స్కూళ్లపై దాడులు చేసే రోజులొస్తాయి!
ఉపాధ్యాయులు పనితీరు మార్చుకోకుంటే జరిగేది ఇదే
► ఉత్తమ పౌరులుగా చిన్నారులను తీర్చిదిద్దాలి
► హెచ్ఎంల సమావేశంలో దిశానిర్దేశం చేసిన డీఈఓ
కందుకూరు రూరల్: తల్లిదండ్రులు పాఠశాలలపై దాడి చేసే రోజులు వస్తాయని.. లక్షలాది జీతాలు తీసుకున్న ఉద్యోగులు తమ పిల్లలను నిష్ర్పయోజకులుగా తయూరు చేశారంటూ.. కోర్టుకెళ్లే ప్రమాదం ఉందని డీఈఓ సుప్రకాష్ హెచ్చరించారు. దీనికి ఉపాధ్యాయలోకం బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో గురువారం కందుకూరు విద్యాశాఖ డివిజన్లోని ఉన్నత పాఠశాలల హెచ్ఎంలతో జరిగిన సమావేశంలో మాట్లాడారు. కొందరు ఉపాధ్యాయులు, హెచ్ఎంల పనితీరు వల్ల పేద విద్యార్థులు రోడ్డున పడుతున్నారన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను ఎప్పుడూ కించపరచకూడదని సూచించారు. తల్లిదండ్రుల ముందు వారిని హేళన చేయకూడదని చెప్పారు.
పిల్లలకు చదువు చెప్పమని పెద్ద భవనాలు అప్పగిస్తే వాటిల్లో కర్రలు, రాడ్లు వంటి సామగ్రి వేస్తున్నారని.. లెసెన్ ప్లాన్ లేకుండా పాఠాలు చెబుతున్నారన్నారు. ప్రతి క్లాసును హెచ్ఎం పర్యవేక్షించాలని చెప్పారు. ఉపాధ్యాయుడు పాఠం చెప్పేటప్పుడు క్లాసులోకి వెళ్లి ఎలా చెప్తున్నారే పరిశీలించాలన్నారు. కొన్ని పాఠశాలలో ఇంకా ల్యాబ్లు తెరవలేదని చెప్పారు.
మధ్యాహ్న భోజనం కోసం ఇచ్చిన బియ్యాన్ని స్టాకు రిజిస్టర్లో నమోదు చేయడం లేదన్నారు. సబ్జెక్టు టీచర్లు లేని పాఠశాలకు.. డిప్యుటేషన్ పద్ధతిలో డ్యూటీలు వేయూలని ఆదేశించారు. టీచర్లను ట్రెజరీలకు, డీఆర్సీలకు, ఎమ్మార్సీలకు పంపించవద్దన్నారు.
సైన్స్ఫేర్ను విజయవంతం చేయాలి..
ఈ నెల 30, డిసెంబర్ 1, 2వ తేదీల్లో జిల్లా స్థాయిలో కందుకూరులో జరిగే సైన్స్ఫేర్ను విజయవంతం చేయాలని డీఈఓ కోరారు. సైన్స్ ఉపాధ్యాయులతోపాటు యాక్టివ్గా ఉండే ఉపాధ్యాయుల సహకారం తీసుకొని మంచి ప్రాజెక్టులు తయారు చేయూలని చెప్పారు. డిప్యూటీ డీఈఓ లక్ష్మయ్య, డివిజన్లోని ఎంఈఓలు, హెచ్ఎంలు పాల్గొన్నారు.
ఇద్దరు హెచ్ఎంల సస్పెన్షన్కు డీఈఓ సిఫారసు
ఒంగోలు: జిల్లాలో ఇద్దరు హెడ్మాస్టర్ల సస్పెన్షన్ కోసం గుంటూరు ఆర్జేడీకి సిఫారసు చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డి.వి. సుప్రకాష్ తెలిపారు. గురువారం గుడ్లూరు మండలంలో ఆకస్మికంగా పలు పాఠశాలలను సందర్శించారు. ముందుగా భీమవరం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీచేయగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రెండు రోజులుగా పాఠశాలకు రావడంలేదని గుర్తించామన్నారు. పిల్లల ఆధార్ సీడింగ్ పేరుతో ఆయన వేటపాలెంలోని తన ఇంటివద్ద ఉన్నారని గుర్తించామని తెలిపారు. గత ఏడాది పదో తరగతిలో కేవలం 34 శాతం మాత్రమే విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని, అయినప్పటికీ ఉత్తీర్ణతా శాతాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టలేదన్నారు.