ఎంసీడీ స్కూళ్లలో సూపర్ క్లాస్‌రూమ్స్
న్యూఢిల్లీ: మున్సిపల్ కార్పొరేషన్ స్కూళ్లలోని విద్యార్థులకు తమవంతు సహాయసహకారాలు అందించేందుకు కార్పొరేట్ సంస్థ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్(ఆర్‌ఈసీఎల్) ముందుకొచ్చింది. తూర్పు, ఉత్తర ఢిల్లీలోని ఎంసీడీ స్కూళ్లలో 10 ఆర్‌ఈసీఎల్ సూపర్ క్లాస్‌రూమ్స్ నిర్వహణకు ప్రముఖ స్వచ్ఛంద సంస్థ టీచ్ఫర్ ఇండియాతో కలిసి ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందంలోభాగంగా పిల్లలకు ఇంగ్లిష్, గణితంలో బోధనాపరమైన సహాయసహకారాలు అందించడంతోపాటు పేద విద్యార్థులకు పోషకాహారాన్ని కూడా సరఫరా చేయనున్నారు.
ఏడాదిపాటు టీచ్ఫర్ ఇండియాతో కలిసి పనిచేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నామని ఆర్‌ఈసీఎల్ ప్రతినిధులు తెలిపారు. ఈ నెల 18న జహంగిర్‌పురిలోని నిగమ్ ప్రతిభా విద్యాలయ్ స్కూల్లో సూపర్ క్లాస్‌రూమ్‌ను ఆర్‌ఈసీఎల్ టెక్నికల్ డెరైక్టర్ పి.జె. టక్కర్ ప్రారంభించారు. ఇదిలాఉండగాప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలను పెంచేందుకు, ప్రత్యేకించి ఆంగ్లం, గణితంపై విద్యార్థుల పట్టు సాధించేందుకు టీచ్ఫర్ ఇండియా స్వచ్ఛంద సంస్థ దేశవ్యాప్తంగా ఢిల్లీతోపాటు ముంబై, పుణే, హైదరాబాద్, అహ్మదాబాద్, చెన్నైలలో విశేష కృషి చేస్తోంది.