దుర్గగుడికి మహర్దశ! | 'Durga temple to be developed on par with TTD | Sakshi
Sakshi News home page

దుర్గగుడికి మహర్దశ!

Published Wed, Aug 3 2016 9:06 AM | Last Updated on Mon, Sep 4 2017 7:40 AM

దుర్గగుడికి మహర్దశ!

దుర్గగుడికి మహర్దశ!

  •  స్వయం ప్రతిపత్తి కల్పించిన ప్రభుత్వం
  •   ఇప్పటికే ఈవోగా ఐఏఎస్ అధికారి
  •   ఇక నిర్ణయాలు వేగవంతం
  •   త్వరలో పాలకమండలి నియామకం
  •  
    విజయవాడ : శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానానికి మహర్దశ రానుంది. ప్రతిష్టాత్మక దుర్గగుడికి స్వయం ప్రతిపత్తి హోదా ఇస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు దేవాలయంలో ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టాల్సివచ్చినా, తప్పనిసరిగా దేవాదాయశాఖ కమిషనర్, ప్రభుత్వ   అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఇక నుంచి పాలకమండలి నిర్ణయించిన తర్వాత ప్రభుత్వ అనుమతితో పనులు  చేపట్టే అవకాశం ఉంటుంది.
     
    రాజధానిగా మారడంతో....
    విజయవాడ రాష్ట్ర రాజధానికి కేంద్రంగా మారడంతో రాష్ట్ర ప్రభుత్వం దుర్గగుడిపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. విజయవాడలోనే మంత్రివర్గ సమావేశాలు, కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లు, గవర్నరు పర్యటనలు ఉండటంతో వారంతా ఇక్కడకు వచ్చినప్పుడు తప్పకుండా అమ్మవారి దేవాలయాన్ని సందర్శిస్తున్నారు. ఈ క్రమంలో దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్నారు. దేవస్థానం పేరుతో గత అనేక సంవత్సరాలుగా ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లు తీసి వేసి, ఆలయం కట్టూ భూములు కొనుగోలు చేస్తున్నారు. నూతన నిర్మాణాలు చేపడుతున్నారు. వీవీఐపీలను ఆకర్షించే విధంగా దేవాలయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దుతున్నారు.
     
    పాలకమండలి నియమాకం!
    దేవస్థానానికి పాలకమండలి నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేవస్థానం కమిటీని నియమించాలని ఇప్పటికే అనేక మంది తెలుగుదేశం నేతలు ముఖ్యమంత్రిని కోరుతున్నారు. ఇప్పుడు స్వయం ప్రతిపత్తి ఇచ్చిన నేపథ్యంలో పాలకమండలి నియమించే అవకాశం ఉంది. అయితే పాలకమండలిని పుష్కరాల్లోపు నియమిస్తారా? ఆ తర్వాత నియమిస్తారా? అనేది స్పష్టంగా తెలియాల్సి ఉంది.
     
    సిబ్బంది ఇబ్బందులు తీరేనా?
    దేవస్థానంలో రెండు దశాబ్దాలుగా అనేక మంది ఉద్యోగులు ఎన్‌ఎంఆర్‌లుగానే పనిచేస్తున్నారు. తమను పర్మినెంట్ చేయాలని అనేక మంది సిబ్బంది హైదరాబాద్ చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. అమ్మవారి దేవాలయానికి పుష్కలంగా ఆదాయం వస్తున్నప్పటికీ సిబ్బంది కుటుంబాలు మాత్రం అర్ధాకలితోనే జీవితాలను వెళ్లదీస్తున్నాయి. ప్రత్యేక ప్రతిపత్తి హోదా వచ్చిన తరువాతైనా వీరి కష్టాలు తీరతాయో.. లేదా.. వేచి చూడాలి.
     
    నిర్ణయాలు వికటిస్తే....
    ఇప్పటి వరకు కమిషనర్ పర్యవేక్షణలో నిర్ణయాలను ఆచితూచి తీసుకునేవారు. ఇక నుంచి స్థానికంగా తీసుకుని ప్రభుత్వానికి పంపితే నిర్ణయాలు వికటించే అవకాశం ఉంది. ఇప్పటికే దేవస్థానంలో కొంతమంది కాంట్రాక్టర్లు ఇంద్రకీలాద్రిపై అనేక సంవత్సరాలుగా తిష్టవేశారు. వీరు పాలకమండలి సభ్యులు, దేవస్థాన అధికారులను బుట్టలో వేసుకుని మరింత అడ్డగోలుగా దోచుకునే అవకాశం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

    సిబ్బంది నియమాకాలు, దేవస్థానానికి చెందిన వర్క్‌లు ఇచ్చే విషయంలో అధికారపార్టీ నేతల హవా పూర్తిస్థాయిలో సాగే అవకాశం ఉంది. ఇటువంటి అనుమానాలకు తావులేకుండా పారదర్శకంగా ఆలయాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement