Tanniru harishrao
-
24 గంటల్లో 31 కాన్పులు
జనగామ: జనగామ మాతాశిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్) ప్రసవాల్లో మరో రికార్డు సృష్టించింది. 24 గంటల వ్యవధిలో 31 కాన్పులు చేసి.. వైద్యులు సర్కారు దవాఖానా సత్తా చాటారు. సాధారణ ప్రసవాలు–17, ఆపరేషన్లు 14 కాగా... ఇందులో 12మంది మగపిల్లలు, 19 మంది ఆడపిల్లలు జన్మించారు. అందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుగుణాకర్‌రాజు ఆధ్వర్యంలో అసిస్టెంటు ప్రొఫెసర్ డాక్టర్ స్రవంతి, డాక్టర్లు సౌమ్యారెడ్డి, సిరిసూర్య, సిబ్బంది సంగీత, విజయరాణి, సెలెస్టీనా ప్రసూతి కాన్పులు చేశారు. ఎంసీహెచ్ వైద్యుల అంకితభావంతో సర్కారు దవాఖానాలపై ప్రజలకు మరింత నమ్మకం పెరుగుతోందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ట్వీట్ చేశారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కూడా వీరిని అభినందిస్తూ, ప్రతి ఒక్కరూ సర్కారు దవాఖానాల సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. -
దళితబంధు సర్వే..భేష్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు సర్వేను సమర్థవంతంగా నిర్వహించిన జిల్లా కలెక్టర్లు, అధికారులకు మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, తన్నీరు హరీశ్‌రావు అభినందనలు తెలిపారు. కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం మంత్రి కొప్పుల ఈశ్వర్ అధ్యక్షతన గంగుల, హరీశ్‌రావు, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి రాహుల్ బొజ్జా దళితబంధు సర్వే, దళితబంధు అమలుపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు 12,521 మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్లు మంత్రులు తెలిపారు. మిగిలిన లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని అధికారులను ఆదేశించారు. డబ్బులు ఖాతాలో జమయిన వెంటనే అందరికీ మొబైల్ఫోన్లో తెలుగులో సందేశాలు పంపించాలన్నారు. దళితబంధు సర్వేలో డోర్ లాక్, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినవారు, తప్పిపోయిన దళిత కుటుంబాల ఇళ్లను కూడా ఈ నెల 12 నుంచి వారం రోజుల్లో మరోసారి సందర్శించాలని నిర్ణయించారు. దళితబంధు కింద మంజూరైన డబ్బులను ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు తమకు వద్దని, ఈ డబ్బుల్ని ఇతర పేద దళిత కుటుంబాలకు సహాయం అందించాలని ‘‘గివ్ ఇట్ అప్’’అని స్వచ్ఛందంగా ఇచ్చినందుకు ఆ ఉద్యోగులను మంత్రులు అభినందించారు. 18 ఏళ్లలోపు తల్లిదండ్రులు లేని 14 మంది అనాథ పిల్లలకు మానవతా దృక్పథంతో వెంటనే దళితబంధు మంజూరు చేసివారి ఖాతాల్లో డబ్బులు జమచేయాలని నిర్ణయించారు. త్వరలోనే మిగిలిన వారికి..! దళితబంధు పథకం ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా మంజూరు చేసిన 15 మంది లబ్ధిదారులలో ఇంతవరకు ఆరుగురు లబ్ధిదారులకు యూనిట్లు గ్రౌండింగ్ చేశామని మిగిలిన వారికి కూడా స్కీముల ఎంపిక పూర్తి చేసి వారం రోజుల్లో గ్రౌండింగ్ చేయాలని మంత్రులు ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, నగర మేయర్ వై.సునీల్ రావు, అదనపు కలెక్టర్లు శ్యాం ప్రసాద్ లాల్ రాష్ట్ర, జిల్లాస్థాయి అధికారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు. -
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి హరీశ్
