బడికెళ్లని ఆచార్యుడు...
నివాళి: సుద్దాల అశోక్‌తేజ, ప్రముఖ సినీ గేయ రచయిత
ఫైనల్‌గా ఓ విషయం చెప్పాలి. ఆయన యాక్ట్ చేసిన ఏదైనా సీన్‌ని మ్యూట్‌లో పెట్టి చూడండి. ఆ హావభావాలతోనే ఆ సీన్‌లో ఆయనేం చెప్పదలుచుకు న్నారో అర్థమైపోతుంది. అదే సీన్‌ని కళ్లు మూసుకుని కేవలం డైలాగ్స్ వినండి. ఆ డైలాగ్స్‌తోనే ఆయన ఎలా యాక్ట్ చేస్తారో మన మనసుకి తెలిసిపోతుంది. ఏయన్నార్ యాక్టింగ్‌లోని మెస్మరిజం అదే!
‘‘ఇల్లు కొనుక్కున్నారా?’’
‘‘లేదు సార్...’’
‘‘పోనీ... కారైనా ఉందా?’’
‘‘అదీ లేదండీ...’’
‘‘ఎప్పటికైనా సరే... ముందు ఇల్లు కొనుక్కోండి. మీ భార్య సంతోషిస్తుంది. ఆ తర్వాతే కారు’’
‘‘అలాగే సార్’’.
2000 సంవత్సరంలో ‘సకుటుంబ సపరివార సమేతం’ షూటింగ్ స్పాట్‌లో ఏయన్నార్‌గారికి, నాకూ మధ్య జరిగిన సంభాషణ అది. ఆ సినిమాలో అన్ని పాటలూ నేనే రాశాను. అలా ఆయన నోట నా పాట రావడం నిజంగా నా అదృష్టమే.
ఆ షూటింగ్ లొకేషన్‌లో చాలాసార్లు కలిశాన్నేను. ఎన్నో ఏళ్ల జీవితానుభవంతో ఆయన చెప్పిన కొన్ని అంశాలను నా మనసులోనే భద్రపరచుకున్నా. ఆయన చెప్పిన సలహాలు... అప్పుడే కెరీర్ మొదలు పెట్టిన నాకు ఓ గైడింగ్ ఫోర్స్‌లా ఉపకరించాయి.
‘‘ఇండస్ట్రీలో నీకెవరిమీదైనా కోపం కలిగినా, అసహనం వచ్చినా ఎక్కడా వ్యక్తపరచొద్దు. నీలో నువ్వు దాచుకో. లేకపోతే నీ భార్యతో పంచుకో. సినిమా పరిశ్రమలో గోడలకు, కిటికీలకు, రోడ్లకు, అన్నింటికీ చెవులుంటాయ్’’.
నిజంగా ఎంత గొప్ప సలహా అది. ఏయన్నార్ చెప్పిన ఇంకో విలువైన విషయం ఏంటంటే... ‘‘ఇక్కడ ఎవరికి వాళ్లే ఆధునిక భస్మాసురులు. క్రమశిక్షణ, వృత్తిపట్ల గౌరవభావం, టైమ్‌సెన్స్... ఈ మూడూ లేకపోతే మన నెత్తి మీద మనమే చేయిపెట్టుకున్నట్టు. ప్రతిభ కన్నా ముఖ్యమైన అంశాలు అవి’’.
నిజంగా నాకైతే ఆయన సూచనలు సినీ భగవద్గీతలా అనిపించాయి.
ఆయన నటించిన ‘నటసమ్రాట్’ అనే టీవీ సీరియల్‌కి టైటిల్‌సాంగ్ రాశాను. ఆ పాటలో ‘బడికెళ్లని ఆచార్యుడు నటసమ్రాట్... ఏ గుడికెళ్లని తాత్వికుడు నటసమ్రాట్...’ అనే రెండు వాక్యాలు ఆయన్ను అమితంగా ఆకర్షించాయి. ఆయన కారులో కొన్నాళ్లపాటు ఈ పాట మార్మోగి పోయింది. ఆయన నటించిన ‘శ్రీరామదాసు’, ‘పెళ్లి సంబంధం’ చిత్రాల్లో కూడా నేను పాటలు రాశాను. సముద్రాల, పింగళి, శ్రీశ్రీ, ఆత్రేయ, దేవులపల్లి, ఆరుద్ర, సినారె లాంటి హేమాహేమీలతో పనిచేసిన ఆయనతో కలిసి పనిచేసే అవకాశం రావడం నిజంగా ఈ తరంలో నాలాంటి కొంతమందికే దక్కింది.
‘రవీంద్రభారతి’లో జరిగిన 10-15 సభల్లో నేనూ ఆయనతో పాటు పంచుకున్నా. ఓసారి ‘అక్కినేని అభినయ అవలోకనం’ అనే ప్రోగ్రామ్ జరిగింది. ఆయన అభినయం గురించి 45 నిమిషాలు ప్రసంగించాలి. అదీ ఆయన ముందు. కొంచెం కష్టమే. కానీ నాకిష్టంగా అనిపించింది.
