప్రైవేట్ పాటలు రాసుంటాను. అన్నీ సమాజ హితం కోరుకునేవే. కానీ యువతలోని శక్తిని వెలికి తీసినపుడే సుసమాజ నిర్మాణం సాధ్యమవుతుంది. ఈ విషయాన్ని యువత గుర్తించాలి. మనకంటూ ప్రత్యేక బ్రాండ్ ఉన్నప్పుడే సమాజం తలెత్తి చూస్తుంది. దానిని సాధించుకోవడానికి కష్టపడాల్సిన పని లేదు. ఆ జీవితాన్ని ఇష్టపడి పొందాలి. త్వరలో ఎస్కే యూనివర్శిటీలో రెండు రోజుల పాటు వ్యక్తిత్వ వికాసం, మానవ సంబంధాల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాలనుకుంటున్నాను. -
సుద్దాల కలం చెక్కిన ‘శ్రమ కావ్యం’
అనంతపురం సిటీ : మనిషి పరిణామ క్రమంలో శ్రమ పాత్రను గుర్తిస్తూ ప్రముఖ సినీకవి, జాతీయ పురస్కార గ్రహీత సుద్దాల అశోక్‌తేజ రచించిన ‘శ్రమ కావ్యం’ నేటి తరం యువతను ఆలోచింపజేస్తుందని వక్తలు పేర్కొన్నారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలోని సమావేశ భవనంలో ‘శ్రమ కావ్యం’ పుస్తకావిష్కరణ సభను చీఫ్ విప్ కాలువ శ్రీనివాసుల ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి కవి తూమచర్ల రాజారాం అధ్యక్షత వహించగా ముఖ్య అథితులుగా సినీకవి, జాతీయ పురస్కార గ్రహీత సుద్దాల ఆశోక్‌తేజ, జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం, జిల్లా పరిషత్ చైర్మఽన్ చమన్, సీఈఓ రామచంద్ర, ప్రముఖ కవులు అధికార భాషా సంఘం అధ్యక్షుడు హరికృష్ణ, ప్రజా గాయకులు లెనిన్‌బాబు, మల్లెల నరసింహులు హాజరయ్యారు. ప్రారంభోత్సవంలో లెనిన్‌బాబు అలరించిన ‘నేలమ్మ నేలమ్మ.. నేలమ్మా.. నీకు వేల వేల వందనాలమ్మా..’ పాట అందరినీ ఆకట్టుకుంది. అనంతరం వక్తలు మాట్లాడుతూ.. సమాజ హితాన్ని కోరుతూ పుస్తక రచన చేసే వారి సంఖ్య చాలా తక్కువన్నారు. ఈ నేపథ్యంలో సుద్దాల అశోక్‌తేజ ‘శ్రమ కావ్యం’ వంటి పుస్తకాలు రచించడం హర్షించదగ్గ విషయమన్నారు. అనంతరం సుద్దాల అశోక్‌తేజ మాట్లాడుతూ.. కరువు నేలపై మనిషి మనుగడ, కులవృత్తులు, మనిషి పుట్టుక నుంచి చావు వరకు ప్రతి కదలిక, కలయిక, కష్టంపై ఈ కావ్యాన్ని రాశానన్నారు. ఎక్కువగా నన్ను అభిమానించే వ్యక్తుల మధ్య ఈ పుస్తకావిష్కరణ జరుపుకోవాలని భావించానని చెప్పారు. చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు ఆహ్వానించడం గర్వంగా ఉందన్నారు. తనపై అనంత వాసులు చూపిన.. చూపుతున్న అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమానికి జిల్లా కవులు, రచయితల సంఘం నేతలు, నగర ప్రముఖులు, పలు పార్టీల నేతలు, న్యాయవాదులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు హాజరయ్యారు. -
నేడు నగరానికి సుద్దాల అశోక్‌తేజ
అనంతపురం కల్చరల్ : ప్రముఖ సినీ గీత రచయిత సుద్దాల అశోక్‌తేజ బుధవారం నగరానికి రానున్నారు. సాయంత్రం 5 గంటలకు జెడ్పీ సమావేశ మందిరంలో జరిగే ‘ శ్రమకావ్యం’ గేయ రూపకాన్ని స్వయంగా ఆలపిస్తారని నిర్వాహకులు చంద్రశేఖర్ తెలిపారు. అనంత కవులు, రచయితలు ముఖ్య అతిథులుగా విచ్చేసే కార్యక్రమానికి సాహితీ అభిమానులు విరివిగా విచ్చేయాలని కోరారు. -
కొత్తగా ఆలోచిస్తేనే ఆదరణ
అచ్యుతాపురం : సృజనాత్మకతతో కొత్తదనాన్ని ప్రదర్శిస్తే సినీ పరిశ్రమ ఎప్పటికీ ఆదరిస్తుందని ప్రముఖ సినీ గేయరచయిత సుద్దాల అశోక్ తేజ అన్నారు. శనివారం ఆయన ప్రశాంతి పాలిటెక్నిక్కళాశాల ఫ్రెషర్స్ డేకి వచ్చారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సినీపరిశ్రమలో 24రంగాలున్నాయన్నారు. సినీపరిశ్రమవైపు ఆసక్తి ఉన్నవారు ఏదో ఒక రంగాన్ని ఎంపిక చేసుకోవాలన్నారు. క్రియేటివ్‌గా ఆలోచించేవాడిదే పరిశ్రమ అన్నారు. కాలంతోపాటు రచనలు, దర్శకత్వం, నటన, ఎడిటింగ్‌ల్లో మార్పులు వచ్చాయన్నారు.తేలికైన పదాలతో నిగూఢమైన అర్థాన్ని చెప్పడం, తక్కువ సన్నివేషాలతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధులను చేయడం కొత్తదనాన్ని చూపడం ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ అన్నారు. తన 23 ఏళ్ల సినీ పస్థానంలో 2300 పాటలు రాశానని చెప్పారు. నమస్తే అన్నా సినిమాతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టానని, ఠాగూర్సినిమాలో ‘నేను సైతం’ జాతీయ ఉత్తమ పాటల రచయితగా పురస్కారం లభించిందన్నారు. త్వరలో రామ్‌చరణ్ ధ్రువ, శేఖరకమ్ముల దర్శకత్వంలో రానున్న సినిమాలకు పాటలు రాశానన్నారు. తెలుగుపై మక్కువ, పాటపై ఇష్టం ఉన్న ప్రతి వ్యక్తి రచయితగా రాణించవచ్చని తెలిపారు. పరిశ్రమలో అనేక కష్టాలు ఉన్నమాట వాస్తవమని, ఏ రంగంలోనైనా మన అవసరం ఉంటే అవకాశాలకు కొదవ ఉండదన్నారు. ఏదో రంగంలో టాలెంట్ ఉండాలన్నారు. సి.నారాయణరెడ్డి స్ఫూర్తితో గేయరచయితగా ఎదిగానని తెలిపారు. స్వచ్ఛభారత్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా.. రాష్ట్రంలో స్వచ్ఛభారత్‌కు బ్రాండ్ ఎంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నానని అశోక్‌తేజ చెప్పారు. స్వచ్ఛభారత్‌కు అవసరమైన గేయాలను రచించడం, అవగాహన సదస్సుల్లో గళం విప్పి స్ఫూర్తిని కలిగిస్తున్నామని చెప్పారు. తన అమ్మనాన్నల పేరుతో ఏర్పాటుచేసిన ట్రస్ట్ ద్వారా సేవాకార్యక్రమాలు చేస్తున్నట్టు చెప్పారు. -
బడికెళ్లని ఆచార్యుడు...
నివాళి: సుద్దాల అశోక్‌తేజ, ప్రముఖ సినీ గేయ రచయిత ఫైనల్‌గా ఓ విషయం చెప్పాలి. ఆయన యాక్ట్ చేసిన ఏదైనా సీన్‌ని మ్యూట్‌లో పెట్టి చూడండి. ఆ హావభావాలతోనే ఆ సీన్లో ఆయనేం చెప్పదలుచుకు న్నారో అర్థమైపోతుంది. అదే సీన్‌ని కళ్లు మూసుకుని కేవలం డైలాగ్స్ వినండి. ఆ డైలాగ్స్‌తోనే ఆయన ఎలా యాక్ట్ చేస్తారో మన మనసుకి తెలిసిపోతుంది. ఏయన్నార్ యాక్టింగ్లోని మెస్మరిజం అదే! ‘‘ఇల్లు కొనుక్కున్నారా?’’ ‘‘లేదు సార్...’’ ‘‘పోనీ... కారైనా ఉందా?’’ ‘‘అదీ లేదండీ...’’ ‘‘ఎప్పటికైనా సరే... ముందు ఇల్లు కొనుక్కోండి. మీ భార్య సంతోషిస్తుంది. ఆ తర్వాతే కారు’’ ‘‘అలాగే సార్’’. 2000 సంవత్సరంలో ‘సకుటుంబ సపరివార సమేతం’ షూటింగ్ స్పాట్లో ఏయన్నార్‌గారికి, నాకూ మధ్య జరిగిన సంభాషణ అది. ఆ సినిమాలో అన్ని పాటలూ నేనే రాశాను. అలా ఆయన నోట నా పాట రావడం నిజంగా నా అదృష్టమే. ఆ షూటింగ్ లొకేషన్లో చాలాసార్లు కలిశాన్నేను. ఎన్నో ఏళ్ల జీవితానుభవంతో ఆయన చెప్పిన కొన్ని అంశాలను నా మనసులోనే భద్రపరచుకున్నా. ఆయన చెప్పిన సలహాలు... అప్పుడే కెరీర్ మొదలు పెట్టిన నాకు ఓ గైడింగ్ ఫోర్స్‌లా ఉపకరించాయి. ‘‘ఇండస్ట్రీలో నీకెవరిమీదైనా కోపం కలిగినా, అసహనం వచ్చినా ఎక్కడా వ్యక్తపరచొద్దు. నీలో నువ్వు దాచుకో. లేకపోతే నీ భార్యతో పంచుకో. సినిమా పరిశ్రమలో గోడలకు, కిటికీలకు, రోడ్లకు, అన్నింటికీ చెవులుంటాయ్’’. నిజంగా ఎంత గొప్ప సలహా అది. ఏయన్నార్ చెప్పిన ఇంకో విలువైన విషయం ఏంటంటే... ‘‘ఇక్కడ ఎవరికి వాళ్లే ఆధునిక భస్మాసురులు. క్రమశిక్షణ, వృత్తిపట్ల గౌరవభావం, టైమ్‌సెన్స్... ఈ మూడూ లేకపోతే మన నెత్తి మీద మనమే చేయిపెట్టుకున్నట్టు. ప్రతిభ కన్నా ముఖ్యమైన అంశాలు అవి’’. నిజంగా నాకైతే ఆయన సూచనలు సినీ భగవద్గీతలా అనిపించాయి. ఆయన నటించిన ‘నటసమ్రాట్’ అనే టీవీ సీరియల్‌కి టైటిల్సాంగ్ రాశాను. ఆ పాటలో ‘బడికెళ్లని ఆచార్యుడు నటసమ్రాట్... ఏ గుడికెళ్లని తాత్వికుడు నటసమ్రాట్...’ అనే రెండు వాక్యాలు ఆయన్ను అమితంగా ఆకర్షించాయి. ఆయన కారులో కొన్నాళ్లపాటు ఈ పాట మార్మోగి పోయింది. ఆయన నటించిన ‘శ్రీరామదాసు’, ‘పెళ్లి సంబంధం’ చిత్రాల్లో కూడా నేను పాటలు రాశాను. సముద్రాల, పింగళి, శ్రీశ్రీ, ఆత్రేయ, దేవులపల్లి, ఆరుద్ర, సినారె లాంటి హేమాహేమీలతో పనిచేసిన ఆయనతో కలిసి పనిచేసే అవకాశం రావడం నిజంగా ఈ తరంలో నాలాంటి కొంతమందికే దక్కింది. ‘రవీంద్రభారతి’లో జరిగిన 10-15 సభల్లో నేనూ ఆయనతో పాటు పంచుకున్నా. ఓసారి ‘అక్కినేని అభినయ అవలోకనం’ అనే ప్రోగ్రామ్ జరిగింది. ఆయన అభినయం గురించి 45 నిమిషాలు ప్రసంగించాలి. అదీ ఆయన ముందు. కొంచెం కష్టమే. కానీ నాకిష్టంగా అనిపించింది. నేనేం చెప్పానంటే... ‘‘సావిత్రి కేవలం కళ్లతోనో, నవ్వుతోనో అభినయిస్తుందంటారు. అయితే మీకో సినిమా సీన్ చెప్పాలి. ‘పెళ్లి కానుక’ సినిమాలో హీరోయిన్‌కి తన బిడ్డను అప్పగించి, సూర్యాస్తమయం వైపుకి ఏయన్నార్ నడుచు కుంటూ వెళ్తుంటారు. ఆ షాట్లో కేవలం ఆయన వీపు మాత్రమే కని పిస్తుంది. ఆ వీపుతో కూడా తాను చెప్పదలుచుకున్న భావాన్ని అద్భుతంగా వ్యక్తపరిచారు’’. ఒక్కసారిగా ఆడిటోరియం మొత్తం క్లాప్స్. నా అబ్జర్వేషన్‌ని ఏయన్నార్ కూడా ప్రశంసించారు. ‘నవరాత్రి’లో కూడా అంతే. ఆయన, సావిత్రి కేవలం సైగలతోనే సంభాషించుకుంటారు. ఎంత గొప్ప యాక్టింగ్. ఎవరు చేయగలరండీ అలా. ‘శ్రీరామదాసు’ ఆడియో ఫంక్షన్ భద్రాచలంలో జరిగింది. ఏయన్నార్‌తో కలిసి నేనూ రైలులో వెళ్లా. ఆయనతో రెండు గంటలు స్పెండ్ చేశా. ఎన్ని అనుభవాలు చెప్పారో. ఓసారాయనకు మశూచి వచ్చిందట. అవి చిదిపితే మొహం మొత్తం మచ్చలు మిగులుతాయి. దానికి ఒకటే పరిష్కారం. ఒక్కో పొక్కుని సిరంజితో గుచ్చి ఇంజెక్షన్ చేయాలి. ఆల్మోస్ట్ యాసిడ్ లాంటి మందు. నిజంగా నరకమే. అయినా భరించారు. ఆయన జీవితం ప్రతి మలుపులోనూ ఎన్నో అవరోధాలు... ఎన్నెన్నో అడ్డుపుల్లలు. అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొన్నారు. పిపీలకం అని వెక్కిరించిన వాళ్ల ఎదురుగానే... ఎవరెస్ట్‌లా ఎదిగి చూపించారు. వ్యక్తిగతంగానూ, వృత్తిపరంగానూ ఆయన్నుంచి ఈ తరమే కాదు... రాబోయే తరాలు కూడా ఎంతో నేర్చుకోవాల్సింది ఉంది. తెరపై ఆయన గొప్ప లవర్ బాయ్. తెర బయట ఆయనో గొప్ప లైఫ్ లవర్‌బాయ్. జీవితం పట్ల ఆమోఘమైన ప్రేమ ఉందాయనకు. అదే ఆయన్ను ఇంత దాకా నడిపించింది. గుండె మనిషిని నడిపిస్తుందని మనందరికీ తెలుసు. కానీ ఒక మనిషి... గుండెను నడిపిస్తున్న సంగతి ఎవరికైనా తెలుసా? ప్రపంచంలో అలాంటి వ్యక్తి ఒక్కరే ఉన్నారు. ఆయనే అక్కినేని. అమెరికాలో ఆయనకు హార్ట్ సర్జరీ చేసిన డాక్టర్లే ఈ గుండె ధైర్యాన్ని చూసి విస్తుపోయారట. మనిషి ఎంత కాలం బతికినా 120 ఏళ్లకు సరిపడ్డా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని పెద్దలు చెబుతుంటారు. దానికి నిలువెత్తు నిదర్శనంగా అనిపిస్తారాయన. ఫైనల్‌గా ఓ విషయం చెప్పాలి. ఆయన యాక్ట్ చేసిన ఏదైనా సీన్‌ని మ్యూట్‌లో పెట్టి చూడండి. ఆ హావభావాలతోనే ఆ సీన్లో ఆయనేం చెప్పదలుచుకున్నారో అర్థమైపోతుంది. అదే సీన్‌ని కళ్లు మూసుకుని కేవ లం డైలాగ్స్ వినండి. ఆ డైలాగ్స్‌తోనే ఆయన ఎలా యాక్ట్ చేస్తారో మన మనసుకి తెలిసిపోతుంది. ఏయన్నార్ యాక్టింగ్లోని మెస్మరిజం అదే! ఈ నట రవిబింబం అస్తమించింది! అభినయ మేరునగం క్రుంగిపోయింది! మొత్తంగా ఒక శకం ముగిసింది..!