సాక్షి, హైదరాబాద్: కొత్తగా 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ఆర్థికశాఖ మంత్రి టి.హరీశ్‌రావు వెల్లడించారు. ఉద్యోగుల పదవీ విరమణ వయోపరిమితి పెంచడం వల్ల నిరుద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని, అలాగే.. కొత్త ఉద్యోగ నియామకాలకు ఆటంకం కలగదన్నారు. గురువారం శాసనసభలో పెన్షన్ సవరణ బిల్లును, ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయోపరిమితి పెంపు బిల్లును మంత్రి ప్రవేశపెట్టగా.. సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. మాజీ శాసనసభ్యుల పెన్షన్‌ను రూ.30 వేల నుంచి రూ.50 వేలకు పెంచుతున్నట్లు తెలిపారు. అలాగే.. అప్పర్ సీలింగ్ రూ.70 వేలుగా ఖరారు చేసినట్లు చెప్పారు. వైద్య చికిత్సల పరిమితిని రూ.లక్ష నుంచి రూ.10 లక్షలు పెంచుతున్నట్లు మంత్రి సభకు వివరించారు. ఈ పథకాన్ని మాజీ సభ్యులతో పాటు వారి సహ చరులు కూడా వినియోగించుకోవచ్చని చెప్పారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను త్వరలో జారీ చేయనున్నట్లు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే భాగన్న వైద్య చికిత్స సమయంలో సీలింగ్ రూ.లక్ష మాత్రమే ఉండటంతో మరింత నగదు చెల్లించాల్సి వచ్చిందని, అప్పట్లో తలెత్తిన ఇబ్బందులు పునరావృతం కాకూడదని సీఎం కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఉద్యోగుల పదవీ విరమణ 61కి పెంపు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా ఉద్యోగుల పదవీ విరమణ వయో పరిమితిని 61 సంవత్సరాలకు పెంచుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇదివరకే నాల్గో తరగతి ఉద్యోగులకు అరవై ఏళ్లు, ప్రభుత్వ వైద్య కళాశాలలో బోధన సిబ్బందికి 65 సంవత్సరాలు, న్యాయ సిబ్బందికి 60 ఏళ్లు పదవీ విరమణ వయోపరిమితి ఉందని గుర్తు చేశారు. కొన్ని రాష్ట్రాల్లో 60 ఏళ్ల వరకు ఉందన్నారు. ఉద్యోగుల సీనియార్టీని, అనుభవాన్ని వినియోగించు కునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. వేతన సవరణ సంఘం కూడా ఈ మేరకు ప్రతిపాదించిందని గుర్తు చేశారు. ప్రస్తుతం మానవుని సగటు జీవిత కాలం కూడా పెరిగిందని, దీంతో ఉద్యోగులకు మరో మూడేళ్ల పాటు పనిచేసే వెసులుబాటు ఇస్తున్నామని ఆయన వివరించారు. -
‘ఓపెన్’ బెని‘ఫిట్’
దైనందిన కార్యక్రమాల్లో వ్యాయామం కూడా ఒకటి. దనికోసమే యువత పోలీస్, ఇతర పరీక్షలకు సిద్ధం కావలంటే శారీరక సౌష్టవం, పటిష్టత కోసం జిమ్స్ అవసరం. మహిళలు, పట్టణ వాసులు కూడా వ్యాయామం వైపు మొగ్గు చూపుతున్నారు. దీని కోసం సిద్దిపేట పట్టణంలో ఇప్పటికే కోమటి చెరువు, బ్లాక్ ఆఫీస్ చౌరస్తా, సిరిసిల్లా కమాన్ ప్రాంతాల్లో ఓపెన్ జిమ్స్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు కొత్తగా కోమటి చెరువు అడ్వంచర్ పార్కు, హౌసింగ్‌బోర్డు పార్కు, ఎర్రచెరువు ప్రాంతాల్లో జిమ్స్ ఏర్పాటు చేస్తున్నారు. యువత కోరిక మేరకు సిద్దిపేట నియోజకవర్గంలోని గుర్రాల గొందిలో కూడా ఏర్పాటు చేశారు. దీన్ని చూసిన చిన్నకోడూరు, ఇబ్రహింపూర్, విఠలాపూర్, చంద్లాపూర్, ఇర్కొడు, నంగునూరు మొదలైన గ్రామాల యువకులు తమ గ్రామాల్లో కూడా జిమ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. దీనిపై స్పందించిన హరీశ్‌రావు ఆయా గ్రామాల్లో కూడా జిమ్స్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారు. సాక్షి, సిద్దిపేట: నాటి తెలంగాణ ఉద్యమం నుంచి నేడు జిల్లా సమగ్ర అభివృద్ధి వరకు సిద్దిపేట అంటే ఓ ప్రత్యేకత. రాష్ట్రంలో ఏ జిల్లా అభివృద్ధి చెందనంతగా సిద్దిపేట అభివృద్ధిలో దూసుకుపోతోంది. రోడ్లు, కార్యాలయాలు, భవనాలు, ప్రభుత్వ పథకాల అమలులో మందంజలోనే కాకుండా ఇప్పుడు వినూత్న రీతిలో యువతకు ఉపయోగపడే కార్యక్రమాలకు మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు నేతృత్వంలో శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా యువత అతి త్వరగా ఆకర్షితులయ్యే ఓపెన్ జిమ్స్ ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగా సిద్దిపేటలో ప్రతీ కూడలిలో ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేశారు. వీటిని గ్రామాలకు కూడా విస్తరించేందుకు కార్యచరణ సిద్ధం చేస్తున్నారు. యువతను ప్రోత్సహించేలా.. నేటి బాల బాలికలే రేపటి పౌరులు. వీరే విలువైన మానవ వనరులు.. వీరు సంపూర్ణ ఆరోగ్యంతో పెరిగితే రేపటి ఆరోగ్యవంతమైన సమాజంలో భాగస్వామ్యులు అవుతారనే విధానాన్ని నమ్మిన మాజీ మంత్రి హరీశ్‌రావు యువతకు పదికాలల పాటు ఉపయోగపడే వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో ఉపాధ్యాయుల నియామకం కోసం పోటీ పడుతున్న విద్యార్థులకు టెట్, టీఆర్టీతోపాటు, వీఆర్వో, వీఆర్ఏ, గ్రూప్స్‌కు కూడా శిక్షణ ఇప్పించారు. దాతల సహకారంతో విద్యార్థులు ఉచిత భోజనం, వసతులు కల్పించారు. దీంతో వేలాది మంది విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు మార్గం సుగమనం అయ్యింది. అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్స్, ఎస్సై ఉద్యోగాలకు ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. ఆర్మీ, ఎయిర్‌పోర్స్ నియామకాలు కూడా జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారు. అయితే ప్రతీ మనిషి సంపూర్ణ ఆరోగ్యవంతుడుగా ఎదగాలంటే మంచి గాలి, శారీరక వ్యాయామం అవసరం. దీనికోసమే సిద్దిపేట పరిసర ప్రాంతాలతోపాటు మారుమూల ప్రాంతాల్లో కూడా విరివిరిగా చెట్లు నాటే కార్యక్రమాన్ని యజ్ఞంలా ప్రారంభించారు. పచ్చటి సిద్దిపేటే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. అదేవిధంగా మంచి వ్యాయామం చేయాలంటే వారికి అందుబాటులో జిమ్స్ ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ప్రధాన కూడళ్ల వద్ద జిమ్స్ ఏర్పాటు చేస్తున్నారు. వ్యాయామంతో క్రమశిక్షణ ‘‘యువత రేపటి విలువైన మానవ వనరులు. చిన్న చిన్న పొరపాట్లు చేసి జీవితాలను ఆంధకారంలోకి పోతున్నారు. వీరిని ప్రోత్సహించాలనే ఆలోచనతోనే అన్ని పోటీ పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇప్పించాం. కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలకు సన్నద్ధం చేశాం. ఎయిర్‌పోర్స్ సెలక్షన్లు పెట్టడంతో వందలాది మంది ఉద్యోగాలు పొందారు. ఇక సిద్దిపేటలో కోమటి చెరువు అభివృద్ధి చేశాం. ఉదయం వేలసంఖ్యలో చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు వ్యాయామం చేస్తున్నారు. వీరందరికీ జిమ్స్ అందుబాటులో ఉండాలన్నదే ఆలోచన. యువత జిమ్స్‌ను ఉపయోగించుకొని పోలీస్, ఇతర ఉద్యోగాల్లో ఎంపిక కావడం సంతోషకరం. ’’ – తన్నీరు హరీశ్‌రావు, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే ‘‘ఒకప్పుడు సిద్దిపేట అంటే మారుమూల గ్రామం. కానీ ఇప్పుడు ఇక్కడి ప్రజలకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. సిద్దిపేట కోమటి చెరువు, బ్లాక్ ఆపీస్ చౌరస్తా, సిరిసిల్లా కమాన్ వద్ద ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్స్తో యువతకు ఉపయోగకరంగా ఉంది. నెలకు వేలాది రూపాయలు ఖర్చుచేసి జిమ్‌కు వెళ్లలేని నిరుపేదలు వీటిని వినియోగించుకొని మంచి క్రీడాకారులుగా ఎదుగుతున్నారు.’’ – మల్లికార్జున్, క్రికెట్ క్రీడాకారుడు ‘‘మా ఊళ్లో మూడు వందలకు పైగా యువత ఉంటారు. జిమ్ చేయాలంటే సిద్దిపేటకు రావాల్సి ఉండేది. యుత అందరం కలిసి మాకు జిమ్ కావాలని మాజీ మంత్రి హరీశ్‌రావును కోరాం. వెంటనే మా ఊళ్లో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశారు. యువత ఉదయం, సాయంత్రం జిమ్ చేసుకుంటున్నారు. క్రమశిక్షణకు అలవాటు పడుతున్నారు. కొందరు కానిస్టేబుల్, ఎస్సై వంటి ఉద్యోగాలు కూడా పొందుతున్నారు. యువతలో మార్పు వచ్చింది’’. – ఆంజనేయులు, సర్పంచ్, గుర్రాల గొంది -
‘అభివృద్ధికి అడ్డుగా ప్రధాని మోడీ, చంద్రబాబు’