నేనేం చెప్పానంటే...
‘‘సావిత్రి కేవలం కళ్లతోనో, నవ్వుతోనో అభినయిస్తుందంటారు. అయితే మీకో సినిమా సీన్ చెప్పాలి. ‘పెళ్లి కానుక’ సినిమాలో హీరోయిన్‌కి తన బిడ్డను అప్పగించి, సూర్యాస్తమయం వైపుకి ఏయన్నార్ నడుచు కుంటూ వెళ్తుంటారు. ఆ షాట్‌లో కేవలం ఆయన వీపు మాత్రమే కని పిస్తుంది. ఆ వీపుతో కూడా తాను చెప్పదలుచుకున్న భావాన్ని అద్భుతంగా వ్యక్తపరిచారు’’.
ఒక్కసారిగా ఆడిటోరియం మొత్తం క్లాప్స్. నా అబ్జర్వేషన్‌ని ఏయన్నార్ కూడా ప్రశంసించారు.
‘నవరాత్రి’లో కూడా అంతే. ఆయన, సావిత్రి కేవలం సైగలతోనే సంభాషించుకుంటారు. ఎంత గొప్ప యాక్టింగ్. ఎవరు చేయగలరండీ అలా.
‘శ్రీరామదాసు’ ఆడియో ఫంక్షన్ భద్రాచలంలో జరిగింది. ఏయన్నార్‌తో కలిసి నేనూ రైలులో వెళ్లా. ఆయనతో రెండు గంటలు స్పెండ్ చేశా. ఎన్ని అనుభవాలు చెప్పారో. ఓసారాయనకు మశూచి వచ్చిందట. అవి చిదిపితే మొహం మొత్తం మచ్చలు మిగులుతాయి. దానికి ఒకటే పరిష్కారం. ఒక్కో పొక్కుని సిరంజితో గుచ్చి ఇంజెక్షన్ చేయాలి. ఆల్‌మోస్ట్ యాసిడ్ లాంటి మందు. నిజంగా నరకమే. అయినా భరించారు.
ఆయన జీవితం ప్రతి మలుపులోనూ ఎన్నో అవరోధాలు... ఎన్నెన్నో అడ్డుపుల్లలు. అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొన్నారు. పిపీలకం అని వెక్కిరించిన వాళ్ల ఎదురుగానే... ఎవరెస్ట్‌లా ఎదిగి చూపించారు.
వ్యక్తిగతంగానూ, వృత్తిపరంగానూ ఆయన్నుంచి ఈ తరమే కాదు... రాబోయే తరాలు కూడా ఎంతో నేర్చుకోవాల్సింది ఉంది. తెరపై ఆయన గొప్ప లవర్ బాయ్. తెర బయట ఆయనో గొప్ప లైఫ్ లవర్‌బాయ్. జీవితం పట్ల ఆమోఘమైన ప్రేమ ఉందాయనకు. అదే ఆయన్ను ఇంత దాకా నడిపించింది.
గుండె మనిషిని నడిపిస్తుందని మనందరికీ తెలుసు. కానీ ఒక మనిషి... గుండెను నడిపిస్తున్న సంగతి ఎవరికైనా తెలుసా? ప్రపంచంలో అలాంటి వ్యక్తి ఒక్కరే ఉన్నారు. ఆయనే అక్కినేని.
అమెరికాలో ఆయనకు హార్ట్ సర్జరీ చేసిన డాక్టర్లే ఈ గుండె ధైర్యాన్ని చూసి విస్తుపోయారట.
మనిషి ఎంత కాలం బతికినా 120 ఏళ్లకు సరిపడ్డా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని పెద్దలు చెబుతుంటారు. దానికి నిలువెత్తు నిదర్శనంగా అనిపిస్తారాయన.
ఫైనల్‌గా ఓ విషయం చెప్పాలి. ఆయన యాక్ట్ చేసిన ఏదైనా సీన్‌ని మ్యూట్‌లో పెట్టి చూడండి. ఆ హావభావాలతోనే ఆ సీన్‌లో ఆయనేం చెప్పదలుచుకున్నారో అర్థమైపోతుంది. అదే సీన్‌ని కళ్లు మూసుకుని కేవ లం డైలాగ్స్ వినండి. ఆ డైలాగ్స్‌తోనే ఆయన ఎలా యాక్ట్ చేస్తారో మన మనసుకి తెలిసిపోతుంది. ఏయన్నార్ యాక్టింగ్‌లోని మెస్మరిజం అదే!
ఈ నట రవిబింబం అస్తమించింది!
అభినయ మేరునగం క్రుంగిపోయింది!
మొత్తంగా ఒక శకం ముగిసింది..!