చీటింగ్ కేసులో టీ9 ఛానల్ సీఈవో అరెస్ట్
హైదరాబాద్ : ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు టోకరా వేస్తున్న 'టీ9' న్యూస్ ఛానల్ సీఈవో సహా మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మోసాలకు పాల్పడుతున్న ఘరానా ముఠాను టాస్క్‌ఫోర్స్, సీసీఎస్ పోలీసుల సంయుక్త బృందం అదుపులోకి తీసుకుంది. మొత్తం నలుగురు నిందితులను పట్టుకున్నట్లు సీసీఎస్ సంయుక్త పోలీస్ కమిషనర్ టి.ప్రభాకర్ రావు తెలిపారు. తార్నాకకు చెందిన 'టీ9' న్యూస్ ఛానల్ సీఈవో కె.మల్లన్న అలియాస్ మల్లారెడ్డి, అబిడ్స్ లోని ఓ కాలేజీలో ల్యాబ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న టి.రమేష్, సితాఫల్మండికి చెందిన నిరుద్యోగి బి.నగేష్ బాబు, సచివాలయ ఉద్యోగి డి. వెంకటేశ్వరరావు కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. జెన్కోలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వేణు, మహేష్ అనే నిరుద్యోగులను నమ్మించారు. ఇందు కోసం రూ.10 లక్షలు అవుతుందని చెప్పి అడ్వాన్స్‌గా రూ.2.5 లక్షలు తీసుకున్నారు.
జెన్కోలో ఏఈ పోస్టుల పేరుతో మరికొందరి నుంచి రూ.5 లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ఫిర్యాదులు అందడంతో కేసు నమోదు చేసిన సీసీఎస్ పోలీసులు మంగళవారం నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా 2010లోనూ రైల్వేలో గ్రూప్-డి పోస్టులు ఇప్పిస్తామంటూ 10 మంది రూ.10 లక్షలు వసూలు చేసినట్లు, ఆ మొత్తాన్ని నారయణగౌడ్ అనే వ్యక్తికి ఇచ్చినట్లు, ఆ డబ్బుతో అతడు పరారైనట్లు విచారణలో తేలిందని వెల్లడించారు. అదనపు డీసీపీ విజయేందర్‌రెడ్డి పర్యవేక్షణలో ఈ నిందితుల్ని అరెస్టు చేసిన సీసీఎస్ ఇన్స్పెక్టర్ పి.విక్రమ్‌దేవ్ రూ.2.68 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.