టీజీవీ పరిశ్రమల కాలుష్యాన్ని అరికట్టాలి
తుంగభద్రనది పరిసర ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించాలి
అఖిలపక్ష పార్టీల నేతల డిమాండ్
కల్లూరు రూరల్, న్యూస్‌లైన్:
తుంగభద్ర నది సమీపంలో రాష్ట్ర మంత్రి టి.జి.వెంకటేశ్‌కు సంబంధించిన శ్రీరాయలసీమ ఆల్కాలీస్ అండ్ అల్లైడ్ కెమికల్స్, శ్రీరాయలసీమ హైపో హైస్ట్రెంత్ (టీజీవీ గ్రూప్) పరిశ్రమల నుంచి వస్తున్న కాలుష్యాన్ని అరికట్టాలని ప్రభుత్వాన్ని అఖిలపక్ష రాజకీయ పార్టీల నేతలు డిమాండ్ చేశారు. గురువారం కర్నూలు నగరం బీఏఎస్ కల్యాణ మండపంలో సీపీఎం జిల్లా కార్యదర్శి కె.ప్రభార్‌రెడ్డి అధ్యక్షతన అఖిల పక్ష రాజకీయ పార్టీల సమావేశం నిర్వహించారు. సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ.. టీజీవీ గ్రూప్ పరిశ్రమల కాలుష్యంతోతుంగభద్ర నది జలాలన్నీ కలుషితం అవుతున్నాయన్నారు. తాండ్రపాడు, పంచలింగాల, గొందిపర్ల గ్రామాల పొలాలన్నీ కలుషితమై బీడుభూములుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు.
సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎం.ఎ.గఫూర్ మాట్లాడుతూ.. తుంగభద్రనది కలుషితం కావడంతో పాతనగరంలోని ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు. ఈ పరిస్థితి గతంలో ఎన్నడూలేదని, దీనికి కారణాలు విశ్లేషించి బాధ్యులైన వారిపై కఠిన చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ అధికారులు, టీజీవీ గ్రూప్ పరిశ్రమల యాజమాన్యం తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేయడం సరైంది కాదన్నారు. సమస్యకు పరిష్కారం వెతికి ప్రజలకు ఆరోగ్య రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. అధికారుల బాధ్యతా రాహిత్యాన్ని సీపీఐ, లోక్‌సత్తా, బీఎస్పీ, సమాజ్‌వాది తదితర పార్టీల నాయకులు ఎండగట్టారు. సీపీఐ జిల్లా నాయకులు ఎ.శేఖర్, లోక్‌సత్తా జిల్లా నాయకులు డేవిడ్, సమాజ్‌వాది పార్టీ జిల్లా అధ్యక్షుడు దండు శేషుయాదవ్, బీఎస్పీ కర్నూలు నియోజకవర్గ నాయకులు మౌలాలి, రాజేశ్, సీపీఎం నగర కార్యదర్శి గౌస్‌దేశాయ్, జిల్లా కమిటీ సభ్యులు ఇ.పుల్లారెడ్డి, సత్యనారాయణగుప్త పాల్గొన్నారు.