డీఎడ్ సీట్ల కోసం బేరసారాలు | D.ed to bargaining for seats | Sakshi
Sakshi News home page

డీఎడ్ సీట్ల కోసం బేరసారాలు

Published Sun, Jun 15 2014 2:46 AM | Last Updated on Sat, Sep 2 2017 8:48 AM

డీఎడ్ సీట్ల కోసం బేరసారాలు

డీఎడ్ సీట్ల కోసం బేరసారాలు

 ఉపాధ్యాయ వృత్తి చేపట్టేందుకు మొదటి మెట్టు ఛాత్రోపాధ్యాయ విద్య. గౌరవమైన వృత్తికావడం, ఉద్యోగావకాశా లు ఎక్కువగా ఉండడంతో ఎక్కువ మంది ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో ఉపాధ్యాయ శిక్షణ కళాశాలల్లో సీట్ల కోసం విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. డీఎడ్ చేసిన వారితోనే ఎస్జీటీ పోస్టులు భర్తీ చేస్తుండడంతో ఆ కోర్సుకు ఆసక్తి పెరిగింది. విద్యార్థుల అవసరాన్ని కళాశాలల యాజమాన్యాలు సొమ్ము చేసుకునేందుకు అప్పుడే సీట్ల బేరం మొదలెట్టాయి. సీటుకు రూ.రెండు లక్షలకు తక్కువ కాకుండా వసూలు చేస్తున్నారుు.
 
శాతవాహన యూనివర్సిటీ : ఉపాధ్యాయ నియామకాలకు డీఎడ్, బీఎడ్, బీపీఈడీ, టీపీటీ, హెచ్‌పీటీ చేసినవారు అర్హులు. సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్జీటీ) పోస్టులకు గతంలో బీఈడీ, డీఈడీ చేసిన వారికి అర్హత ఉండగా.. గత డీఎస్సీ నుంచి ఆ అవకాశం తొలగిం చారు. కేవలం డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఎ డ్) చదివిన వారే ఎస్జీటీ పోస్టులకు అర్హులని ప్రభుత్వం తేల్చిచెప్పింది. అప్పటినుంచి డీఎడ్ కోర్సుకు భారీగా డిమాండ్ పెరిగింది.

కళాశాలలు తక్కువగా ఉండడం, ప్రాథమికోన్నత స్థాయి వరకు బోధించే ఎస్టీటీల నియామకాలే ఎక్కువగా ఉంటుండడంతో ఈ కోర్సు చేస్తే ఉద్యోగం గ్యారెంటీ అనే పరిస్థితి ఏర్పడింది. డీఎడ్‌కు ఇంటర్మీడియెట్ అర్హత కాగా, చాలామంది ఆసక్తి చూపుతున్నారు. జూన్ 15న ప్రవేశపరీక్ష ఉండగా... పరీక్షకు ముందే తమ దగ్గర ఉన్న 20 శాతం మేనేజ్‌మెంట్ కోటా సీట్లను యాజమాన్యాలు బేరానికి పెట్టాయి.

అభ్యర్థుల ఫోన్ నంబర్లు సంపాదించిన కళాశాలల పీఆర్వో లు ఫోన్ చేస్తూ గాలం వేస్తున్నారు. పరీక్ష రాసి ర్యాంకులు వ చ్చేలోగానే యాజమాన్య కోటా సీట్లు నిండిపోతాయని, ముందుగానే సీటు రిజర్వ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. కొన్ని కళాశాలలు ఫీజు చెల్లించి ఫైనల్ పరీక్షలు రాస్తే చాలు... మిగతాదంతా తామే చూసుకుంటామని బంపర్ ఆఫర్ ప్రకటిస్తున్నాయి. ఇందుకు కొంత అదనపు సొమ్ము ఇస్తే చాలని చెబుతున్నాయి.
 
