teaching profession
-
నాలుగు తరాలు ఉపాధ్యాయ వృత్తిలోనే..
తాళ్లరేవు: ‘ఇంజరం.. విద్వత్ కుంజరం..’ అన్నది అనాదిగా ఉన్న నానుడి. వేద పండితులు, విద్వాంసులు, సంగీత, సాహిత్య కళాకారులకు తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవు మండలంలోని ఇంజరం గ్రామం నెలవు. ఇదేకాదు.. ఈ గ్రామంలో ఓలేటి కుటుంబానికీ ఓ ప్రత్యేకత ఉంది. ఆ కుటుంబం నాలుగు తరాలుగా ఉపాధ్యాయ వృత్తిలోనే కొనసాగుతోంది. గ్రామానికి చెందిన ఓలేటి బంగారేశ్వరశర్మ పాఠశాల వ్యవస్థ లేని కాలంలోనే గురుకుల వ్యవస్థ పరంపరలో తన ఇంటి అరుగు మీదే విద్యార్థులకు సాహిత్యం, పాఠాలు బోధించేవారు. ఆయన కుమారుడు ఓలేటి సూర్యనారాయణశాస్త్రి గ్రేడ్–1 ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఈయన కుమారుడు ఓలేటి శ్రీనివాసశర్మ కూడా ఉపాధ్యాయుడే. ఈయన తన ఏడుగురు కుమారులను ప్రభుత్వ ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దారు. తన తాత, తండ్రి స్ఫూర్తితో విద్య ద్వారా మాత్రమే సమాజాన్ని మార్చగలమని విశ్వసించి తన పిల్లలను ఉపాధ్యాయులను చేశారు. ఆయన ఇద్దరు కోడళ్లు కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులే కావడం విశేషం. ఏడుగురు కుమారులూ ఇలా.. ఇక శ్రీనివాసశర్మ పెద్ద కుమారుడు సూర్యనారాయణశాస్త్రి తెలుగు ఉపాధ్యాయుడిగా.. రెండో కుమారుడు వెంకటభాస్కరశర్మ సంస్కృత, సాహిత్య అధ్యాపకునిగా.. మూడో కుమారుడు వెంకట ఫణినాథశర్మ ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడిగా.. నాలుగో కుమారుడు వెంకట రమణశర్మ ఎస్జీటీగా పనిచేస్తున్నారు. అలాగే, ఐదో కుమారుడు సుబ్రహ్మణ్యేశ్వర శర్మ వ్యాకరణ అధ్యాపకుడిగా.. ఆరో కుమారుడు వెంకట బంగారేశ్వరశర్మ తెలుగు ఉపాధ్యాయుడిగా.. ఏడో కుమారుడు మృత్యుంజయశర్మ గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. మరోవైపు.. మూడో కుమారుడు వెంకటఫణినాథశర్మ భార్య రాజేశ్వరి, ఆరో కుమారుడు బంగారేశ్వరశర్మ భార్య వీరేశ్వరి కూడా టీచర్లే. ఇలా మొత్తం ఆ కుటుంబంలో తొమ్మిది మంది ఉపాధ్యాయులుగా సేవలందిస్తున్నారు. అలాగే, శ్రీనివాసశర్మ కుమార్తె సుబ్బలక్ష్మి కుమారుడు, అల్లుడు కూడా ఉపాధ్యాయులే. మొత్తం మీద ఓలేటి కుటుంబమంతా ఉపాధ్యాయులుగా పనిచేస్తూ నాలుగు తరాలుగా విద్యాభివృద్ధికి కృషిచేస్తోంది. తన కుమారులు ఏడుగురూ తండ్రి ప్రోత్సాహంతోనే ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారని శ్రీనివాసశర్మ సతీమణి ఓలేటి వెంకట సీతామహాలక్ష్మి ‘సాక్షి’కి తెలిపారు. -
లక్షన్నర డాలర్ల పన్ను కట్టిన బైడెన్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దంపతులు 1,50,439 డాలర్ల ఆదాయ పన్ను చెల్లించారు. 2021లో 6,10,702 డాలర్లు ఆర్జించిన బైడెన్, ఆయన భార్య జిల్... దానిపై 24.6 శాతం పన్ను చెల్లించారు. అధ్యక్షుడు కాకముందుతో పోలిస్తే బైడెన్ దంపతుల ఆదాయం తగ్గడం విశేషం. 2019లో పుస్తకాల అమ్మకాలు, ప్రసంగాలు, టీచింగ్ ద్వారా వాళ్లు దాదాపు 10 లక్షల డాలర్లు ఆర్జించారు. ఫస్ట్ లేడీ జిల్ నార్తర్న్ వర్జీనియా కమ్యూనిటీ కాలేజీలో ఇప్పటికీ బోధన వృత్తిలో కొనసాగుతున్నారు. బైడెన్ అధ్యక్షుడయ్యాక తన ఆదాయ పన్ను చెల్లింపు వివరాలు విడుదల చేయడం వరుసగా ఇది రెండో ఏడాది. తద్వారా యూఎస్ ప్రెసిడెంట్లు తమ ఐటీ చెల్లింపులను ప్రజల ముందుంచే సంప్రదాయాన్ని ఆయన పునరుద్ధరించారు. బైడెన్‌కు ముందు అధ్యక్షునిగా చేసిన డొనాల్డ్ ట్రంప్ తన ఆదాయ పన్ను వివరాలు వెల్లడించేందుకు నిరాకరించడం తెలిసిందే. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ దంపతులు 16,55,563 డాలర్ల ఆదాయంపై 5,23,371 డాలర్ల పన్ను చెల్లించారు. -
75 నగరాల్లో ఉపాధ్యాయులకు సెంటా పోటీలు
సాక్షి. హైదరాబాద్ : భారతదేశ వ్యాప్తంగా బోధనలో నైపుణ్యతను పెంపొందించడమే లక్ష్యంగా సెంటా కృషిచేస్తోంది. సెంటర్ ఫర్ టీచర్ అక్రిడిటేషన్(సెంటా), టీచింగ్ ప్రొఫెషనల్స్ ఒలంపియాడ్(టీపీఓ)లు కలిసి సంయుక్తంగా భారతదేశంలో ఉన్న ఉపాధ్యాయులకు వారి నైపుణ్యాలను వెలికి తీసేందుకు ప్రతీ ఏటా వార్షిక పోటీలను నిర్వహిస్తుంటాయి. ఈ సందర్భంగా డిసెంబర్14, 2019న భారతదేశ వ్యాప్తంగా ఉన్న 75 నగరాల్లో ఈ పోటీలను నిర్వహించనున్నారు. ఈ మేరకు సెంటా ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి వారిని ఘనంగా సన్మానించనుంది. అదే విధంగా పోటీలో విజేతలుగా నిలిచినవారికి రూ. లక్ష నగదుతో పిటు రిలయన్స్ ఫౌండేషన్ టీచర్ అవార్డును అందించనున్నారు. అదేవిధంగా టీపీవో ధృవీకరణ పత్రంతో పాటు, యూకేలోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో మాస్టర్ క్లాస్ హాజరయ్యేందుకు అవకాశం కల్పిస్తుంది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు నవంబర్ 25, 2019 తుది గడువని సెంటా తెలిపింది. సెంటా టీపీవో పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి www.centa.org/tpo2019 లింక్ ద్వారా లాగిన్ అయి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ పోటీలకు 18 ఏళ్లకు పైబడి, డిగ్రీ ఉత్తీర్ణులైనవారు, బీఈడీ/డీఈడీ విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయులు, సప్లిమెంటల్ టీచర్లు, ప్రిన్సిపాల్లు, కోఆర్డినేటర్లు, కంటెంట్ క్రియేటర్లు, బోధనాభ్యాసంపై ఆసక్తి కలిగి ఉన్న ఇతరులు ఎవరైనా పాల్గొనవచ్చని సెంటా తెలిపింది. పరీక్షా విధానం సెంటా టీపీఓకు 12 రాష్ట్ర ప్రభుత్వాలు, ఆయా రాష్ట్రాల బోర్డులతో పాటు సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ, కేంబ్రిడ్జీ వంటి అన్ని బోర్డులు అండగా నిలుస్తున్నాయి. భారతదేశవ్యాప్తంగా 30,000కు పైగా పాఠశాలల తరఫున ఉపాధ్యాయులు పోటీ పడుతున్నారు. సెంటా టీపీఓ పరీక్షలో మల్టీపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ఈ పరీక్ష నిడివి రెండు గంటలు కాగా ఎన్సీఈఆర్టీ సిలబస్‌లోని కామన్ టాపిక్‌లకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ప్రధానంగా ఆయా అంశాలను అర్థం చేసుకోవడం, అన్వయించుకోవడంపై ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. సెంటా వ్యవస్థాపకురాలు అంజలీ మాట్లాడుతూ... బోధనను ఉత్తమమైన వృత్తిగా ఎంచుకోవడాన్ని ప్రోత్సహించేందుకు సెంటా టీపీఓ ఎప్పుడు కట్టుబడి ఉంటుంది. ఉపాధ్యాయులలోని ప్రతిభను గుర్తించి నగదుతో ప్రోత్సహిస్తాం. నా జీవితాన్ని మార్చివేసింది సెంటా నా జీవితాన్ని పూర్తిగా మార్చివేసిందని తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా కొత్తపల్లి గ్రామంలో పని చేస్తున్న ప్రభుత్వ టీచర్ తోట శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. ఆయన తెలుగు మీడియం ప్రైమరీ ట్రాక్ టాపర్, టీపీఓ 2018లో 129వ విజేతగా నిలిచారు. ఈ సందర్భంగా దుబాయ్‌లో జరిగిన గ్లోబల్ ఎడ్యుకేషన్ ఆండ్ స్కిల్స్ ఫోరంలో క్రికెట్ లెజెండ్ బ్రియన్ లారా ఆయన్ను ఘనంగా సన్మానించారు. -
లక్షలు కాదు.. లైఫ్ ఉండాలె
సాక్షి, హైదరాబాద్: ఐఐటీయన్లు సరికొత్త పంథాను ఎంచుకుంటున్నారు. దేశంలోని పేరొందిన సాంకేతిక విద్యాసంస్థల నుంచి ఉన్నత చదువులు చదివిన ఎంతో మంది ఇప్పుడు సాఫ్ట్వేర్ సంస్థల్లో, బహుళ జాతి కంపెనీల్లో ఆఫర్లను వదులుకొని అధ్యాపక వృత్తిని ఎంపిక చేసుకుంటున్నారు. ప్రత్యేకంగా కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఐఐటీలో చదువుకున్న వారికి క్యాంపస్‌లోనే అద్భుత ప్యాకేజీలతో దేశ విదేశాల ఆఫర్లు వస్తాయి. అయితే ఈ ప్యాకేజీలు, ఆఫర్లు వారికి సంతృప్తినివ్వడం లేదు. రూ.లక్షల్లో జీతం వస్తున్నా తమ అభిరుచికి అనుగుణంగా టీచింగ్ ప్రొఫెషన్లోకి ప్రవేశిస్తున్నారు. హైదరాబాద్‌లో ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ ఇప్పుడు ఐఐటీ కోచింగ్ సెంటర్లకు హబ్‌గా మారింది. అశోక్‌నగర్, ఇందిరాపార్కు సివిల్స్ కోచింగ్ అడ్డా కాగా.. విద్యానగర్, నల్లకుంట ప్రాంతాలు ఐఐటీ కోచింగ్‌కు కేంద్రంగా మారాయి. ఐఐటీ కోచింగ్‌లో రాజస్థాన్‌లోని కోట తరువాత హైదరాబాద్ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఐఐటీ ఇప్పుడు అన్ని వర్గాల్లో ఒక క్రేజ్‌గా మారింది. పది, ఇంటర్ నుంచే ఐఐటీ కోసం శిక్షణ ఇప్పిస్తున్నారు. ఆడుతూ, పాడుతూ ఐఐటీ శిక్షణ పొందాలనే లక్ష్యంతో శిక్షణనిస్తున్నారు కొందరు ఐఐటీయన్లు. అధ్యాపకుల్లా కాకుండా స్నేహితుల్లా పాఠాలు బోధిస్తున్నారు. 24 గంటల పాటు చదువే కాదు.. సినిమాలు, షికార్లు, సరదా కబుర్లు కూడా జీవితంలో భాగం కావాలని వీరు చెబుతున్నారు. దీనికి అనుగుణంగా శిక్షణలో వైవిధ్యం, వినూత్నం కనబరుస్తూ బోధన చేస్తున్నారు. నగరానికి చెందిన భరత్ ఖరగ్‌పూర్ ఐఐటీలో 2010లో ఎంటెక్ పూర్తి చేశారు. క్యాంపస్ ప్లేస్మెంట్స్ను వదులుకొని టీచింగ్ ప్రొఫెషన్‌ను ఎంపిక చేసుకున్నారు. బహుళ జాతి సాఫ్ట్వేర్ సంస్థల్లో పని చేస్తే బోలెడంత జీతం ఇస్తారు. కానీ ఎలాంటి సంతృప్తి ఉండదు. జీవితం చాలా యాంత్రికంగా గడిచిపోతుంది. అలా రొటీన్‌గా గడపడం నాకు ఇష్టం లేదు. మనకు తెలిసిన జ్ఞానాన్ని, కొత్త విషయాలను బోధించడం వల్ల ఇప్పుడు టీచర్‌గా ఎంతో సంతోషంగా ఉన్నా. ఒక సాఫ్ట్వేర్ నిపుణుడితో పోల్చుకుంటే నా జీతం చాలా తక్కువే. కానీ ఈ జాబ్ చాలా క్రియేటివ్‌గా ఉంది. – భరత్ జస్వంత్ది వైజాగ్. ఖరగ్‌పూర్ ఐఐటీలో ఎంటెక్ పూర్తి చేశారు. నగరంలోని ఒక కోచింగ్ సెంటర్లో ఫిజిక్స్ బోధిస్తున్నారు. ఒక టీచర్‌గా పాఠం చెప్పి వెళ్లడం ఏ మాత్రం సరైన పద్ధతి కాదు. వాళ్లలో ఒక స్టూడెంట్‌గా కలిసిపోయి చర్చించడం వల్ల బోధన సృజనాత్మకంగా ఉండటమే కాకుండా ఆ చర్చలో ప్రతి స్టూడెంట్ భాగస్వామి అవుతాడు. లక్ష్యాన్ని నిర్దేశించుకుంటాడు. క్యాంపస్ ప్లేస్మెంట్ కాదనుకొని ఈ వృత్తికి వచ్చా. ఇది నాకు ఎంతో సంతృప్తినిస్తోంది. – జస్వంత్ విక్రమ్ దాచేపల్లిది సూర్యాపేట జిల్లాలోని లింగాల గ్రామం. వెల్లూరు వీఐటీలో చేరి 2010లో బీటెక్ పూర్తి చేశారు. ఆ మరుసటి సంవత్సరమే ఒక బహుళ జాతి సంస్థలో ఉద్యోగం లభించింది. నెలకు రూ.1.5 లక్షల జీతం. అయితే విక్రమ్‌కు ఆ ఉద్యోగం సంతృప్తినివ్వలేదు. ఒక సాఫ్ట్వేర్ సంస్థలో నాలుగు గోడల మధ్య పని చేయడం నచ్చలేదు, నాకు మొదటి నుంచి టీచింగ్ అంటే ఎంతో ఇష్టం. పైగా ఐఐటీ కోచింగ్‌లో తీవ్రమైన ఒత్తిడికి భిన్నంగా సృజనాత్మకమైన పద్ధతిలో శిక్షణనిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు అని అనిపించింది. అందుకే 2012లో ఐఐటీ అకాడమీని ఏర్పాటు చేశాం. – విక్రమ్ -
ఆచార్య దేవో భవ
సాక్షి, వెబ్‌డెస్క్ : ప్రపంచంలో అతి పవిత్రమైన, గొప్పదైన వృత్తి ఏదన్న ఉందంటే అది ఉపాధ్యాయ వృత్తే. ఎంత గొప్పవారైనా గురువు చేతిలోంచే వెళ్తారు కనుక ఉపాధ్యాయ వృత్తిని అన్ని వృత్తుల కంటే పవిత్రమైనది. మారుతున్న సమాజం విసిరే సవాళ్లను ఎదుర్కొంటూ, తాను మారుతూ, సమాజాన్ని ముందుకు నడిపించే ఒకే ఒక్కడు.. ఉపాధ్యాయుడు. చీకటిని తొలగించి జీవితంలోను, సమాజంలోనూ వెలుగులు ప్రసారించే గొప్ప వ్యక్తి గురువు. పురాణాల్లో కూడా గురువుకు మంచి గౌరవం ఉంది. గురువును దైవంగా భావించేవారు. మరి ప్రస్తుతం ఉపాధ్యాయులకు ఈ ప్రపంచం ఇస్తున్న గౌరవం ఎంత? సమాజంలో వారిని ఏ దేశంలో ఎక్కువగా గౌరవిస్తున్నారు? ఇదే విషయంపై తాజాగా ‘వర్కీ ఫౌండేషన్’ అనే అంతర్జాతీయ సంస్థ సర్వే నిర్వహించింది. ఉపాధ్యాయులను అత్యంత గౌరవం ఇచ్చే దేశాల్లో చైనా ప్రథమ స్థానంలో నిలిచిందని సర్వేలో వెల్లడించింది. ప్రపంచంలో ఆర్థికంగా అభివృద్ధి చెందిన 35 దేశాల్లో నిర్వహించిన ఈ సర్వేలో.. ద్వితీయ, తృతీయ స్థానాల్లో మలేసియా, తైవాన్ ఉండగా, భారత్ ఎనిమిదవ ర్యాంకు సాధించింది. బ్రెజిల్, ఇజ్రాయెల్, ఇటలీ దేశాలు చివరి స్థానాల్లో నిలిచాయి. అభివృద్ధిలో దూసుకుపోతున్న జపాన్ లాంటి దేశాల్లో కూడా ఉపాధ్యాయులకు గౌరవం అంతంతమాత్రంగానే ఉంది. కానీ 2013నాటి సర్వేతో పోల్చుకుంటే జపాన్, స్విట్జర్లాండ్ దేశాల్లో ఉపాధ్యాయ గౌరవం 20శాతం మేర పెరిగింది. చైనాలో ఉపాధ్యాయులపై గౌరవం ఉందని 81 శాతం మంది చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో అది 36 శాతం ఉంది. వీరే ఎక్కువగా టీచర్లను గౌరవిస్తారు వర్కీ పౌండేషన్ సర్వేలో ఏ వర్గానికి చెందిన వారు ఎక్కువగా టీచర్లను గౌరవిస్తున్నారు అనే అంశాన్ని కూడా అధ్యయనం చేశారు. సర్వే ప్రకారం..వృద్ధులు ఎక్కువ శాతం మేరకు ఉపాధ్యాయులను గౌరవిస్తున్నారు. మహిళల కంటే పురుషులే ఉపాధ్యాయులను ఎక్కువగా గౌరవిస్తున్నారు. నాన్గ్రాడ్యూయేట్స్ కంటే గ్రాడ్యూయేట్సే టీచర్లకు ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తున్నారు.సంతానం లేని వారికంటే సంతానం ఉన్న తల్లిదండ్రులే గురువలను గౌరవిస్తున్నారు. యూరప్, దక్షిణ అమెరికా దేశాల్లో ఉపాధ్యాయులను విద్యార్థులు గౌరవించడం తక్కువగా ఉందని ఈ అధ్యయనం తెలిపింది. 35దేశాల్లో గురువులకు ఇచ్చే గౌరవ సూచిక ఉపాధ్యాయ వృత్తిని ప్రోత్సహించే దేశాలు ఇవే ఎంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకోవాలని కోరుకుంటున్నారో కూడా వర్కీ ఫౌండేషన్ అధ్యయనం చేసింది. భారత్, చైనా, ఘనా, మలేషియా దేశాల్లో అత్యధిక కుటుంబాలు తమ పిల్లలను బోధనా వృత్తిని ఎంచుకునేలా ప్రోత్సహిస్తున్నారు. యూఎస్‌లో మాత్రం తల్లిదండ్రులు తమ పిల్లలు ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకోకుండా నిరుత్సాహపరుస్తున్నారని తేలింది.ఉపాధ్యాయులను గౌరవించే సంస్కృతి చైనా, భారత్, సింగపూర్, దక్షిణ కొరియా సహా ఆసియా దేశాల్లో బలంగా ఉంది. ఈ దేశాల విద్యార్థులు అంతర్జాతీయ స్థాయి పరీక్షల్లోనూ మెరుగైన ప్రతిభ కనబరుస్తున్నారు. రానున్న రోజుల్లో టీచర్ల పాత్రలో సమాజంలో మరింత కీలకం కానుందని సంస్థ వెల్లడించింది. టెక్నాలజీ పరంగా యువతకు మార్గదర్శకంగా ఉపాధ్యాయుడు ఉండబోతున్నారని పేర్కొంది. ఉపాధ్యాయలకు మంచి గౌరవం లభించినప్పుడు ఆ వృత్తిని ఎంచుకునేందుకు ప్రతిభావంతులు ఎక్కువగా ముందుకొస్తారని, దాంతో చదువుల్లో మెరుగైన ఫలితాలు వస్తాయని ఈ అధ్యయనం చెబుతోంది. -
బోధన వృత్తి.. తాత ఇచ్చిన ఆస్తి
చిరునవ్వుల స్నేహశీలి సర్వేపల్లి ఏయూ క్యాంపస్(విశాఖ తూర్పు): పరిచయం అవసరం లేని వ్యక్తిత్వం.. అధ్యాపక వృత్తికే వన్నె తెచ్చిన ప్రతిభ.. భారతదేశానికి రాష్ట్రపతిగా పనిచేసిన గొప్ప తత్వవేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా ఆయన పనిచేశారు. సర్వేపల్లి మనుమడు గౌతమ్ రాధాకృష్ణన్ గురువారం ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. తాతతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ విశేషాలను ఆయన మాటల్లోనే విందాం. బోధన వృత్తి.. తాత ఇచ్చిన ఆస్తి తాత అధ్యాపకుడిగా ప్రపంచానికి పరిచయం అయ్యారు. మాలో 12 మంది వేర్వేరు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. నేనొక్కడినే అధ్యాపక వృత్తిలోకి వచ్చాను. ఆయన నుంచి నాకు వచ్చిన ఆస్తి అధ్యాపక వృత్తే. వ్యక్తిగత జీవితం వేరు మా తాతకు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు. మొత్తం 13 మంది మనుమలం. ఒకరు చనిపోగా ప్రస్తుతం 12 మంది ఉన్నాం. నేను చిన్న కుమార్తె కుమారుడిని. తాత వ్యక్తిగత జీవితానికి, వృత్తి పరమైన జీవితానికి వ్యత్యాసం ఉండేది. రెండింటికీ తగిన సమయం కేటాయించేవారు. ఆడంబరాలకు దూరం తాత ఎక్కువగా మాకు దగ్గరవడానికే ప్రయత్నించే వారు. ఎప్పుడూ మీరు అని సంభోదించడానికి ఇష్టపడే వారు కాదు. నువ్వు అని పిలవమనే వారు. సాధారణంగా ఉండాలని కోరుకునేవారు. ఏనాడూ ఆడంబరాలకు పోలేదు. రూపాయి వేతనం తీసుకునే వారు తాత రాష్ట్రపతిగా పనిచేసిన సమయంలో కేవలం ఒక రూపాయి వేతనంగా తీసుకునేవారు. రాష్ట్రపతి భవన్ లో ఒక పాత కారు ఉండేది. మా కుటుంబ సభ్యులు, బంధువులు ఎవరు వచ్చినా స్టేషన్ నుంచి ఆ పాత కారులోనే తీసుకువచ్చేవారు. కారు తరచూ మరమ్మత్తులకు గురవుతున్నప్పటికీ.. అధికారిక వాహనాలను కుటుంబ అవసరాలకు ఎప్పుడూ వాడలేదు. ప్రత్యేకంగా వంటగది, వ్యక్తిగత వంట మనిషి ఉండేవారు. తాత వాడిన పాత కారు డ్రైవర్‌కు సొంతంగా వేతనం ఇచ్చేవారు. తాతలో చిరునవ్వే చూశాను ఆయనలో ఎప్పుడూ కోపం చూడలేదు. హాస్యంతో అందరినీ ఆనంద పరిచేవారు. గంభీరమైన సందర్భాలను సైతం ఆయన ఎంతో నవ్వుతూ స్వీకరించేవారు. ఆయనను నేను చాలా దగ్గరగా చూశాను. కుటుంబసభ్యుల పైనే కాదు.. ఎవ్వరిపైనా కోపగించుకోవడం నా జీవితంలో చూడలేదు. నేను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో మూడు దశాబ్దాల పైగా పనిచేశాను. దశాబ్ద కాలం వరకు నేను సర్వేపల్లి మనవడిననే విషయం ఎవ్వరికి తెలియదు. అన్నం, చారు, అప్పడం నేను చూసిన రోజుల్లో తాత ఎప్పుడూ భోజన ప్రియుడిగా కనిపించలేదు. ఎక్కడికైనా పార్టీలకు వెళ్లాల్సి ఉన్నా ఇంటిలో వండిన అన్నం, చారు, అప్పడం వంటి వాటితో భోజనం ముగించేవారు. సభా మర్యాద కోసం అందిరితో కలసి భోజనం వద్ద కూర్చునేవారు. ఎన్ని ఆహార పదార్థాలు ఉన్నా.. ఆయన మాత్రం పరిమితంగానే తినేవారు. ఎక్కువగా గడిపా..తాతతో చిన్నతనంలో ఎక్కువ సమయం తాతతో గడిపే అవకాశం వచ్చింది. నాకు ఊహ తెలిసిన నాటి నుంచి సుమారు 15 ఏళ్ల కాలం తాతను దగ్గరగా చూశాను. తాత వాస్తవిక దృక్పథం ఉన్న వ్యక్తి. రాష్ట్రపతిగా ఉన్న సమయంలో ప్రసంగ పాఠాన్ని ఆయనే తయారు చేసుకునేవారు. ఒక రోజు గుండె సంబంధిత ప్రసంగం ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. నేను అనుకోకుండా తాత గదిలోనికి వెళ్లాను. వెంటనే గుండె జబ్బులు ఎందుకు వస్తాయి అంటూ ప్రశ్నించారు. గుండె ఎలా పని చేస్తుంది, గుండె సమస్యలు ఎలా వస్తాయి అనే విషయాలు తెలియజేశారు. ఆయన పరిశోధన ఆసక్తికి ఈ సంఘటన నిదర్శనం. -
టీచర్లకు టోపీ !
గుంటూరు ఎడ్యుకేషన్ : ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలని రెండేళ్ళుగా ఎదురుచూసిన నిరుద్యోగుల ఆశలు ఎక్కువ కాలం నిలువలేదు. పాఠశాలల్లో పోస్టింగ్స్ పొందిన ఉపాధ్యాయులకు జూన్ నెల జీతంలో సగం కోత పడనుండగా, డీఈవో పూల్‌లో ఉంచిన వారికి అసలు జీతమే విడుదల కాని పరిస్థితి ఏర్పడింది. డీఎస్సీలో ఉపాధ్యాయులుగా ఎంపికైన వారందరికీ జూన్ 1వ తేదీన పోస్టింగ్స్ ఇవ్వడంతో పాటు అదే రోజు నుంచి వేతన చెల్లింపు పరిధిలోకి వస్తారని ప్రకటించిన ప్రభుత్వం వారిని మోసగించింది. డీఎస్సీ-2014లో ప్రతిభ ఆధారంగా అర్హత సాధించిన అభ్యర్థులతో ఈనెల 1వ తేదీన సీఎం చంద్రబాబు విజయవాడలో నిబద్ధత ప్రమాణం సైతం చేయించారు. జిల్లాలో డీఎస్సీ ద్వారా వివిధ కేటగిరీల్లో 890 మంది నియామకం పొందగా, వారిలో 300 మందికి పోస్టింగ్స్ కల్పించలేదు. ఉపాధ్యాయులుగా ఎంపికైన వారందరికీ ఈనెల 3వ తేదీ నుంచి శిక్షణ కల్పించిన ప్రభుత్వం 13న పాఠశాలల్లో పోస్టింగ్స్ కల్పించింది. వారందరినీ జూన్ ఒకటో తేదీ నుంచి విధుల్లో చేరినట్లుగా పరిగణించాల్సి ఉండగా, విధుల్లో చేరి రోజు నుంచే విద్యాశాఖ అధికారికంగా హాజరు నమోదు చేయడంతో జూన్ నెలకు సగం జీతమే చెల్లించనున్నారు. వారికి జీతాలు నిల్.. పాఠశాలల్లో ఖాళీలు లేకపోవడంతో డీఈవో పూల్‌లో ఉంచిన 300 మంది అభ్యర్థులకుజీతాలు విడుదలయ్యే పరిస్థితి లేదు. పాఠశాలల్లో చేరి ఉపాధ్యాయులుగా నమోదైతేనే వారి వివరాలు ట్రెజరీకి పంపడం జరుగుతుంది. డీఈవోకు అటాచ్ చేసినప్పటికీ పాఠశాలల్లో నియామకం పొందని కారణంగా 300 మంది అభ్యర్థులకు జీతాల చెల్లింపులపై ఎలాంటి ఉత్తర్వులు విడుదల కాలేదు. డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయులుగా ఎంపికయ్యామనే ఆనందం మినహా, జీతాలు పొందే పరిస్థితి లేకపోయింది. దీంతో ఉపాధ్యాయులుగా ఎంపికైన వారు సగం జీతం పొందుతుండగా, పోస్టింగ్స్ అందుకుని పాఠశాలలకు కేటాయించని అభ్యర్థులకు అసలు జీతమే చెల్లించని పరిస్థితి నెలకొంది. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం జిల్లాలో డీఎస్సీ-2014 ద్వారా నియామకం పొందిన ఉపాధ్యాయులకు వారు విధుల్లో చేరిన జూన్ 13వ తేదీ నుంచే వేతనాల లెక్కింపు జరుగుతుంది. డీఈవో పూల్‌లో ఉంచిన అభ్యర్థులకు వేతనాలు చెల్లింపు విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. - కేవీ శ్రీనివాసులు రెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి -
డీఎడ్ సీట్ల కోసం బేరసారాలు
ఉపాధ్యాయ వృత్తి చేపట్టేందుకు మొదటి మెట్టు ఛాత్రోపాధ్యాయ విద్య. గౌరవమైన వృత్తికావడం, ఉద్యోగావకాశా లు ఎక్కువగా ఉండడంతో ఎక్కువ మంది ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో ఉపాధ్యాయ శిక్షణ కళాశాలల్లో సీట్ల కోసం విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. డీఎడ్ చేసిన వారితోనే ఎస్జీటీ పోస్టులు భర్తీ చేస్తుండడంతో ఆ కోర్సుకు ఆసక్తి పెరిగింది. విద్యార్థుల అవసరాన్ని కళాశాలల యాజమాన్యాలు సొమ్ము చేసుకునేందుకు అప్పుడే సీట్ల బేరం మొదలెట్టాయి. సీటుకు రూ.రెండు లక్షలకు తక్కువ కాకుండా వసూలు చేస్తున్నారుు. శాతవాహన యూనివర్సిటీ : ఉపాధ్యాయ నియామకాలకు డీఎడ్, బీఎడ్, బీపీఈడీ, టీపీటీ, హెచ్‌పీటీ చేసినవారు అర్హులు. సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్జీటీ) పోస్టులకు గతంలో బీఈడీ, డీఈడీ చేసిన వారికి అర్హత ఉండగా.. గత డీఎస్సీ నుంచి ఆ అవకాశం తొలగిం చారు. కేవలం డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఎ డ్) చదివిన వారే ఎస్జీటీ పోస్టులకు అర్హులని ప్రభుత్వం తేల్చిచెప్పింది. అప్పటినుంచి డీఎడ్ కోర్సుకు భారీగా డిమాండ్ పెరిగింది. కళాశాలలు తక్కువగా ఉండడం, ప్రాథమికోన్నత స్థాయి వరకు బోధించే ఎస్టీటీల నియామకాలే ఎక్కువగా ఉంటుండడంతో ఈ కోర్సు చేస్తే ఉద్యోగం గ్యారెంటీ అనే పరిస్థితి ఏర్పడింది. డీఎడ్‌కు ఇంటర్మీడియెట్ అర్హత కాగా, చాలామంది ఆసక్తి చూపుతున్నారు. జూన్ 15న ప్రవేశపరీక్ష ఉండగా... పరీక్షకు ముందే తమ దగ్గర ఉన్న 20 శాతం మేనేజ్మెంట్ కోటా సీట్లను యాజమాన్యాలు బేరానికి పెట్టాయి. అభ్యర్థుల ఫోన్ నంబర్లు సంపాదించిన కళాశాలల పీఆర్వో లు ఫోన్ చేస్తూ గాలం వేస్తున్నారు. పరీక్ష రాసి ర్యాంకులు వ చ్చేలోగానే యాజమాన్య కోటా సీట్లు నిండిపోతాయని, ముందుగానే సీటు రిజర్వ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. కొన్ని కళాశాలలు ఫీజు చెల్లించి ఫైనల్ పరీక్షలు రాస్తే చాలు... మిగతాదంతా తామే చూసుకుంటామని బంపర్ ఆఫర్ ప్రకటిస్తున్నాయి. ఇందుకు కొంత అదనపు సొమ్ము ఇస్తే చాలని చెబుతున్నాయి. కాసుల పంట జిల్లాలో ఒక గవర్నమెంట్ కళాశాల(ఎల్ఎండీలోని డైట్), 20 ప్రైవేట్ కళాశాలలు ఈ కోర్సు అందిస్తున్నాయి. కళాశాల కు 100 సీట్ల చొప్పున మొత్తం రెండు వేల సీట్లు ఉన్నాయి. గవర్నమెంట్ కళాశాల పోను ప్రైవేట్ కళాశాలల్లో 80 శాతం కన్వీనర్ కోటా, 20 శాతం మేనేజ్మెంట్ కోటాలో భర్తీ చే స్తారు. అంటే 400 సీట్లు మేనేజ్మెంట్ కోటాలో అందుబాటులో ఉన్నాయి. డైట్‌సెట్ ఎంట్రెన్స్ రాయకున్నా మేనేజ్మెంట్ కోటాలో సీటు పొందవచ్చు. కోర్సు డిమాండ్ దృష్ట్యా కళాశాలల యాజమాన్యాలు సీట్ల ఖరీదు పెంచి కాసులపంట పండించుకుంటున్నాయి. కన్వీనర్ కోటా సీటు అయితే ఫీజు ఏడాదికి రూ.12,500 ఉంటుంది. దీంతో కళాశాలలకు పె ద్దగా రాబడి ఏమీ ఉండదు. రాబడి అంతా యాజమాన్యకో టా సీట్లనుంచే. దీంతో ఈ కోటాలో ఒక్కో సీటు రూ.2 లక్షల కుపైనే పలుకుతోందని సమాచారం. ఇది సరిపోదన్నట్టు 20 శాతం మేనేజ్మెంట్ కోటా సీట్లు సరిపోవని, 50 శాతం భర్తీ కి అవకాశం ఇవ్వాలని యాజమాన్యాలు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించాయి. తెరపైకి నాలుగేళ్ల ప్రతిపాదన డీఎడ్ కోర్సు గతంలో ఒకే సంవత్సరం ఉండేది. ప్రమాణా లు పెంచేందుకని పదేళ్ల క్రితం రెండేళ్ల కోర్సుగా చేశారు. ఒక ఏడాది క్లాసులు, మరో ఏడాది పాఠశాలలకు వెళ్లి బోధిం చడం ఉంటాయి. మారుతున్న ప్రమాణాలకు అనుగుణంగా బోధనా విధానం మరింత మెరుగుపరిచేందుకు డీఈడీ కోర్సును నాలుగేళ్లు, బీఈడీని రెండేళ్ల కోర్సుగా చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదనను డీఎడ్ కళాశాలల యాజమాన్యాలు ధనార్జనకు అవకాశంగా మలుచుకుంటున్నాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచి డీఎడ్ కోర్సు నాలుగేళ్లవుతుందని, ఈ ఏడాదే చివరి అవకాశమంటూ విద్యార్థుల నుంచి భారీగా దండుకునే ప్లాన్ వేస్తున్నాయి. ఒకప్పుడు పటిష్టంగా ఉన్న డీఎడ్ కోర్సు ప్రైవేట్ కళాశాలల్లో ప్రస్తుతం ప్రమాణాలు తగ్గడానికి ప్రభుత్వ పర్యవేక్షణ లోపమే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తరగతులకు విద్యార్థులు వస్తున్నారా? కళాశాలల్లో ల్యాబ్, లైబ్రరీలాంటి సౌకర్యాలు ఉంటున్నాయా? అధ్యాపకులు ఉంటున్నారా? అనే విషయమై అధికారులు పర్యవేక్షణ చేయడం లేదనే విమర్శలున్నాయి. ఏటా కళాశాలల గుర్తింపు రెన్యూవల్ చేసుకునే సమయంలోనూ.. ఎంతో కొంత ముట్టజెప్పి తనిఖీలు లేకుండానే కళాశాలలు తమ పని కానిచ్చేసుకుంటున్నాయనే ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి కళాశాల్లో ఎంపిక పారదర్శకంగా జరిగేలా, అన్ని వసతులతో మెరుగైన బోధన అందించేలా చూడాలని విద్యార్థులు కోరుతున్నారు. -
ఉపాధ్యాయ వృత్తిపై తగ్గుతున్న గౌరవం
అనంతపురం ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ : ‘పిల్లలను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయ వృత్తిపై సమాజంలో గౌరవం తగ్గుతోందని ఆర్వీఎం రాష్ట్ర అకడమిక్ మానిటరింగ్ అధికారి (ఏఎంఓ) రాజ్యలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ హాలులో ‘పాఠశాల నాయకత్వం’ అనే అంశంపై ఆర్వీఎం ఆధ్వర్యంలో విద్యాశాఖ అధికారులు, ఎమ్మార్జీలకు ఏ ర్పాటు చేసిన రెండు రోజుల జిల్లా స్థాయి వర్క్‌షాపును సోమవారం ఆమె ప్రారంభించారు. కార్యక్రమానికి పీఓ కేఎస్ రా మారావు అధ్యక్షత వహించారు. స్టేట్ ఏఎంఓ మాట్లాడుతూ వృత్తి అంటే ఒకప్పుడు ఎనలేని గౌరవం ఉండేదన్నారు. తరగతి గదుల్లో చదువుకున్న ఎందరో అనేకరంగాల్లో లీడర్లుగా ఎదిగారన్నారు. ఇలాంటి లీడర్ల నుతయారు చేస్తున్న లీడర్ల (ఉపాధ్యాయుల్లో)లో నాయకత్వ లక్షణాలు కరువయ్యాయన్నారు. ఫలితంగా ప్రభుత్వ విద్యా వ్య వస్థ మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని ఆమె ఆందోళన వ్య క్తం చేశారు. పాఠశాలల్లో పిల్లలకు పాఠ్యపుస్తకాలు, యూనీఫాం, మధ్యా హ్న భో జనం, అర్హులైన టీచర్లు, తదితర సౌకర్యాల కోసం ప్రభుత్వం రూ. కోట్లు ఖర్చు పెడుతోందన్నారు. అయినా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఏడాదికేడాది తగ్గుతోందని విచారం వ్యక్తం చేశారు. ప్ర భుత్వ ఉద్యోగుల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదవాలనే జీఓ తీసుకురావడంతో చదువులో కేరళ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందన్నారు. తరగతి గది నా యకుడు ఉపాధ్యాయుడు, పాఠశాల నాయకుడు ప్రధానోపాధ్యాయుడన్నారు. అన్ని అంశాల్లోనూ నాయకుడిగా ఆలోచించి అమలు చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయన్నారు. డీఈఓ మధుసూదన్‌రావు, పీఓ కేఎస్ రామారావు మాట్లాడుతూ పర్యవేక్షణ లోపిస్తే ఆశించిన ఫలితాలు రావన్నారు. ఉపాధ్యాయులు పిల్లల్లో మమేకం కావాలన్నారు. డైట్ కళాశాల ప్రిన్సిపల్ మునెయ్య మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో విద్యా వ్యవస్థను బతికించుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆర్వీఎం కార్యక్రమాలపై ప్రదర్శన వర్క్‌షాపు సందర్భంగా జిల్లాలో ఆర్వీ ఎం అభివృద్ధి కార్యక్రమాలను పవర్ పా యింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్ర ఏం ఎంఓ రాజ్యలక్ష్మికి వివరించారు. ‘మోడల్ స్కూల్‌గా ఎంపీపీఎస్ ఉరవకొండ’, ‘ మోడల్ కాల్ స్కూల్‌గా ఆర్. కొత్తూరు, బీకేఎస్ మండలం’, ‘మోడల్ కేజీబీవీగా బుక్కరాయసముద్రం’, ‘మోడల్ భవిత కేంద్రంగా బత్తలపల్లి’, ‘మోడల్ ఎస్ఎంసీగా నామనాంకపల్లి, పెద్దపప్పూరు మండలం’, ‘మోడల్ అర్బన్ డి ప్రైవ్డ్ హాస్టల్‌గా అనంతపురం’ను ప్ర జెంటేషన్ ద్వారా పీఓ వివరించారు. ఏఎంఓలు బాల, వెంకటాచారి, స్టేట్ సీ ఎంఓ బండి సాయన్న, విద్యాశాఖ ఏడీ పగడాల లక్ష్మీనారాయణ, డైట్ లెక్చరర్లు సుబ్బారావు, సాయిప్రసాద్, ఇన్చార్జ్ ఏంఎంఓ గురుప్రసాద్, పాఠశాల ఆ రోగ్య సమన్వయకర్త జయశేఖర్‌రెడ్డి, సీ ఎంఓ దివాకర్‌రెడ్డి, అలెస్కో శ్రీనివాసరావు, ఐఈ కోఆర్డినేటర్ పాండురంగ పాల్గొన్నారు.