కొత్త లక్ష్యంతో...
నేటి నుంచి వరల్డ్ సూపర్ సిరీస్ మాస్టర్స్ ఫైనల్స్
తొలిసారి పోటీపడుతున్న పీవీ సింధు
భారత షట్లర్ గ్రూప్‌లోనే కరోలినా మారిన్
ఈ ఏడాది అద్వితీయ ఫామ్‌లో ఉన్న భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట (పీవీ) సింధు గొప్ప విజయాలు సాధించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించడం... కెరీర్లో లోటుగా ఉన్న ‘సూపర్ సిరీస్’ టైటిల్‌నూ సొంతం చేసుకోవడం... ఇలా తాను నిర్దేశించుకున్న ఒక్కో లక్ష్యాన్ని ఈ హైదరాబాద్ అమ్మాయి సమర్ధవంతంగా చేరుకుంది. ఇక సీజన్ ముగింపు ప్రతిష్టాత్మక ‘వరల్డ్ సూపర్ సిరీస్ మాస్టర్స్ ఫైనల్స్’ టోర్నమెంట్‌కు సింధు తొలిసారి అర్హత సాధించింది. ఈ మెగా ఈవెంట్లో బరిలోకి దిగుతున్న తొలిసారే తనదైన ముద్ర వేయాలనే లక్ష్యంతో ఆమె దుబాయ్‌లో అడుగుపెట్టింది. 2011లో సైనా నెహ్వాల్ ఈ టోర్నీలో రన్నరప్‌గా నిలువడం భారత్ తరఫున అత్యుత్తమ ప్రదర్శన. సింధు తన దూకుడు కొనసాగించి సైనా ఘనతను సవరిస్తుందా? లేదా ఆమె సరసన నిలుస్తుందో లేదో వేచి చూడాలి.
సాయంత్రం 6.00 నుంచి
స్టార్ స్పోర్ట్స్4లో ప్రత్యక్ష ప్రసారం
సాక్షి క్రీడా విభాగం : అంతర్జాతీయస్థాయిలో అడుగుపెట్టిన కొన్నేళ్లకే ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు మరో పరీక్షకు సిద్ధమైంది. దుబాయ్ వేదికగా బుధవారం తెర లేవనున్న వరల్డ్ సూపర్ సిరీస్ మాస్టర్స్ ఫైనల్స్‌లో ఈ హైదరాబాద్ అమ్మాయి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఈనెల 18 వరకు జరిగే ఈ టోర్నీలో సింధుతో పాటు ప్రపంచ నంబర్‌వన్ తై జు యింగ్ (చైనీస్ తైపీ), రియో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత, ప్రస్తుత ప్రపంచ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్), అకానె యామగుచి (జపాన్), సున్ యు (చైనా), హీ బింగ్జియావో (చైనా), సుంగ్ జీ హున్ (దక్షిణ కొరియా), ప్రపంచ మాజీ చాంపియన్ ఇంతనోన్ రచనోక్ (థాయ్‌లాండ్) పాల్గొంటున్నారు.
గ్రూప్ ‘ఎ’లో తై జు యింగ్, సుంగ్ జీ హున్, రచనోక్, హీ బింగ్జియావో... గ్రూప్ ‘బి’లో సింధు, మారిన్, యామగుచి, సున్ యు ఉన్నారు. బుధవారం జరిగే తొలి రౌండ్ లీగ్ మ్యాచ్‌లో అకానె యామగుచితో సింధు ఆడుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 2–1తో ఆధిక్యంలో ఉంది. గురువారం జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో సున్ యుతో... శుక్రవారం జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో కరోలినా మారిన్‌తో సింధు తలపడుతుంది.
చివరి టోర్నీతో బెర్త్...
2011 నుంచి గత ఏడాది వరకు మహిళల సింగిల్స్‌లో భారత్ నుంచి సైనా నెహ్వాల్ ఈ మెగా ఈవెంట్లో ఆడింది. కానీ ఈసారి మాత్రం సైనాను వెనక్కినెట్టి సింధు ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి బెర్త్ సాధించింది. సీజన్ చివరి సూపర్ సిరీస్ టోర్నీ హాంకాంగ్ ఓపెన్‌లో సింధు రన్నరప్‌గా నిలువడం... అదే టోర్నీలో సైనా క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించడం జరిగింది. దాంతో సూపర్ సిరీస్ ర్యాంకింగ్స్‌లో సింధు 46,290 పాయింట్లతో చివరిదైన 8వ బెర్త్ దక్కించుకోగా... 43,120 పాయింట్లతో సైనా తొమ్మిదో ర్యాంక్‌లో నిలిచి ఈ టోర్నీకి అర్హత పొందలేకపోయింది.
నిలకడగా రాణిస్తేనే...
అగ్రశ్రేణి క్రీడాకారుల కోసం ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) సీజన్ మొత్తంలో 12 సూపర్ సిరీస్ టోర్నమెంట్లు నిర్వహిస్తుంది. ఇందులో ఆరు సూపర్ సిరీస్ టోర్నీలు కాగా... మరో ఆరు ప్రీమియర్ సూపర్ సిరీస్ టోర్నీలు. సూపర్ సిరీస్‌తో పోలిస్తే ప్రీమియర్ టోర్నీలో ప్రైజ్‌మనీ, ర్యాంకింగ్ పాయింట్లు ఎక్కువగా లభిస్తాయి. 12 సూపర్ సిరీస్ టోర్నీలు ముగిశాక ఈ టోర్నీల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా టాప్–8లో నిలిచిన వారు ‘మాస్టర్స్ ఫైనల్స్’కు అర్హత పొందుతారు. 10 లక్షల డాలర్ల ప్రైజ్‌మనీతో ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు.
ఇదీ ఫార్మాట్...
పురుషుల సింగిల్స్, మహిళల సింగిల్స్, పురుషుల డబుల్స్, మహిళల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో పోటీలుంటాయి. ప్రతి విభాగంలో రెండు గ్రూప్‌లు ఉన్నాయి. లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాక రెండు గ్రూప్‌ల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తారు.
శ్రమకు తగ్గ ఫలితం...
ఈ ఏడాది నిలకడగా రాణించిన సింధుకు దానికి తగ్గ గుర్తింపు లభించింది. ప్రపంచ బ్యాడ్మిం టన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) వార్షిక పురస్కారాల్లో ఆమెకు ‘మోస్ట్ ఇంప్రూవ్డ్ ప్లేయర్’ (చాలా మెరుగైన క్రీడాకారిణి) అవార్డు లభించింది. దుబాయ్‌లో సోమవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు దావూద్ అల్ హజ్రి చేతుల మీదుగా సింధు ఈ అవార్డును అందుకుంది.
ఈ పురస్కారం లభిస్తుందని అనుకోలేదు. ఊహించని అవార్డు దక్కినందుకు చాలా ఆనందంగా ఉంది. దుబాయ్‌లో తొలిసారి సూపర్ సిరీస్ మాస్టర్స్ ఫైనల్స్‌ను ఆడనున్నాను. నాకు ‘డ్రా’ కఠినంగా పడింది. మారిన్, బింగ్జియావో, సున్ యులతో మా గ్రూప్ పటిష్టంగా ఉంది. మంచి ఫలితాలను సాధించాలంటే నేను తొలి మ్యాచ్ నుంచే బాగా ఆడాల్సి ఉంటుంది.
–పీవీ సింధు