technical report
-
Gyanvapi case: జ్ఞానవాపి నివేదికకు మరో 10 రోజుల గడువు
వారణాసి(యూపీ): జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో భారత పురావస్తు శాఖ(ఏఎస్ఐ) శాస్త్రీయ సర్వే నిర్వహించి నివేదిక సమర్పించేందుకు మరో 10 రోజుల గడువును వారణాసి జిల్లా కోర్టు మంజూరుచేసింది. నవంబర్ 17(శుక్రవారం)లోగా సర్వే వివరాలను నివేదించాలని గతంలో ఆదేశించగా మరో 15 రోజుల గడువుకావాలంటూ శుక్రవారం కోర్టును ఏఎస్ఐ తరఫు లాయర్లు అభ్యర్థించారు. టెక్నికల్ రిపోర్ట్ ఇంకా అందుబాటులో లేని కారణంగా గడువును పెంచాలని ఏఎస్ఐ కోరడంతో జిల్లా జడ్జి ఏకే విశ్వేశ్ నవంబర్ 28 వరకు గడువు ఇచ్చారని హిందువుల తరఫు న్యాయవాది మదన్ మోహన్ యాదవ్ వెల్లడించారు. ఆలయ పురాతన పునాదులపైనే 17వ శతాబ్దంలో మసీదు నిర్మించారంటూ దాఖలైన పిటిషన్ విచారణలో భాగంగా కోర్టు ఆదేశాల మేరకు ఏఎస్ఐ సర్వే చేపట్టిన విషయం తెల్సిందే. ఆగస్టు నాలుగో తేదీన నివేదిక సమర్పించాలని మొట్టమొదటిసారిగా కోర్టు ఆదేశించింది. ఆ తర్వాత కేసు విచారణల సందర్భంగా గడువు పొడిగిస్తూ వచ్చారు. తాజాగా గడువును జిల్లా కోర్టు నవంబర్ 28గా నిర్దేశించింది. ‘న్యాయం జరగాలంటే సర్వే జరగాల్సిందే’ అంటూ వారణాసి కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను అలహాబాద్ హైకోర్టు సమర్థించడంతో ఈ సర్వే ప్రక్రియకు తొలి అడుగు పడింది. -
మాది టెక్నికల్ నివేదిక మాత్రమే!
రాజమండ్రి: రాజధాని ఎంపిక తమ పనికాదని, తమది టెక్నికల్ నివేదిక మాత్రమేనని శివరామకృష్ణన్ కమిటీ సభ్యుడు రతన్ రాయ్ చెప్పారు. సీమాంధ్ర కొత్త రాజధాని ఎంపికకు సంబంధించి ఈ కమిటీ రాష్ట్రంలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. నిన్న విశాఖలో పర్యటించిన ఈ కమిటీ సభ్యులు ఈ రోజు రాజమండ్రిలో పర్యటించారు. రాజానగరం ఫారెస్ట్ భూములను పరిశీలించారు. ఆగస్టు 31లోగా నివేదిక సమర్పిస్తామని రతన్ రాయ్ చెప్పారు. పాలనా సౌలభ్యం, అధికార వికేంద్రీకరణ, వనరుల లభ్యతలను పరిశీలిస్తున్నట్లు రతన్ రాయ్ వివరించారు. రాజధానికి అనువైన ప్రదేశాలు సీమాంధ్రలో చాలా ఉన్నట్లు తెలిపారు. భవిష్యత్లో సీమాంధ్ర గొప్ప రాష్ట్రంగా ఉద్భవిస్తుందని చెప్పారు. ఈ కమిటీ రేపటి నుంచి రెండు రోజుల పాటు కృష్ణా జిల్లాలో పర్యటించనుంది.