సిద్దిపేటలో జిమ్ ప్రారంభిస్తున్న హరీశ్‌రావు
దైనందిన కార్యక్రమాల్లో వ్యాయామం కూడా ఒకటి. దనికోసమే యువత పోలీస్, ఇతర పరీక్షలకు సిద్ధం కావలంటే శారీరక సౌష్టవం, పటిష్టత కోసం జిమ్స్ అవసరం. మహిళలు, పట్టణ వాసులు కూడా వ్యాయామం వైపు మొగ్గు చూపుతున్నారు. దీని కోసం సిద్దిపేట పట్టణంలో ఇప్పటికే కోమటి చెరువు, బ్లాక్ ఆఫీస్ చౌరస్తా, సిరిసిల్లా కమాన్ ప్రాంతాల్లో ఓపెన్ జిమ్స్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు కొత్తగా కోమటి చెరువు అడ్వంచర్ పార్కు, హౌసింగ్‌బోర్డు పార్కు, ఎర్రచెరువు ప్రాంతాల్లో జిమ్స్ ఏర్పాటు చేస్తున్నారు. యువత కోరిక మేరకు సిద్దిపేట నియోజకవర్గంలోని గుర్రాల గొందిలో కూడా ఏర్పాటు చేశారు. దీన్ని చూసిన చిన్నకోడూరు, ఇబ్రహింపూర్, విఠలాపూర్, చంద్లాపూర్, ఇర్కొడు, నంగునూరు మొదలైన గ్రామాల యువకులు తమ గ్రామాల్లో కూడా జిమ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. దీనిపై స్పందించిన హరీశ్‌రావు ఆయా గ్రామాల్లో కూడా జిమ్స్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారు.
సాక్షి, సిద్దిపేట: నాటి తెలంగాణ ఉద్యమం నుంచి నేడు జిల్లా సమగ్ర అభివృద్ధి వరకు సిద్దిపేట అంటే ఓ ప్రత్యేకత. రాష్ట్రంలో ఏ జిల్లా అభివృద్ధి చెందనంతగా సిద్దిపేట అభివృద్ధిలో దూసుకుపోతోంది. రోడ్లు, కార్యాలయాలు, భవనాలు, ప్రభుత్వ పథకాల అమలులో మందంజలోనే కాకుండా ఇప్పుడు వినూత్న రీతిలో యువతకు ఉపయోగపడే కార్యక్రమాలకు మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు నేతృత్వంలో శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా యువత అతి త్వరగా ఆకర్షితులయ్యే ఓపెన్ జిమ్స్ ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగా సిద్దిపేటలో ప్రతీ కూడలిలో ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేశారు. వీటిని గ్రామాలకు కూడా విస్తరించేందుకు కార్యచరణ సిద్ధం చేస్తున్నారు.
యువతను ప్రోత్సహించేలా..
నేటి బాల బాలికలే రేపటి పౌరులు. వీరే విలువైన మానవ వనరులు.. వీరు సంపూర్ణ ఆరోగ్యంతో పెరిగితే రేపటి ఆరోగ్యవంతమైన సమాజంలో భాగస్వామ్యులు అవుతారనే విధానాన్ని నమ్మిన మాజీ మంత్రి హరీశ్‌రావు యువతకు పదికాలల పాటు ఉపయోగపడే వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో ఉపాధ్యాయుల నియామకం కోసం పోటీ పడుతున్న విద్యార్థులకు టెట్, టీఆర్‌టీతోపాటు, వీఆర్‌వో, వీఆర్‌ఏ, గ్రూప్స్‌కు కూడా శిక్షణ ఇప్పించారు. దాతల సహకారంతో విద్యార్థులు ఉచిత భోజనం, వసతులు కల్పించారు. దీంతో వేలాది మంది విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు మార్గం సుగమనం అయ్యింది. అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్స్, ఎస్సై ఉద్యోగాలకు ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. ఆర్మీ, ఎయిర్‌పోర్స్ నియామకాలు కూడా జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారు. అయితే ప్రతీ మనిషి సంపూర్ణ ఆరోగ్యవంతుడుగా ఎదగాలంటే మంచి గాలి, శారీరక వ్యాయామం అవసరం. దీనికోసమే సిద్దిపేట పరిసర ప్రాంతాలతోపాటు మారుమూల ప్రాంతాల్లో కూడా విరివిరిగా చెట్లు నాటే కార్యక్రమాన్ని యజ్ఞంలా ప్రారంభించారు. పచ్చటి సిద్దిపేటే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. అదేవిధంగా మంచి వ్యాయామం చేయాలంటే వారికి అందుబాటులో జిమ్స్ ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ప్రధాన కూడళ్ల వద్ద జిమ్స్ ఏర్పాటు చేస్తున్నారు.
వ్యాయామంతో క్రమశిక్షణ
‘‘యువత రేపటి విలువైన మానవ వనరులు. చిన్న చిన్న పొరపాట్లు చేసి జీవితాలను ఆంధకారంలోకి పోతున్నారు. వీరిని ప్రోత్సహించాలనే ఆలోచనతోనే అన్ని పోటీ పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇప్పించాం. కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలకు సన్నద్ధం చేశాం. ఎయిర్‌పోర్స్ సెలక్షన్లు పెట్టడంతో వందలాది మంది ఉద్యోగాలు పొందారు. ఇక సిద్దిపేటలో కోమటి చెరువు అభివృద్ధి చేశాం. ఉదయం వేలసంఖ్యలో చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు వ్యాయామం చేస్తున్నారు. వీరందరికీ జిమ్స్ అందుబాటులో ఉండాలన్నదే ఆలోచన. యువత జిమ్స్‌ను ఉపయోగించుకొని పోలీస్, ఇతర ఉద్యోగాల్లో ఎంపిక కావడం సంతోషకరం. ’’
– తన్నీరు హరీశ్‌రావు, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే
‘‘ఒకప్పుడు సిద్దిపేట అంటే మారుమూల గ్రామం. కానీ ఇప్పుడు ఇక్కడి ప్రజలకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. సిద్దిపేట కోమటి చెరువు, బ్లాక్ ఆపీస్ చౌరస్తా, సిరిసిల్లా కమాన్ వద్ద ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్స్‌తో యువతకు ఉపయోగకరంగా ఉంది. నెలకు వేలాది రూపాయలు ఖర్చుచేసి జిమ్‌కు వెళ్లలేని నిరుపేదలు వీటిని వినియోగించుకొని మంచి క్రీడాకారులుగా ఎదుగుతున్నారు.’’
– మల్లికార్జున్, క్రికెట్ క్రీడాకారుడు
‘‘మా ఊళ్లో మూడు వందలకు పైగా యువత ఉంటారు. జిమ్ చేయాలంటే సిద్దిపేటకు రావాల్సి ఉండేది. యుత అందరం కలిసి మాకు జిమ్ కావాలని మాజీ మంత్రి హరీశ్‌రావును కోరాం. వెంటనే మా ఊళ్లో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశారు. యువత ఉదయం, సాయంత్రం జిమ్ చేసుకుంటున్నారు. క్రమశిక్షణకు అలవాటు పడుతున్నారు. కొందరు కానిస్టేబుల్, ఎస్సై వంటి ఉద్యోగాలు కూడా పొందుతున్నారు. యువతలో మార్పు వచ్చింది’’.
– ఆంజనేయులు, సర్పంచ్, గుర్రాల గొంది
Comments
Please login to add a commentAdd a comment