Thugs Attack On YSRCP Women GVM Corporator Surya Kumari In Visakhapatnam - Sakshi
Sakshi News home page

విశాఖ మహిళా కార్పొరేటర్‌ కారుపై దాడి

Published Mon, Mar 29 2021 5:38 AM | Last Updated on Mon, Mar 29 2021 1:39 PM

Attack on a female corporator in visakhapatnam - Sakshi

పెదగంట్యాడ (గాజువాక): వైఎస్సార్‌సీపీ మహిళా కార్పొరేటర్‌పై ఇద్దరు దుండగులు దాడి చేసిన ఘటనలో ఆమె తృటిలో తప్పించుకున్నారు. ఈ ఘటన విశాఖ నగరంలో జరిగింది. వివరాలు.. బట్టు సూర్యకుమారి ఇటీవల జరిగిన కార్పొరేషన్‌ ఎన్నికల్లో విశాఖలోని 77వ డివిజన్‌ నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఈ నేపథ్యంలో అప్పికొండలో ఆదివారం అభినందన సభ ఏర్పాటు చేశారు. దీనికి పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌రాజ్, మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తిరెడ్డి  హాజరయ్యారు. సభ ముగిసిన తర్వాత సూర్యకుమారి తన కారులో ఇంటికి బయల్దేరారు.

పాలవలస సమీపంలోని గొలెందిబ్బ జీడి తోటల వద్దకు వచ్చేసరికి.. ఇద్దరు యువకులు హఠాత్తుగా రోడ్డుపైకి వచ్చి కారును అడ్డగించి మద్యం సీసాలతో దాడి చేశారు. అయితే సూర్యకుమారి కూర్చున్న వైపు అద్దం వేసి ఉండడంతో తృటిలో ప్రమాదం తప్పింది. ఇంతలో ఆమె కారు వెనుకే వస్తున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు అప్రమత్తమై.. దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో బట్టు అప్పలరెడ్డి అనే యువకుడిపై దుండగులు దాడి చేసి పారిపోయారు. దువ్వాడ సీఐ శ్రీలక్ష్మి సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని సూర్యకుమారిని సురక్షితంగా ఇంటికి చేర్చారు.. కాగా, దాడి చేసిన ఇద్దర్నీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. 
(చదవండి: కాలేజ్‌కు వెళ్తుండగా.. తండ్రి కళ్లెదుటే ఘోరం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement