‘స్వదేశీ దర్శన్’ కింద రూ.వంద కోట్లు
► కేంద్రానికి ప్రతిపాదించనున్న రాష్ట్ర ప్రభుత్వం
► కుతుబ్‌షాహీ, రేమండ్, హయత్ బక్షీబేగం, పైగా సమాధుల అభివృద్ధి
సాక్షి, హైదరాబాద్: స్వదేశీ దర్శన్ పథకం కింద రాష్ట్రంలో చారిత్రక ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2016–17 సంవత్సరానికిగాను ఈ పథకం కింద కనీసం రూ.100 కోట్లకు తగ్గకుండా కేంద్ర నిధులను రాబట్టుకునేందుకు ప్రతిపాదన సిద్ధం చేస్తోంది. గత 2 సంవత్సరాల్లో సాధించిన 2 కీలక ప్రాజెక్టుల పనులు ఇప్పటికే మొదలయ్యాయి.
కొల్లాపూర్‌లో సోమశిల ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌ను ఆసరా చేసుకుని పర్యాటకప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ఉద్దేశించిన ఎకో టూరిజం ప్రాజెక్టుకు దాదాపు రూ.95 కోట్లు మంజూరయ్యాయి. ఏపీలోని పాపికొండలు తరహాలో తెలంగాణలో కూడా ఒక పర్యాటక కేంద్రాన్ని రూపొందించే ప్రాజెక్టు సిద్ధమవుతోంది. సింగోటం రిజర్వాయర్, అక్కమహాదేవి గుహలను కూడా ఇందులో భాగంగా అభివృద్ధి చేస్తున్నారు. ట్రైబల్ సర్క్యూట్ కింద ఏటూరు నాగారం, ములుగు, తాడ్వాయి, లక్నవరం, మేడారం, బొగత జలపాతం, మల్లూరు తదితర ఏజెన్సీ ప్రాంతాలను కలుపుతూ మరో ప్రాజెక్టుకు కూడా కేంద్రం నిధులు కేటాయించింది. రూ.96 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపట్టారు. మూడో ప్రాజెక్టు కోసం చారిత్రక ప్రాంతాల అభివృద్ధి, వాటిల్లోని కట్టడాలను సంరక్షించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
నాలుగు కట్టడాలపై దృష్టి...
మూడో ప్రాజెక్టు కోసం ప్రాథమికంగా నాలుగు కట్టడాలను ప్రభుత్వం గుర్తించింది. కుతుబ్‌షాహీ సమాధులు, హయత్ బక్షీబేగం, రేమండ్, పైగా టూంబ్ ను ఎంపిక చేశారు. ఇండో–అరబ్, ఇండో–యూరోపియన్ నిర్మాణశైలికి ప్రతిబింబాలుగా ఉన్న ఈ కట్టడాలు పర్యాటకులను అబ్బురపరుస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. చారిత్రకంగా, నిర్మాణపరంగా గొప్పగా ఉన్నా ఆ ప్రాంతాల్లో కనీసం మరుగుదొడ్ల సౌకర్యం కూడా లేదు. మంచినీళ్లు దొరకవు. శుభ్రత ఉండదు. దీంతో పర్యాటకులు ఈ ప్రాంతాలకు రాలేకపోతున్నారు. మంచినీళ్లు, విశ్రాంతి గదులు, ఆధునిక మరుగుదొడ్లు, రెస్టారెంట్లు, పచ్చిక బయళ్లు, వాటర్ఫౌంటెయిన్లు, పూదోటలు, సౌండ్ అండ్ లైట్స్ షో, గైడ్స్... ఇలా ఈ ప్రాంతాల్లో పర్యాటకులకు అవసరమైన అన్ని వసతులు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతిపాదనను సిద్ధం చేయడానికి బుధవారం పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ క్రిస్టీనా చోంగ్తు, పురావస్తుశాఖ సంచాలకురాలు విశాలాక్షి, ఇతర అధికారులు వాటిని పరిశీలించారు. మరో రెండుమూడు రోజుల్లో ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పించనున్నారు.