సాక్షి, హైదరాబాద్: ఐఐటీయన్లు సరికొత్త పంథాను ఎంచుకుంటున్నారు. దేశంలోని పేరొందిన సాంకేతిక విద్యాసంస్థల నుంచి ఉన్నత చదువులు చదివిన ఎంతో మంది ఇప్పుడు సాఫ్ట్‌వేర్ సంస్థల్లో, బహుళ జాతి కంపెనీల్లో ఆఫర్లను వదులుకొని అధ్యాపక వృత్తిని ఎంపిక చేసుకుంటున్నారు. ప్రత్యేకంగా కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఐఐటీలో చదువుకున్న వారికి క్యాంపస్‌లోనే అద్భుత ప్యాకేజీలతో దేశ విదేశాల ఆఫర్లు వస్తాయి. అయితే ఈ ప్యాకేజీలు, ఆఫర్లు వారికి సంతృప్తినివ్వడం లేదు. రూ.లక్షల్లో జీతం వస్తున్నా తమ అభిరుచికి అనుగుణంగా టీచింగ్ ప్రొఫెషన్‌లోకి ప్రవేశిస్తున్నారు.
హైదరాబాద్‌లో ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ ఇప్పుడు ఐఐటీ కోచింగ్ సెంటర్లకు హబ్‌గా మారింది. అశోక్‌నగర్, ఇందిరాపార్కు సివిల్స్ కోచింగ్ అడ్డా కాగా.. విద్యానగర్, నల్లకుంట ప్రాంతాలు ఐఐటీ కోచింగ్‌కు కేంద్రంగా మారాయి. ఐఐటీ కోచింగ్‌లో రాజస్థాన్‌లోని కోట తరువాత హైదరాబాద్ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఐఐటీ ఇప్పుడు అన్ని వర్గాల్లో ఒక క్రేజ్‌గా మారింది. పది, ఇంటర్ నుంచే ఐఐటీ కోసం శిక్షణ ఇప్పిస్తున్నారు. ఆడుతూ, పాడుతూ ఐఐటీ శిక్షణ పొందాలనే లక్ష్యంతో శిక్షణనిస్తున్నారు కొందరు ఐఐటీయన్లు. అధ్యాపకుల్లా కాకుండా స్నేహితుల్లా పాఠాలు బోధిస్తున్నారు. 24 గంటల పాటు చదువే కాదు.. సినిమాలు, షికార్లు, సరదా కబుర్లు కూడా జీవితంలో భాగం కావాలని వీరు చెబుతున్నారు. దీనికి అనుగుణంగా శిక్షణలో వైవిధ్యం, వినూత్నం కనబరుస్తూ బోధన చేస్తున్నారు.
నగరానికి చెందిన భరత్ ఖరగ్‌పూర్ ఐఐటీలో 2010లో ఎంటెక్ పూర్తి చేశారు. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌ను వదులుకొని టీచింగ్ ప్రొఫెషన్‌ను ఎంపిక చేసుకున్నారు.
బహుళ జాతి సాఫ్ట్‌వేర్ సంస్థల్లో పని చేస్తే బోలెడంత జీతం ఇస్తారు. కానీ ఎలాంటి సంతృప్తి ఉండదు. జీవితం చాలా యాంత్రికంగా గడిచిపోతుంది. అలా రొటీన్‌గా గడపడం నాకు ఇష్టం లేదు. మనకు తెలిసిన జ్ఞానాన్ని, కొత్త విషయాలను బోధించడం వల్ల ఇప్పుడు టీచర్‌గా ఎంతో సంతోషంగా ఉన్నా. ఒక సాఫ్ట్‌వేర్ నిపుణుడితో పోల్చుకుంటే నా జీతం చాలా తక్కువే. కానీ ఈ జాబ్ చాలా క్రియేటివ్‌గా ఉంది.
– భరత్
జస్వంత్‌ది వైజాగ్. ఖరగ్‌పూర్ ఐఐటీలో ఎంటెక్ పూర్తి చేశారు. నగరంలోని ఒక కోచింగ్ సెంటర్‌లో ఫిజిక్స్ బోధిస్తున్నారు.
ఒక టీచర్‌గా పాఠం చెప్పి వెళ్లడం ఏ మాత్రం సరైన పద్ధతి కాదు. వాళ్లలో ఒక స్టూడెంట్‌గా కలిసిపోయి చర్చించడం వల్ల బోధన సృజనాత్మకంగా ఉండటమే కాకుండా ఆ చర్చలో ప్రతి స్టూడెంట్ భాగస్వామి అవుతాడు. లక్ష్యాన్ని నిర్దేశించుకుంటాడు. క్యాంపస్ ప్లేస్‌మెంట్ కాదనుకొని ఈ వృత్తికి వచ్చా. ఇది నాకు ఎంతో సంతృప్తినిస్తోంది.
– జస్వంత్
విక్రమ్ దాచేపల్లిది సూర్యాపేట జిల్లాలోని లింగాల గ్రామం. వెల్లూరు వీఐటీలో చేరి 2010లో బీటెక్ పూర్తి చేశారు. ఆ మరుసటి సంవత్సరమే ఒక బహుళ జాతి సంస్థలో ఉద్యోగం లభించింది. నెలకు రూ.1.5 లక్షల జీతం. అయితే విక్రమ్‌కు ఆ ఉద్యోగం సంతృప్తినివ్వలేదు.
ఒక సాఫ్ట్‌వేర్ సంస్థలో నాలుగు గోడల మధ్య పని చేయడం నచ్చలేదు, నాకు మొదటి నుంచి టీచింగ్ అంటే ఎంతో ఇష్టం. పైగా ఐఐటీ కోచింగ్‌లో తీవ్రమైన ఒత్తిడికి భిన్నంగా సృజనాత్మకమైన పద్ధతిలో శిక్షణనిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు అని అనిపించింది. అందుకే 2012లో ఐఐటీ అకాడమీని ఏర్పాటు చేశాం.
– విక్రమ్
Comments
Please login to add a commentAdd a comment