surya kumari
-
AP: ప్రాణం నిలిపిన కలెక్టర్
నెల్లిమర్ల (విజయనగరం జిల్లా): రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై రక్తపు మడుగులో పడి ఉన్న ఓ వ్యక్తి ప్రాణాలను కలెక్టర్ ఎ.సూర్యకుమారి కాపాడారు. సకాలంలో స్పందించి సదరు వ్యక్తిని ఆర్డీఓ వాహనంలో జిల్లా కేంద్రాస్పత్రికి తరలించేలా ఏర్పాట్లు చేశారు. అక్క డి వైద్యులు వెంటనే అత్యవసర వైద్యం అందించడంతో గాయపడిన వ్యక్తికి ప్రాణాపాయం తప్పింది. మెరుగైన చికిత్స నిమిత్తం విశాఖపట్నంలోని కేజీహెచ్‌కు తరలించారు. కలెక్టర్‌గా పరిపాలనలో తనదైన ముద్ర వేసుకున్న సూర్యకుమారి ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడి, తన మానవత్వాన్ని చాటుకు న్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వివరాల్లోకి వెళ్తే.. నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధి వేణుగోపాలపురం కాలనీకి చెందిన బి.అప్పారావు(30) శనివారం మధ్యాహ్నం తన ద్విచక్ర వాహనంపై నెల్లిమర్ల నుంచి గాజులరేగ వెళ్తుండగా జేఎన్టీయూ జంక్షన్లో ప్రమాదానికి గురయ్యారు. అదే సమయంలో కలెక్టర్ సూర్యకుమారి చీపురుపల్లిలో పింఛన్ల పంపిణీకి వెళ్లి తిరిగి విజయనగరం విచ్చేస్తున్నారు. రోడ్డు పక్కన రక్తపు మడుగులో వ్యక్తి పడి ఉండటాన్ని గుర్తించారు. వెంటనే కారును ఆపి 108 వాహనంలో ఆ వ్యక్తిని ఆస్పత్రికి తరలించేందుకు ఫోన్ చేశారు. అయితే 108 వచ్చేందుకు కొంత ఆలస్యమవుతుందని గుర్తించి, తన వెనకే వస్తున్న ఆర్డీఓ భవానీశంకర్ అధికారిక వాహనంలో జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. డీసీహెచ్ఎస్ డాక్టర్ నాగభూషణరావుకు విషయం తెలియజేసి, అత్యవసర చికిత్స అందించాలని ఆదేశించారు. ఆ సమయానికి ఆస్పత్రిలోనే ఉన్న డీసీహెచ్ఎస్ ఇతర వైద్యులను అప్రమత్తం చేశారు. గాయపడిన వ్యక్తికి అవసరమైన పరీక్షలు నిర్వహించి, సకాలంలో వైద్యమందించారు. మెరుగైన చికిత్స నిమిత్తం విశాఖలోని కేజీహెచ్‌కు తరలించారు. ఆదివారం మధ్యాహ్నానికి గాయపడిన అప్పారావు అపస్మారక స్థితి నుంచి బయటపడినట్లు కలెక్టర్‌కు డీసీహెచ్ఎస్ తెలిపారు. గోల్డెన్ అవర్‌లో ఆస్పత్రికి తీసుకురావడం వల్లనే ప్రాణాలు కాపాడగలిగామని ఆయన పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడిన కలెక్టర్ చొరవను అధికారులతో పాటు వైద్య సిబ్బంది అభినందిస్తున్నారు. -
విశాఖ కార్పొరేటర్ బట్టు సూర్య కుమారి పై దాడికి యత్నం
-
విశాఖ మహిళా కార్పొరేటర్ కారుపై దాడి
పెదగంట్యాడ (గాజువాక): వైఎస్సార్సీపీ మహిళా కార్పొరేటర్‌పై ఇద్దరు దుండగులు దాడి చేసిన ఘటనలో ఆమె తృటిలో తప్పించుకున్నారు. ఈ ఘటన విశాఖ నగరంలో జరిగింది. వివరాలు.. బట్టు సూర్యకుమారి ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో విశాఖలోని 77వ డివిజన్ నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఈ నేపథ్యంలో అప్పికొండలో ఆదివారం అభినందన సభ ఏర్పాటు చేశారు. దీనికి పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌రాజ్, మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తిరెడ్డి హాజరయ్యారు. సభ ముగిసిన తర్వాత సూర్యకుమారి తన కారులో ఇంటికి బయల్దేరారు. పాలవలస సమీపంలోని గొలెందిబ్బ జీడి తోటల వద్దకు వచ్చేసరికి.. ఇద్దరు యువకులు హఠాత్తుగా రోడ్డుపైకి వచ్చి కారును అడ్డగించి మద్యం సీసాలతో దాడి చేశారు. అయితే సూర్యకుమారి కూర్చున్న వైపు అద్దం వేసి ఉండడంతో తృటిలో ప్రమాదం తప్పింది. ఇంతలో ఆమె కారు వెనుకే వస్తున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలు అప్రమత్తమై.. దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో బట్టు అప్పలరెడ్డి అనే యువకుడిపై దుండగులు దాడి చేసి పారిపోయారు. దువ్వాడ సీఐ శ్రీలక్ష్మి సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని సూర్యకుమారిని సురక్షితంగా ఇంటికి చేర్చారు.. కాగా, దాడి చేసిన ఇద్దర్నీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. (చదవండి: కాలేజ్‌కు వెళ్తుండగా.. తండ్రి కళ్లెదుటే ఘోరం) -
గ్రేటర్ విశాఖ కార్పొరేటర్ దాడి సూర్యకుమారి మృతి
-
విశాఖ కార్పొరేటర్ ఆకస్మిక మృతి
సాక్షి, విశాఖపట్నం: గ్రేటర్ విశాఖలో విషాదం చోటు చేసుకుంది. 61వ వార్డు కార్పొరేటర్ దాడి సూర్యకుమారి ఆదివారం రాత్రి గుండెపోటుతో ఆకస్మికంగా మృతిచెందారు. ఆమె విశాఖ పారిశ్రామిక వాడలో నివాసం ఉంటున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పోస్ట్‌మార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ నెల 10వ తేదిన జరిగిన గ్రేటర్ విశాఖ ఎన్నికల్లో దాడి సూర్యకుమారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి 61వ వార్డుకు కార్పొరేటర్‌గా గెలుపొందారు. ఆమె మృతితో విశాఖ పారిశ్రామిక వాడలో విషాద ఛాయలు అలుముకొన్నాయి. ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. గ్రేటర్ విశాఖపట్నం కార్పొరేషన్(జీవీఎంసీ) శ్రీహరిపురం(వార్డు61)కు ఎన్నికైన వైఎస్సార్సీపీ కార్పొరేటర్ దాది సూర్యకుమారి ఆకస్మికమృతి సీఎం వైఎస్జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ తన ప్రగాఢ సానుభూతి తెలియాజేశారు. చదవండి: విశాఖ ఉక్కును కాపాడుకుంటాం.. -
బెజవాడలో ఐఏఎస్ అధికారి సోదరి అదృశ్యం
విజయవాడ: నగరంలోని మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళా వైద్యురాలు సూర్యకుమారి అదృశ్యం కలకలం రేపుతోంది. కృష్ణాజిల్లా విస్సన్నపేటలోని ఓ ఆస్పత్రిలో ఆమె వైద్యురాలిగా పని చేస్తోంది. అదృశ్యమైన సూర్యకుమారి కర్ణాటక క్యాడర్ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి సోదరిగా సమాచారం. కుటుంబసభ్యుల ఫిర్యాదు నేపథ్యంలో ఆమె అదృశ్యంపై తూర్పు మాజీ ఎమ్మెల్యే జయరాజ్ కుమారుడు విద్యాసాగర్‌ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కాగా సూర్యకుమారి రెండు రోజుల క్రితం విద్యాసాగర్ ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అతడి ఇంట్లో సోదాలు చేపట్టి సీసీ టీవీ ఫుటేజ్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కాగా విద్యాసాగర్ తల్లి మాట్లాడుతూ... రెండ్రోజుల క్రితం సూర్యకుమారి తన ఇంటికి వచ్చారని, అయితే ఆమె అక్కడ నుంచి వెంటనే వెళ్లిపోయినట్లు తెలిపారు. కాగా అటు మాజీ ఎమ్మెల్యే, ఇటు ఐఏఎస్ అధికారి కుటుంబాలు కావడంతో పోలీసులు ఈ కేసులో గోప్యత పాటిస్తున్నారు ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కనకదుర్గ దేవస్థానంలో ముగిసిన దసరా ఉత్సవాలు
విజయవాడ : బెజవాడ కనకదుర్గ దేవస్థానంలో దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు మంగళవారం ముగిశాయి. ఆలయ పండితులు యజ్ఞ నారాయణశర్మ, శివప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ఎ. సూర్యకుమారితోపాటు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. 11 రోజులపాటు అత్యంత వైభవంగా దసరా మహోత్సవాలు జరిగాయి. సాయంత్రం గంగా సమేత దుర్గా మల్లేశ్వరస్వామివార్ల తెప్పోత్సవం హంసవాహనంపై కృష్ణానదిలో జరగనుంది. -
దుర్గమ్మ ఆలయ సిబ్బందిపై వేటు
విజయవాడ: దుర్గగుడిలో అమ్మవారికి మహానివేదనపై ఆలయ ఉన్నతాధికారులు ఆలస్యంగా స్పందించారు. ఈ అంశంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆలయ సూపరింటెండెంట్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. అలాగే ఏఈవో, ఆలయ ఇన్స్పెక్టర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు ఆలయ ఈవో ఎ. సూర్యకుమారి బుధవారం వెల్లడించారు. ఈ విషయంపై వివరణ ఇవ్వాలని స్థానాచార్యలను కోరినట్లు ఆమె పేర్కొన్నారు. మంగళవారం దుర్గమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆ క్రమంలో వీఐపీల తాకిడి కూడా అధికంగా ఉంది. ఆలయ అధికారులు వీఐపీల సేవలో తరించడంతో అమ్మవారికి సమర్పించే నివేదన ఆలస్యమైంది. మధ్యాహ్నం అమ్మవారికి నివేదన సమర్పించేందుకు ఆలయ అర్చకులు సిద్ధమయ్యారు. మేళతాళాలతో ఆలయ అర్చకులు నివేదనను తీసుకుని అమ్మవారి ముఖ మండపం వద్దకు చేరుకున్నారు. అయితే అప్పటికే ఆలయం లోపల కొందరు వీఐపీలు ఉండటంతో వారు బయటకు వచ్చే వరకు నివేదనను పట్టుకుని అర్చకులు వేచి ఉండాల్సి వచ్చింది. అర్చకులు ఎంత పిలిచినా అంతరాలయంలో ఉన్నవారు బయటకు రాలేదు. వైదిక కమిటీ సభ్యులు శంకర శాండిల్య ఆగ్రహంతో గట్టిగా కేకలు వేయడంతో వీఐపీలు బయటకు వచ్చారు. ఆ తర్వాత అమ్మవారికి మహా నివేదన చేయవలసి వచ్చింది. -
లడ్డూల నష్టానికి బాధ్యులు ఎవరు?
ఎవరి తప్పులేదంటున్న ఈవో సూర్యకుమారి విచారణలు, చర్యలు లేనట్టేనా? సాక్షి, విజయవాడ: ‘ఎదురుగా ఈగల్ని పోనివ్వరు... వెనుక నుంచి ఏనుగులు పోతాయి’ అన్నట్టు ఉంది ఇంద్రకీలాద్రి దేవస్థానం అధికారుల పనితీరు. దేవస్థానానికి ఆదాయం పెంచడం కోసం భక్తుల దర్శనం టికెట్లు, పూజా టికెట్లు పెంచేసిన ఈవో సూర్యకుమారి వెనుకవైపు దేవస్థానానికి లక్షల్లో వస్తున్న నష్టాల గురించి పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. గతంలో రూ.100 ఉన్న దర్శనం టికెట్ ఇప్పుడు రూ.300, రూ.500కు పెంచేశారు. దీనివల్ల భక్తులు అమ్మవారికి దూరం అవుతున్నారే తప్ప దేవస్థానానికి పెద్దగా ఒరుగుతున్నది ఏమీ లేదు. అలాగే కుంకుమ పూజా టికెట్లు, చండీహోమం టికెట్ల రేట్లను పెంచేశారు. దీనివల్ల దేవస్థానానికి లక్షల్లో ఆదాయం వచ్చిందా అంటే..అదీ లేదు. ఇక వరలక్ష్మి వత్రం లాంటి పూజలకు టికెట్లు పెట్టి పేద, మధ్యతరగతి వర్గాల మహిళా భక్తుల్ని అమ్మవారి సన్నిధికి రాకుండా దూరం చేశారు. ఒక్క లడ్డూల్లోనే రూ.4లక్షలు నష్టం దుర్గగుడిలో సుమారు 41వేల లడ్డూలు పాడైపోవడంతో వాటిని విక్రయించకుండా పక్కన పెట్టేయాలని దేవస్థానం కార్యనిర్వహణధికారి సూర్యకుమారి నిర్ణయించారు. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగానే లడ్డూలు పాడైపోయాయని, అందువల్ల దీనికి ఎవరూ బాధ్యులు కారని ఈవో తేల్చి చెప్పారు. దీనివల్ల దేవస్థానానికి ఏకంగా రూ.4లక్షల వరకు నష్టం వస్తోంది. ఒకవైపు భక్తుల నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తూ.. మరోకవైపు ఈ విధంగా వృథా చేయడాన్ని భక్తులు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఏం జరిగిందంటే.... గతంలో భక్తుల దర్శనం టిక్కెట్లు పెంచాలంటే ఈవోలు ఆచితూచి నిర్ణయాలు తీసుకునేవారు. అయితే లడ్డూలు పాడైపోవడం వంటి సంఘటనలు జరిగితే మాత్రం కఠినంగా వుండేవారు. గతంలో 100 లడ్డూలు పాడైపోయాయని ఒక ఉద్యోగిని సస్పెండ్‌చేశారు. మరొక సందర్భంగా 900 లడ్డూలు పాడైపోయాయని విజిలెన్స్ అధికారులు సూమోటోగా విచారణ చేసి నివేదిక ఇచ్చారు. చివరకు ఈ లడ్డూలు పాడైందుకు కారణమైన సూపరింటెండెంట్, గుమస్తాలు ఆ తప్పుకు బాధ్యత వహిస్తూ నష్టాన్ని వారు జీతాల నుంచి చెల్లించారు. ఇప్పుడు ఏకంగా 41వేల లడ్డూలు పాడైపోతే కనీసం ఆవిభాగానికి చెందిన సిబ్బంది వివరణ తీసుకుంటామని కూడా ఈవో చెప్పకపోవడం విశేషం. దేవస్థానంలో ఒక ఏపీఓ స్థాయి అధికారి ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ ప్రసాదాలను ఇబ్బడి ముబ్బడిగా తయారు చేయించడం వల్లనే పాడైపోయాయనే విమర్శలు వినవస్తున్నాయి. -
డబ్బుల్లేకుండా దర్శనానికి వస్తారా?
భక్తునిపై సిబ్బంది దుర్భాషలు సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాదిపై తొలిరోజే భక్తునికి చేదు అనుభవం ఎదురైంది. శనివారం ఉదయం పటమటకు చెందిన చలమయ్య చౌదరి అనే భక్తుడు హైదరాబాద్‌లోని సుమారు 10 మంది బంధువులతో దర్శనానికి వచ్చారు. క్యూలో వెళ్లి రూ.100 టిక్కెట్లు అడగ్గా లేవు, రూ.300, 500 లవే ఉన్నాయని సిబ్బంది చెప్పారు. వాటిని అసలు ముద్రించలేదని తెలిపారు. అలాంటప్పుడు రూ.100 టిక్కెట్లు అని బోర్డులు ఎందుకు పెట్టారని చలమయ్య చౌదరి ప్రశ్నించారు. రూ. మూడు వేలు పెట్టి టిక్కెట్లు కొనలేనివాడివి, అమ్మవారి దర్శనానికి తొలిరోజే ఎందుకు వచ్చారంటూ సిబ్బంది ఆయనను నానా దుర్భాషలాడారు. దీంతో ఆవేదనకు గురైన చౌదరి మీడియా పాయింట్ వద్ద ఉన్న అధికారులకు చెప్పారు. ఈవో ఎ.సూర్యకుమారి అక్కడకు వచ్చి చలమయ్య చౌదరి కుటుంబసభ్యులకు క్షమాపణ చెప్పి, దర్శనానికి పంపారు. సిబ్బంది తీరుపై భక్తులు విస్మయానికి గురయ్యారు. -
దుర్గమ్మ దర్శనానికి ఎన్ని అగచాట్లో
భక్తులకు కిలోమీటర్ల కొద్దీ నడక అంతరాలయం దర్శనం బంద్‌పై ఆగ్రహం వీఐపీలు, పోలీసులకే ‘లిఫ్టు’ సేవలు విజయవాడ: దసరామహోత్సవాల్లో తొలిరోజు అమ్మవారి దర్శనానికి ఇబ్బందులు తప్పలేదు. కొత్తగా చేసిన మార్పులు, అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమనే విమర్శలున్నాయి. రూ.500 టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తుల్ని మాత్రమే పున్నమి ఘాట్ నుంచి ప్రత్యేక వాహనాల్లో కొండపైకి అనుమతించారు. వృద్దులు, వికలాంగులకు తూతూ మంత్రంగానే వాహనాలను ఏర్పాటు చేశారు. దీంతో సుమారు ఐదు కి.మీ నడవడానికి భక్తులు నానా ఇబ్బందులు పడ్డారు. అంతరాలయ దర్శనం నిల్ ఉదయం భక్తులు రద్దీ నామమాత్రంగా వున్నప్పటీకీ దేవస్థానం అధికారులు అంతరాలయ దర్శనం రద్దు చేసి కేవలం ముఖమండప దర్శనం మాత్రమే అనుమతిచ్చారు. ఇది భక్తులకు చెప్పకుండా రూ.500, రూ.300 టిక్కెట్లు విక్రయించారు. విషయం తెలిసి భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ముందుగా చెప్పకుండా రూ.500 టిక్కెట్లు అంటగడుతున్నారంటూ సెక్యూరిటీ సిబ్బందిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కుంకుమార్చనకు భక్తుల కొరత తొలిరోజున అతి తక్కువగా తొలి బ్యాచ్‌లో 70 మంది రెండవ బ్యాచ్ 9 మంది కలిపి 79 మంది మాత్రమే కుంకుమార్చన చేసుకున్నారు. ఇక శత చండీయాగానికి కేవలం ఆరుగురు భక్తులు మాత్రమే వచ్చారు. లాభార్జన కోసం కుంకుమార్చన టిక్కెట్లు ఇబ్బడి ముబ్బడిగా పెంచేయడంతో భక్తులు రావట్లేదనే ఆరోపణలున్నాయి. లిప్టులోకి భక్తులకు నో ఎంట్రీ మల్లికార్జున మహామండపంలోని లిప్టులలో సాధారణ భక్తుల్ని అనుమతించడం లేదు. కేవలం దేవస్థానం సిబ్బందితో పాటు వీవీఐపీలు, పోలీసులు మాత్రమే వెళ్తున్నారు. సాధారణ భక్తుల్ని అర్జున వీధిలోంచి కొండ పైకి రానివ్వడం లేదు. పాలకమండలి సభ్యుల పరిశీలన మంత్రి దేవినేని ఉమా, దేవస్థానం పాలకమండలి చైర్మన్ యలమంచిలి గౌరంగబాబు, సభ్యులు గుణశేఖర్, వెలగపూడి శంకరబాబు, కోడేల సూర్యకుమారి తదితరులు వచ్చారు. భక్తుల ఇబ్బందులను ఈవో ఎ.సూర్యకుమారి దృష్టికి తీసుకువెళ్లడానికి ప్రయత్నించగా ఆమె అందుబాటులో లేరు. -
దుర్గగుడికి మహర్దశ!
స్వయం ప్రతిపత్తి కల్పించిన ప్రభుత్వం ఇప్పటికే ఈవోగా ఐఏఎస్ అధికారి ఇక నిర్ణయాలు వేగవంతం త్వరలో పాలకమండలి నియామకం విజయవాడ : శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానానికి మహర్దశ రానుంది. ప్రతిష్టాత్మక దుర్గగుడికి స్వయం ప్రతిపత్తి హోదా ఇస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు దేవాలయంలో ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టాల్సివచ్చినా, తప్పనిసరిగా దేవాదాయశాఖ కమిషనర్, ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఇక నుంచి పాలకమండలి నిర్ణయించిన తర్వాత ప్రభుత్వ అనుమతితో పనులు చేపట్టే అవకాశం ఉంటుంది. రాజధానిగా మారడంతో.... విజయవాడ రాష్ట్ర రాజధానికి కేంద్రంగా మారడంతో రాష్ట్ర ప్రభుత్వం దుర్గగుడిపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. విజయవాడలోనే మంత్రివర్గ సమావేశాలు, కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లు, గవర్నరు పర్యటనలు ఉండటంతో వారంతా ఇక్కడకు వచ్చినప్పుడు తప్పకుండా అమ్మవారి దేవాలయాన్ని సందర్శిస్తున్నారు. ఈ క్రమంలో దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్నారు. దేవస్థానం పేరుతో గత అనేక సంవత్సరాలుగా ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లు తీసి వేసి, ఆలయం కట్టూ భూములు కొనుగోలు చేస్తున్నారు. నూతన నిర్మాణాలు చేపడుతున్నారు. వీవీఐపీలను ఆకర్షించే విధంగా దేవాలయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దుతున్నారు. పాలకమండలి