తూప్రాన్: తెలంగాణ లో అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్రమోడి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు మండిపడ్డారు. గురువారం తూప్రాన్ మండలంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు మంత్రి హరీష్‌రావు సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..తెలంగాణలో నేడు విద్యుత్‌కు అనేక ఇబ్బందులు ఎదురవడానికి కారణం ఖమ్మంలోని దిగువ సీలేరు విద్యుత్ కేంద్రాన్ని సీమాంధ్రలో విలీనం చేయడమేనన్నారు. విలీనం వల్ల 400 మెగావాట్ల విద్యుత్ ఆంధ్రకు వెళ్లిపోయిందన్నారు. కడప నుంచి తెలంగాణకు రావాల్సిన 600 మెగావాట్ల విద్యుత్‌ను చంద్రబాబు అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఇదంతా ప్రధానమంత్రి నరేంద్రమోడీ, చంద్రబాబు కుట్ర రాజకీయాలతో తెలంగాణకు ఇబ్బందులు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రధానమంత్రి కుట్రపూరిత రాజకీయాలకు పాల్పడుతుంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ‘తెలంగాణ ఉద్యమం కొనసాగుతున్న క్రమంలో నిజామాబాద్ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ రాజీనామా చేస్తే.. నాడు రాజీనామ చేయని మీరు కేసీఆర్‌పై విమర్శలు చేస్తారా? కేసీఆర్‌ను విమర్శించే నైతిక హక్కు మీకు లేదని’ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చేతనైతే కరెంటు కోసం ఢిల్లీలోని ప్రధానమంత్రిని నిలదీయాలని కిషన్‌రెడ్డికి సూచించారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కేటాయింపుల్లోనూ ప్రధానమంత్రి తెలంగాణపై వివక్ష చూపుతున్నారని వాపోయారు. రైల్వే బడ్జెట్లో ఆంధ్రకు బుల్లెట్ రైలు, తెలంగాణకు మోండిచేయి చూపారని హరీష్‌రావు ఆరోపించారు. తమ ప్రభుత్వంపై ఎవరు ఎన్ని కుట్రలు చేసినా.. అవినీతి రహిత పాలన అందించాడానికి, బంగారు తెలంగాణ కోసం కేసీఆర్ బృహత్ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. రైతుల బ్యాంకు రుణాలను మాఫీ చేయడానికి కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. అయితే ప్రధానమంత్రి కుట్రలో భాగంగానే రిజర్వు బ్యాంకు మెలికలు పెడుతోందని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి తీరుతామని నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. భారీగా చేరికలు.. తూప్రాన్ మండలంలోని మనోహరాబాద్ టీడీపీకి చెందిన సర్పంచ్ సంతోష, సోముల్యాదవ్, మాజీ ఎంపీపీ మేకల అర్జున్‌యాదవ్, ఎంపీటీసీ సభ్యులు ఆంజనేయులు, రజనీ, బాపు, మాజీ ఉప సర్పంచ్ అంజాగౌడ్, మాల్కాపూర్ సర్పంచ్ స్వామి, రంగాయిపల్లి మాజీ సర్పంచ్ నాగభూషణం, టీఎన్ఎస్ఎఫ్ మండల శాఖ అధ్యక్షుడు బద్రితో పాటు సుమారు 200 మంది నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో టీఆర్ఎస్లో చేరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు దేవేందర్‌రెడ్డి, ఎలక్షన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. -
పవన్‌పై పరువునష్టం దావా వేస్తా: హరీశ్
సాక్షి, హైదరాబాద్: పీసీసీ మాజీ అధ్యక్షులు బొత్సతో తనకు వ్యాపార సంబంధాలున్నాయని ఆరోపించిన పవన్‌కల్యాణ్‌పై పరువు నష్టం దావా వేస్తానని టీఆర్ఎస్ నేత తన్నీరు హరీశ్‌రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బొత్సతో కేబుల్ వ్యాపార సంబంధాలున్నట్లు చేసిన ఆరోపణలను ఖండించారు. ఆయన చేసిన ఆరోపణలను 24 గంటలల్లోగా నిరూపించాలని, లేదంటే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాడు. లేని పక్షంలో దావాతో పాటు క్రిమినల్ కేసు పెడతానని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమ నాయకుల ప్రతిష్టను దిగజార్చడానికి ఇలాంటి తప్పుడు ఆరోపణలు గతంలోనూ చేశారని, ఇప్పుడు కూడా అదే పద్దతి కొనసాగిస్తున్నారన్నారు