రాజకీయ శక్తిగా ఎదగాలంటున్నారు
జేఏసీ భేటీలో కోదండరాం వ్యాఖ్య
హైదరాబాద్: రాష్ట్రంలో జేఏసీ ప్రత్యామ్నాయ రాజకీయశక్తిగా ఎదగాలని పలువురు కోరుకుంటున్నారని తెలంగాణ రాజ కీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం వ్యాఖ్యానించా రు. గురువారం హైదరాబాద్లో ఆయన అధ్యక్షతన జరిగిన జేఏసీ కార్యక్రమాల కమిటీ సమావేశం సందర్భంగా 22 రోజుల పాటు జరిగిన విదేశీ పర్యటనలో జరిగిన భేటీలు, వాటిలో వచ్చిన సూచనలను కోదండరాం వివరించారు. అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో తెలంగాణ సంఘాలు నిర్వహించిన సమావేశాలకు విశేష ఆదరణ దక్కిందన్నా రు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆవిర్భవించిన జేఏసీ రాజకీయాలకు అతీ తంగానే, ప్రజల పక్షాన పోరాటం చేయాలని కొందరు సూచించగా మరికొందరు మాత్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ప్రజ లకు చెప్పిన మాటలను నిజం చేయడానికి అవసరమైతే ప్రత్యామ్నాయ రాజకీయశక్తిగా ఎదగాలని కోరినట్టుగా కోదండరాం వెల్లడించారు.
రాజకీయాలకతీతంగా, ఒక రాజకీయ లక్ష్యం కోసం దీర్ఘకాలికంగా పనిచేసి విజయం సాధించడంతోపాటు నిలదొక్కుకున్న సామాజిక సంస్థలు ప్రపంచంలో మరెక్కడా లేవని పలు వర్సిటీల ప్రొఫెసర్లు విశ్లేషించినట్టు కోదండరాం చెప్పారు. ప్రపంచీకరణ విధానాలకు భిన్నం గా ఒక ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాను రాష్ట్ర సాధన ఉద్యమం ప్రతిపాదించిందని, కానీ ఇక్కడి పాలకులు భూమిని కేంద్రంగా చేసుకుని ఆలోచనలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. సమావేశంలో జేఏసీ నేతలు పిట్టల రవీందర్, ప్రహ్లాద్, డి.పి.రెడ్డి, పురుషోత్తం, రమేశ్, ఖాజా మోహినుద్దీన్, వెంకట్రెడ్డి పాల్గొన్నారు.