కాసుల పంట
జిల్లాలో ఒక గవర్నమెంట్ కళాశాల(ఎల్‌ఎండీలోని డైట్), 20 ప్రైవేట్ కళాశాలలు ఈ కోర్సు అందిస్తున్నాయి. కళాశాల కు 100 సీట్ల చొప్పున మొత్తం రెండు వేల సీట్లు ఉన్నాయి. గవర్నమెంట్ కళాశాల పోను ప్రైవేట్ కళాశాలల్లో 80 శాతం కన్వీనర్ కోటా, 20 శాతం మేనేజ్‌మెంట్ కోటాలో భర్తీ చే స్తారు. అంటే 400 సీట్లు మేనేజ్‌మెంట్ కోటాలో అందుబాటులో ఉన్నాయి. డైట్‌సెట్ ఎంట్రెన్స్ రాయకున్నా మేనేజ్‌మెంట్ కోటాలో సీటు పొందవచ్చు. కోర్సు డిమాండ్ దృష్ట్యా కళాశాలల యాజమాన్యాలు సీట్ల ఖరీదు పెంచి కాసులపంట పండించుకుంటున్నాయి.

కన్వీనర్ కోటా సీటు అయితే ఫీజు ఏడాదికి రూ.12,500 ఉంటుంది. దీంతో కళాశాలలకు పె ద్దగా రాబడి ఏమీ ఉండదు. రాబడి అంతా యాజమాన్యకో టా సీట్లనుంచే. దీంతో ఈ కోటాలో ఒక్కో సీటు రూ.2 లక్షల కుపైనే పలుకుతోందని సమాచారం. ఇది సరిపోదన్నట్టు 20 శాతం మేనేజ్‌మెంట్ కోటా సీట్లు సరిపోవని, 50 శాతం భర్తీ కి అవకాశం ఇవ్వాలని యాజమాన్యాలు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించాయి.
 
తెరపైకి నాలుగేళ్ల ప్రతిపాదన
డీఎడ్ కోర్సు గతంలో ఒకే సంవత్సరం ఉండేది. ప్రమాణా లు పెంచేందుకని పదేళ్ల క్రితం రెండేళ్ల కోర్సుగా చేశారు. ఒక ఏడాది క్లాసులు, మరో ఏడాది పాఠశాలలకు వెళ్లి బోధిం చడం ఉంటాయి. మారుతున్న ప్రమాణాలకు అనుగుణంగా బోధనా విధానం మరింత మెరుగుపరిచేందుకు డీఈడీ కోర్సును నాలుగేళ్లు, బీఈడీని రెండేళ్ల కోర్సుగా చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదనను డీఎడ్ కళాశాలల యాజమాన్యాలు ధనార్జనకు అవకాశంగా మలుచుకుంటున్నాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచి డీఎడ్ కోర్సు నాలుగేళ్లవుతుందని, ఈ ఏడాదే చివరి అవకాశమంటూ విద్యార్థుల నుంచి భారీగా దండుకునే ప్లాన్ వేస్తున్నాయి.

ఒకప్పుడు పటిష్టంగా ఉన్న డీఎడ్ కోర్సు ప్రైవేట్ కళాశాలల్లో ప్రస్తుతం ప్రమాణాలు తగ్గడానికి ప్రభుత్వ పర్యవేక్షణ లోపమే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తరగతులకు విద్యార్థులు వస్తున్నారా? కళాశాలల్లో ల్యాబ్, లైబ్రరీలాంటి సౌకర్యాలు ఉంటున్నాయా? అధ్యాపకులు ఉంటున్నారా? అనే విషయమై అధికారులు పర్యవేక్షణ చేయడం లేదనే విమర్శలున్నాయి. ఏటా కళాశాలల గుర్తింపు రెన్యూవల్ చేసుకునే సమయంలోనూ.. ఎంతో కొంత ముట్టజెప్పి తనిఖీలు లేకుండానే కళాశాలలు తమ పని కానిచ్చేసుకుంటున్నాయనే ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి కళాశాల్లో ఎంపిక పారదర్శకంగా జరిగేలా, అన్ని వసతులతో మెరుగైన బోధన అందించేలా చూడాలని విద్యార్థులు కోరుతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement