హుస్సేన్‌సాగర్‌లో డీలక్స్ అమెరికన్ బోట్‌ను నడుపుతున్న మంత్రి జూపల్లి
టూరిజం అధికారులతో మంత్రి కృష్ణారావు భేటీ
సాక్షి, హైదరాబాద్: కొల్లాపూర్ నియోజకవర్గంలోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రం సోమశిల నుంచి శ్రీశైలం వరకు ఇప్పటికే బోటింగ్ సౌకర్యం ఏర్పాటు చేయగా.. తాజాగా స్వదేశ్ దర్శన్ పథకం క్రింద సోమశిల సర్క్యూట్‌ను అభివృద్ధి చేసేందుకు మంత్రి జూపల్లి కృష్ణారావు చర్యలు తీసుకుంటున్నారు. దీనిపై టూరిజం కార్పొరేషన్ ఎండీ క్రిస్టీనా జడ్ ఛోంగ్తూ, జీఎం మనోహర్‌లతో మంత్రి చర్చించారు. సోమశిలలో గెస్ట్‌హౌస్‌తో పాటు సింగోటం చెరువులో రెండు డీలక్స్ బోట్ల ఏర్పాటుపై కూడా చర్చించారు.
అనంతరం లుంబినీ పార్కుకు చేరుకుని హుస్సేన్‌సాగర్‌లో ఉన్న డీలక్స్ అమెరికన్ బోట్‌ను స్వయంగా జూపల్లి కృష్ణారావు నడిపి పరిశీలించారు. 4 నెలలల్లో రెండు బోట్లను అమెరికా నుంచి తెప్పించి సింగోటంలో ఏర్పాటు చేసేందుకు టూరిజం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌టీడీసీ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బు రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.