ఆవేశం.. ఆర్ధ్రత.. చైతన్యమే అతని గానం
ఉద్యమాల పురిటి గడ్డ నల్గొండలో పుట్టిన అతని నెత్తుటిలో ఓ ఆవేశం ఉంది. పాశ్చాత్య ధోరణిలో నిర్వీర్యమైపోతున్న యువతను మేల్కోల్పాలనే ఆర్ధ్రత ఉంది.. అదే అతని ఊపరైంది... అక్షరమై ఎగిసిపడింది. ‘ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం..’ అంటూ యువతకు దిశానిర్దేశం చేసినా.. ‘నేలమ్మ నేలమ్మ నేలమ్మా.. నీకు వేల వేల వందనాలమ్మ’ అంటూ పుడమితల్లి రుణం తీర్చుకోనిది అంటూ హితోక్తి పల్కినా.. ‘నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి «ఆహుతిచ్చాను’ అన్న శ్రీశ్రీ గీతానికి మరింత అద్భుతమైన పొడిగింపునిచ్చి జాతీయ పురస్కారంతో తెలుగువారి సాహితీ పతకాన్ని హస్తినలో రెపరెపలాడించినా.. అదంతా సుప్రసిద్ద రచయిత, కవి సుద్దాల అశోక్ తేజ కలానికే సొంతం. జిల్లా కేంద్రం అనంతపురంతో పాటు, రాయదుర్గంలో జరుతున్న సాహితీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన గురువారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు.
- అనంతపురం కల్చరల్
సాక్షి : బాల్యం నుంచే మీరు కవిత్వం రాశారంటారు.. ఏ వయసు నుంచి కలం పట్టారో చెప్పగలరా?
అశోక్ తేజ : నేను నాల్గో తరగతి చదువుతున్నప్పుడే ‘జెండా’పై కవిత రాశాను. ఉపాధ్యాయులకు నచ్చి చాలా మెచ్చుకున్నారు. అదే నేను అందుకున్న తొలి బహుమతి.
సాక్షి : మీపై ఎవరి ప్రభావం ఎక్కువగా ఉందంటారు?
అశోక్‌తేజ :నిస్సందేహంగా మా నాన్నగారైన సుద్దాల హనుమంతు గారిదే. నాలోని శిలను శిల్పంగా మార్చడంలో ఆయన శ్రమే ఉంది. నాలోని సాహితీ పిసాసను వేలు పట్టి నడిపించిన తొలి గురువు ఆయనే. అలాగే శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి, వేటూరి, సి.నారాయణరెడ్డి, గజ్జెల మల్లారెడ్డి.... ఒకరేమిటి ప్రతి ఒక్కరూ నన్ను తీర్చిదిద్దారు.
సాక్షి : దాసరి నారాయణరావుతో మీది ప్రత్యేక బంధమంటారు. వారిని ఎలా కలిశారు ?
అశోక్‌తేజ : ఆయన లేకపోతే సుద్దాల అశోక్‌తేజ కవిగా ఉండేవాడు కాదంటే అతిశయోక్తి కాదు. నాలోని కవితా శక్తిని గుర్తించిన తొలి దర్శకుడు ఆయనే. ‘రాయుడుగారు.. నాయుడు గారు’ సినిమాతో ప్రారంభమైన మా బంధం ‘ఒసేయ్ రాములమ్మ’ సినిమాతో తారాస్థాయికి వెళ్లింది. అలానే ‘కంటే కూతుర్నే కను’ సినిమా నాకు నంది అవార్డు నడినొచ్చేలా చేసింది. ఈ నాటికి ఆయనే నా గాడ్‌ఫాదర్ అని నమ్ముతాను.
సాక్షి : తల్లి గొప్పతనం గురించి అశోక్‌తేజ చెబితే మరింత కమ్మదనం ఉంటుందంటారు. ఏమా ప్రత్యేకత ?
అశోక్‌తేజ :అమ్మ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మా అమ్మ జానకమ్మ ఆర్ధ్రత నిండిన దొడ్డ ఇల్లాలు. ఆమెది ఎంత గొప్ప మానవత్వమంటే.. మా ఊళ్లో ఎవరైనా చనిపోతే ఆ రోజంతా ఏమి తినేది కాదు. ఎందుకు తినవని మేమడిగితే వాళ్ళు ఏడుస్తుంటే మనకెలా సహిస్తుంది బిడ్డా అనేది. బహుశా ఆ ప్రభావపు ఝరిలో నేను ఇప్పటికీ మునిగి తేలుతుంటాను. కాబట్టే ‘నేలమ్మ.. నేలమ్మ’ పాట గానీ, పాండురంగడులోని ‘మాతృదేవోభవా’ పాట గాని ఆ భావుకత నుంచే పుట్టుకొచ్చాయి. కేవలం అమ్మ పైనే నేను వందల సంఖ్యలో పాటలు రాసుంటాను.
సాక్షి : మీపై ఉద్యమాల ప్రభావం ఎక్కువగా ఉంది కదా! అదే సమయంలో అందమైన డ్యూయెట్లను ఎలా రాయగల్గుతున్నారు ?
అశోక్‌తేజ : ప్రేమనైనా.. పోరాటమైనా సమానంగానే ప్రతిస్పందిస్తుంది నా కలం.
సాక్షి : సినీ ప్రస్థానంలో మిమ్మల్ని బాధపెట్టిన సంఘటనలేమైనా ఉన్నాయా ?
అశోక్‌తేజ : ఇంత వరకు చాలా మందికి తెలియని విషాదకర విషయమొకటుంది. నేను అత్యంత ప్రేమించే మా అమ్మ చనిపోయి పార్థివశరీరం ఇంకా నా ఒళ్లోనే ఉండగానే.. ఓ సినిమాకు రాసిన శృంగార గీతం మార్చమని నిర్మాత అదే సమయంలో అడిగారు. ఇక ఎలా ఉంటుందో చెప్పండి. గుండె చప్పుడు కూడా వినలేని నిస్సహాయస్థితిలో కూడా కర్తవ్యమంటే అదేనని అమ్మ చెప్పినట్టనిపించి పాట మార్చి రాసిచ్చాను. అప్పుడు పొందిన ఆవేదన మరెవరికీ రాకూడదనుకుంటాను.
సాక్షి : ‘అనంత’ సాహిత్యంతో మీ పరిచయం...
అశోక్‌తేజ : రాయలసీమ కవులు విద్వాన్ విశ్వం (అనంతపురం), మధురాంతకం రాజారామ్(చిత్తూరు), పుట్టపర్తి నారాయణాచార్యుల సాహిత్యం నాకు బాగా నచ్చుతుంది. వారి శైలి నాకు మార్గదర్శకమైంది.
సాక్షి : సమాజంలో వస్తున్న మార్పులు గురించి..
అశోక్‌తేజ : నూరు శాతం ఇబ్బందికరంగా ఉన్నాయి. అనవసరమైన అభిజాత్యాల(ఈగో)తో మానవ సంబంధాలను చెడగొట్టుకుంటున్నాం. సెంటిమెంట్లు మిస్సవుతున్నాం. కేవలం మంచి మాటలతో ప్రపంచాన్ని సాధించవచ్చన్న చిన్న విషయం అవగతమైతే ఇక జీవితమంతా విజయాలే. ఇతరుల శ్రమను గుర్తించాలి. ఆ తాపత్రయంతోనే నేను రాసిన ‘శ్రమకావ్యం’ ప్రతి ప్రాంతంలో వినిపిస్తున్నాను. అలాగే ప్రకృతిని కాపాడుకోవడానికి యువ సమాజాన్ని జాగృతం చేస్తున్నా.
సాక్షి : మెరుగైన సమాజం కోసం ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు ?
అశోక్‌తేజ : యువతనే టార్గెట్‌గా చేసుకుని సాహిత్యాన్ని మలుచుకున్నాను. నేను ఇప్పటి దాకా 1,200 సినిమా పాటలు, మరో రెండు వేల దాకా ప్రైవేట్ పాటలు రాసుంటాను. అన్నీ సమాజ హితం కోరుకునేవే. కానీ యువతలోని శక్తిని వెలికి తీసినపుడే సుసమాజ నిర్మాణం సాధ్యమవుతుంది. ఈ విషయాన్ని యువత గుర్తించాలి. మనకంటూ ప్రత్యేక బ్రాండ్ ఉన్నప్పుడే సమాజం తలెత్తి చూస్తుంది. దానిని సాధించుకోవడానికి కష్టపడాల్సిన పని లేదు. ఆ జీవితాన్ని ఇష్టపడి పొందాలి. త్వరలో ఎస్కే యూనివర్శిటీలో రెండు రోజుల పాటు వ్యక్తిత్వ వికాసం, మానవ సంబంధాల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాలనుకుంటున్నాను.