నియమాకం! దేవస్థానానికి పాలకమండలి నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేవస్థానం కమిటీని నియమించాలని ఇప్పటికే అనేక మంది తెలుగుదేశం నేతలు ముఖ్యమంత్రిని కోరుతున్నారు. ఇప్పుడు స్వయం ప్రతిపత్తి ఇచ్చిన నేపథ్యంలో పాలకమండలి నియమించే అవకాశం ఉంది. అయితే పాలకమండలిని పుష్కరాల్లోపు నియమిస్తారా? ఆ తర్వాత నియమిస్తారా? అనేది స్పష్టంగా తెలియాల్సి ఉంది. సిబ్బంది ఇబ్బందులు తీరేనా? దేవస్థానంలో రెండు దశాబ్దాలుగా అనేక మంది ఉద్యోగులు ఎన్‌ఎంఆర్‌లుగానే పనిచేస్తున్నారు. తమను పర్మినెంట్ చేయాలని అనేక మంది సిబ్బంది హైదరాబాద్ చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. అమ్మవారి దేవాలయానికి పుష్కలంగా ఆదాయం వస్తున్నప్పటికీ సిబ్బంది కుటుంబాలు మాత్రం అర్ధాకలితోనే జీవితాలను వెళ్లదీస్తున్నాయి. ప్రత్యేక ప్రతిపత్తి హోదా వచ్చిన తరువాతైనా వీరి కష్టాలు తీరతాయో.. లేదా.. వేచి చూడాలి. నిర్ణయాలు వికటిస్తే.... ఇప్పటి వరకు కమిషనర్ పర్యవేక్షణలో నిర్ణయాలను ఆచితూచి తీసుకునేవారు. ఇక నుంచి స్థానికంగా తీసుకుని ప్రభుత్వానికి పంపితే నిర్ణయాలు వికటించే అవకాశం ఉంది. ఇప్పటికే దేవస్థానంలో కొంతమంది కాంట్రాక్టర్లు ఇంద్రకీలాద్రిపై అనేక సంవత్సరాలుగా తిష్టవేశారు. వీరు పాలకమండలి సభ్యులు, దేవస్థాన అధికారులను బుట్టలో వేసుకుని మరింత అడ్డగోలుగా దోచుకునే అవకాశం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిబ్బంది నియమాకాలు, దేవస్థానానికి చెందిన వర్క్‌లు ఇచ్చే విషయంలో అధికారపార్టీ నేతల హవా పూర్తిస్థాయిలో సాగే అవకాశం ఉంది. ఇటువంటి అనుమానాలకు తావులేకుండా పారదర్శకంగా ఆలయాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. -
ఆటలు.. కెరీర్‌కు రాచబాటలు
నేడు కెరీర్లో ఎదిగేందుకు ఆటలు మంచి మార్గంగా మారాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కొలువులు సాధించేందుకు క్రీడలు దారి చూపుతున్నాయి. ప్రభుత్వాలు కూడా క్రీడాకారులకు భారీ నజరానాలు అందిస్తున్నాయి. దీంతో ఎక్కువ మంది క్రీడలవైపు దృష్టి సారిస్తున్నారు. తల్లిదండ్రుల దృక్పథంలోనూ మార్పు వస్తోంది. తమ చిన్నారులను ఆటల్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలో క్రీడల శిక్షకులు, ఇతర సిబ్బంది అవసరం నానాటికీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సిటీలో, దేశంలో స్పోర్ట్స్ సంబంధిత కోర్సులను అందిస్తున్న యూనివర్సిటీలు, అర్హతలు, అవకాశాలపై ఫోకస్.. అవకాశాలెన్నో ఆటగాళ్లను ఫిట్‌గా ఉండేలా చూసే ఫిట్నెస్ ట్రైనర్, గాయాలబారిన పడితే సేవలందించే ఫిజియో థెరపిస్ట్, ఆత్మవిశ్వాసం, మానసిక స్థైర్యాన్ని పెంపొందించే స్పోర్ట్స్ సైకాలజిస్ట్, ఒత్తిడిని ఎదుర్కోవడానికి దారిచూపే యోగా ట్రైనర్, సరైన ఆహారం తీసుకునేలా సూచనలిచ్చే న్యూట్రిషనిస్ట్, క్రీడాకారుల వ్యవహారాలు పర్యవేక్షించే స్పోర్ట్స్ మేనేజర్, ఎప్పటికప్పుడు క్రీడా రంగంలో వస్తున్న నూతన టెక్నాలజీని విశ్లేషించే స్పోర్ట్స్ టెక్నాలజిస్ట్, వివిధ క్రీడల్లో ప్రావీణ్యం కల్పించే కోచ్, స్పోర్ట్స్ మసాజ్ స్పెషలిస్ట్, ఎక్సర్‌సెజైస్ స్పెషలిస్ట్.. ఇలా ఎన్నో ఉద్యోగావకాశాలు క్రీడా రంగంలో యువతకు అందుబాటులో ఉన్నాయి. కోర్సులు - స్పెషలైజేషన్లు క్రీడలంటే మక్కువ.. క్రీడాంశాలను కెరీర్‌గా ఎంచుకోవాలనేవారికి ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు పలు కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. సర్టిఫికెట్ కోర్సులు మొదలుకుని డిప్లొమా, పీజీ డిప్లొమా, యూజీ, పీజీ, ఇంటిగ్రేటెడ్ పీజీ, బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఎంఫిల్, పీహెచ్డీ, ఇంటిగ్రేటెడ్ ఎంఫిల్ - పీహెచ్డీ, ఎంబీఏ వంటి కోర్సులను దేశంలో వివిధ యూనివర్సిటీలు అందిస్తున్నాయి. ఈ కోర్సులను అందించడంలో గ్వాలియర్‌లో ఉన్న లక్ష్మీబాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్‌కు మంచిపేరుంది. ఇది కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ పరిధిలో ఏర్పాటైన సంస్థ. దీంతోపాటు పాటియాలాలో ఉన్న నేతాజీ సుభాశ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ కూడా వివిధ కోర్సులను అందించడంలో ప్రఖ్యాతి పేరుగాంచింది. ఇవేకాకుండా మరెన్నో విద్యా సంస్థలు ఈ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. స్పెషలైజేషన్ల విషయానికొస్తే ఎక్సర్సైజ్ ఫిజియాలజీ, స్పోర్ట్స్ సైకాలజీ, స్పోర్ట్స్ బయోమెకానిక్స్, ఫిట్నెస్ మేనేజ్మెంట్, స్పోర్ట్స్ ఇంజూరీస్ మేనేజ్మెంట్, స్పోర్ట్స్ కోచింగ్, స్పోర్ట్స్ మేనేజ్మెంట్ , యోగా, స్పోర్ట్స్ టెక్నాలజీ, స్పోర్ట్స్ మెడిసిన్, స్పోర్ట్స్ మసాజ్, లైఫ్‌గార్డ్స్ అండ్ పూల్ స్విమ్మింగ్, గ్రౌండ్ మేనేజ్మెంట్ వంటివి అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సుల వ్యవధి ఏడాది, యూజీ కోర్సుల వ్యవధి మూడేళ్లు/నాలుగేళ్లు, పీజీ కోర్సుల వ్యవధి రెండేళ్లు. నగరంలో పలు ఫిట్నెస్ స్టూడియోలు, జిమ్‌లు.. ఫిట్నెస్ సంబంధిత ఏరోబిక్స్, ఫిజియోమసాజ్, వెయిట్ రిడక్షన్, యోగా, మెడిటేషన్ వంటి అంశాల్లో శిక్షణ ఇస్తుండడంతోపాటు.. సర్టిఫికేషన్ కోర్సులను నిర్వహిస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లో పీఈసెట్.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ యూనివర్సిటీల పరిధిలోని కళాశాలల్లో యూజీడీపీఈడీ, బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రతిఏటా ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్టును నిర్వహిస్తారు. యూజీడీపీఈడీ వ్యవధి రెండేళ్లు, బీపీఈడీ వ్యవధి ఏడాది. అర్హత: యూజీడీపీఈడీకి ఇంటర్మీడియెట్, బీపీఈడీకి ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎంపిక: శారీరక సామర్థ్య పరీక్ష, ఏదైనా క్రీడలో ప్రతిభ ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు. వేతనాలు మనదేశంలో క్రీడలంటే నిన్నమొన్నటి వరకు క్రికెట్ మాత్రమే. ఇప్పుడిప్పుడే ఈ పరిస్థితిలో మార్పు వస్తోంది. ఆర్చరీ, షూటింగ్, బ్యాడ్మింటన్, టెన్నిస్, రెజ్లింగ్, బాక్సింగ్, చెస్, అథ్లెటిక్స్ వంటి క్రీడలకు ఆదరణ పెరుగుతోంది. స్పోర్ట్స్ మేనేజర్లకు ప్రారంభంలో నెలకు రూ.15,000 నుంచి రూ.25,000 వరకు వేతనాలు ఉంటాయి. క్రీడా శిక్షకులు, సైకాలజిస్ట్లకు మొదట రూ.15,000తో కెరీర్ ఆరంభమవు తుంది. ఆ తర్వాత పనితీరు, అనుభవాన్ని బట్టి మరింత ఆదాయం పొందొచ్చు. రెండేళ్ల అనుభవం, మంచి నైపుణ్యాలు ఉంటే సొంతంగా శిక్షణా సంస్థను కూడా ఏర్పాటు చేసుకోవ చ్చు. ఫిజియో థెరపిస్ట్‌లు, న్యూట్రిషనిస్ట్‌లు ప్రారంభంలో రూ.25,000 వేతనం అందుకోవచ్చు. ఈ రంగంలో మంచి పేరు సాధిస్తే రూ.లక్షల్లో ఆదాయం గడించొచ్చు. కోర్సులను అందిస్తున్న యూనివర్సిటీలు ఉస్మానియా యూనివర్సిటీ వెబ్సైట్: www.osmania.ac.in ఆంధ్రా యూనివర్సిటీ వెబ్సైట్: www.andhrauniversity.edu.in ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వెబ్సైట్: www.nagarjunauniversity.ac.in జేఎన్టీయూ - కాకినాడ కోర్సు: ఎంఎస్ హెల్త్ సైన్స్ అండ్ స్పోర్ట్స్ టెక్నాలజీ వ్యవధి: రెండేళ్లు అర్హత: ఎంబీబీఎస్/బీయూఎంఎస్/బీఎన్‌వైఎస్/బీఏఎంఎస్/బీహెచ్ఎంఎస్/బీపీటీ/ఎంపీటీ ఉత్తీర్ణత. వెబ్సైట్: www.jntuk.edu.in ప్రవేశం ప్రవేశం ఆయా యూనివర్సిటీల నియమ నిబంధనల మేరకు ఉంటుంది. దాదాపు అన్ని యూనివర్సిటీలు శారీరక సామర్థ్య పరీక్ష, ఏదైనా క్రీడలో ప్రావీణ్యం, రాతపరీక్ష ఆధారంగా క్రీడాకారులకు ప్రవేశం కల్పిస్తున్నాయి. గేమ్స్ అడ్డా.. సిటీ స్పోర్ట్స్ కోర్సులను అభ్యసించినవారికి ఎన్నో అవకాశాలున్నాయి. నగరంలో క్రికెట్, చెస్, టెన్నిస్, బ్యాడ్మింటన్, గోల్ఫ్, పోలో, స్విమ్మింగ్, అథ్లెటిక్స్, వెయిట్ లిఫ్టింగ్ వంటి క్రీడల్లో శిక్షణనిస్తున్నారు. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియం - యూసఫ్‌గూడ, లాల్ బహదూర్ స్టేడియం, పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ, జింఖానా గ్రౌండ్స్, హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్, హైదరాబాద్ పోలో అండ్ రైడింగ్ క్లబ్, సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం, గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం, సానియామీర్జా టెన్నిస్ అకాడమీ మొదలైనవి ఎన్నో నగరంలో కొలువుదీరాయి. * వివిధ క్రీడలు, క్రీడా పరికరాలపై మంచి పరిజ్ఞానం ఉండాలి. * నెట్వర్కింగ్ నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్. * నాయకత్వ లక్షణాలు. * పరిశీలన, పరిశోధనాత్మక దృక్పథం. * నిర్ణయ సామర్థ్యాలు. * దూర ప్రాంతాలకు ప్రయాణం చేయగల సంసిద్ధత. తల్లిదండ్రుల ప్రోత్సాహమే కీలకం భారత ప్రభుత్వం పంచాయత్ యువ క్రీడ ఔర్ ఖేల్ అభియాన్ (పీవైకేకేఏ), అర్బన్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్‌లతో క్రీడలను ప్రోత్సహిస్తోంది. ప్రాథమిక విద్య దశలోనే క్రీడల్లో విద్యార్థుల భాగస్వామ్యం తప్పనిసరి చేయనుంది. కార్పొరేట్ ఉద్యోగాల ఎంపిక సమయంలోనూ గేమ్స్, స్పోర్ట్స్‌లో ప్రవేశం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. క్రీడాకారుల్లో ఉండే లీడర్షిప్, టీమ్బిల్డింగ్తో ఉద్యోగాన్ని సమర్థంగా నిర్వహించగలరని కంపెనీలు భావిస్తున్నాయి. స్కూల్ స్థాయి నుంచే పిల్లలను ఇండోర్, ఔట్‌డోర్ ఏదో ఒక ఆటకు అలవాటయ్యేలా తల్లిదండ్రులు దృష్టిసారిస్తే.. ఆరోగ్యం, కెరీర్ రెండూ బాగుంటాయి. -డాక్టర్ ఎం.వి.ఎల్.సూర్యకుమారి, ఫిజికల్ ఎడ్యుకేషన్ డెరైక్టర్, జి. నారాయణమ్మ మహిళా ఇంజనీరింగ్ కళాశాల